సామరస్యమే సరైన పరిష్కారం
విశ్లేషణ ఏ సమస్యల పరిష్కారానికైనా కాలగతి ఎంత ముఖ్యమో అనువైన వాతావరణం కూడా అంతే ముఖ్యమని హిపోక్రిటస్ పేర్కొన్నాడు. విభజనానంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గతంలో చాలా చిక్కుముళ్లు ఏర్పడటం వాస్తవమే కానీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ప్రస్తుతం ఉన్న సుహృద్భావ వాతావరణం మిగిలి ఉన్న సమస్యల పరిష్కారానికి అత్యంత అనుకూలతను ఏర్పరుస్తోంది. ఉద్యోగుల విభజన వంటి కొన్ని అంశాలు గతంలోనే దాదాపుగా పరిష్కృతమయ్యాయి. మిగిలి ఉన్న రెండు ప్రధాన అంశాలు షెడ్యూల్ 9 షెడ్యూల్ 10కి చెందిన సంస్థల విభజన. కోర్టుల వరకు వెళ్లిన షెడ్యూల్ 10కి చెందిన సంస్థల విభజన అంశాన్ని ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా పరిష్కరించుకోవచ్చు. ఇక 9వ షెడ్యూల్‌కి చెందిన వాణిజ్యపరమైన సంస్థల విషయంలో కూడా సామరస్యంగా పరిష్కరించుకోవడం పెద్ద సమస్య కాకపోవచ్చు. సాధారణంగా అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు అంత సులభంగా పరిష్కారం కావు. పంతాలు, పట్టింపులు ప్రధాన పాత్ర పోషిస్తాయి కాబట్టి మామూలుగా అంత ప్రధానం కాని అంశాలు కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. రాష్ట్రాల విభజనలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉత్పన్నం అవుతాయనడంలో...