A Visionary Statesmen and a Strategic Manipulator - Whose Capital Amaravathi
9. రాజధానీ నగరాలుగా కర్నూలు, అమరావతుల ఎంపికలో భేదం దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడికీ, వ్యూహాత్మక చాణక్యనాయకత్వానికీ ఉన్న భేదం 1953 లో ఆంధ్ర రాజధానిగా కర్నూలును ఎంపిక చేసుకున్న పద్ధతి, 2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానీనగరంగా అమరావతిని ఎంపిక చేసుకున్న పద్ధతి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు నాయకత్వలక్షణాల గురించీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వ లక్షణాల గురించీ బోలెడన్ని విశేషాలు చెప్తాయి. దీన్ని గురించి మరింత చర్చించే ముందు 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడిందో తెలుసుకోవడం మంచిది. 1920 నాగపూరు కాంగ్రెస్ సమావేశం స్వతంత్ర భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. మద్రాసు ప్రెసిడెన్సీలో ఆంధ్రప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక ఉద్యమం చేపట్టడమూ, అది జాతీయోద్యమంతో పాటు, విస్తరించడమూ దీనికి కారణం. 1937 లో శ్రీబాగ్ ఒడంబడికపై సంతకాలు జరిగాయి. రాష్ట్రంలోని విభిన్నప్రాంతాల్లో రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఇతర సంస్థలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి అన్న విషయంలో కోస్తాంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య అనౌపచారికంగా ఒక ఒప్పందం కుదిరింది. అప్పటికే ఆంధ్రవిశ్వవిద...