A Visionary Statesmen and a Strategic Manipulator - Whose Capital Amaravathi

9. రాజధానీ నగరాలుగా కర్నూలు, అమరావతుల ఎంపికలో భేదం

దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడికీ, వ్యూహాత్మక చాణక్యనాయకత్వానికీ ఉన్న భేదం

1953 లో ఆంధ్ర రాజధానిగా కర్నూలును ఎంపిక చేసుకున్న పద్ధతి, 2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానీనగరంగా అమరావతిని ఎంపిక చేసుకున్న పద్ధతి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు నాయకత్వలక్షణాల గురించీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వ లక్షణాల గురించీ బోలెడన్ని విశేషాలు చెప్తాయి. దీన్ని గురించి మరింత చర్చించే ముందు 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడిందో తెలుసుకోవడం మంచిది. 

1920 నాగపూరు కాంగ్రెస్ సమావేశం స్వతంత్ర భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. మద్రాసు ప్రెసిడెన్సీలో ఆంధ్రప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక ఉద్యమం చేపట్టడమూ, అది జాతీయోద్యమంతో పాటు, విస్తరించడమూ దీనికి కారణం. 1937 లో శ్రీబాగ్ ఒడంబడికపై సంతకాలు జరిగాయి. రాష్ట్రంలోని విభిన్నప్రాంతాల్లో రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఇతర సంస్థలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి అన్న విషయంలో కోస్తాంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య అనౌపచారికంగా ఒక ఒప్పందం కుదిరింది. అప్పటికే ఆంధ్రవిశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉన్నందున రాయలసీమ దానిలో భాగం కావడానికి అంగీకరించక, రాయలసీమవాసులు మద్రాసు విశ్వవిద్యాలయంతోనే కొనసాగడానికి నిశ్చయించుకోవడం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యవిషయం. ‘నా జీవనయాత్ర’ అన్న టంగుటూరి ప్రకాశం పంతులుగారి స్వీయచరిత్రలో ఒక భాగాన్ని రాస్తూ, తెన్నేటి విశ్వనాథం కర్నూలును రాజధానిగా ఎంపిక చేసుకున్న ప్రక్రియను సవివరంగా వర్ణించారు. చివరి నిమిషం వరకూ మద్రాసు నగరం మీద ఆంధ్రుల హక్కును వదులుకోవడానికి ప్రకాశం పంతులుగారు వ్యతిరేకంగా ఉన్నారు. మద్రాసు మీద హక్కును వదులుకుంటున్న పత్రంపై ఆయన సంతకం తీసికోవడానికి భోగరాజు పట్టాభిసీతారామయ్య చేసిన ప్రయత్నం ఫలించలేదు. 

1952 తరువాత మాత్రమే సోషలిస్టు, కమ్యునిస్టు పార్టీ సభ్యులు కూడా మద్రాసుపై హక్కును వదులుకోవడానికి అంగీకరించిన తర్వాతే, ప్రకాశం పంతులు మద్రాసు నగరం లేని ఆంధ్ర రాష్ట్రానికి చివరికి తన అంగీకారం తెలిపారు. ఆమరణ నిరాహారదీక్ష చేసి, శ్రీ పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసిన తరువాత మాత్రమే కేంద్రప్రభుత్వంపై వొత్తిడి పెరిగి ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం జరిగింది. 1953 లో న్యూ ఢిల్లీలో శ్రీ జవహర్ లాల్ నెహ్రూ, శ్రీ ప్రకాశం పంతులు మధ్య జరిగిన సమావేశం నూతన ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు దారివేసింది. ఆంధ్రులకు ఒక ప్రత్యేక రాజధాని ప్రశ్న ఒక ముఖ్యమైన అంశంగా నెహ్రూ, ప్రకాశం పంతులు గార్ల మధ్య జరిగిన సమావేశంలో ముందుకు వచ్చింది.

 కొత్త రాష్ట్రానికి ఒక తాత్కాలిక రాజధానిని శాసనసభ సూచించిన తరువాత విభజన కార్యక్రమం ప్రారంభమవుతుందని, నెహ్రూ ప్రకాశం పంతులుగారికి సూచించారు. తదనుగుణంగా రాజధాని స్థలాన్ని నిర్ణయించడానికి ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ప్రకాశం పంతులు అధ్యక్షతన కృషికార్ లోక్ పార్టీ పక్షాన గౌతు లచ్చన్న, కమ్యూనిస్టు పార్టీ పక్షాన తరిమెల నాగిరెడ్డి పాల్గొన్నారు. కొత్తరాజధాని సమస్యను చర్చంచబోతూ ఉండడంతో, అప్పటికే శాసనసభ్యులు రాజధాని తమతమ పట్టణాలలో ఉండాలని కోరసాగారు. వైజాగ్ సుందరమైన దృశ్యాలతో, అన్ని సౌకర్యాలతో ఉండడం వల్ల ఆ ప్రాంతం నుండి వచ్చిన శాసనసభ్యులందరూ కొత్తరాజధానిగా అదే తగిన ప్రదేశంగా భావించారని తెన్నేటి విశ్వనాథం రాశారు. తమ జిల్లాలలో రాజధానిని ఏర్పాటుచేయమని గోదావరి జిల్లాలోనుండి ఎవరూ కోరలేదు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో బలంగా ఉన్న కమ్యూనిస్టులు తాత్కాలిక రాజధానిని గుంటూరు-విజయవాడల మధ్య నెలకొల్పాలని కోరారు. 

రాయలసీమ సభ్యులు 1937 ఒడంబడికను పేర్కొంటూ, ఆంధ్రవిశ్వవిద్యాలయం కోస్తా ప్రాంతంలో ఏర్పరచినందువల్ల తాత్కాలిక రాజధానిని రాయలసీమలో ఏర్పాటుచేయాలని కోరారు. తమ కోరికను అంగీకరించకపోతే తాము మద్రాసు రాష్ట్రంలోనే భాగంగా ఉంటామన్నారు. తదనుగుణంగా వారొక పిటీషన్‌పై సంతకాలు పెట్టి, జేబులో పెట్టుకున్నారు. ఒకవేళ శాసనసభలో అవసరమైతే ఈ పత్రాన్ని తెరచి అందులో పేర్కొన్న విధంగా చేయడానికి సిద్ధపడ్డారు. ఇటువంటి పరిస్థితులలో ప్రకాశం పంతులు రాజధానీనగరాన్ని ఎంపిక చేయడం కోసం ఆధికారికంగా ఏర్పాటుచేసిన కమిటీ సమావేశాన్ని తమ నివాసగృహంలో ఏర్పాటుచేశారు. ఉదయం సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. వైజాగ్‌ను రాజధానిగా చేసే ప్రస్తావన అంగీకారయోగ్యం కాదని ప్రకాశం పంతులు స్పష్టంగా చెప్పినందువల్ల, తెన్నేటి విశ్వనాథం విశాఖపట్నం విషయంలో పట్టుబట్టలేదు. గౌతు లచ్చన్న నిర్దిష్టంగా తిరుపతి పక్షాన మాట్లాడారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని రాయలసీమలోనే ఉండాలనీ, దాన్ని తిరుపతిలో ఏర్పాటుచేయకపోతే చిత్తూరు మనతో రాదనీ, మద్రాసు రాష్ట్రంలోనే ఉండిపోవడానికి నిర్ణయించుకోవచ్చుననీ ఆయన వాదించారు. కడప పట్టణంలో అనేక భవనాల చిత్రపటాలు చూపించి కోటి రెడ్డి రాజధాని కడపలో ఉండాలని వాదించారు. 

తాత్కాలిక రాజధానిని కర్నూలులో పెట్టడం వల్ల ఎటువంటి లక్ష్యం, ప్రయోజనం నెరవేరదని కమ్యూనిస్టులు వాదించారు. అది గుంటూరు - విజయవాడల మధ్య ఉండాలన్నారు. శ్రీ ప్రకాశం పంతులు, శ్రీ నీలం సంజీవరెడ్డి గారికి రాష్ట్రం ఏర్పడడంలో ముఖ్యమైన పాత్ర నిర్వహించినందువల్ల, తాను అనంతపురం పక్షాన ప్రచారం చేయవద్దని సూచించినందువల్ల శ్రీ నీలం సంజీవరెడ్డి అనంతపురం గురించి ఏమీ మాట్లాడలేదు. ఒంటిగంట వరకు చర్చలు నడుస్తూనే ఉన్నాయి. కాని వాళ్లు ఏ నిర్ణయానికీ రాలేదు. అందువల్ల వాళ్లందరూ  ప్రకాశం పంతులుగారికే నిర్ణయాన్ని వదిలిపెడుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆయన వాళ్లందరినీ మళ్లీ వచ్చి మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కమ్మన్నాడు. వాళ్లు మళ్లీ సమావేశమైనప్పుడు ప్రకాశం పంతులు శ్రీ  గౌతు లచ్చన్నను ఒక కాగితం ముక్కమీద రాజధానిగా కర్నూలు పేరును రాయమని కోరారు. రాజధానిని రాయలసీమలో నిర్ణయించినందువల్ల శాసనసభలో శ్రీ నీలం సంజీవరెడ్డిని తీర్మానం ప్రవేశపెట్టవద్దని కోరి, ఆ బాధ్యతను శ్రీ తెన్నేటి విశ్వనాథానికి అప్పజెప్పారు. శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఓటింగు జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి తాత్కాలిక రాజధానిగా కర్నూలు పక్షాన నిర్ణయం జరిగింది. తదనుగుణంగా కర్నూలు రాజధానిగా1-10-1953 న అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, తదితరుల సమక్షంలో ఆంధ్ర రాష్ట్ర స్థాపన జరిగింది. 

తాను నూతన ఆంధ్ర రాష్ట్ర స్థాపనను ప్రకటించడానికి ముందే రాజధాని సమస్య పరిష్కారం కావాలని జవహర్ లాల్ నెహ్రూ సూచించడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. నెహ్రూ మొదటినుంచీ కూడా భాషాప్రయుక్త రాష్ట్రాల భావనకు వ్యతిరేకి. రాజధానీ నగరాన్ని ఎంపిక చేసుకోవడం తేలిక కాదని నెహ్రూకి తెలుసు. అందువల్ల వాళ్లు రాజధానీనగరాన్ని ఎంచుకోవడంలో విఫలమైనట్లయితే భాషాప్రయుక్తరాష్ట్రం ఏర్పాటు కూడా  వాయిదా పడుతుంది. శ్రీ ప్రకాశం పంతులుకు ఈ విషయంపై నెహ్రూ ఏమి ఆలోచిస్తున్నారో తెలుసు. రాయలసీమ నాయకత్వం తమ ప్రాంతంలో రాజధానిని నెలకొల్పనట్లయితే మద్రాసు రాష్ట్రంలోనే ఉండిపోవడానికి నిర్ణయించుకోవచ్చునని కూడా ఆయనకి తెలుసు. ఈ వాస్తవాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని, ఆయన దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడుగా రాజధానిని కర్నూలులో ఏర్పరచడం ద్వారా భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు బాట వేశారు. 

ఆంధ్ర శాసనసభలో మళ్లీ రాజధాని ప్రశ్నను లేవనెత్తినప్పుడు ప్రకాశం పంతులుగారి సమాధానం చాలా ఆసక్తికరం. ఆయన లేచి, అభివృద్ధి చెందని కర్నూలు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం సముచితమనీ, అందుకే తాత్కాలిక రాజధానిని కర్నూలులో ఏర్పరుస్తున్నామనీ, విశాలాంధ్ర ఏర్పడితే రాజధాని హైదరాబాదుకు తరలిపోతుందనీ చెప్పారు. ఆ విధంగా కర్నూలు ఆంధ్ర రాష్ట్రానికి తాత్కాలిక రాజధాని అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాజధాని హైదరాబాదుకు మారింది. 


ఇప్పుడు దీన్ని, అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానీనగరంగా ఎంపిక చేసిన పద్ధతిలో పోల్చి చూద్దాం. ఒకసారి రాష్ట్ర విభజన నిర్ణయం తీసికున్న తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఒక రాజధానీస్థలాన్ని సిఫారసు చేసేందుకు చట్టంలో ఒక నిపుణుల కమిటీని నియమించడానికి అవకాశం కల్పించడం జరిగింది. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 6వ సెక్షన్ కింది కేంద్రప్రభుత్వం విభజనానంతరం ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కొత్తరాజధాని కోసం వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడానికి కేంద్రప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించాలి. 2014 ఆర్ ఓ ఆర్ చట్టం చేసిన నాటినుండి ఆరునెలల లోపల కమిటీ తగిన సిఫారసులు చేయాలి. తదనుగుణంగా 28-03-2014 నాడు శ్రీ శివరామకృష్ణన్ చైర్మన్‌గా నిర్దిష్ట పరిశీలనాంశాలతో (టిఓఆర్) కమిటీని నియమంచారు. 

శ్రీ నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం 08-06-2014 న ప్రమాణస్వీకారం చేసింది. కమిటీ చట్ట రీత్యా ఏర్పడినది కాబట్టి దీని సిఫారసులకు రాజధానీనగరస్థలం గుర్తింపు విషయంలో నిర్ణయం తీసికొనే ముందు రాష్ట్రప్రభుత్వం తగినంత ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంటుంది. కమిటీ సిఫారసులను 27-08-2014 న రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. మంత్రివర్గం 01-09-2014 న రాజధాని విషయంలో నిర్ణయం తీసికొనే సమయానికి అందుబాటులో ఉంది. కాని దాన్ని యథాలాపంగా పేర్కొనడం తప్ప రాజధాని స్థల విషయంలో నిర్ణయం తీసికొనేముందు దాన్ని అధ్యయనం చేయడంకాని, సీరియస్‌గా తీసికోవడం గాని జరగలేదు. వాస్తవానికి రాజధానీనగరస్థలం గుర్తింపు విషయంలో నిపుణుల కమిటీ ఒక నిర్ణయానికి రావడం కోసం కోరిన ఏ సమాచారాన్ని ఇవ్వడంలోనైనా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వం నుండి సహాయ నిరాకరణే ఎదురయింది. ఈ అంశం 01-09-2014 న మంత్రివర్గం ముందు పెట్టడం జరిగింది. అది రెగ్యులర్ అజెండాలో భాగంగానా, టేబుల్ ఐటెంగానా అన్నది స్పష్టంగా తెలియదు. మంత్రివర్గ తీర్మానమేమిటంటే రాజధానీనగరం విజయవాడ పరిసరాల్లో కేంద్రస్థానంలో ఉండాలని. దీన్ని 04-09-2014 న శాసనసభకు తీసికొని వెళ్లడం జరిగింది. 

విజయవాడ పరిసరాల్లో రాజధానీనగరం స్థలం ఎంపిక గురించి ముఖ్యమంత్రి ఒక ప్రకటన, స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. దీనితోపాటు భిన్న ప్రాంతాలలో అనేక ప్రాజెక్టులను ప్రకటిస్తూ పట్టికను చదివాడు. ఈ ప్రాజెక్టు లేవీ ఎప్పుడూ ప్రారంభం కాలేదనుకోండి. ప్రజాభిప్రాయసేకరణ, సంప్రదింపుల ద్వారా జరగవవలసిన ఈ నిర్ణయం విషయంలో ప్రతిపక్షాలతో ముందుగా చర్చించడం కాని, పౌర సమాజంతో సంప్రదించడం కాని జరగనే లేదు. నిర్ణయంలో మరెవరినీ భాగస్వాములను చేయలేదు. దాన్ని శాసనసభకు హఠాత్తుగా తెచ్చినతీరు, విజయవాడ పరిసరాల్లోనే రాజధాని ఏర్పాటు జరుగుతుందని ప్రకటించడం ఒక వ్యూహాత్మక చర్య. ప్రతిపక్షం అభ్యంతరం తెల్పడానికి వీల్లేదు. అభ్యంతరం తెలిపితే, అది ఆ ప్రాంతానికి వ్యతిరేకి అని ముద్ర పడుతుంది. 953 లో కమ్యూనిస్టులకు ఈ సమస్య లేదు. బహుశా అప్పుడు వాళ్లు రాయలసీమలో పెద్దసంఖ్యలో లేరు. మంత్రివర్గ తీర్మానపు తోవను ఎంపిక చేసుకొని, ఆయన ఒక నిర్దిష్ట స్థలాన్ని ప్రకటించకుండా రాజధాని విజయవాడ పరిసరాల్లో ఉంటుందని వెంటనే శాసనసభలో ప్రకటించి, శాసనసభ తీర్మానాన్ని ఆధారం చేసుకొని రాజధాని స్థలాన్ని తాము ముందుగానే ఎంపిక చేసుకున్న, అప్పటికే గణనీయమైన రియల్ ఎస్టేట్ ఆసక్తులు స్థిరంగా ఏర్పడిన ప్రదేశం వైపుగా ప్రయత్నం సాగించారు. అమరావతిని రాజధాని నగరంగా నిర్ణయించిన పద్ధతి నాయకుడి వ్యూహాత్మక స్వభావాన్ని, చాణక్యాన్ని తెలియజేస్తుంది. వ్యూహాత్మక రీతిలో ప్రతిపక్షాన్ని ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టి లొంగదీసుకోవటమూ, అతి చతురతతో శాసనసభ తీర్మానాన్ని నిర్దిష్ట స్థలాన్ని పేర్కొనకుండా విజయవాడ పరిసరాల్లోనని తీసికోవడమూ జరిగింది. రాజధాని స్థలం ఎంపికపై శాసనసభ తీర్మానాన్ని సాధనంగా చేసికొని గణనీయమైన రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను నిర్మించిన చోట రాజధానిని ఏర్పరచడానికి పూనుకున్నాడు – మాదాపూరులో విజయవంతమైన సైబర్ సిటీ రియల్ ఎస్టేట్ నమూనాను అనుకరించే ప్రయత్నం జరిగింది. ఆ విధంగా కర్నూలులో రాజధాని ఏర్పాటు నిర్ణయం వెనుక శ్రీ ప్రకాశం పంతులుగారి రాజనీతిజ్ఞత, ముందు చూపు కనిపిస్తూ ఉంటే, అమరావతి నిర్ణయం వెనుక శ్రీ నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక నాయకత్వం, మోసకారి స్వభావం (Manipulative nature) ప్రతిఫలిస్తున్నాయి.


సైద్ధాంతిక నేపథ్యంలో పరిశీలించినప్పుడు మన మింతకు ముందు గమనించిన విషయాలలో వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి ప్రోత్సాహాన్నిచ్చే రాజధాని, లేదా ఇతరాలను చేర్చుకొనకుండా తాను మాత్రమే అభివృద్ధి చెందే రాజధానులను గురించి చెప్పుకున్నాం. కర్నూలు మొదటి తరగతికి చెందినది. పెద్దప్రాంతాలు, మరింత అభివృద్ధి చెందిన ప్రాంతాలు చిన్న, అభివృద్ధి చెందని ప్రాంతాలను తనతో ముందుకు తీసికొని వెళతాయి. తక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతంలో రాజధానీ నగరాన్ని ఏర్పరచడమనే రాయితీ ఇవ్వడం ద్వారా ఆ ప్రాంతాల విశ్వాసాన్ని చూరగొంటుంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధనంగా కూడా ఈ రాజధాని తోడ్పడుతుంది. ప్రపంచంలో ఇటువంటి రాజధానులకు ఎన్నో ఉదాహరణలు లభిస్తాయి: బ్రెజిల్ రాజధాని బ్రసీలియా, కజకిస్తాన్ రాజధాని ఆస్థానా, నైజీరియా రాజధాని అబూజా. ఇటువంటి నిర్ణయాలు తీసికొనే నాయకులు స్వభావరీత్యా దూరదృష్టి కలిగినవారు. వీరు రాజధానీ స్థలం ఎంపికలో సంప్రతింపులకు, ప్రజల ఏకాభిప్రాయసాధనకు ప్రయత్నిస్తారు. ఈ రకమైన రాజధానులను ఫార్వర్డ్ త్రష్ట్ (forward thrust) రాజధానులంటారు.

 
దీన్ని రెండో రకంతో పోల్చండి. ఇక్కడ ప్రమాణం రాష్ట్ర అధికారానికి విధేయంగా ఉండే కేంద్రం కావడం. నాయకుడికి తన జాతి బలమైన సమర్థన లభించే ప్రాంతం కావడం. ఇటువంటి రాజధానుల ఏర్పాటు సాధారణంగా నిరంకుశ పాలకుల దేశాలు, రాష్ట్రాలలో జరుగుతుంది. మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో సంప్రతింపులు, అభిప్రాయ సేకరణల మార్గం అవలంబించ కుండా రాజధానీనగర స్థల నిర్ణయంలో కూటనీతి, వ్యూహాత్మక మార్గాన్ని అనుసరించి కేంద్రీకృతాభివృద్ధికి మాత్రమే అవకాశమిచ్చే ఎక్స్‌క్లూజివ్ రాజధానిని ఎంపిక చేసుకోవడం దురదృష్టకరం. ఇటువంటి రాజధానులున్నాయి కాని వాటి న్యాయబద్ధత, సార్థక్యాలు ఒక వ్యక్తితోనో, ఒక వంశంతోనో అనుబంధించి ఉంటాయి. అవి తక్కువ కాలమే ఉండేవి, చాలా అస్థిరమైనవి, నిర్మాణానికీ, నిర్వహణకూ భారీ వ్యయం అవసరమైనవి. అవి తెగ పక్షపాతాన్ని, తమ సొంత తెగకు అధికారబదిలీని, అధికారంలోని కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన భాగస్వామ్యాన్ని ప్రదర్శిస్తాయి. అమరావతి ఎంపిక వ్యూహాలు పన్ని, కూటనీతి ప్రయోగించి జరిగింది. సంప్రదింపులు, ఏకాభిప్రాయ సేకరణ ద్వారా జరగనందున అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భిన్నప్రాంతాల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించదు. అందువల్ల దాన్ని ఏ విధంగానూ ‘ప్రజల రాజధాని’ అనలేము.

Comments

Popular posts from this blog

Whose Capital Amaravathi - Introduction

ChandraBabu Naidu - CBN

Urban centres as growth engines