Sivaramakrishnan Commission- Whose Capital Amaravathi

7. శివరామకృష్ణన్ కమిషన్ - అమరావతి

రాజధానీనగర సైద్ధాంతిక నేపథ్యాన్నీ, అంతర్జాతీయ జాతీయ అనుభవాలనూ పరిశీలించిన తరువాత, ఈ  అధ్యాయంలో మన అమరావతి స్థల నేపథ్యాన్నీ, అమరావతికి సంబంధించిన ప్రత్యేక సమస్యలను విశ్లేషిద్దాం. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం కింద సెక్షన్-6 ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధానికి వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడానికి ఒక నిపుణుల కమిటీని నియమించడానికి అవకాశం ఇస్తుంది. తదనుగుణంగా భారతప్రభుత్వం శ్రీ శివరామకృష్ణన్ చైర్మన్‌గా ఒక కమిటీని నియమించింది. శ్రీ శివరామకృష్ణన్ భారతప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖకు మాజీ కార్యదర్శి. ఈ కమిటీ సభ్యులలో ఈ రంగంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తులు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ డైరెక్టర్ డా. రతిన్ రాయ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ అర్బన్ ఎఫైర్స్ డైరెక్టర్ ప్రొ. జగన్ షా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ డైరెక్టర్ అరోమార్ రవి, స్కూల్ అఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ మాజీ డీన్, ప్రొ. రవీంద్రన్ ఉన్నారు. 

ఈ కమిటీని నియమిస్తూ భారతప్రభుత్వం అది పరిశీలించవలసిన అంశాలలో సాగులో ఉన్న వ్యావసాయిక వ్యవస్థలకు అతి తక్కువ భంగం కల్గించడం, ప్రాంతీయ పర్యావరణాన్ని పరిరక్షించడం, వాతావరణ రీత్యా, పరిసరాల రీత్యా స్థిరంగా కొనసాగించగలిగిన అభివృద్ధిని ప్రోత్సహించడం, ప్రకృతి బీభత్సాల ప్రమాదాలను అంచనా వేయడం, నిర్మాణ వ్యయాన్ని కనిష్ఠస్థాయిలో ఉంచడం, భూసేకరణను కనిష్ఠస్థాయిలో ఉంచడం అన్న వాటిని పేర్కొన్నది. మార్చి 2014 లోనే ఏర్పరచినప్పటికీ ఈ కమిటీ తన పనిని కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత జూన్ నెల నుండి మాత్రమే ప్రారంభించింది. అందువల్ల వాస్తవానికి నివేదికను తయారుచేసి, సమర్పించడానికి దానికి 3 నెలల సమయం మాత్రమే లభించింది. 


రాజధానీ నగరాన్ని ఎక్కడ ఏర్పాటుచేయాలో రాష్ట్రప్రభుత్వం తమ కమిటీ నివేదిక సమర్పించక ముందే ఒక నిర్ణయాన్ని తీసుకున్నదన్న విషయం తెలిసిన కమిటీ ఉన్న పరిస్థితులలో భారత ప్రభుత్వం తనను పరిశీలించమన్న అంశాలదృష్ట్యా అన్ని సంభావ్యాలను పరిశీలించి ఒక నివేదికను సమర్పించింది. రాజధానీనగర స్థలంపై అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినందున రాష్ట్రప్రభుత్వం కూడా కమిటీ విషయంలోనూ, దాని నివేదిక విషయంలోనూ ఎటువంటి శ్రద్ధ చూపించలేదు. కమిటీకి రాష్ట్రప్రభుత్వం తోడ్పాటు కనిష్ఠస్థాయిలో ఉంది. కొన్నిసార్లు కమిటీకి తెలియవలసిన ముఖ్యమైన సమాచారాన్ని ప్రభుత్వం కమిటీతో పంచుకోనేలేదు. ఈ విషయాన్ని కమిటీ తన నివేదికలో పేర్కొన్నది కూడా. ప్రభుత్వం మరోవైపు ప్రత్యేకంగా తన సొంత కమిటీని ఒకదాన్ని ఏర్పాటుచేసింది. అందులో స్థానిక రాజకీయనాయకులు, స్థానిక కేపిటలిస్టులు సభ్యులు. చట్టపరిధిలో భారతప్రభుత్వం నియమించిన కమిటీ ప్రాధాన్యాన్ని తగ్గించడానికి వ్యూహాత్మకంగా రచించిన ప్రణాళిక ఇది. 


కమిటీ ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అనే తన ప్రధాన లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుంది. వివిధ రాజధాని కార్యకలాపాల నిర్వహణలో రాజధాని స్థలం ఏ విధంగా తోడ్పడుతుందో పరిశీలించింది. ప్రభుత్వ కార్యకలాపాలకు తమకు ఇష్టమైన ఒకటి రెండు ప్రాంతాలను నిర్ణయించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారం పట్ల కొన్ని ప్రాంతాల ప్రజలకు - ముఖ్యంగా రాయలసీమ వారికి - కొన్ని భయాలున్నట్లు కమిటీ గుర్తించింది. కమిటీ ముందు ఆ ప్రాంతంవారు తమ భయాలను వెల్లడించారు. 

కమిటీ మూడు సంభావ్యధోరణులను పరిశీలించింది. వాటిలో మొదటిది ఒక హరితక్షేత్ర మహానగర నిర్మాణం. అది రాజధానీనగరంగా కూడా పనిచేస్తుంది. రెండు, ఉన్న పట్టణాలలోనే ఉన్న నగరాలను విస్తృతీకరించడం. మూడు, ప్రభుత్వ కార్యకలాపాలను రాష్ట్రవ్యాప్తంగా భిన్న ప్రదేశాలకు పంపిణీ చేయడం. వాళ్లు ముందుగా ఒక హరిత క్షేత్ర నగర నిర్మాణ అవకాశాన్ని పరిశీలించి, దాని వల్ల ప్రత్యేకంగా ఒనగూడే ప్రయోజమేదీ లేదన్న నిర్ణయానికి వచ్చారు. 
ఆ నాడు రాజధానీనగరం గుంటూరు – విజయవాడ ల మధ్య ఉండవచ్చునని జరుగుతున్న ప్రచారం మీద కూడా కమిటీ వ్యాఖ్యానించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలనూ విజయవాడ - గుంటూరు పరిసరాలలో కేంద్రీకరించే ప్రయత్నం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయని అది హెచ్చరించింది. ప్రైవేటు, స్పెక్యులేటివ్ పెట్టుబడినంతా ఈ రాజధానీప్రాంతమే రాబట్టుకుంటుందని కూడా కమిటీ హెచ్చరించింది. హైదరాబాదులోలాగ కాకుండా గుంటూరు, విజయవాడలలో వ్యవసాయ సాగుభూముల సమస్యను కూడా కమిటీ అధ్యయనం చేసింది. మహానగరంగా ఆ ప్రాంతం అభివృద్ధిని ఇది అడ్డుకుంటుందని కూడా కమిటీ భావించింది. తుదిగా ఈ ప్రాంతంలో భారీగా పెట్టుబడినీ, జనాభానీ ప్రవేశపెట్టడం అవాంఛనీయమనీ, హైదరాబాదులోలాగ ఇది కూడా తేనెకుండ (honeypot)ప్రభావాన్ని కలిగిస్తుందని కమిటీ భావించింది. విజయవాడ - గుంటూరు ప్రాంతంలో ఒకవేళ కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఉంచదలిస్తే వాటిని ముసునూరు, నూజివీడు, అమరావతి లేదా పులిచింతల వంటి ప్రాంతాలలో ఏర్పరచాలని కమిటీ సూచించింది. వాళ్లు ప్రధానంగా అవలంబించిన ప్రమాణం విజయవాడ - గుంటూరు ప్రాంతంలో ఉన్న మెట్టభూములు. ఇవి కార్యాలయాల నిర్మాణానికి అనుగుణమైన ప్రదేశాలు. రాష్ట్రప్రభుత్వం నిజంగా తమతో సహకరించనందున అవసరమైన సమాచారాన్నంతా అందించనందున నివేదికలోకి కొన్ని పొరపాట్లు వచ్చి చేరాయి. అటువంటి వాటిలో ఒకటి పులిచింతలను సూచించడం. అది గుంటూరు - విజయవాడ ప్రాంతంలో ఒక భాగమని భావించి, అక్కడ కొన్ని రాజధానీనగర కార్యకలాపాలను ఏర్పరచాలని సూచించడం. 

ఈ కమిటీ సూచించిన అమరావతి, ప్రస్తుతం రాజధానీ నగరాన్ని నిర్మిస్తున్న అమరావతి కాదు, చారిత్రక మత ప్రధానమైన పట్టణం. ప్రస్తుత రాజధానీ నగర స్థలానికి 20 కి.మీ.ల దూరంలో ఉంది. అది మెట్టభూముల పరిధుల్లోనే ఉంది. ఆ విధంగా హరితక్షేత్ర మహానగరాన్ని కొత్తరాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిర్ణయించే ప్రయత్నానికి కమిటీ పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఒకవేళ గుంటూరు - విజయవాడ ప్రాంతంలో అది రాష్ట్ర కేంద్రప్రాంతంలో ఉంది కాబట్టి, ఆ కార్యాలయాలను స్థాపించడానికి నిర్ణయించినట్లయితే ఆ కార్యాలయాలను వ్యవసాయ సాగుభూములు ఉన్న ప్రాంతంలో కాక, అదే ప్రాంతంలోని మెట్టప్రదేశంలో ఏర్పరచాలని సూచించింది.

కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజధానీనగర కార్యకలాపాలను భిన్నప్రాంతాలలో ఏర్పరచడమన్న ప్రత్యామ్నాయవిధానాన్ని కూడా కమిటీ పరిశీలించింది. విజయవాడ - గుంటూరు ప్రాంతంతో పాటు అది వైజాగ్ ప్రాంతంతో కూడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ చాపం, కాళహస్తి - నడికుడి వెన్ను ప్రదేశాలను మూడు భిన్న ప్రాంతాలలో గుర్తించింది. హై కోర్టును వైజాగ్‌లోను, పైన పేర్కొన్న కారణాలరీత్యా తక్కిన ప్రభుత్వ కార్యకలాపాలను విభిన్న ప్రాంతాలకు పంపిణీ చేయడం మంచిదని కమిటీ సూచించింది.

హరితక్షేత్ర రాజధానీనగరస్థాపనకు భూసేకరణను తిరస్కరించి, లాండ్ పూలింగ్ కూడా పూర్తిగా ఉపయుక్తమైన మార్గం కాదని తన విపులమైన అధ్యయనంపై ఆధారపడి కమిటీ అభిప్రాయపడింది.
భారత ప్రభుత్వం నియమించిన పట్టాణాభివృద్ధి రంగంలో పేరుగాంచిన నిపుణులతో కూడిన ఈ కమిటీ గొప్ప నిరాశతో వెనుదిరగవలసి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వారితో సహకరించడానికి ఏ మాత్రం ముందుకు రాకపోవడం, వారి సేవలను వినియోగించడానికి ఇచ్చగించకపోవడం ఇందుకు కారణం. కమిటీ సభ్యులు రాష్ట్రానికి వచ్చే సమయానికే కొత్త ప్రభుత్వం ఏర్పడి కొత్త రాజధానీనగర స్థలంపై ఒక నిర్ణయానికి వచ్చింది. 

ఈ నిర్ణయానికి ఆధారం వాణిజ్య, కులపరమైన, రియల్ ఎస్టేట్ పరమైన ఆసక్తులు. అందువల్ల ప్రభుత్వ నిపుణుల కమిటీని గాని, దాని పనిని గాని సీరియస్‌గా పట్టించుకోలేదు. కమిటీని నియమించిన సమయంలో నిర్ణయించిన కాలపరిధి కారణంగా జూన్ మాసాంతంలో పని ప్రారంభించిన కమిటీకి తన నివేదికను సమర్పించడానికి మూడునెలలకు మించిన సమయం లభించలేదు. కమిటీ సభ్యులు నివేదిక సమర్పణకు మరికొంత వ్యవధి అడిగి తమ కాలాన్ని పొడిగించుకోవచ్చు. కాని రాష్ట్రప్రభుత్వం ఎక్కడ రాజధానీనగరాన్ని నిర్మించాలన్న విషయంలో నిర్ణయం తీసేసుకున్నందున మరింత వ్యవధి కోరడం వ్యర్థమని కమిటీ గ్రహించింది. రాజధానీనగర స్థల విషయంలో రాష్ట్రప్రభుత్వం అనుసరించదలచుకున్న కార్యప్రణాళికపై తమ సిఫారసులకు ఎటువంటి ప్రాముఖ్యమూ ఉండదని కమిటీ సభ్యులకు బాగా తెలుసు. 

రాజధానీ నగరం ఎక్కడ ఉండాలన్న విషయంలో నిర్ణయం కేంద్రప్రభుత్వంతో సంప్రతించి రాష్ట్రప్రభుత్వం తీసికొనవలసిందే తప్ప మరొకటి కాదని, కమిటీ తన నివేదిక మొదటి పుటలోనే స్పష్టంగా రాసింది. తనకు లభించిన ఆధారాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నుండి తాను సంపాదించగలిగిన సమాచారాన్ని క్రోడీకరించి విశ్లేషించడం, దాని ఆధారంగా తన సిఫారసులు అందించడం మాత్రమే తన బాధ్యతగా కమిటీ భావించింది.ఈ గొప్ప వ్యక్తిని, అతని జట్టును లేక్‌వ్యూ అతిథిగృహంలో కలుసుకునే అవకాశం నాకు కలిగంది. ఇక్కడ కమిటీతో అధికారుల సమావేశం ఏర్పాటు జరిగింది. అప్పటికే ఆయన కాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స తీసికొంటున్నారు. కొద్దిరోజుల ముందే కీమోథెరపీ తీసుకున్నాననీ, ఇప్పుడు కమిటీ పనికి సంబంధించి సమావేశానికి వచ్చాననీ ఆయన నాకు చెప్పారు. కొత్తరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు పరిపాలన రాజధానిగా దొనకొండను ప్రతిపాదిస్తూ నేను తయారుచేసిన కాన్సెప్ట్ నోట్ విషయం ఆయనకు తెలుసు. దొనకొండను పరిపాలన రాజధానిగా సూచించడానికి నేను ప్రమాణాలుగా తీసికున్న అంశాలు, నా దృక్పథం గురించి ఆయన చాలా ప్రశంసించాడు. రాజధానీ నగర ప్రదేశంగా శివరామకృష్ణన్ కమిటీ ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని సూచించలేదన్న అభిప్రాయాన్ని ప్రచారం చేస్తున్నారు.

 పరిపాలన రాజధానీనగరంగా వాళ్లొక ప్రదేశాన్ని సూచించదలచుకోలేదని కాదు, పరిమితమైన ప్రయోజనాలతో రాజధాని కార్యకలాపాలను ఎలా పంపిణీ చేయాలో వారి మనస్సులో ఉంది. వాళ్లు పని ప్రారంభించిన ఒక నెలలోపుగానే రాజధాని ఉండవలసిన చోటు గురించి రాష్ట్రప్రభుత్వం ఒక నిర్ణయం తీసేసుకున్నదని వాళ్లు గ్రహించగలిగారు. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్దిరోజుల్లోనే ఈ కమిటీకి అవమానకరంగా పట్టణాభివృద్ధి శాఖామంత్రి చైర్మన్‌గా, కొంతమంది స్థానిక పెట్టుబడిదారులు, స్థానిక రాజకీయ నాయకులతో కొత్త రాజధానికి తగిన స్థలాన్ని సూచించడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. అందువల్ల రాజధాని స్థల నిర్ణయం రాష్ట్రప్రభుత్వ అధికార పరిధిలోకి వస్తుంది కాబట్టి, దానికి భిన్నంగా మరో సూచన చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, పరిస్థితి సంక్లిష్టమవుతుందని శివరామకృష్ణన్ కమిటీ గుర్తించింది. పైగా కమిటీకి కావలసిన సమాచారాన్ని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వాధికారులు సుముఖంగా లేరు. రాజధాని స్థలం అప్పటికే నిర్ధారణ అయిందని వారికి కూడా తెలుసు. అయినా కొత్త రాష్ట్రానికి కేంద్రీకృతమైన హరితక్షేత్ర నగరం సరైన ఎంపిక కాదని కమిటీ స్పష్టీకరించింది. రాజధాని కార్యకలాపాలను భిన్నస్థలాలకు పంపిణీ చేయాలని సూచించింది. రాజధాని నగరం నిర్మించవలసిన స్థలాన్ని నిర్దిష్టంగా సూచించకుండా వదిలివేసింది.

‘రాజధానిపై కన్ను – లోపించిన దృష్టి’ అన్న శీర్షికతో 2015 ఆగస్టు 15వ తేదీన ‘హిందూ’ పత్రికలో శివరామకృష్ణన్ రాసిన వ్యాసంలో ఇలా చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ఆంధ్రప్రదేశ్‌ను ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలపై కేంద్రీకరించడానికి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడుకు చాలా సమయం ఇస్తున్నది. ఆయన ఈ సమస్యలపై దృష్టి పెట్టే బదులు రాజధానికి స్థలసేకరణ కోసం ఆలోచించడంలోనే కూరుకుపోయినట్లు కనిపిస్తూ ఉంది. 

శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు అంటే నాకు చాలా అభిమానం. ముఖ్యంగా అవిభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఆయన సాధించిన కార్యాలకు నేను ఆయనను అభిమానిస్తాను. ఎందుకు? ఆయన ఆంధ్రప్రదేశ్‌ను ఒక పురోగమనశీలమైన సమాచార సాంకేతికత ప్రధానమైన ఆధునిక విద్యాకేంద్రంగా రూపొందించడంలో సఫలుడయ్యారు. తన ప్రయత్నాలలో బహుశా ఆయన బెంగళూరు పొందిన ప్రతిష్ఠ వల్ల ప్రభావితుడై ఉంటారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచంలో వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేసి, శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించి, శక్తిమంతులైన వ్యాపారవేత్తలనూ, కంపెనీలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అవిభాజిత ఆంధ్రప్రదేశ్‌లో 1999 ప్రాంతంలో అతని పరిపాలన కాలంలో జి.డి.పి. రూ. 1700 బిలియన్లుగా ఉండింది (ఈపిడబ్ల్యు రీసెర్చ్ ఫౌండేషన్ సమాచారం). ఇప్పుడది 2014 లో రూ. 4,574 బిలియన్లు. ఈ పెరుగుదలకు ముఖ్యకారణం శ్రీ నాయుడు ప్రయత్నాలే అన్న విషయాన్ని కాదనలేం. వీటన్నిటికీ మించి ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలలో తమ రాష్ట్రం పట్ల ఒక స్వీయభావాన్నీ, గర్వాన్నీ కల్గించారు; ఆంధ్రప్రదేశ్ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందన్న నమ్మకాన్ని కలిగించారు. దురదృష్టవశాత్తూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అభివృద్ధి విషయంలో – విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతంలో అమరావతి అని పిలవబడే ప్రాంతం – పూర్తిగా ఆయన్ని వశపరచుకున్నట్లనిపిస్తుంది.
రైతులను వారి భూములనుండి తొలగించడం

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం దేశవ్యవహారాల శాఖ నియమించిన నా నేతృత్వంలోని నిపుణుల కమిటీ, తన పరిశీలనాంశాల్లో సాధ్యమైనంతవరకూ సారవంతమైన వ్యవసాయ భూములను తాకవద్దని నిర్దేశించింది. దీన్ని వివరిస్తాను. మొత్తం విజయవాడ – గుంటూరు - తెనాలి – మంగళగిరి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారంగా ప్రసిద్ధికెక్కింది; వాస్తవానికి నిస్సందేహంగా ఈ ప్రాంతం భారతదేశపు ప్రధాన ధాన్యాగారాలలో ఒకటి. ఇప్పుడు తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాలలో రెండు పంటలు, మూడు పంటలు పండే భూముల్లో ముప్ఫైవేల ఎకరాల భూమిని తీసుకోవడం తాత్కాలిక ఆర్థిక లాభాలకోసం రైతులను తమ భూములనుంచి తప్పించడం ప్రభుత్వ హ్రస్వదృష్టి విధానానికి ఒక ఉదాహరణ. 

కొందరు రైతులు దీన్నొక అదృష్టంగా భావించవచ్చు. నగదు పరిహారాన్ని విలాసవస్తువులపై - పెద్ద కార్లు, పెద్ద బంగళాలు – ఖర్చు పెట్టే అవకాశం లభిస్తుంది. వాణిజ్య దుకాణాలు, వినియోగదారుల సమర్థనపై ఆధారపడతాయి. ఇటువంటి సందర్భంలో ఈ స్థాయి వినియోగదారుల సమర్థన ఐదు పదేళ్ల అల్పకాలానికి మాత్రమే పరిమితమవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం కోరుకుంటున్న రకపు అభివృద్ధికి ఈ సమర్థన స్వల్పకాలికమే. తుళ్లూరు ఉత్తరభాగాన్ని రాజధానీనగర కార్యకలాపాలలో కీలకపాత్ర పోషించేదిగా నిర్ణయించినట్లు కనిపిస్తుంది. అయినా రాజధానీనగరమని చెప్పుకొనేదానికి సంబంధించి ఇంకా ఎటువంటి మాస్టర్ ప్లానూ అందుబాటులో లేదు. ఆన్‌లైన్‌లో ఏదీ దొరకడం లేదు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ వెబ్‌సైట్‌లో కూడా – ఎక్కడ ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకోవడం ప్రస్తుతం అసాధ్యంగా ఉంది.

మౌలిక సదుపాయాల అభివృద్ధి

నేను గట్టిగా చెప్పదలచుకున్న మరో అంశం ముఖ్యంగా భూగర్భ జలమట్టం చాలా ఉన్నతంగా ఉన్నచోట నేలను సిద్ధం చేసే పని. కొంతభూమి అందుబాటులోకి వస్తుందని అనుకున్నప్పటికీ సంబంధిత పద్ధతిలో ఏకీకరణ, రోడ్డు సదుపాయాలు, అనేక ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణానికీ, అభివృద్ధికీ చాలా సమయం పడుతుంది. స్వాతంత్ర్యం వచ్చిననాటినుండి భారతదేశం నిర్మించిన సుమారు నూరు పట్టణాల విషయంలో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు దాదాపు ఏడెనిమిదేళ్లు పట్టింది. ఒకటి రెండు పెద్ద పరిశ్రమలను నెలకొల్పడం, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలను తీర్చడానికి ఇంత సమయం. చండీగఢ్, భువనేశ్వర్, గాంధీనగర్, ఉక్కు పట్టణాలు బొకారో, దుర్గాపూర్, రూర్కేలా కూడా ఈ వంద పట్టణాలలో ఉన్నాయి. అందువల్ల ఐదేళ్లలో ఇవన్నీ పూర్తవుతాయని ఆంధ్రప్రదేశ్ చెప్పుకోవడం పూర్తిగా అతిశయోక్తి తప్ప మరొకటి కాదు.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందున్న అత్యంత గంభీర సమస్య ఏడాదికి మూడులక్షలకు పైగా ఉద్యోగాల కల్పన, గణనీయమైన అధిక ఉత్పాదకత అని నిపుణుల కమిటీ మళ్లీ మళ్లీ గుర్తు చేసింది. ఈ ఉద్యోగాలేవీ కనుచూపుమేరలో కనిపించడం లేదు. ఇటీవల తుపాను వల్ల దెబ్బతిన్న పట్టణాలను పునర్నిర్మించవలసిన అవసరం ఉంది. నిపుణుల కమిటీ సూచించిన విధంగా హై కోర్టు వంటి సదుపాయాలను అక్కడ నెలకొల్పాలి. అవి ఆంధ్రప్రదేశ్‌కు కొంత అభివృద్ధిని కలిగిస్తాయి.


చిత్తూరు, తిరుపతుల్లో వైద్య, విద్యాసదుపాయాలు ముఖ్యంగా ప్రైవేటు రంగంలో స్థాపించడం ప్రారంభమవడం ఆహ్వానించదగిందే. కాని చిత్తూరు, తిరుపతులకు ఆ శక్తి తమిళనాడు దగ్గరగా ఉండడం వల్ల తప్ప, హైదరాబాదుకు దగ్గరగా ఉండడం వల్ల కాదని గుర్తు పెట్టుకోవాలి. తిరుపతి, చిత్తూరులకు పెద్ద విద్యా, వైద్య సంస్థలను కలిగి ఉండగల సామర్థ్యం గురించి మాట్లాడుతున్నారుకాని, రాయలసీమ సామర్థ్యం గురించి మాట్లాడడం లేదు. ఇది దురదృష్టకరం. రాజధాని గురించిన ప్రస్తావనల్లో ఆర్థిక రాజధానిని కూడా విజిటిఎం ప్రాంతానికే బదిలీ చేస్తారనే విషయాన్ని అందరూ గుర్తించినట్లే కనిపిస్తూ ఉంది. నిరసనలు వెల్లువెత్తుతాయన్న విషయంలో సందేహమవసరం లేదు. నాయుడు ఎదుర్కోవలసిన అత్యంత ముఖ్యమైన సవాలు, అతని రాజకీయ చాణక్యమంతా వినియోగించి సాధ్యమైనంత త్వరలో పరిష్కరించవలసిన సవాలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సమతులాభివృద్ధి కోసం పనిచేయడం తప్ప విజిటిఎం ప్రాంతానికి పరిమితం కాకూడదని నిపుణుల కమిటీ మళ్లీ మళ్లీ చెప్పింది.


ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా పంచుకోవడానికి పదేళ్ల కాలవ్యవధి నిచ్చింది. ఈ సమయాన్ని ఎలా వినియోగించుకోవచ్చో కమిటీ అనేక సిఫారసులు చేసింది. నేనేమీ కమిటీకి మారుపేరుగా ఉండదలచుకోలేదు; దేశంలో ఇంతకుముందు అనేక కమిటీలు నియమించారు; వాటిలో కొన్నిటి సిఫారసులను అంగీకరించారు, కొన్నిటిని తిరస్కరించి ఉండవచ్చు. అందువల్ల ఈ కమిటీ సిఫారసులను అంగీకరిస్తారా, తిరస్కరిస్తారా అన్నది ముఖ్యం కాదు. ముఖ్యం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. నాయుడు తన అడుగులను వెనక్కు తీసికొనే సమయమింకా మించిపోలేదు.

లాండ్ పూలింగ్
రాజధానికి స్థలం సమస్యలోనే మునిగిపోకుండా ఆంధ్రప్రదేశ్ ఎదుర్కుంటున్న పెద్ద సమస్యల పరిష్కారంపై తన దృష్టిని కేంద్రీకరించడానికి చట్టం చాలా వెసులుబాటు ఇచ్చింది. సింగపూరులో నెలకొని ఉన్న రాజధాని మాస్టర్ ప్లాన్‌పై పనిచేస్తున్న కంపెనీలు, రాజధాని సరిహద్దులకు వెలుపల, విజిటిఎం ప్రాంతంలో 3,000 ఎకరాల భూమిని కోరుతున్నట్లు చెప్తున్నారు.


చైనాతో సహా ఎన్నోచోట్ల సింగపూరు వాణిజ్యవేత్తలు గణనీయమైన భూకమతాలను సొంతం చేసుకోవడమో, సొంతం చేసుకొనే ప్రయత్నం చేయడమో చేస్తున్నట్లు తెలుస్తున్నది. అది వాళ్ల విధానం కావచ్చు, కాని ఈ సందర్భంలో, ఆంధ్రప్రదేశ్‌లో నేను చెప్పదలచుకున్న విషయమేమిటంటే సింగపూరుకు వెళ్లే భూమి వాటా అంతా వ్యావసాయిక భూకమతాలేనన్నది. రాజధాని ప్రాజెక్టు వల్ల నేరుగా ప్రభావితులయ్యే వారితో పాటు ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగాకాని, పరోక్షంగా కాని స్వతంత్ర వ్యవసాయ భూములుకాని, ఆదాయాలుకాని లేని లక్షలాది కుటుంబాలు కూడా ప్రభావితమవుతాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థలో ఏర్పడుతున్న ఎగుడు దిగుళ్ల సందర్భంలో  కుటుంబాలకు సంక్షేమాన్ని, భద్రతను ఇచ్చే పూచీపడడం ఆచరణరీత్యా అసాధ్యం. రాష్ట్ర రాజధాని నిర్మాణం, నిర్వహణలకు పెట్టుబడులు అంతర్జాతీయంగా అప్పులు తీసుకోవలసిందే తప్ప గత్యంతరం లేదు; ఈ పనికి ఆంధ్రప్రదేశ్‌కు తాను చేయగల సహాయం గురించిన పరిమితులను కేంద్రప్రభుత్వం ఇప్పటికే సూచించింది.


ఈ ప్రాంతంలో భూయజమానులు 32,000 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించడానికి, లాండ్ పూలింగుకు అంగీకరించారని చెప్తున్నారు. అదే సమయంలో కృష్ణానది దక్షిణ తీరంలో ఈ ప్రణాళికకు ప్రతిఘటన పెరుగుతూ ఉన్నదన్న వార్తలు వస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్న లాండ్‌పూలింగ్ దేశంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన లాండ్ పూలింగ్‌కు భిన్నమైనది. దేశంలోని ఇతర ప్రాంతాలలో ఈ ప్రయత్నం సాధించిన విజయం ఏకరీతిలో లేదు. ఈ సందర్భంలో పేర్కొంటున్న గుజరాత్‌ లాండ్ పూలింగు పథకం సాఫల్యం దట్టమైన పట్టణ ప్రాంతాల్లో జరిగిందని గుర్తించాలి. అక్కడ బేరసారాల్లో కొంత వాస్తవికతా స్పర్శ ఉంది. అక్కడ ఈ పథకాన్ని విస్తృతంగా మళ్లీ మళ్లీ ప్రచారం చేశారు. భూయజమానులు అంగీకారం సంపాదించే ప్రయత్నంలో ప్రకటనలు చేశారు. దీనివల్ల అధికారులు ఏమి ఇవ్వదలచుకున్నారో, భూయజమానులకు ఏమి లభిస్తుందో స్పష్టమైంది.


మౌలిక సదుపాయాలకు ప్రోత్సాహం
శ్రీ నాయుడు రాబోయే కొద్ది సంవత్సరాలు కేంద్రప్రభుత్వ సహాయం సునిశ్చితమైన కోస్టల్ కారిడార్, గ్యాస్ పైప్‌లైన్, దాన్ని రాయలసీమకు రవాణా చేయడం, నడికుడి – కాళహస్తి రైల్వే లైను, తూర్పు-పడమరలకు మరికొన్ని రైలు మార్గాలు, మరికొన్ని అతి ముఖ్యమైన ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరించడం మంచిది. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఆయన రాజకీయ పలుకుబడిని కూడా పెంచుతుంది.

ప్రతి రాజకీయ రాజధానికీ, రాజకీయ సమర్థన అవసరం. కాని ఈ సందర్భంలో రాష్ట్రంలో మొత్తంగా రాజధాని ప్రాజెక్టు కోసం అటువంటి సమర్థన లేదు. సుదీర్ఘకాలం అనుభవజ్ఞులైన, సమర్థులైన అనేకులు పరిపాలనాధికారుల మార్గదర్శకత్వం లభించిన చరిత్ర ఆంధ్రప్రదేశ్‌కు ఉంది. శ్రీ నాయుడు వారి ప్రతిభాపాటవాలను ఉపయోగించుకొని, కనీసం రాబోయే కొద్ది సంవత్సరాలైనా రాష్ట్రం ముందున్న ప్రాథమ్యాలను గుర్తించినట్లయితే బాగుంటుంది. విషయం మహత్తరమైన రాజధానీనగరం కాదు, అది తర్వాత ఎప్పుడైనా రావచ్చు. ప్రస్తుతం ముఖ్యమైనదేమంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ శక్తినీ, ఆర్థిక వనరులను ఈ రాజధాని ప్రాజెక్టుకు తాకట్టు పెట్టే దాదాపు ఆత్మహత్యాసదృశమైన పని పనికిరాదు.

(కె.సి. శివరామకృష్ణన్, చైర్మన్, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్, భారత ప్రభుత్వం నియమించిన ‘ఆం.ప్ర. రాజధాని గురించి నిపుణుల కమిటీ’ చైర్మన్)
ఈ వ్యాసాన్ని ప్రచురించిన తర్వాత స్వల్ప కాలంలోనే 2015 మే 28 వ తేదీన శ్రీ శివరామకృష్ణన్ మరణించారు.

Comments

Popular posts from this blog

Whose Capital Amaravathi - Introduction

Urban centres as growth engines