ChandraBabu Naidu - CBN
చంద్రబాబు నాయుడు హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఒక రాజ్యాంగేతర శక్తిగా, అంతులేని అధికారాలున్న రాజకీయ అధికార కేంద్రంగా మారిందనడంలో సందేహం లేదు - "నవ్యాంధ్ర తో నా నడక"
14. చంద్రబాబు పని శైలి
చంద్రబాబు పనితీరు చాలా విచిత్రంగా ఉంటుంది.
ఏపని చేయాలనుకున్నా, ఎవర్ని నియమించాలనుకున్నా, ముందు రోజు ఆ విషయంపై లీకులు ఇస్తాడు. ఈ లీకుల్ని ఆయనకు అనుకూలంగా ఉన్న పత్రికలు, టీవీ ఛానెల్స్ ప్రచారం చేస్తాయి. దానిపై వచ్చిన ప్రతిస్పందన బట్టి ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఇది ఆయన సాధారణంగా అనుసరించే పద్ధతి. లేక ఆ నిర్ణయం వివాదాస్పదంగా, సంక్లిష్టంగా మారితే అందుకు బాధ్యతను ఎవరో ఒకరి పై తోసేసి తాను మాత్రం సురక్షితంగా ఉండాలని ప్రయత్నిస్తారు. చాలా సార్లు నిర్ణయాలకు బాధ్యతను అధికారులపైనే తోసేస్తారు. ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడా ఆయన ఇదే పద్ధతిని అనుసరించాడు.
ఉదాహరణకు గతంలో అదనంగా మద్యపు షాపులు ఇవ్వాలని నిర్ణయించారు. అప్పుడు పెద్ద గందరగోళం చెలరేగింది. మర్నాడు ఇది ఎవరు ఎందుకు చేశారు. అని ఆయన ఆరా తీసినట్లు, కమిషనర్‌పై ఆగ్రహించినట్లు పత్రికల్లో పతాకశీర్షికల్లో వార్తలు వచ్చాయి. మూడో రోజు తర్వాత ఆ కమిషనర్‌ను ఆ పదవి నుంచి తీసేసి పోస్టింగ్ ఇవ్వకుండా ఎక్కడో సర్దుబాటు చేశారు.
నిజానికి అదనంగా మద్యపు షాపులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఆయనే. కాని ప్రతికూల ప్రచారం వచ్చినందుకు అధికారిపై చర్య తీసుకున్నారు. ఇలా చాలా విషయాల్లో జరిగింది. నన్ను సిఎస్‌గా నియమించే విషయంలో కూడా ఆయన ఇదే పద్ధతి అనుసరించారు.
నన్ను ఛీఫ్ సెక్రటరీగా, రాముడును డీజీపిగా, మరొకర్ని ఇంటలిజెన్స్ ఐజిగా నియమించనున్నట్లు లీక్‌లు వచ్చాయి. రెండో రోజు ఈ జాబితా తీసుకుని గవర్నర్‌కు ఇవ్వాలి. గవర్నర్ ఆమోదం తెలపాలి. రెండో రోజు ఆ జాబితా చూసి ‘ఆ ఐజి ఇంటలిజెన్స్ పేరు తీసేయండి. ఈయనమీద నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది..’ అని ముఖ్యమంత్రి అన్నారు.
‘బతుకు జీవుడా’ అనుకున్నాను. నిన్న సాయంత్రం నా పేరు ఉందన్నారు. ఉదయం పేపర్ లో కూడా వార్త వచ్చింది. అదృష్టవశాత్తు నా మీద వ్యతిరేక ఫీడ్ బ్యాక్ రాలేదు. సాయంత్రం జరిగిన ఆంతరంగిక చర్చల్లో ఒక ముఖ్యుడు మీ పట్ల ఏమీ వ్యతిరేక సమాచారం ఇవ్వలేదనుకుంటాను.. అని ఒక మిత్రుడు అన్నాడు. దీనితో ఊపిరి పీల్చుకున్నాను.
ఈ పద్ధతి చాలా రోజుల తర్వాత అజయ్ కల్లం విషయంలో కూడా జరిగింది.
ఆయనకు ఛీఫ్ సెక్రటరీగా మొదట నెల రోజులు నియమించి తర్వాత ఆరునెలలు పొడిగించాలని ముందు నిర్ణయించారు. సాయంత్రం వరకు ఆయనే ఛీఫ్ సెక్రటరీ అన్న విషయం అందరూ అనుకున్నారు. కాని రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆంధ్రజ్యోతి బ్యూరో ఛీఫ్ మాధప్ నాకు మెసేజ్ పెట్టి కొత్త ఛీఫ్ సెక్రటరీగా దినేశ్‌కుమార్‌ను నియమిస్తున్నట్లు చెప్పారు. బహుశా రాత్రిపూట జరిగిన చర్చల్లో అజయ్ కల్లంను సిఎస్‌గా పంపకూడదని నిర్ణయించి ఉంటారు. ఆ తర్వాత కేంద్రం అజయ్ కల్లంకు ఆరు నెలలు పొడిగింపుకు సుముఖంగా లేదని, నెలరోజుల కోసం సిఎస్‌గా ఇచ్చే బదులు నేరుగా దినేశ్‌కుమార్‌కు ఇవ్వాలనుకుంటున్నామని లీకులు సృష్టించారు.
దీనితో అజయ్ కల్లం సిఎంను కలిశారు. ‘అదేమిటి సార్, నిన్నటిదాకా ఆరునెలలు పొడిగిస్తామని అనుకున్నారు కదా.. ఇప్పుడు నెల రోజులకోసం అయినా సిఎస్‌గా ఇవ్వకపోతే ఎలా.. కనీసం నన్ను ముందు అనుకున్న విధంగా ఒక నెల సిఎస్‌గా నియమించండి..’ అని అడిగారు. సిఎం అందుకు కాదన లేక అజయ్ కల్లంకు నెల రోజుల పాటు సిఎస్‌గా అవకాశం ఇచ్చారు. అదే జీవోలో అజయ్ కల్లం రిటైర్ మెంట్ తర్వాత దినేష్ కుమార్ ను నియమిస్తున్నట్లు తెలిపారు. మార్చి 1న అజయ్ కల్లం సిఎస్ అయ్యారు. ఫిబ్రవరి 24 వరకు కూడా దినేశ్‌కు తాను సిఎస్ అవుతానని నమ్మకం లేదు. ఆ రోజు ఆయనను సెక్రటేరియట్‌లో నేను కలిశాను. అజయ్ కల్లంకు నెలరోజులకోసం సిఎస్ గా ఇచ్చి తర్వాత ఆరునెలలు పొడిగించేటట్లున్నారు అన్న సమాచారం ఆయనకు అందింది. తెలిసింది. ఆరునెలల తర్వాత నాకు ఇస్తామంటున్నారు. ఆరునెలల తర్వాత ఏమి జరుగుతుందో, ఇస్తారో లేదో ఏం తెలుసు అని ఆయన అనుకున్నారు. కాని వారం రోజుల్లోనే ఇతరేతర కారణాల వల్ల చంద్రబాబు మనసు మారి దినేశ్ వైపు మొగ్గు చూపారు.
సరే దినేశ్‌కుమార్ కూడా సిఎస్ గా రావడానికి తన వంతు గట్టి ప్రయత్నాలు చేశారనుకోండి. అది వేరే విషయం కాని ఈ ఉదంతం కూడా చంద్రబాబు అనుసరించే పద్ధతిని స్పష్టం చేస్తుంది. ఉద్దేశ పూర్వకంగా లీకులు ఇవ్వడం, ఫీడ్ బ్యాక్ తెప్పించుకుని నియామకాలు చేయడం, ఎవర్ని దెబ్బ కొట్టాలో వారిని కొట్టడం, నిర్ణయాలు తీసుకోవడం చేస్తుంటారు. ఇష్టం లేని వారి మనో స్థైర్యం దెబ్బతీసే లీకులు ఇచ్చి బాగా ప్రచారం చేసి దెబ్బతీస్తారు. వేటు వేస్తారు.
నన్ను బ్రాహ్మణ కార్పోరేషన్‌నుంచి తీసేటప్పుడు కూడా ఇదే పద్ధతి అనుసరించారు. సాధారణంగా అధికారులకు సిసిఐ రూల్స్ అమలు అవుతాయి కనుక ఏమీ మాట్లాడకుండా ఊరుకుంటారు. కాని నాకు రిటైర్ అయిన తరువాత అలాంటివేవీ వర్తించవు కనుక వెంటనే ప్రతిస్పందించాను.
చంద్రబాబు శైలి గురించి, వ్యక్తిత్వానికి సంబంధించి రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, తాను చాలా కష్టపడుతున్నానని, 24 గంటల పాటు పనిచేస్తున్నారని, తనలా ఎవరూ పనిచేసేవారు లేరని ప్రచారం చేసుకోవడం, అలా కనిపించేందుకు ప్రయత్నించడం చంద్రబాబు తరుచూ చేస్తుంటారు. ఆయనకు అనుకూలంగా ఉన్న పత్రికలు దానికి అత్యధిక ప్రచారం చేస్తుంటాయి.
నా ఉద్దేశం ప్రకారం చంద్రబాబు 50 శాతం తక్కువ పనిచేస్తే రాష్ట్రం 200 శాతం ఎక్కువ అభివృద్ధి చెందుతుంది. ఆయన సాధ్యమైనంత మేరకు కుటుంబంతో గడపడం, మనుమడితో గడపడం చేస్తే మిగతా వారంతా హాయిగా పనిచేస్తారు. ఎప్పుడూ తన మనుమడితో సమయం గడిపేందుకు తీరిక లేదు అని వాపోతుంటారు. అలా వాపోవాల్సిన అవసరం లేదు. ఆయన కుటుంబానికి కూడా సమయం కేటాయిస్తే రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది.
ఎందుకంటే చంద్రబాబు పని చేయడం వల్ల అదనంగా వచ్చే ఫలితం ఏమీ ఉండదు. ఎటువంటి అదనపు విలువ చేర్చకుండా ఆయన అధికంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తే మాత్రం ఏం లాభం? నిజంగా మిగిలిన వాళ్లు పనిచేయడానికి ఇది ఆటంకంగా మారుతుంది.రెండవది ఆయన ఆచరణీయమైన రీతిలో గడువులు నిర్దేశించుకోకపోవడం. అనవసరంగా చేయాల్సిన సమయం కంటే ముందు చేయాలని భావించి లేని పోని హడావిడి చేస్తుంటారు.
ఉదాహరణకు యూరోపియన్ సంస్థలు షెల్, ఎంజీ కాకినాడలో ఎఫ్ ఎస్ ఆర్ యు (ఫ్లోటింగ్ స్టోరేజి, రిగ్యాసిఫికేషన్ యూనిట్) లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. సముద్రంలోనే లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ ను నిల్వచేసి ఆ తర్వాత దాన్ని సరఫరా చేస్తారు. ఢిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్ లో కంపెనీ ప్రతినిధులతో సమావేశం జరిగింది. ‘ఎన్ని రోజుల్లో మీరీ ప్రాజెక్టు పూర్తి చేస్తారు?’ అని చంద్రబాబు అడిగారు. నేను మనసులో వీళ్ళు రెండేళ్ళలో ప్రాజెక్టు పూర్తయ్యేటట్లైతే నాలుగేళ్లూ చెప్పితే బాగుండును. వెంటనే చంద్రబాబునాయుడుగారు రెండేళ్లలో చేయలేరా అంటాడని అనుకున్నాను. కాని ఆ కంపెనీ వాళ్లు రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామని సరైన సమయం చెప్పారు. ఏడాదిలో ఎందుకు పూర్తి చేయకూడదని చంద్రబాబు అడిగారు. అంత తక్కువ సమయంలో వీలు కాదని వాళ్లు చెప్పారు. దీనిపైనే గంటసేపు ఉత్తి చర్చ జరిగింది. చివరకు ఇప్పటి వరకూ ఆ ప్రాజెక్టు ప్రారంభం కానే లేదు. తమకు లాభసాటి కాదని షెల్, ఎంజీ కంపెనీలు ఉపసంహరించు కున్నాయి.
రాజధానిలో తాత్కాలిక సెక్రటేరియట్ నిర్మాణం విషయంలో కూడా ఇదే జరిగింది. అందుకు ఆరునెలలు పడుతుందని కాంట్రాక్టు తీసుకున్న సంస్థ చెప్పింది. లేదు రెండు, మూడునెలల్లో పూర్తి చేయాలని చంద్రబాబు నిర్దేశించారు. తాను ప్రతి వారం వచ్చి తనిఖీ చేస్తానని చెప్పారు. చంద్రబాబునాయుడు ప్రతి వారం వెళ్లడం వల్ల అక్కడ జరిగే పనిలో వచ్చే మార్పు ఏమీ ఉండదు. పైగా ఆయన తాను ఇచ్చిన సమయానికి నాలుగు గంటలో, అయిదు గంటలో ఆలస్యంగా వెళతారు. వాళ్లంతా ఆ నాలుగు గంటలు వేచి చూస్తూనే ఉంటారు. తర్వాత రెండు గంటల పాటు సమీక్ష జరుపుతారు. అంటే ప్రతివారం ఆరు గంటలు వృధా అవుతుంది. ఏమైనప్పటికీ చివరకు తాత్కాలిక సెక్రటేరియట్ కాంట్రాక్టర్ తొలుత చెప్పిన సమయానికే పని పూర్తి చేశారు. చంద్రబాబు ప్రతి వారం రావడం వల్ల వచ్చిన ఉపయోగమేమిటి? ఎవరికీ అర్థం కాలేదు.
ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును కూడా ఇదే విధంగా సమీక్ష చేస్తానంటారు. సమీక్ష చేయడంలో తప్పేమీ లేదు. ఒక సరైన కాల పరిమితిని ఇచ్చి హేతుబద్ధంగా వ్యవహరించి, పాత మినిట్స్ దగ్గర పెట్టుకుని సమీక్షించడం చంద్రబాబు చేయరు. తనను తాను బిజీగా ఉంచుకునేందుకు సమీక్ష పేరుతో జరుగుతున్న పనులు ఆలస్యమయ్యేందుకు కారణమవుతారు. మాటిమాటికీ ఒకేరకమైన సమీక్షలు, అదే అంశాలను పదే పదే మాట్లాడడం సోదిలా అనిపిస్తుందని కూడా ఆయనకు తట్టదు. ఆయన వల్ల చాలా మంది నిజంగా పనిచేసేవాళ్ల సమయం వృధా అవుతుంది. మండల స్థాయిలో ఉదయమే లేవడం, గంటలు గంటలు ఆయన చెప్పింది వినడం ప్రతి వాడికీ అలవాటైపోయింది. చంద్రబాబు తాను ఎంతో క్రియాశీలకంగా కష్టపడి చేస్తున్నాను అని బిల్డప్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. దాని వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని ఆయనకు అర్థం కాదు.
ఇటీవల ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తను ఏదో సందర్భంలో కలిశాను. ఎప్పుడో ముఖ్యమంత్రిగా ఉన్న వెంగళరావును ఆయన గుర్తు చేసుకున్నారు. తాను ఆదిలాబాద్‌లో ప్లాంట్ పెడతానని ముందుకు వచ్చినప్పుడు వెంగళరావు 15 రోజుల్లో అందుకు వీలు కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారట. నిజానికి వెంగళరావు ప్రతి అంశంపై చంద్రబాబు లాగా సమయం వృధా చేసే వారు కాదు. నేను ఖమ్మం కలెక్టర్‌గా ఆయన కేంద్ర మంత్రి. ఆయన పని విధానాన్ని దగ్గరగా చూచే అవకాశం లభించింది. చాలమంది సీనియర్ ఆఫీసర్లు ఆయనను ముఖ్యమంత్రిగా ఉన్న సమయాన్ని చాలా ఆత్మీయతతో గుర్తు చేసుకునేవారు. కాని ఆయన హయాంలో పనులు చకచకా సాగిపోయాయి. పనులు బాగా సాగడానికి ఇంతగా శ్రమించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు వల్ల జరగాల్సిన పనులు జరగకపోగా వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయన్న అంశం ఆలోచించుకోవాలి. తెలుగుదేశం వాళ్లకు కూడా ఈ విషయంలో తల బొప్పి కట్టిపోయిందంటారు.
నిజానికి చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, ఇప్పటికీ ఎంతో తేడా ఉన్నది. ఆ కాలంలో ఆయనకు అద్భుతమైన టీమ్ ఉండేది. ఒక టీమ్‌గా అది బాగా పనిచేసింది. ఆయన కూడా తాను నేర్చుకోవాలనే మనస్తత్వాన్ని ప్రదర్శించేవారు. తనకు అన్నీ తెలుసుననే మనస్తత్వాన్ని ప్రదర్శించేవారు కాదు. ఏ చిన్న మీటింగ్ అయినా ల్యాప్‌ట్యాప్ పెట్టుకుని ప్రజంటేషన్ చేసేవారు. ఏదో ఒకటి చేయాలన్న తపన, వినయం కనపడేవి. ఈ టీమ్ గతంలో అంత బాగా లేదు. ఇప్పుడు మాత్రం తాను సర్వజ్ఞుడినన్న అభిప్రాయం ఆయనలో కలిగింది. నాకు విద్యుత్ గురించి తెలిసినంతగా మీకు కూడా తెలియదు అని ఆయన విద్యుత్ అధికారులతోనే అనే స్థితికి వచ్చారు.
పైగా అప్పుడు హైదరాబాద్ నగరం అభివృద్ధి కావడానికి వేచి ఉన్న నగరంలా కనపడింది. ఆయన ఆ అవకాశాన్ని వినియోగించుకుని విజయవంతం అయ్యారు. ఇవాళ అలా అభివృద్ధి కోసం వేచి చూసే నగరమే లేదు. అంతా మొదటి నుంచి నిర్మించాల్సిన అవసరం ఉంది. అక్కడే ఆయన విఫలమవు తున్నారు. గతంలో ఉన్న విజన్ కొంత తప్పుద్రోవ పట్టింది. హైదరాబాద్, చెన్నై స్థాయిలో ఒక పెద్ద గ్రీన్ ఫీల్డ్ రాజధానిని నిర్మించాలని ఆయన ఆలోచిస్తున్నారు. అది సరైన విజన్ కాదు. పలు రకాల వైవిధ్య లక్షణాలున్న ఆంధప్రదేశ్ వంటి రాష్ట్రంలో అభివృద్ధికి వికేంద్రీకరణే సరైన వైఖరి. అధికారంలో లేనప్పుడు తనకు సాయం చేసిన వారికి ఇప్పుడు మళ్లీ తగిన రీతిలో ప్రతిఫలాలు అందేలా చూడాలని భావించడం కూడా లక్ష్యాలను నీరుకారుస్తోంది. సరే, చంద్రబాబు తొలి విడత పాలన సమయంలో పుత్రుడి జోక్యం లేదు. ఇప్పుడది కొత్త పరిణామం. నేనున్నంత కాలం దాని ప్రభావం ప్రత్యక్షంగా లేదు కాని పరోక్షంగా ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా అధికారయంత్రాంగంపై ఉంది.
తనకు అన్నీ తెలుసునన్న అభిప్రాయం ఉండడం వల్ల అధికారులు కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నారు.. కృష్ణా నదీ జలాలను బకింగ్ హామ్ ద్వారా పైకి పంపించి, పంపులు పెట్టి పైకి కొట్టి సోమశిలలో నింపుతాననో ఏదో చెబుతున్నారు.. అది ఎంతగా సాంకేతికంగా సాధ్యపడుతుందన్న విషయం మాత్రం ఎవరూ మాట్లాడరు. పైగా ఎలా తయారయ్యారంటే, ఆయనను మెప్పించేందుకు ‘వాట్ ఆన్ ఐడియా సర్ జీ’ అన్న స్థాయిలో ప్రశంసిస్తున్నారు. దీనితో తాను చెప్పింది కరెక్టని చంద్రబాబు అనుకుంటున్నారు. ‘గోదావరి నీళ్లు కృష్ణా లో కలిపాము, ఎప్పుడూ ఇలా జరగ లేదు, మేమే చేశాం, ఇదో పవిత్ర సంగమం’ అని ఎన్ని సార్లు చెప్పారో, ఎన్ని తడవల ప్రారంభోత్సవాలు పూజలు చేశారో? కాని పవిత్ర సంగమం ఎప్పుడో జరిగిపోయింది. తెలుగు గంగ పేరుతో ఎన్టీఆరే మొదలు పెట్టారు. సోమ శిల ప్రాజెక్టులో కృష్ణా నదీ జలాలు కలిపినప్పుడే పవిత్ర సంగమం ఏర్పడింది. అది వదిలేసి, ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నామని ప్రచారార్భాటం సృష్టిస్తున్నారు. మళ్లీ దీన్ని తీసుకువెళ్లి ఎక్కడో కలిపే బదులు, పైన సోమశిలలో నీళ్లు కలుపుకుని పంపించవచ్చు. ఈ అంశాలపై సరిగా దృష్టి కేంద్రీకరించకుండా అవాస్తవమైన అంశాలు ఎక్కువ మాట్లాడుతున్నారు.
నేను మొదట్లోనే చెప్పాను. కొత్తగా వెలగపూడి వద్ద రాజధాని పెడుతున్నప్పుడు తొలి ప్రాధాన్యత విజయవాడకు వెలగపూడితో రైల్వే లైన్ ద్వారా అనుసంధానం చేయడం అని. అది చాలా చిన్న అంశం. కృష్ణా కెనాల్ ద్వారా వెలగపూడికి రైల్వేలైన్ తీసుకువచ్చి గుంటూరు దగ్గర కలిపేయవచ్చు. రెండు లైన్లూ కలుస్తాయి. ఇది చిన్న ప్రాజెక్టు. గట్టిగా అడిగితే భారత ప్రభుత్వం కూడా ‘నో’ అనేది కాదు. ఆఫీసుకు వెళ్లేవారికి కూడా ఇబ్బందులు ఉండేవి కావు. తొలుత ఫోకస్ చేసి అది పూర్తి చేసుకోవచ్చు కదా.. కాని అలా చేయకుండా విజయవాడలో మెట్రో, హైపర్ లూప్ రైళ్లు, గూడూరు నుంచి విశాఖ వరకు హై స్పీడ్ బుల్లెట్ రైళ్లు అని ఆచరణీయం కాని వాటి గురించి మాట్లాడుతుంటారు. నిధులు లేని ఆలోచనలను వెల్లడిస్తుంటారు. అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తుంటారు. చెట్టు చిటారున ఉన్న పండ్ల పై కంటే, క్రిందికి వ్రేళ్లాడుతున్న పండ్లను ముందు తెంచుకోవాలని ఆయనే ఎన్నో సార్లు అన్నారు. కాని ఆయన దృష్టి ఎప్పుడూ అందని పండ్లపైనే చిటారుకొమ్మపై ఉంటుంది. వాటికోసం రాళ్లు విసురుతుంటారు.
మరో అంశం చంద్రబాబు నాయుడు హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఒక రాజ్యాంగేతర శక్తిగా, అంతులేని అధికారాలున్న రాజకీయ అధికార కేంద్రంగా మారిందనడంలో సందేహం లేదు. సీఎంఓ ఏమాత్రం పారదర్శకత, బాధ్యత లేకుండా నడుస్తుండటం వల్ల పరిపాలనపై ప్రతికూల ప్రభావం పడుతోంది. సీఎంఓ బాధ్యతాయుతంగా పనిచేసేలా పరిపాలనా సంస్కరణలు తీసుకురావాలని నేను ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశాను. సమాంతర సచివాలయంగా మారిన సీఎంఓ పారదర్శకంగా పనిచేయడం లేదు. “ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయం లో కూడా ప్రధానికి సలహాలు ఇచ్చిన, నోట్ రాసిన వారి సంతకాలు ఉంటాయి. గవర్నర్ కార్యాలయంలో గవర్నర్‌కు సలహా ఇచ్చిన వారి సంతకం ఉంటుంది. ఎలాంటి రికార్డులు, బాధ్యత, జవాబుదారీతనం లేకుండా పనిచేస్తున్న ఏకైక కార్యాలయం ముఖ్యమంత్రి కార్యాలయం ఒక్కటే. పారదర్శకత, బాధ్యత, జవాబుదారీతనం లేవనడానికి ఇదే నిదర్శనం” అని నేను తెలిపాను. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి, అదనపు కార్యదర్శి ఉన్నారు. అందరూ ప్రభుత్వ ఖజానా నుంచి జీతభత్యాలు తీసుకుంటున్నారు. అందువల్ల వారు నిర్వర్తించే విధులన్నీ పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాలి. అయితే, ప్రస్తుతం సీఎంఓ అధికారులు రికార్డులు నిర్వహించకుండా తమకు అనుకూలంగా కొన్ని అనధికారిక నోట్స్ నిర్వహిస్తూ పనులు పూర్తికాగానే వాటిని చించివేస్తున్నారు. దీన్నిబట్టి సీఎంఓ ఎలాంటి మాన్యువల్స్ (రికార్డులు) నిర్వహించడం లేదని, జవాబుదారీతనంతో పనిచేయడం లేదని స్పష్టమవుతోంది. ఎలాంటి నియంత్రణ లేని ఈ తరహా సీఎంఓ పనితీరు వల్ల ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది. సచివాలయంలో కార్యదర్శులు, ఇతర అధికారుల్లాగే సీఎంఓ అధికారులు కూడా సర్వీస్ రూల్స్ ప్రకారం రికార్డులు నిర్వహించాలి. సీఎంఓ అధికారులు ఏయే ఫైళ్లు తెప్పించుకున్నారు? ముఖ్యమంత్రికి ఏయే సలహాలు ఇచ్చారు? ఏయే విభాగాలకు ఏమేం రాసి పంపించారు? అనే వివరాలను భద్రపరిచే విధానం ఉంటే ఫైళ్ల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఈ జవాబుదారీతనం లేకపోవడం వల్లే సీఎంఓ అధికారులు రాజ్యాంగేతర శక్తులుగా మారి ప్రోటోకాల్‌ను కాలరాస్తున్నారు. ఉన్నతాధికారులను పక్కన పెట్టి కిందిస్థాయి వారి నుంచి నేరుగా తమకు కావాల్సిన రీతిలో ఫైళ్లు తెప్పించుకుంటున్నారు. తమ సంతకాలు లేనందున భవిష్యత్తులో వివాదాల్లో ఇరుక్కోమనే ధైర్యంతో సీఎంఓ అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు.
“ముఖ్యమంత్రి పరిశీలన కోసం ఫైల్ పంపండి (పుటప్ ఫైల్) అని రాయడానికే సీఎంఓ అధికారులు ఉన్నట్లయితే ఇందుకు ఐఏఎస్ అధికారులు అవసరం లేదు. ఎలాంటి బాధ్యత, జవాబుదారీతనం లేకుండా కేవలం ఫైల్ పుటప్ అని రాసి విభాగాలకు పంపించడం ద్వారా సీఎంకు సహాయపడటానికే అయితే సెక్షన్ ఆఫీసర్లు సరిపోతారు. సీఎంఓలో తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాలి. సీఎంఓ పారదర్శకంగా పనిచేసేలా, ప్రతి రికార్డునూ భద్రపరిచేలా ముఖ్యమంత్రి చొరవ తీసుకుని సంస్కరణలు అమల్లోకి తీసుకురావాలి. నా లేఖపై తీసుకున్న చర్యలను నాకు తెలియజేయాలి” అని సీఎంకు రాసిన లేఖలో నేను పేర్కొన్నాను. దీనిపైన నేను హైకోర్టులో కేసు వేశాను. అది పెండింగ్‌లో ఉంది. సమాచార హక్కు చట్టం ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ పాలనా క్రమంలో రహస్యం, గోప్యత అన్న పదాలకు తావు లేదు. ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయం ఎటువంటి బాధ్యత లేకుండా తిరుగులేని అధికారం అనుభవించడం అనేది వ్యవస్థతో చెలగాటమాడటమే.
నా అభిప్రాయం లిఖిత పూర్వకంగా తెలిపిన తర్వాత ఆయన తాను ఛీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? అని ముఖ్యమంత్రి అడిగారని తెలిసింది. ఎవరైనా ఏ సలహా ఎవరికైనా చెబితే విన్న వారికి ఆ సలహా రుచిస్తుందని అనిపించాలి కదా.. అయినా ఇచ్చిన సలహాలను పాటిస్తే కదా.. ఎవరైనా ముందుకు వెళ్లేది. తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని, తాను మాత్రమే ప్రజలకు జవాబుదారీ అని భావించి తమకు ఎవరి సలహాలు అవసరం లేదనుకునే నేతలకు చెప్పడం మన అమాయకత్వమే అవుతుంది.
Comments
Post a Comment