Navyandha tho na nadaka - Other division issues

పార్లమెంటులో ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చేసిన ప్రకటనలో చాలా స్పష్టంగా విభజన జరిగిన నాటి నుంచి 14వ ఆర్థిక సంఘం నివేదిక అమలయ్యే సమయం వరకు రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ లోటును కేంద్రం భర్తీ చేస్తుంది అని పేర్కొన్నారు..."నవ్యాంధ్రతో నా నడక"   

5. ఇతర విభజన అంశాలు

సంస్థలను ఉద్యోగులను విభజించే ప్రక్రియకు అనుబంధంగా ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం లో కొత్త రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేసే అంశాలను కొన్ని కొత్త ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేసే విధి విధానాలను పొందుపరచటం జరిగింది.దీనిలో ముఖ్యమైనది కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వెంటనే దృష్టి పెట్టవలసిన అంశం 14వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ కోరికలు తెలియజేస్తూ ఒక నివేదిక సమర్పించడం. 

రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 46 వ సెక్షన్ లో ఈ 14వ ఆర్థిక సంఘం ప్రస్తావన ఉన్నది. తదనుగుణంగా రాష్ట్రపతి రెండు కొత్త రాష్ట్రాలకు తమ అవార్డు ఇవ్వవలసిందిగా ఆర్థిక సంఘాన్ని కోరారు. ఈ సమావేశం తిరుపతిలో ఏర్పాటు చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన శ్రీ సి ఎస్ రావు గారిని ఆర్థిక శాఖలో సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయనకు కేంద్ర ప్రభుత్వం లో మంచి పేరు ఉన్నది. 14వ ఆర్థిక సంఘానికి మేము ఇచ్చే నివేదికను తయారు చేసే బాధ్యతను ఆయనకు అప్పగించడం జరిగింది. ఆర్థిక సంఘంలో సభ్యులు కొంత మంది ఆయన కింద పనిచేసిన వారే. ముఖ్యంగా సుష్మానాథ్ ఆయన కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయనతో పని చేసింది. 

ఆర్థిక సంఘం అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాడు కావడం కొంత మనకు కలిసొచ్చింది. ఆయనకు రాష్ట్ర సమస్యల మీద విభజన వలన రాష్ట్రానికి వచ్చిన అదనపు సమస్యల గురించి పూర్తి అవగాహన ఉంది. తిరుపతిలో జరిగిన సమావేశంలో రాష్ట్ర సమస్యలను విభజన పర్యవసానాలను ఆర్థిక సంఘానికి సవివరంగా తెలియ జేయడం జరిగింది. వారి తుది నివేదికలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2015 నుంచి 20 వరకు ఐదు సంవత్సరాలకు 21113 కోట్లు రెవిన్యూ లోటు భర్తీ కింద వారు సిఫార్స్ చేశారు. ఈశాన్య రాష్ట్రాలు కాకుండా ఐదు సంవత్సరాలకు రెవెన్యూ లోటు గ్రాంటులు వచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్. అధికార స్థాయి లో ఈ నివేదిక చూసిన తర్వాత మేమంతా చాలా సంతోషించాము. కానీ ముఖ్యమంత్రి గారికి ఆర్థిక సంఘం నివేదిక సంతృప్తి కలిగించలేదు. ఈ అంశంపై టెలీ కాన్ఫరెన్స్లు  మీటింగులు ఆఫీసర్లతో ,ఎంపీ లతో నిర్వహించారు. రాజధానికి ఏమి సహాయం ఇవ్వలేదని రాష్ట్రానికి ఉన్న సమస్యలను ఆర్థిక సంఘం సరిగ్గా అర్థం చేసుకోలేదని వ్యాఖ్యానించారు. సి ఎస్ రావు గారికి ఒక సందర్భంలో అసహనం వచ్చి ముఖ్యమంత్రి గారికి ఆర్థిక సంఘం వారికి ఇచ్చిన టర్మ్స్ అఫ్ రిఫరెన్స్  అనుగుణంగా వారి నివేదిక ఇస్తుందని రాజధాని అంశాలు మిగిలిన అంశాలు సంఘం పరిధిలోకి రావని ముఖ్యమంత్రి గారికి తెలియజేశారు.

ఈ అంశం ఇక్కడితో సమాప్తి కాలేదు. శాసనసభలో రెవెన్యూ మంత్రి గారు వై వేణుగోపాల్ రెడ్డి గారి మీద వ్యక్తిగత విమర్శ మొదలెట్టారు. సి ఎస్ రావు గారు నాకు ఫోన్ చేసి  చాలా ఉదారంగా రాష్ట్రానికి సహాయం చేసిన ఈ రకంగా విమర్శించటం బాధ కలిగిస్తుందని వేణుగోపాల్ రెడ్డి గారు తనతో అన్నారని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు రావాల్సిందిగా నన్ను కోరారు. ఈ అంశం ముఖ్యమంత్రి గారి తో నేను ప్రస్తావించినప్పుడు వారు వేణుగోపాల్ రెడ్డి గారంటే తనకు ఎనలేని గౌరవం అని వారితో ప్రత్యేకంగా మాట్లాడతానని తెలిపారు. ఈ విషయం సి ఎస్ రావు గారికి తెలిపి వేణుగోపాల్ రెడ్డి గారికి తెలియజేయమని కోరాను. కొన్ని రోజుల తర్వాత సి ఎస్ రావు గారిని ముఖ్యమంత్రి గారు వేణుగోపాల్ రెడ్డి గారి తో మాట్లాడారా అని అడిగినప్పుడు వారితో సంప్రదించి అటువంటి సంభాషణ ఏమి జరగలేదని తెలియజేశారు. 

14 ఆర్థిక సంఘం పదవి కాలం అయిపోవటంతో వేణుగోపాల్ రెడ్డి గారితోనూ సి ఎస్ రావు గారితోనూ అవసరం తీరిపోయింది. కొంతకాలానికి తనకు సరైన పని ఉండటం లేదని సి ఎస్ రావు గారు కూడా ఇంకా తనకు పదవి కాలం ఉన్న రాజీనామా చేసివెళ్లిపోయారు. మొత్తమ్మీద ముఖ్యమంత్రి గారికి అసంతృప్తి ఉన్న 14 ఆర్థిక సంఘం చాలా ఉదారంగా సీ ఎస్ రావు గారి వేణుగోపాల్ రెడ్డి గారి చొరవతో కొత్త రాష్ట్రం అవసరాలను దృష్టిలో ఉంచుకొని సహాయం చేసింది అనేది మాత్రం వాస్తవం.

ఇంకో ప్రధానాంశం 2014 -15 సంవత్సరం రెవిన్యూ లోటు భర్తీ. ఈ అంశంపై చట్టం లోఅంత స్పష్టత లేక పోయినా పార్లమెంటులో ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చేసిన ప్రకటనలో చాలా స్పష్టంగా విభజన జరిగిన నాటి నుంచి 14వ ఆర్థిక సంఘం నివేదిక అమలయ్యే సమయం వరకు రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ లోటును కేంద్రం భర్తీ చేస్తుంది అని పేర్కొన్నారు. గవర్నర్ పాలన సమయంలో నే గవర్నర్ గారు ఈ లోటు 16 వేల కోట్ల దాకా ఉండవచ్చని అంచనావేసి కేంద్రానికి పంపించడం జరిగింది.2014 డిసెంబర్ నాటికి అవగతమైన అంశమేంటంటే ఈ లోటు మూడు నాలుగు వేల కోట్ల ను  దాటదని. అంచనాలకు భిన్నంగా రాష్ట్ర ఆదాయం బాగా పెరిగింది. ఖర్చు నియంత్రణలో ఉంది. ఈ అంశంపై జనవరి 2015 నుంచి ముఖ్యమంత్రి గారు దృష్టిసారించారు. ఈ రెవెన్యూ లోటు బాగా పెంచాలని తదనుగుణంగా చర్యలు మొదలెట్టారు. దీనిని కేంద్రం నుంచి రాబట్టగలను అన్న పూర్తి ధైర్యంతో ఉన్నారు. బహుశా వాజ్‌పాయ్ కాలంలో ఎన్డీఏ ప్రభుత్వంలో తనకున్న పలుకుబడిని దృష్టిలో పెట్టుకొని అటువంటి అపోహలో ఉన్నారు. 

ఇక ఖర్చు మీద దృష్టి పెట్టటంతో అంతవరకు పరిగణలోకి తీసుకోని చాలా అంశాలు ముందుకు వచ్చాయి. సంవత్సరాల తరబడి ఇవ్వని పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఈ సమయంలోనే ఇవ్వటం మొదలెట్టారు. పరిశ్రమల వారు వెంటనే రావు అనుకున్న నిధులు వస్తున్నాయి కాబట్టి వారి మర్యాదలు వారు చేశారు. ఇక ఎన్నికల సమయంలోని వాగ్దానాల అమలుకు రైతు రుణమాఫీ అధిక పెన్షన్లు అంశాల మీద కూడా ఆఖరి రెండు నెలల్లో పెద్ద ఎత్తున ఖర్చు చేయడం జరిగింది. దీనితో రాష్ట్రానికి వచ్చే రెవిన్యూ లోటు 16,078 కోట్లు చేరింది. సంవత్సరాంతంలో లెక్కలు తనిఖీ చేసిన కాగ్ ఈ అంశాన్ని ధృవీకరించింది. ఈ మొత్తం భర్తీ చేయవలసిందిగా రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. కేంద్రం ఈ పద్దును పరిశీలించి ఎన్నికల హామీలు అమలుచేయటం మీద చేసిన ఖర్చులు మేము భరించలేమని అట్లా చేస్తే ఇతర రాష్ట్రాల నుంచి కూడా అటువంటి అభ్యర్థనలు వచ్చే అవకాశం ఉందని తెలియజేసింది. 

కేవలం రాష్ట్ర విభజన వల్ల వచ్చిన లోటును మాత్రమే భర్తీ చేస్తామని ఆ మొత్తం 4117 కోట్లు వస్తుందని తేల్చి చెప్పింది. మధ్యేమార్గంగా 2015 -16 వ సంవత్సరానికి 14వ ఆర్థిక సంఘం 600 9 కోట్లు రెవిన్యూ లోటు గా తేల్చింది కాబట్టి 2014-15 సంవత్సరానికి విభజన జరిగిన తర్వాత పది నెలలకు అదే దామాషాలో రెవిన్యూ లోటు భర్తీకి నిధులు ఇవ్వటానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కాగ్ పేర్కొనిన మొత్తాన్ని ఇవ్వాలని కోరింది. ఈ మధ్య ఇదే అంశం మీద సుప్రీంకోర్టులో ఒకరు వేసిన వ్యాజ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ పద్దు కింద రాష్ట్రానికి ఇవ్వాల్సిన మొత్తం 4117 కోట్ల గా తేల్చేసింది. సమస్య సామరస్యంగా పరిష్కరించుకోవడానికి రాష్ట్ర చొరవ చూపి ఉండుంటే ఆరు వేల కోట్ల కైనా వచ్చే అవకాశం ఉండేది.

సుప్రీంకోర్టులో ఈ అంశం మీద రాష్ట్రానికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. అతి నమ్మకంతో మనమే సృష్టించుకున్న సమస్య ఇది.ఇక చట్టంలోని 93 వ సెక్షన్ లో13వ షెడ్యూల్లో ఉన్న అంశాలను అమలు చేయటానికి కేంద్రం 10 సంవత్సరాల  లో తగిన చర్య తీసుకోవాలని ఉన్నది. ఈ 13వ షెడ్యూల్లో ఉన్న సంస్థలను విద్యారంగ సంస్థలుగా మౌలిక సదుపాయాల సంస్థలు గా విభజించారు. విద్యా రంగ సంస్థల విషయంలో చట్టం ఏర్పాటు చేయాలని నిర్దిష్టంగా చెప్పగా మౌలిక సదుపాయాల సంస్థల విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మాత్రమే ఉంది.

ముందు ఈ విద్యా సంస్థల ఏర్పాటు మీదనే మేము దృష్టి కేంద్రీకరించాం. కేంద్ర ప్రభుత్వంలో ఇది ఉన్నత విద్యాశాఖకు సంబంధించినది  గనుక ఆ శాఖ కార్యదర్శి తో సమావేశం కావడం జరిగింది. 2015 -16 విద్యా సంవత్సరం నుంచి ఈ సంస్థలు ప్రారంభించాల్సిందిగా మేము కోరాము. అవసరమైతే తాత్కాలికంగా భవనాలు ఏర్పాటు చేస్తామని తెలిపాము. దీనికి ఆయన సుముఖంగా లేడు. పూర్తి సదుపాయాలు ఏర్పడిన తర్వాతనే నాలుగైదు సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ఉన్నత స్థాయిలో చర్చించి కేంద్ర ప్రభుత్వం ఆమోదించే టట్లుగా  చేసింది. వెంటనే తాత్కాలిక భవనాల్లో ఈ సంస్థలను ప్రారంభించారు. ఏవో కొన్ని చోట్ల ఎక్కడ ఏర్పాటు చేయాలనే దాని మీద వివాదం ఉన్న సంస్థలు మినహాయించి మిగిలిన అన్ని సంస్థలు 2015 -16 విద్యా సంవత్సరం నుంచి పని చేయడం మొదలు పెట్టాయి. ఎన్ఐటి ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశం మీద తీవ్ర వివాదం నెలకొంది. తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయాలని జిల్లా మంత్రి గారు ఏలూరులోఅని ఒక బలమైన వర్గం ప్రయత్నాలు చేశాయి. చివరకు మంత్రి గారి వాదన ప్రకారం దీనిని తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల దీని ఏర్పాటు ఆలస్యం అయింది.

 అదేవిధంగా పెట్రోలియం యూనివర్సిటీ విశాఖపట్నం లోనా  , తూర్పుగోదావరి జిల్లాలో అనే అంశంపై తేల్చుకోలేక పోవడంతో దీని ప్రారంభం కూడా ఆలస్యమైంది.నేను పదవీ విరమణ చేసే సమయానికి చట్టం చేసి ఏర్పాటు చేయాల్సిన ఒకటి రెండు సంస్థలు మినహా మిగిలినవన్నీ పనిచేయడం ప్రారంభించాయి. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థలు తాత్కాలిక భవనాల్లో పనిచేస్తున్నాయని కేంద్రం పై ఆరోపణలు చేసినప్పుడు వాస్తవాలను ఎట్ల వక్రీకరిస్తుందని అనిపిస్తుంది. తాత్కాలిక భవనాల్లో అయినా వెంటనే ప్రారంభించమని వాళ్లను ప్రాధేయ పడింది మనం. మన అభ్యర్ధనను మన్నించి ముందు వారు వ్యతిరేకించిన చివరకు ఒప్పుకున్నారు. ఇప్పుడు తాత్కాలిక భవనాల్లోనే ఎందుకు కొనసాగిస్తున్నారని మన మేవాళ్ళను ప్రశ్నిస్తున్నాం.


 మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలలో మొదటి ప్రాధాన్యం చోటుచేసుకున్నది విశాఖ చెన్నై పరిశ్రమల ద్వారం. దీనికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి నిధులు సమకూర్చాలి ఉన్నందువలన వారితో చాలా మీటింగులు నిర్వహించడం జరిగింది. దీనిలో ఏర్పాటు చేయవలసిన పారిశ్రామిక వాడలను ఎంపిక చేయడం జరిగింది. నేను పదవీ విరమణ చేసే సమయానికి ఇది చాలా ముందు దశలో ఉన్నది. రెండవ ప్రధాన అంశం విజయవాడ విశాఖ పట్టణాలలో మెట్రో రైలు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేసే రోజుల్లో హైదరాబాద్ మెట్రో రైల్ వ్యవహారం చూసేవాణ్ణి. ఆ సమయంలో ఢిల్లీ మెట్రో శ్రీధరన్ గారితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. దానిని పురస్కరించుకొని వారిని హైదరాబాద్కు పిలిపించి ముఖ్యమంత్రి గారితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రెండు మెట్రో రైల్ ల మీద చాలా కసరత్తు జరిగింది. నేను పదవీ విరమణ చేసే సమయానికి విజయవాడ మెట్రో రైలు కు భూసేకరణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఆపైన ఎందు కో రెండు మెట్రో రైలు మూలన పడ్డాయి. ఇక మిగిలిన మౌలిక సదుపాయాల సంస్థ ఏర్పాటు సాధ్యాసాధ్య పరిశీలన నేను పదవీ విరమణ చేసే సమయానికి పూర్తి కాలేదు.

ముఖ్య కార్యదర్శిగా పదవి బాధ్యత స్వీకరించిన కొత్తల్లోనే నేను దృష్టి పెట్టిన ప్రధానాంశం ప్రత్యేక హోదా. ఈ అంశాన్ని చర్చించటం కోసం గా ప్రధానమంత్రి కార్యాలయంలోని సుబ్రహ్మణ్యం అనే  అధికారితో సమయం తీసుకొని పోయి కలవడం జరిగింది. జార్ఖండ్ క్యాడర్కు చెందిన ఈయన మన రాష్ట్రం వాడు. మొదటి సమావేశం లోనే ఆయన నిర్ద్వంద్వంగా ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని తేల్చేశారు. జాతీయ అభివృద్ధి మండలిలో తీసుకొనవలసిన నిర్ణయమని ఇతర ముఖ్య మంత్రులు తప్పకుండా అభ్యంతరాలు లేవనెత్తుతానని తెలిపాడు. ఏమైనా ఇది రాజకీయంగా తేల్చుకోవాల్సిన విషయం అని అధికారుల స్థాయిలో పరిష్కరించే అంశం కాదని చెప్పారు. ఈ అంశాన్ని తిరిగి వచ్చి ముఖ్యమంత్రి గారికి వివరించాను. ప్రత్యేక హోదా స్థాయిలో ప్యాకేజీ అంశం పై చర్చలు నేను ముఖ్య కార్యదర్శిగా ఉన్న సమయంలో మొదలు కాలేదు

Comments

Popular posts from this blog

Whose Capital Amaravathi - Introduction

Urban centres as growth engines