Donakonda ,the Aborted Neutral capital-Whose Capital Amaravathi

8. తటస్థ రాజధానిగా దొనకొండ: విఫలమైన ప్రతిపాదన

కొత్తరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా దొనకొండ ప్రతిపాదన

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూపరిపాలన శాఖ ఛీఫ్ కమీషనర్‌గా నేను 2013 మేలో బాధ్యతలు చేపట్టాను. 2013 జులై 30 వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పదేండ్లపాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ప్రతిపాదస్తూ కొత్త ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఏర్పాటుకు తీర్మానం చేసింది. సిడబ్ల్యుసి తీర్మానం ఆమోదించడంతో రాష్ట్రాన్ని విభజించడానికి కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయమై ఉందనీ, ఈ విభజన జరగడానికి సమయనిర్ణయమే జరగవలసి ఉందనీ అర్థమైపోయింది. నేను భూపరిపాలన శాఖ ఛీఫ్ కమీషనర్ని కావడం వల్ల, రెవిన్యూమంత్రి కొత్త రాష్ట్ర రాజధాని స్థలానికి యోగ్యమైన స్థలాన్ని పరిశీలించవలసిందిగానూ, దానికోసం ప్రభుత్వభూమి, ఎక్కడెక్కడ అందుబాటులో ఉందో అన్వేషించవలసిందిగానూ కోరారు. తదనుగుణంగా పని ప్రారంభించాను. విశాలమైన ప్రభుత్వ భూముల లభ్యతపై సమాచారం పంపవలసిందిగా కలెక్టర్లను కోరాను. అన్ని జిల్లాలనుండి సమాచారం సేకరించాను. ఈ సమాచర విశ్లేషణ వల్ల కొన్ని జిల్లాలలో తగినంత విశాలమైన ప్రభుత్వభూములు లభిస్తున్నాయనీ, ఆ భూములను రాజధానీనగర స్థాపనకు తేలికగానే సంపాదించవచ్చుననీ తెలిసింది. 

వైజాగ్ జిల్లా అచ్యుతాపురం సమీపంలో అటువంటి భూభాగం ఉంది. కృష్ణాజిల్లా నూజివీడులోనూ ఉంది. అదేవిధంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల మెట్ట ప్రాంతాలలోనూ, రాయలసీమ జిల్లాలు, నెల్లూరులోనూ విశాలమైన భూభాగాలు లభిస్తున్నాయి. పది కిలోమీటర్ల వ్యాసార్ధంలో ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతంలో 50,000 ఎకరాల ప్రభుత్వ భూమి వీటన్నిటిలోనూ విశాలమైనది. కొత్తరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు రాజధానీనగరాన్ని స్థాపించడానికి సంభావ్యస్థలంగా దొనకొండను సూచిస్తూ నేనొక కాన్సెప్ట్ నోట్ తయారుచేశాను. ఈ ఎంపికకు కారణాలివి.
అన్నిటికంటే నా మనస్సులో ఉన్న ముఖ్యమైన కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర. వారివారి ప్రత్యేక గుర్తింపులు కలిగిన చాలా విశిష్టమైన రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తర కోస్తా జిల్లాలు వంటి ప్రాంతాలు కలిసి ఏర్పడే రాష్ట్రం కావడం. రాజధానీ నగరస్థలం తటస్థ ప్రదేశంలో ఉందని అన్నిప్రాంతాల ప్రజలూ భావించాలి. ఒక ప్రత్యేక ప్రాంతం లేదా వర్గం రాజధాని స్థాపన ప్రక్రియలో ప్రాబల్యం లేదా అనుకూలతను పొందుతున్నదన్న భావన ఎవరికీ కలగకూడదు. 

ఈ దృష్టితో చూసినప్పుడు కోస్తాంధ్రలో గుంటూరు, నెల్లూరు జిల్లాల నుండి కొన్ని ప్రాంతాలను, రాయలసీమలో కర్నూలు జిల్లాలోని మార్కాపురం డివిజన్‌ను తీసికొని ఏర్పరచిన జిల్లా ప్రకాశం జిల్లా. ఆ జిల్లాలోని ఏ ప్రదేశాన్నయినా రాజధాని స్థలంగా బ్రహ్మాండంగా ఎంచుకోవచ్చు. ఆ స్థలం కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలకు తృప్తి కలిగిస్తుంది. తరువాత రాజధానీనగరాల స్థాపనకు సంబంధించిన రచనలను అధ్యయనం చేసినప్పుడు, ఈ ప్రత్యేకమైన ఆలోచన తటస్థభావన సిద్ధాంతంలో కనిపిస్తుంది. తమ తమ సొంత గుర్తింపులున్న భిన్నప్రాంతాల ప్రజలు తామందరికీ తటస్థమైన చోట రాజధానీనగరం ఉండాలని కోరుకున్నప్పుడు, అటువంటి స్థలం కోసం వెదికినప్పుడు ఆ స్థలం వారందరికీ సమానదూరంలో, సమానంగా అందుబాటులో ఉండి, అది తమది అన్న భావన కలగాలి.


మొదట దొనకొండ నెల్లూరు జిల్లాలో ఉంది. తరువాత అది ప్రకాశం జిల్లాలో భాగమయింది. ఇది కోస్తా ప్రాంతం. దీనికి దగ్గరలోని మార్కాపురం, గిద్దలూరు తాలూకాలు దీనిలో భాగమయ్యాయి. ఈ ప్రదేశం రాయలసీమలో భాగమైన కర్నూలు జిల్లాలో ఉండేవి. అందువల్ల ఈ ప్రాంతం ఇరు ప్రాంతాల వారికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని నాకనిపించింది.


కొత్తరాష్ట్రంలో ప్రభుత్వ కార్యకలాపాలు నడిచే పాలనాపరమైన రాజధాని నా మనస్సులో ఉంది. అది తక్షణం ఏర్పడే మహానగరం కాదు. దాన్ని ఒక చిన్న హరితక్షేత్ర రాజధానిగా, ప్రారంభంలో లక్షమంది ప్రజలకు ఆశ్రయమిచ్చేదిగా, కాలక్రమంలో ఐదులక్షల జనావాసంగా విస్తరించేదిగా ఊహించడం జరిగింది. ఛత్తీస్‌గఢ్ రాజధానిగా నయారాయపూర్ ఎలా వికాసం చెందిందీ అధ్యయనం చేశాను. ఆ ప్రకారమే 5000 ఎకరాల విస్తీర్ణంలో లక్షమంది జనాభాకు సరిపోయేదిగా ప్రారంభమై, కాలక్రమంలో మెల్లగా 20,000 ఎకరాలకు విస్తరించి, ఐదు లక్షల జనాభాను స్వీకరించగలగినదిగా దాన్ని ప్రతిపాదించాను. అప్పటి ఆంధ్రప్రదేశ్ సచివాలయం సిబ్బంది సుమారు 5500. అందులో నుంచి సుమారు 4000 మంది కొత్త రాజధానికి మారతారు. కుటుంబానికి నలుగురు చొప్పున లెక్కిస్తే వారి కుటుంబాల సభ్యుల సంఖ్య 16,000 అవుతుంది. సిబ్బంది, శాఖాధిపతుల కుటుంబ సభ్యుల సంఖ్య కలిపితే మరో 10,000. శాసనసభ, ఇతరమంత్రుల సిబ్బంది, ఇతర సిబ్బందితో కలిపితే మొత్తం నూతన రాజధానిలో ఉద్యోగులు, వారి కుటుంబసభ్యుల జనాభా 35,000 అవుతుంది. దీనికి ప్రభుత్వ పరమైన పనుల కోసం రాజధానికి వచ్చే అస్థిరమైన జనాభా (Floating population) 30, 40 వేలమంది ఉండవచ్చు. దాని ప్రకారం రాజధానిని ప్రారంభంలో లక్ష జనాభాకు ఆశ్రయమివ్వగలిగిందిగా, కాలక్రమంలో ఐదులక్షల వరకు జనాభాను ఇముడ్చుకోగలిగేట్లు దొనకొండ ప్రాంతంలో అందుబాటులో ఉన్న విశాలమైన ప్రభుత్వ భూములను వినియోగించుకోవచ్చు.


నూతన రాష్ట్రానికి దొనకొండను రాజధానిగా ప్రతిపాదించినప్పుడు నీటి సరఫరా గురించి కూడా ఆలోచించాను. నీటి సరఫరాకు నిశ్చితమైన కేటాయింపు తప్పనిసరి, ఆ నీటి సరఫరాలు కాలువల వ్యవస్థ అవసరం. చెన్నై విషయంలో కృష్ణాజలాల కేటాయింపు జరిగింది, తెలుగు గంగ కాలువల ద్వారా సరఫరా జరుగుతూ ఉంది. నూతన నగరానికి భారత ప్రభుత్వం నుండి నిశ్చిత పరిమాణంలో నీటి కేటాయింపు పొందవలసి ఉంటుంది. కృష్ణానది నుండి నీటిని దర్శిశాఖ కాలువ ద్వారా సరఫరా చేయవచ్చు. ఇది దొనకొండకు దగ్గరగా పారుతుంది. లేదా వెలిగొండ జలాశయం పని పూర్తయిన తర్వాత దానినుండి తీసుకోవచ్చు. అందువల్ల కొత్త నగరానికి నీటి సదుపాయం పెద్ద సమస్య కాకపోవచ్చు. ఈ ప్రాంతం బెంగళూరు - కలకత్తా రైలు మార్గం మీద ఉంది. రెండో ప్రపంచయుద్ధ సమయంలో నర్మించిన విమానాశ్రయం కూడా ఉంది. ఈ ప్రదేశాన్ని రాజధాని స్థలంగా సూచించడానికి విస్తారమైన ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండడం ఒక కారణం. రాజధానీనగర స్థాపన ఖర్చ గణనీయంగా తగ్గుతుంది. శుష్క, ఎర్ర నేలలు చవక, నిర్మాణానికి అనుకూలం కూడా. ఆంధ్రప్రదేశ్‌లోని భిన్న ప్రాంతాలకు ప్రస్తుతం రాజధానిగా అభివృద్ధి చేయదలచుకున్న అమరావతితో పోలిస్తే దొనకొండ కేంద్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో ఇది అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ రాజధానిని పెట్టడం ఈ ప్రాంతంలో ఆవశ్యకమైన అభివృద్ధి ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఈ ప్రాంతంలో అధిక సంఖ్యాకులు వెనుకబడిన తరగతులవారు, తదితరులు. అందువల్ల ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేక సామాజికవర్గ ప్రాబల్యం ఏర్పడే అవకాశం లేదు. అది నిజంగా ఒక లౌకిక, కాస్మోపాలిటన్ పరిపాలన రాజధానిగా ఏర్పడుతుంది. నగరాన్ని చిన్నదిగా, పరిపాలనా స్వభావం కలిగినదిగా, ఒక మహానగరాన్ని నిర్మించే భారీవ్యయం కలగకుండా, ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్, తిరుపతి, విజయవాడ వంటి పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా ఇప్పటికే వర్ధిల్లుతున్న నగరాలపై కేంద్రీకరణకు అవకాశమిస్తూ నిర్మించవలసి ఉంటుంది.


ఆ నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రతిపాదన పట్ల అనుకూలంగా ఉందనీ, దాన్ని భారత ప్రభుత్వానికి పంపిందనీ నాకు చెప్పారు. 2014 జూన్ 2 న రాష్ట్రం ఏర్పడటానికి ముందు ఈ భావనకు పత్రికల్లోనూ, ఇతర సంబంధిత చర్చా సందర్భాల్లోనూ విస్తృతంగా చర్చకు వచ్చింది. కాని ఒకసారి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 8, 2014 ప్రమాణస్వీకారం చేయడంతో రాజధానీనగర ఆలోచనే పూర్తిగా మారిపోయింది.
కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం నేను తయారుచేసిన కాన్సెప్ట్ నోట్ తరువాతి కాలంలో తరచుగా నా ఆలోచనలను ఆక్రమిస్తూ వస్తూ ఉంది. నేను 2014 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినయినప్పటికి రాజధానీనగర స్థలం గురించి ప్రభుత్వం అప్పటికే నిశ్చితమైన అజెండాతో ముందుకు వచ్చింది. భారత ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ వంటి నిపుణుల కమిటీ తమ అడుగుజాడల్లో నడవదని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం, పట్టణాభివృద్ధి శాఖామంత్రి నేతృత్వంలో స్థానిక పెట్టుబడిదారులు, స్థానిక రాజకీయ నాయకులు సభ్యులుగా మరొక కమిటీని నియమించింది. ప్రాథమికంగా ప్రధాన కార్యదర్శినే కమిటీ సమావేశకర్తగా నియమించ తలపెట్టారు. అప్పటికే దొనకొండ రాజధానీ నగరంగా గట్టి అభిప్రాయానికి వచ్చిన నేను, భూపరిపాలన శాఖ ఛీఫ్ కమీషనర్‌గా దానికోసం కాన్సెప్ట్ నోట్‌ను కూడా తయారుచేసి ఉన్నందున, కమిటీ సమావేశకర్తగా నేనుండాలన్న ఆలోచన నాకంత సౌకర్యంగా లేదు. అంతకు కొద్దిరోజుల ముందే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాను.

 ముఖ్యమంత్రి కూడా ప్రమాణస్వీకారం చేసి ఎక్కువరోజులు కాలేదు. మా ఇద్దరి ఆలోచనావిధానాలూ ఒకస్థాయిలో ఇంకా స్థిరపడలేదు. అందువల్ల నా ఈ అసౌకర్యాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రికి తెల్పడానికి కాస్త సంకోచించాను. కాని అదృష్టవశాత్తు తమ ఎంపికకు అనుకూలంగా రాజధానీ నగర స్థల నిర్ణయ అంశాన్ని నిర్వహించడానికి నేను తగిన వ్యక్తిని కానేమోనని ఎవరో ఆయన చెవిలో ఊదారు. తదనుగుణంగా మరుసటిరోజే సమావేశకర్తగా మరెవరో ఉంటారని నాకు తెలిపారు. రాజధానీ నగర ప్రదేశ విషయంలో ప్రభుత్వానికి నా అభిప్రాయం కంటే పూర్తిగా భిన్నమైన అభిప్రాయం ఉందని బాగా తెలిసిన నేను, సాధ్యమైనంతవరకు రాజధానీనగర స్థల నిర్ణయ ప్రక్రియకు, సంప్రతింపులకు దూరంగా ఉన్నాను. రాజధాని స్థలం ఎంపికలో గుణాత్మకమైన ప్రమాణాలు కాక, వాణిజ్య, రియల్ ఎస్టేట్ ఆసక్తులు, కుల ఆసక్తులు చోదకశక్తులుగా ఉన్నట్లు అర్థం చేసుకున్నాను కాబట్టి, రాజధాని విషయంలో నా అభిప్రాయాలు పంచుకోవడం నిరర్థకమని భావించాను. గుంటూరు ప్రాంతపు ఒకముఖ్యమైన రాజకీయ నాయకుడు – దొనకొండ ప్రాంతంలో నాకు భారీ పరిమాణంలో భూములు ఉన్నాయనీ, అందుకే దొనకొండలో రాజధాని కోసం అంతగా ప్రయత్నిస్తున్నాననీ ఆరోపణ చేశాడు. దొనకొండలో రాజధానిని ప్రతిపాదించడంలో నా ఆసక్తి సుదీర్ఘ భవిష్యత్తులో ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడాలనీ, ప్రాంతీయ సమతుల్యతను కాపాడాలనీ తప్ప మరొకటి కాదు. 


నేను ఆ ప్రాంతానికి చెందినవాణ్ణి కావడంకాని, మరొకటి కాని నా ప్రతిపాదన వెనుక లేదు. ఏది ఏమైనా నేను భూస్వాముల సామాజికవర్గానికి చెందినవాణ్ణీ కాను, దొనకొండలోనో, మరో చోటనో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టేంత డబ్బు సంపాదించినవాణ్ణీ కాను. ఈ దేశ విషాదమేమంటే దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సంపదను త్యాగం చేసిన దూరదృష్టి గల నాయకుల స్థానంలో, ఇటువంటి తమ గురించి మాత్రమే ఆలోచించే గుత్తేదారు తరగతి రాజకీయనాయకులు కావడం. వీళ్ల ఏకైకలక్ష్యం రాజకీయాల్లో పెట్టుబడి పెట్టి విపరీతమైన లాభాలు సంపాదించడమే! అటువంటి అవకాశానికి ప్రమాదం కలిగినప్పుడు ఎటువంటి ఆధారాలూ లేకుండా ఎదుటి వ్యక్తిపై బురద చల్లుతారు. అయితే ఈ ఆరోపణ చేసిన వ్యక్తి ఒక బాధ్యతాయుతుడైన రాజకీయనాయకుడై నందున, అతను పార్లమెంటు సభ్యుడు కూడా అయినందున, అతని నుండి వాస్తవాలను సేకరించి దర్యాప్తు జరిపించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరాను. నా అభ్యర్థనను పట్టించుకోకపోవడమే మంచిదనుకున్నది ప్రభుత్వం.

Comments

Popular posts from this blog

Whose Capital Amaravathi - Introduction

Urban centres as growth engines