Amaravathi and other cities of AP - Whose Capital Amaravathi
13. అమరావతి - ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర నగరాలు
అమరావతి, దాని అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇతరనగరాల అభివృద్ధిని రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కుంటుపరిచే అవకాశం ఉంది. ‘Capital cities Varieties and Patterns of Development and Relocation’ అన్న తన పుస్తకంలో వాదిం రాస్‌మన్, కొన్ని ఆసక్తికరమైన పరిశీలనలు చేశాడు. తగినంత పరిమాణం కలిగిన బలమైన నగరాల నెట్‌వర్క్ ఉన్న దేశాలు, ప్రాంతాలలో రాజధానీనగరాలు స్వాభావికంగానే చిన్నవిగా ఉంటాయనీ, నగరాల నెట్‌వర్క్ చిన్నదిగా ఉండి నగరాలు పరిమాణంలోనూ, సంఖ్యలోనూ తక్కువగా ఉన్నప్పుడు రాజధానీనగరాల పరిమాణం పెద్దదిగా ఉంటుందనీ అతనంటాడు. మధ్యస్థాయి పరిమాణం గల అనేక పట్టణాల నెట్‌వర్కు, వైజాగ్, విజయవాడ, తిరుపతి అనే మూడు పెద్ద నగరాలు రాష్ట్రం మూడు ప్రాంతాలలోనూ ఉండడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదృష్టం.
ఇటువంటి బలమైన నగరాల నెట్‌వర్కు ఉన్న రాష్ట్రంలో ఒక భారీ పరిమాణం గల హరితక్షేత్ర రాజధానీ నగరంపై ప్రత్యేక శ్రద్ధ శివరామకృష్ణన్ కమిటీ చెప్పినట్లు తేనెకుండ ప్రభావాన్ని చూపి, పెట్టుబడులు, నిధులు అన్నీ ఒకే చోట కేంద్రీకృతమై ప్రస్తుతం ఉన్న నగరాల విస్తరణకూ, ఆరోగ్యకరమైన అభివృద్ధికీ ఆటంకం కలిగిస్తుంది. ఇది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైంది. రాజధానీ నగరం అమరావతిపై కేంద్రీకరించే మానసికస్థితి నుండి రాష్ట్ర ప్రభుత్వం బయట పడనట్లయితే ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఇలా ఉంటే మనం ఎంత శ్రమ పడినప్పటికీ అనేక ఇతర కారణాల మూలంగా రాజధాని ప్రాజెక్టు ముందుకు సాగకపోవచ్చు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు నాకిది ప్రత్యక్షానుభవమే. ఒకరోజు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి, నేను విజయవాడలో ఉన్నప్పుడు నాకు ఫోను చేసి దక్షిణ కొరియా రాయబారి ప్రతినిధి నన్ను కలుసుకోవాలనుకుంటున్నాడనీ, తమకు ఎదురైన ఒక ఇబ్బందిని వివరించదలచుకున్నాడనీ సమాచారమిచ్చారు. వాళ్లకు నేను సమయమిచ్చాను. వాళ్లు నన్ను కలుసుకున్నారు. ఆ సంవత్సరం భారత - కొరియా పారిశ్రామిక సమావేశం నిర్వహించడానికి వైజాగ్‌ను వేదికగా ఎంపిక చేసుకున్నామనీ, కాని గౌరవనీయ ముఖ్యమంత్రి అది విజయవాడలో జరగాలని పట్టుపడుతున్నారని వాళ్లు చెప్పారు. గౌరవనీయ ముఖ్యమంత్రి అభ్యర్థనను మన్నించి తాము విజయవాడకు వచ్చామనీ, కానీ ఇటువంటి పెద్ద సన్నివేశాన్ని నిర్వహించడానికి తగిన వేదికగానీ, వసతికానీ విజయవాడలో లభించనందున, ఈ సమావేశాన్ని వైజాగ్‌లోనే నిర్వహించుకోవడానికి ముఖ్యమంత్రిగారిని ఒప్పించడానికి నన్ను సహాయం చేయమనీ వాళ్లు కోరారు. తదనుగుణంగా నేను ముఖ్యమంత్రిని కోరాను, ఆయన వైజాగ్‌లో సమావేశ నిర్వహణకు అంగీకరించారు.
ఆ విధంగానే దాని నిర్వహణ జరిగింది. పెట్టుబడులు, నిధుల ప్రవాహానికి గమ్యంగా అమరావతిపై అతి శ్రద్ధ తక్కిన రాష్ట్రానికీ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న ఇతర ప్రధాన నగరాలకూ ఘోరమైన ఫలితాలనివ్వవచ్చు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బాంకును 2000 కోట్ల అప్పు అడిగింది, అమరావతీ నగర అభివృద్ధికి దాన్ని గ్రాంటుగా అడిగింది. ఈ నిర్దిష్ట మొత్తాన్ని రాష్ట్రవిభజన ఫలితంగా కేంద్రప్రభుత్వం ఇవ్వవలసిన ప్రత్యేక కేటగిరీ స్టేటస్‌కు బదులుగా ప్రకటించిన ప్రత్యేక పాకేజీలో భాగంగా రాష్ట్రప్రభుత్వం కేంద్రప్రభుత్వాన్ని అడిగింది. అసలు రాష్ట్రం మొత్తం అభివృద్ధి కోసం అన్నిప్రాంతాలకూ ఈ నిధి అందడం సముచితం.
కాని భారత ప్రభుత్వం లేదా ఇతర మల్టీలేటరల్ ఏజెన్సీల నుండి వచ్చి ఇటువంటి నిధులను ఒకే ఒక స్థలానికి వాడడం ఎంతవరకు సమంజసం? ఏ రాష్ట్రమయినా తన అభివృద్ధి ప్రణాళికలను తయారు చేసేటప్పుడు రాష్ట్రానికి ప్రత్యేకమైన సమస్యలను దృష్టిలో పెట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్ర వైశాల్యం ఎక్కువ. తత్ఫలితంగా విభిన్న ప్రదేశాలలోని అభివృద్ధి కేంద్రాలు మూడు ప్రధాన ప్రాంతాలలోనూ సహజమైన పెద్దనగరాల అభివృద్ధికి కారణమయ్యాయి.
రాష్ట్రంలో ప్రాంతీయాభివృద్ధి సమతుల్యతను సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రాంతాల సముచిత అభివృద్ధికి కృషి చేయడం అత్యవసరం. ఒక లక్ష్యాత్మక ఫార్ములా ఆధారంగా తనకు అందిన నిధులన్నిటినీ సమానంగా పంపిణీ ఈ ప్రాంతాలన్నిటికీ జరిగేటట్లు చూడాలి. అన్ని నిధులనూ ఒకే చోట కేంద్రీకరించే ప్రయత్నం అంతరాలు పెరగడానికి తోడ్పడి, భిన్నప్రాంతాల మధ్య సందేహాలకు, ద్వేషానికి తావిస్తుంది.
Comments
Post a Comment