Navyandhra tho na nadaka - Introduction
పరిచయం
శ్రీ ఐవైఆర్ కృష్ణారావు కొత్తరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడే దశలో ప్రధాన కార్యదర్శి కాబోయేముందు జరిగిన అనేక విషయాలకు ప్రత్యక్షంగాకాని, పరోక్షంగాకాని భాగస్వామిగాను, రాష్ట్రం ఏర్పడిన అనంతరం ప్రధాన కార్యదర్శిగా తాను నిర్వహించిన పాత్రను వివరించే గ్రంథం ఇది. ఖమ్మం జిల్లాలో ఐటిడిఏలో పనిచేసినప్పటి నుండి ఐవైఆర్ నాకు తెలుసు. ఆయన మొహమాటం లేకుండా సూటిగా మాట్లాడే ప్రభుత్వాధికారి. అదే ఆయన బలమూ, బలహీనతా కూడా. ఇలా ముక్కుసూటిగా మాట్లాడే అధికారులు రాజకీయ అధికారయంత్రాంగానికి అప్పుడప్పుడూ అసౌకర్యంగా అనిపిస్తుంటారు. ఆయన కొత్తరాజధాని కోసం ఎంపిక చేసిన స్థలం గురించి బాహాటంగా వ్యక్తం చేసిన అభిప్రాయాలు రియల్ ఎస్టేట్ ముఠాలకు, ప్రధానంగా వ్యక్తిగత ఆసక్తులు, ప్రయోజనాలున్న ప్రజాప్రతినిధులనబడే వాళ్లకు ఆందోళన కలిగించడంలో ఆశ్చర్యమేమీ లేదు.
ఈ రాష్ట్రవిభజనకు దారితీసిన కొన్ని పరిస్థితులను దగ్గర నుండి చూసే అవకాశం నాకు కూడా కలిగింది. ఆ కీలకమైన రోజుల్లో ఆంధ్ర ప్రాంత నాయకుల ప్రవర్తన విషయంలో ఐవైఆర్ అభిప్రాయాలతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. దాదాపు అన్ని రాజకీయ పార్టీల నాయకులూ ప్రాంత ప్రయోజనాలను కాపాడడం కోసం పనిచేయడం కంటే రాజకీయంగా సరైన నిర్ణయం పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. వారిలో ఎక్కువమంది అసలు విభజన జరుగుతుందని ఎన్నడూ నమ్మలేదు. రాజ్యాంగ పదవులలో అత్యున్నత స్థానంలో ఉన్న కొందరు జనాంతికంలో రెండు రకాలుగా మాట్లాడడం కూడా దీనికి కారణం కావచ్చు. వాళ్ళు చాలా తరచుగా విభజనకు వ్యతిరేకంగా ప్రైవేటులో తమ అభిప్రాయాలను ప్రకటించడమూ, విభజనకు అవసరమైన రాజ్యాంగ ప్రక్రియ దాదాపు అసాధ్యమన్నంత క్లిష్టమైనదని ఆంధ్రనాయకులకు నమ్మకంగా చెప్పడమూ చేస్తూ వచ్చారు. ఈ నమ్మకమైన మాటలు సత్యమని విశ్వసించి ఆంధ్రప్రాంత నాయకులు తమ ప్రాంతం కోసం సవరణలు మొ॥న వాటి ద్వారా డిమాండ్లు చేయడం, విభజన ప్రతిపాదనకు అంగీకారం తెల్పినట్లవుతుందని భావించి చట్టంలోని వివిధ అంశాలపట్ల తమ అభ్యంతరాలను, ఆందోళనను తెలియజేయకుండా దూరంగా ఉన్నారు. అయినా కొందరు ప్రభుత్వాధికారులు శ్రమించి అనేక సవరణలు సూచించారు కాని, ఢిల్లీ వాటిని పట్టించుకోలేదు.
కుటుంబ ఆధిపత్యం, నియంత్రణలోని కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని కొంత చులకనగానే ఉపయోగించుకుంది. చారిత్రకంగా కాంగ్రెస్ పార్టీ రెండురకాల నాయకుల్ని ప్రోత్సహించింది. మొదటి తరం నాయకుల వారసత్వ సంతానం ఒకరకమైతే, వేళ్లు లేని వీరవిధేయులు రెండోరకం. వీరు సొంతంగా డిపాజిట్లు కూడా తెచ్చుకోలేరు కాని క్షేత్రస్థాయిలో వీరిని మేధావులుగా ముద్ర వేస్తారు. ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో ఇటువంటి ట్రిక్కునే ఉపయోగించారు. ఒక విధేయ మంత్రికి ఈ పని అప్పగించారు. ఆ మంత్రి కొందరు తుంటరి హోంశాఖ అధికారులతో ఈ ప్రక్రియను సమన్వయం చేశారు. ఈ తుంటరి అధికారులు వ్యక్తిగతంగా లాభపడే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. తుది ఫలితం ఏమంటే ఆంధ్ర ప్రాంతానికి నష్టం కలిగిస్తూ, దాదాపు ఏకపక్ష ఏర్పాట్లతో ఒక అప్రామాణిక చట్టం. అటువంటి అంశాలలో ఒకటి సరిహద్దుల నిర్ణయం. ఆంధ్రరాష్ట్రంలో తమ ఏకీకరణకు ముందు 1-11-1956 నాడు ఉన్నట్లుగా తమ ప్రాంతాన్ని వేరు చేయమని తెలంగాణ నాయకులు బాహాటంగా కోరారు. అటువంటి సమయంలో గతంలో ఆంధ్రప్రాంతంలో ఉన్న ప్రాంతాలను తెలంగాణలో ఎందుకు కలిపారు? ఇది కావాలనే చేశారు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సమస్యలు సంపాదించడానికీ, విభజనను నిరుత్సాహపరిచే తమ ఆత్రుతలో విభజనవల్ల తెలంగాణ ఎదుర్కొనే సమస్యలను ముఖ్యంగా విద్యుత్తు విషయంలో ఎదుర్కొనవలసి వచ్చే కష్టాలను తరచుగా తమ ఆందోళనలను వెలిబుచ్చడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కొందరు ముఖ్యమైన నేతలు పరోక్షంగా సహాయం చేశారు. పైన పేర్కొన్నట్లుగా ఢిల్లీలోని ఆ పాత్రలూ, మంత్రి, హోం మంత్రిత్వశాఖ సీనియర్ అధికారులు ఆంధ్రప్రభుత్వమూ, నేతలూ అందించిన ప్రతి సమాచారాన్ని, అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని తెలంగాణ ఆసక్తులను కాపాడడం కోసం ఉపయోగించుకున్నారు.
ఐవైఆర్ తర్వాత హోంశాఖ అవలంబించిన సహకార నిరాకరణ సందర్భాలననేకం పేర్కొన్నారు. అధికారుల విభజన ప్రక్రియలో సరైన న్యాయం జరగలేదన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఫలితార్థ మేమంటే మొత్తం ప్రక్రియలో రాజ్యాంగనైతికతకు పూర్తిగా నీళ్లొదిలేశారు. విభజన అంశాలపట్ల, వాటి పరిష్కారాల పట్ల భారత ప్రభుత్వం ఎటువంటి ఆసక్తీ చూపలేదు. ఢిల్లీలో అధికారంలో ఉన్నవారికి తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలధికం కావడం వల్ల చట్టంలోని ఏర్పాట్లలోని పరస్పర వైరుధ్యాల గురించి పట్టించుకోనే లేదు. విభజనానంతరం దురదృష్టవశాత్తు రెండు రాష్ట్రాలకూ అనైతిక నేతలే లభించారు. వీళ్లు భవిష్యత్ ద్రష్టలుగా ఉండడానికి బదులు కాకమ్మ కథలు చెప్పి ప్రజారంజకులయ్యారు. బాహాటంగా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించారు, అవి నీతి సాగించారు, వృథా ఖర్చులు చేసి రెండు రాష్ట్రాలనూ అప్పుల ఊబిలోకి నెట్టారు. వీళ్లకు ప్రజాభిప్రాయం మీద ఎన్నడూ గౌరవం లేదు, సంప్రతింపులు, సలహాల మీద నమ్మకం లేదు, తమ శక్తినంతా మీడియాను తమవైపు తిప్పుకోవడం పైనే ప్రధానంగా కేంద్రీకరించారు.
ప్రభుత్వ స్థాయిలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నది ఆ ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఐవైఆర్ విస్పష్టరీతిలో చెప్పారు. ఆయన జ్ఞాపకశక్తి ప్రశంసనీయం. జనం ఈ పుస్తకాన్ని చదివి, ఇందులో చెప్పిన విషయాలను గుర్తిస్తారనీ, మన ప్రభుత్వ సంస్థలను ఎలా వినియోగిస్తారో ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఎలా దుర్వినియోగపరుస్తారో అవగాహన చేసుకుంటారనీ ఆశిస్తాను. రాబోయే నెలలు, సంవత్సరాలలో తమ తమ రాష్ట్రాల భవిష్యత్తును రూపొందించు కోవడంలో నిజాయితీ, వినయం, న్యాయబుద్ధి, నిష్పక్షపాత బుద్ధి కలిగిన సరైన ఆదర్శవ్యక్తులను ఎంపిక చేసుకొనే వివేకాన్ని ఉభయరాష్ట్రాల పౌరులకూ భగవంతుడు ప్రసాదించుగాక.
Comments
Post a Comment