Whose capital Amaravathi - Early designed Capital Cities of India

4. భారతదేశం ప్రణాళికీకరించిన తొలి రాజధానులు

1. పంజాబ్ , హర్యానాల రాజధాని చండీగఢ్
బ్రిటిష్ ఇండియా విభాజితమైనప్పుడు పంజాబు రాష్ట్రం భారత పాకిస్తాన్‌ల మధ్య విభాజితమైంది. పంజాబు రాష్ట్ర రాజధాని అయిన లాహోరు పాకిస్తాన్ భాగంలోకి వెళ్లింది. అందువల్ల భారత సమాఖ్యలో భాగమైన తూర్పు పంజాబుకోసం ప్రత్యేక రాష్ట్ర రాజధానిని నిర్మించవలసి వచ్చింది. దీనికితోడు పశ్చిమ పాకిస్తాన్ నుండి వస్తున్న కాందిశీకులకు నివాసస్థానం కల్పించడం కోసం ఒక నగరాన్ని నిర్మించవలసిన అవసరం కూడా ఏర్పడింది. ఈ రెండు ప్రయోజనాలనూ నెరవేర్చడానికి ఉపయోగపడేటట్లు చండీగఢ్‌ను ఒక ఆధునిక ప్రణాళికీకృత నగరంగా రూపొందించారు. 

ఆధునిక నగరంగా చండీగఢ్ అభివృద్ధిలో జవహర్‌లాల్ నెహ్రూ స్వయంగా శ్రద్ధ తీసుకున్నారు. రాజధాని చండీగఢ్ నిర్మాణంలో ఒక భవిష్యద్దృష్టి కనబరిచాడు. భారత స్వాతంత్ర్యానికది ప్రతీకగా ఉండాలని, గత సంప్రదాయ బంధాలు దాన్ని అడ్డుకోకూడదని, భవిష్యత్తుపై దేశ విశ్వాసానికది ఒక ప్రతిబింబంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డాడు. శివాలిక్ పర్వతశ్రేణి పాదాలవద్ద తగిన స్థలాన్ని ఎంపిక చేశారు. సమీపంలో చండీ మందిరపు చండీమాత పేరునే నగరం పేరుగా నిర్ణయించారు. దీని మౌలిక మాస్టర్ ప్లాన్ రచించింది ఆల్బర్ట్ మయర్. కాని ఫ్రెంచి ఆర్కిటెక్ట్ లె కర్బూజ్యె, అతని జట్టు నగరాన్ని నిర్మించారు. ఫలితం చండీగఢ్ నగరం. ఈ హరిత క్షేత్ర నగర స్థాపనలో అద్భుత ఆర్కిటెక్చరల్ మేధావి లె కర్బూజ్యె కీర్తి ఎటువంటిదో, నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ దూరదృష్టి, నిబద్ధత అంతే కీర్తనీయమైనవి.

లె కర్బూజ్యె చండీగఢ్ మాస్టర్ ప్లాన్‌ను మానవశరీరం పోలికతో రచించాడు. నాలుగు ప్రధాన లక్ష్యాల నిర్వహణపై ఆధారపడిన నగర భావన ఇది; జీవించడం, పనిచేయడం, శరీరం మనస్సు, ఆత్మల భద్రత, రక్త ప్రసరణం (రవాణా). అతని నగర సాధారణ ప్రణాళికను సెక్టర్లుగా విభజించి డిజైన్ చేశాడు. లె కర్బూజ్యె అతి పెద్ద ‘తెరచిన చేయి’ నిర్మాణాలు చండీగఢ్‌లో ఉన్నాయి. అవి 26 మీటర్ల ఎత్తుంటాయి. లె కర్బూజ్యె ఆర్కిటెక్చర్‌లో పునరుక్తమయ్యే లక్షణమిది. స్వాతంత్ర్యానంతర భారతదేశంలో ప్రణాళికీకృత నగరాలలో మొదటివాటిలో ఒకటి చండీగఢ్. ఇది వాస్తు శిల్పానికీ, పట్టణం నమూనాకీ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. 

చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం. పదిలక్షల జనాభాతో పంజాబ్, హర్యాణా రాష్ట్రాల రాజధాని.
2016 లో చండీగఢ్ రాజధాని కాంప్లెక్సును యునెస్కో వరల్డ్ హెరిటేజ్‌గా ప్రకటించింది. “లె కర్బూజ్యె వాస్తుకృషి ఆధునిక ఉద్యమానికి అసాధారణమైన భాగదేయం” అని పేర్కొన్నారు.

2. ఒడిశా రాజధాని భువనేశ్వర్
బ్రిటిష్ పాలన కాలంలో భాషాపరంగా ఏర్పడిన తొలిరాష్ట్రం ఒడిశా రాష్ట్రం. ఒరియా మాట్లాడే ప్రజలు మూడు బ్రిటిష్ ప్రావిన్సులలో విభాజితమై ఉన్నారు. కలకత్తా, సెంట్రన్, మద్రాసు ప్రెసిడెన్సీ లివి. తమ దోపిడి జరుగుతున్నదన్న భావన ఒరియా ప్రజలలో బలంగా ఉండేది. ముఖ్యంగా తమ ప్రాంతంలో ప్రభుత్వోద్యోగాలలో అధికభాగం బెంగాలీల చేతిలో ఉండడం వారిలో నిరసనకు దారితీసింది.

19వ శతాబ్ది ద్వితీయార్ధంలో ఒరియా భాషాసంస్కృతుల పరిరక్షణ కోసం ఉత్కళ సభ, ఆ తర్వాత ఉత్కళ సంఘసమితి వంటి సంఘాలు ఏర్పడి, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటంలో ప్రముఖపాత్ర వహించాయి. పిల్లలకు విద్యాబోధనలో బెంగాలీని తప్పనిసరి చేసే ప్రయత్నాలు కూడా ఈ ప్రాంతీయాభిమానానికి బలమిచ్చాయి. 1911 లో బీహార్, ఒరిస్సాలను కలిపి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరిచారు. దీనికి మొదట రాంచీ, తర్వాత పాట్నా రాజధానులయ్యాయి. ఇది ఒరియా భాష ఆకాంక్షలను తృప్తి పరచలేకపోయింది. 

1920 నాగపూర్ కాంగ్రెస్‌లో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తీర్మానాన్ని ఒరిస్సా ప్రజలు స్వాగతించారు. చివరికి మధ్య రాష్ట్రం, మద్రాసు రాష్ట్రం, బీహారు ఒరిస్సా రాష్ట్రాలు మూడింటిలోను ఒరియా మాట్లాడుతున్న ప్రాంతాలను ఏకం చేసి 1936 ఏప్రిల్ ఒకటవ తేదీన ఒరిస్సాను ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పరిచారు. భారతదేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలిరాష్ట్రం ఒరిస్సా. 1953 లో ఆంధ్రరాష్ట్రం దేశ స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన ప్రత్యేక భాషారాష్ట్ర మైనప్పటికీ, వాస్తవానికి తొలి భాషాప్రయుక్త రాష్ట్రం ఒరిస్సాయే.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లకు గాని నూతన రాజధాని స్థల నిర్ణయం జరగలేదు. భువనేశ్వర్ అన్నదసలు మొదటిదశలో దృష్టిలోనే లేదు. కటక్, బరంపురం, పూరీ, అంగుల్ పట్టణాలే రాజధాని పోటీలో ఉన్నాయి. చివరికి పోటీలో కటక్, పూరీలు మిగిలాయి. నాటి రాజకీయ ప్రభుత్వం ఈ రెండిటి మధ్యా నిర్ణయించుకోలేకపోవడంతో, రాజధానీనగర నిర్ణయానికి ఒక దశాబ్దం పట్టింది.

చివరికి ఇరుకుగా ఉండడం వల్ల కటక్, ఉన్నత మతకేంద్రం కాబట్టి పూరీ రెండూ రాష్ట్ర రాజధానిగా ఉండడానికి తగినవిగా కనిపించలేదు. అందువల్ల భువనేశ్వర్ ముందుకు వచ్చింది ప్రత్యామ్నాయంగా. ఇదొక ముఖ్యమైన యాత్రాస్థలం, ఒరియా స్వీయగౌరవానికి చిహ్నం, కొత్త భవనాలు కట్టడానికి తగినంత స్థలం ఉంది. గవర్నరుకు ఆ సమయంలో ప్రత్యేక సలహాదారుగా ఉన్న మహారాష్ట్రకు చెందిన గోఖలే భువనేశ్వర్‌కు అనుకూలంగా నిర్ణయం జరగడంలో కీలకపాత్ర నిర్వహించాడు. అతని దృష్టిలో కటక్ ముఖ్యమైన వాణిజ్య కేంద్రం, భువనేశ్వర్ పాలన రాజధాని. 1946 లో ఒరిస్సా ప్రధానమంత్రి అయిన (స్వాతంత్ర్యం తర్వాత ముఖ్యమంత్రి) హరే కృష్ణ మెహతాబ్‌ను ఒప్పించగలిగాడు. భువనేశ్వర్‌కు అనుకూలంగా శాసనసభ తీర్మానించింది. రాజధాని కానందుకు కటక్‌కు ఉత్కళ విశ్వవిద్యాలయం, హై కోర్టు లభించాయి.

భువనేశ్వర్‌లో రాజధాని ఉంటుందన్న నిర్ణయం జరిగిన తర్వాత కూడా, నిధుల కొరత వల్ల కట్టడపు పనులు ప్రారంభం కావడం చాలా ఆలస్యమయింది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వానికి రాజధాని నిర్మాణ విషయంలో హరేకృష్ణ మెహతాబ్ కున్నంత ఆసక్తి లేకపోయింది. 1956 లో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత, భువనేశ్వర్‌లో రాజధాని నిర్మాణానికి పూర్తి సమర్థన లభించింది. రాజధానిని భువనేశ్వర్‌లో నిర్మించే పని ప్రారంభమయింది.

పంజాబు రాజధానిగా చండీగఢ్ నిర్మాణం జవహర్‌లాల్ పూర్తి సమర్థనతో ఫ్రెంచి ఆర్కిటెక్టు లె కర్బూజ్యె ఆధ్వర్యంలో వేగం పుంజుకుంది. ఎటువంటి ఆటంకాలూ లేకుండా ముందుకు సాగింది. భువనేశ్వర్ విషయంలో ఈ బాధ్యత జర్మన్ ఆర్కిటెక్టు ఓటో కోనిగ్స్ బెర్జర్ భుజస్కంధాలపై పడింది. అతనప్పటికే మైసూరు రాజ్యంలో పని చేస్తున్నాడు. అప్పటికే టాటా నగరం జంషెడ్‌పూర్‌కు ప్రణాళిక రచించాడు. మరో ఆర్కిటెక్టు బొంబాయి నుండి వచ్చిన జూలియస్ లాజరస్ వాజ్ అప్పుడు ఒరిస్సా ప్రభుత్వంలో ఛీఫ్ ఆర్కిటెక్టుగా పనిచేస్తున్నాడు. 

ఈ మధ్య కాలంలో భారతప్రభుత్వం నుండి కోనిగ్స్‌బెర్జర్ నియామకం పొందాడు. దూరాన ఉండే పనులను పర్యవేక్షించసాగాడు. అతని ముఖ్యమైన పని మాస్టర్ ప్లాన్ తయారుచేయడం. ఛీఫ్ ఆర్కిటెక్టు వాజ్ కూడా పూర్తిగా భువనేశ్వర్‌లో నివసించడం లేదు. వీరిద్దరి మధ్య సరైన సహకారం లేకపోవడం వల్ల భువనేశ్వర్ నిర్మాణం బాగా ప్రభావితమైంది.

భువనేశ్వర్‌ను రాజధానీనగరంగా నిర్మించడంలో కోనిగ్స్‌బెర్జర్ నిర్వహణ సౌలభ్యం కలిగిన చిన్న ఇరుగుపొరుగుల్ని నిర్మించాలన్న ప్రతిపాదన చేశాడు. కోనిగ్స్‌బెర్జర్, వాజ్ లిద్దరూ రాజధాని నిర్మాణస్థలంలో స్థిరంగా ఉండకపోవడంతో, కొత్త రాజధాని నిర్మాణ పర్యవేక్షణ బాధ్యత పిడబ్ల్యుడి శాఖపై పడింది. ఇంత పెద్ద కార్యాన్ని నిర్వహించడానికి అది సన్నద్ధంగా లేదు. ఒరిస్సా ఆలయ వాస్తుతో ఆధునిక నిర్మాణశిల్పాన్ని సమ్మేళనం చేసి మిశ్రమ నిర్మాణం చేశారు. దీనికి గొప్ప నిర్మాణ శిల్పపు విలువ లేకుండా పోయింది. ప్రభుత్వ గుమాస్తాల కోసం కార్యాలయ భవనాలు నిర్మించడమే ప్రధానలక్ష్యంగా నిర్మితమైన ఏ నగరమూ కూడా గొప్పదనాన్ని ఆశించలేదని ఎం.ఎస్. బుచ్ అనే ప్రభుత్వాధికారి వ్యాఖ్యానించాడు. ఇది భువనేశ్వర్ విషాదం. అది చివరికి పిడబ్ల్యుడి టౌన్‌షిప్‌గా తయారయింది. కిప్లింగ్ మాటలలో ఇది బంగలోత్ సమ్ (వెగటు కలిగించే ప్రభుత్వ బంగళాలు). భువనేశ్వర్‌ను వర్ణించడానికి ఈ ఒక్కమాట సరిపోతుంది. ఒరిస్సా గొప్ప నాయకుడు బిజూ పట్నాయక్ భువనేశ్వర్ నిర్మాణాన్ని గురించి క్లుప్తంగా ఇలా వ్యాఖ్యానించారు: భువనేశ్వర్ పేదవాడి పట్టణం. ఒరిస్సా పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు అది చండీగఢ్ వంటి వైభవోపేతమైన పట్టణం కాజాలదు. దాని సామర్థ్యం ప్రజల పేదరికం, ప్రణాళికాకారుల ఊహాశక్తి పరిమితులకు లోబడి ఉంది.


3. గుజరాత్ రాజధాని గాంధీనగర్
గుజరాతీల ప్రత్యేక రాష్ట్రకాంక్ష 1920 నాటి నాగపూరు కాంగ్రెస్ సమావేశం నుండి స్ఫూర్తి పొందింది. ఈ సమావేశంలో రాష్ట్రాలను భాషాపరంగా పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత గుజరాతీ మాట్లాడే ప్రాంతాన్ని మూడు భాగాలుగా విభజించారు. 1. బొంబాయి రాష్ట్రంలో ఉన్న ప్రధాన గుజరాతీ ప్రాంతం. అనేక సంస్థానాలతో కూడి ఉన్న సౌరాష్ట్ర ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆ సమయంలో భారత సమాఖ్యలో భాగమైంది. పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న కచ్ ప్రాంతాన్ని కేంద్రప్రభుత్వ అధీనంలో ఉంచడం జరిగింది. ఈ మూడింటినీ కలిపి మహాగుజరాత్ అన్న భావన గుజరాతీలకు ఇష్టమైన భావన. భాషాప్రయుక్త రాష్ట్రాలుగా రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించడానికి నియమింపబడిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం, బొంబాయి రాష్ట్రాన్ని ద్విభాషారాష్ట్రంగా ఏర్పరచాలని సిఫారసు చేసింది. కానీ ఈ ప్రయోగం పనిచేయలేదు. గుజరాత్‌లో విస్తృతమైన ఆందోళనకు ఇది దారితీసింది. చివరికి 1960 లో బొంబాయి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదింపబడింది.  దీని ప్రకారం మహారాష్ట్ర, గుజరాత్‌ రెండు ప్రత్యేకరాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. 
గుజరాత్‌ రాష్ట్రం ఏర్పడడంతోనే కొత్త రాష్ట్రానికి రాజధానీనగరం ఎక్కడ ఉండాలనే ప్రశ్న తలెత్తింది. రాజరిక పట్టణం బరోడా, పారిశ్రామిక పట్టణం అహ్మదాబాదు రెండూ పోటీ పట్టాయి. 

స్వాతంత్ర్యం రాకముందే శాయాజీ రావు ప్రతాప్‌సింగ్ ఆధిపత్యంలో బరోడా, పురోగమనశీలంగా అభివృద్ధి చెందింది.ఈ రాజులు విద్య మీద కేంద్రీకరించారు. చివరికి రాజధానిపోటీలో బరోడా వెనకబడిపోయింది. బరోడా పాలకులు మహారాష్ట్ర అనుకూల విధానాన్ని అనుసరించారని భావించడం దీనికొక కారణమైతే, ఇతర కారణాలు అధిక జనసమ్మర్దం, తగినంత విద్యుచ్ఛక్తి లభించకపోవడం. 

ఇప్పుడు రాజధానీనగరం ఎంపికకు పోటీలో అహ్మదాబాదు మాత్రమే మిగిలింది. అహ్మదాబాదు పారిశ్రామిక వర్గాలు అహ్మదాబాదులో రాజధాని స్థాపనను సమర్థించాయి. అహ్మదాబాదు రాజధాని అవుతుందని ముందుగానే ఊహించి, నగరం చుట్టుపక్కల భూములు కొనుక్కున్నారు. అహ్మదాబాదు నగరంలో కూడా ఉన్న అధిక జనసమ్మర్దం, అది నూతన రాష్ట్ర రాజధాని కావడంలో ఆటంకంగా పరిణమించింది. 

ఇక ప్రత్యామ్నాయం అహ్మదాబాదుకు ఉత్తరంగా 15 మైళ్ల దూరంలో ఉన్న గాంధీనగర్. కొత్త రాష్ట్రం ఏర్పాటు ప్రకటనకు రెండు నెలలముందు అప్పటి ముఖ్యమంత్రిగా ప్రకటింపబడిన వ్యక్తి కొత్త రాజధానీనగరప్రాంతాన్ని గుర్తించి, ప్రకటించారు. 

ఈ స్థలాన్ని ఎంపిక చేయడంలో ముఖ్యమైన కారణాలు తక్కువ ధరలో భూమి అందుబాటులో ఉండడం సబర్మతీనదికి సమీపంలో ఉండడం వల్ల నీటి సరఫరాకు సమస్య లేకపోవడం. భవన నిర్మాణానికి అనుగుణమైన నేల ఉండడం, జాతీయ రహదారికి సమీపంలో ఉండడం.
చండీగఢ్ పట్టణాన్ని నిర్మించిన లీ కార్పూజియర్‌కు భిన్నంగా స్థానిక పారిశ్రామిక ఆసక్తులు కొత్త నగర నిర్మాణానికి అమెరికన్ ఆర్కిటెక్టు లూయీస్ కాన్‌ను కోరుకున్నాయి. అప్పటికతను ఐఐఎం అహ్మదాబాదును నిర్మిస్తున్నాడు. అహ్మదాబాదులోని పారిశ్రామిక వర్గం రాజధానీనగర నిర్మాణం ఇతను చేపట్టాలని కోరుకున్నప్పటికీ, విదేశీ మారకద్రవ్యంలో అతనికి డబ్బు చెల్లించే సమస్య కేంద్రప్రభుత్వంతో పరిష్కారం కాకపోవడంతో, అతను ఈ పని చేపట్టలేకపోయాడు. 

చండీగఢ్ నిర్మాణంలో లె కర్బూజ్యె కింద పనిచేసిన భారతీయ ఆర్కిటెక్టు మేవాడ గాంధీనగర్ రాజధానీనగర ప్రణాళికీకరణ నిర్మాణబాధ్యతలు స్వీకరించాడు. ఆ విధంగా భారతీయ వాస్తు నిపుణులే ప్రణాళికీకరించి, నిర్మించిన నిజమైన భారతీయ నగరంగా గాంధీనగర్ రూపొందింది. గుజరాత్‌ రాష్ట్రం 1960 లో ఏర్పడినప్పటికీ రాజధానీనగరం పూర్తి రూపం దాల్చటానికి ఒక దశాబ్దం పట్టింది. 1970 లో సచివాలయం సిబ్బంది గాంధీనగర్‌కు మారింది. కానీ హై కోర్టు అహ్మదాబాదు నుండే పనిచేస్తూఉంది.

ఆ విధంగా మూడు భిన్నరాష్ట్రాల నూతన రాజధానులుగా మూడు పెద్ద నగరాల నిర్మాణాన్ని ప్రణాళికీకరించడం, నిర్మించడం అన్నది భిన్నంగా జరిగింది. ఫలితాలు భిన్నంగానే ఉన్నాయి. వీటిలో అత్యుత్తమ ఉదాహరణ చండీగఢ్. నాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ వ్యక్తిగతమైన ఆసక్తి తీసికొని ఆర్కిటెక్టు లె కర్బూజ్యె‌కు స్వాతంత్ర్యమిచ్చి ఆధునిక పద్ధతిలో సంప్రదాయపు అడ్డంకులు లేకుండా నిర్మింపజేశారు. తదనుగుణంగా స్వల్పసమయంలోనే చక్కగా ప్రణాళిక రచించిన పట్టణంగా చండీగఢ్ ఏర్పడింది. పాకిస్తాన్ నుండి వచ్చిన కాందిశీకుల ప్రభావాన్ని తట్టుకోగలిగింది. 

అవిభాజిత పంజాబు రాష్ట్రానికి అనంతరం పంజాబు – హర్యానాలకు ఉమ్మడి రాజధానిగా పనిచేస్తూ ఉంది. రెండవ స్థానం గాంధీనగర్‌ది అయితే, భువనేశ్వర్‌ది మూడవస్థానం.  గాంధీ తాత్త్వికతను కలుపుకోవడంపై ఊనిక గాంధీనగర్ నిర్మాణంలోనూ, ఆలయ నిర్మాణరీతిని కలుపుకోవడం భువనేశ్వర్ నిర్మాణంలోనూ ఒక సమ్మిశ్రమ ధోరణిని కల్పించింది కానీ, అది ఉన్నతస్థాయిని అందుకోలేకపోయింది. నెహ్రూ చూపించిన గొప్ప ఆసక్తి చండీగఢ్ నిర్మాణంలో బాగా పనిచేసింది. నగర పథకం రచించడానికీ, మార్గదర్శకత్వం వహించడానికీ,  నిర్మాణపర్యవేక్షణకూ తగిన ఆర్కిటెక్టులు లభించకపోవడం, నిధుల కొరత మిగిలిన రెండు నగరాల నిర్మాణంలో లోపాలకు కారణమయ్యాయి.

Comments

Popular posts from this blog

Whose Capital Amaravathi - Introduction

ChandraBabu Naidu - CBN

Urban centres as growth engines