PRATYUSH SINHA COMMITTEE- DIVISION OF AIS OFFICERS


2. ప్రత్యూష్ సిన్హా పక్షపాత వైఖరి  Navyandhra tho na nadaka

జూన్ 2 నాటికే విభజనకు సంబంధించిన కొన్ని చర్యలు ప్రారంభమయ్యాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు మహంతీ ఛీఫ్ సెక్రటరీగా ఉన్న కాలంలోనే అఖిల భారత సర్వీసు అధికారుల విభజనకు ప్రాతిపదికను స్థూలంగా నిర్ణయించారు. 
ఐఏఎస్ అధికారుల విభజనకు సంబంధించి మౌలిక సూత్రాలు మహంతి ఛీఫ్ సెక్రటరీగా ఉన్న కాలంలోనే ఖరారు అయిన తీరు ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా లేదు. వారు జిల్లాల సంఖ్య ఆధారంగా విభజన జరగాలని నిర్ణయించారు. ఆంధ్రాలో 13 జిల్లాలు, తెలంగాణలో 10 జిల్లాలు ఉన్నాయి కనుక ఆ నిష్పత్తిలో విభజన ప్రారంభించారు. నిజానికి ఈరకమైన విభజన సరైంది కాదు. ఐ.ఏ.ఎస్. కేడరు సంఖ్యలో జిల్లా పోస్టులు చాలా తక్కువ. ఎక్కువ పోస్టులు సచివాలయంలో డైరెక్టరేట్లలో ఉంటాయి. కనుక జిల్లాల సంఖ్య ఆధారంగా విభజన చేయడంలో ఔచిత్యం లేదు. 13:10 నిష్పత్తిలో కాకుండా మరో ప్రాతిపదిక పాటించి ఉంటే సముచితంగా ఉండేది. ఏమైనా ఈ నిర్ణయం తెలంగాణకు అనుకూలంగా జరిగినట్లు నాకు అనిపించింది.
నేరుగా రిక్రూట్ అయిన ఇన్‌సైడర్ అధికారులు, ప్రమోటయిన అధికారులను వారి వారి ప్రాంతీయత ఆధారంగా కేటాయించాలని నిర్ణయించారు. ఒక రాష్ట్రానికి కేటాయించిన పోస్టుల సంఖ్య కంటే ఎక్కువ మంది అధికారులు ఆ రాష్ట్రానికిఈ విధానంలో కేటాయించబడితే వారిని జూనియర్ ఆఫీసర్లతో మొదలుపెట్టి తిరిగి రెండవ రాష్ట్రానికి పోస్టులు వ్యక్తులు సరిపోయేదాకా తిరిగి కేటాయిస్తారు. వారు ఇతర రాష్ట్రానికి వెళ్లాల్సి ఉంటుంది.. ఇది ఛత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాల విభజన సమయంలో అవలంబించిన ప్రాతిపదిక. ఇక్కడ కూడా నేటివిటీని ప్రాతిపదికగా తీసుకున్నారు. స్థానిక అధికారుల విభజన పెద్ద సమస్య కాలేదు. ఎందుకంటే అది నేటివిటీ ఆధారంగా జరిగింది. అదనంగా ఉన్న వారు ఇతర రాష్ట్రానికి వెళ్లడమో, లేక వారు అభ్యర్థన చేసుకుంటే సర్దుబాటు చేయడమో జరిగింది. ఇక అవుట్ సైడర్స్‌కు సంబంధించి రోస్టర్ ప్రకారం వెళ్లాల్సిందే. 

రోస్టర్ అనేది సంక్లిష్ట ప్రక్రియగా మారింది. రిజర్వేషన్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చింది. రోస్టర్‌ను ఎక్కడి నుంచి ప్రారంభించాలి అన్నది ప్రధానమైన ప్రశ్న. లాటరీ ప్రకారం వెళ్లాలని చివరకు నిర్ణయించారు. నేను ఛీఫ్ సెక్రటరీ అయిన తర్వాత హాజరైన ప్రత్యూష్ సిన్హా కమిటీ రెండో సమావేశంలోనో, మూడో సమావేశంలోనో రోస్టర్ అంశం ప్రస్తావనకు వచ్చింది. రోస్టర్ ప్రకారం లాటరీ తీసినప్పుడు లాటరీలో తెలంగాణ వచ్చింది. దీనితో తొలి అధికారి తెలంగాణకే వెళతారని అందరూ అనుకున్నారు. అక్కడినుంచే అందరూ లెక్కలు వేసుకుని తాము ఏ ఏ రాష్ట్రానికి వెళతామో నిర్ణయించుకున్నారు. అలాగే జరిగి ఉంటే రాజీవ్ శర్మ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన అధికారి అవుతారు. 

కాని తర్వాత జరిగిన కమిటీ సమావేశంలో తేలిందేమంటే లాటరీలో తెలంగాణ వస్తే, నియామకాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభిస్తారన్న విషయం. గతంలో ఇతర రాష్ట్రాల విభజన జరిగినప్పుడు ఒక రాష్ట్రం లాటరీలో వస్తే మరో రాష్ట్రం నుంచి నియామకాలు జరగాలని నిర్ణయించారట. ప్రత్యూష్ సిన్హా కమిటీ పాత కమిటీ సమావేశాల మినిట్స్ తీసి దాని ప్రకారం వెళ్లింది. ఈ విషయం తెలియని అధికారులు చాలా మంది నియామకాలు కూడా తెలంగాణనుంచే ప్రారంభమవుతాయని భావించి లెక్కలు వేసుకుని, తామెక్కడెక్కడికి వెళుతున్నామో తామే నిర్ణయించుకుని అలా జరగకపోవడంతో నిరాశ చెందారు. అంతా గందరగోళం నెలకొన్నది.. 

ఐఏఎస్ అధికారుల నియామకం విషయంలో తేడా తెచ్చిన మరో అంశం పి. కె. మహంతీని పదవిలో ఉన్న అధికారిగా భావించాలా, లేక, పదవీ విరమణ చెందిన అధికారిగా భావించాలా అన్నది. ప్రత్యూష్ సిన్హా కమిటీ మహంతీని పదవిలో లేని అధికారిగా భావిస్తే లెక్కల్లో తేడా వచ్చి రాజీవ్ శర్మ తెలంగాణలోనే ఉంటారు. మహంతీని రిటైర్డ్ అధికారిగా భావించకపోతే రాజీవ్ శర్మ ఆంధ్రాకు వెళ్లాల్సి వస్తుంది. ఈఅంశంలో పి. కె. మహంతీని ప్రత్యూష్ సిన్హాపరిగణనలోకి తీసుకోలేదు. ఇది వివాదాస్పదమని చాలా మంది భావించారు. పికె మహంతీని పరిగణనలోకి తీసుకోవడానికి బలమైన న్యాయపరమైన కారణాలున్నాయని, కనీసం అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోకుండా మహంతీ పేరును పరిగణించకపోవడం సరైంది కాదని చాలా మంది భావన. 

ప్రత్యూష్ సిన్హా ఉద్దేశ పూర్వకంగా ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరించడం స్పష్టంగా కనపడింది. కమిటీలో నేను కాక ప్రత్యూష్ సిన్హా, తెలంగాణ ఛీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ ఉన్నారు. వారిద్దరూ ఒకటే కావడంతో నేను ఎన్నో వాదనలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రత్యూష్ సిన్హా కమిటీకి ఎన్నో ఉత్తరాలు కూడా రాశాను. ప్రత్యూష్ సిన్హా కమిటీలో వాగ్వివాదాలు సీరియస్ గా జరిపిన మరో అంశం జీవిత భాగస్వామి కూడా అధికారి అయినప్పుడు ఆమె/ఆయన సీనియారిటీని ఎలా పరిగణించాలన్నది. జీవిత భాగస్వామి వృత్తిని నిర్వహించినప్పటినుంచీ సీనియారిటీని పరిగణించాలా లేక పెళ్లి తర్వాత కేటాయించిన రాష్ట్రంలో సీనియారిటీని పరిగణించాలా అన్న దానిపై చర్చలు సాగాయి. కంబైన్డ్ లిస్ట్‌లో జీవిత భాగస్వామి పై స్థాయిలో ఉండవచ్చు. జీవిత భాగస్వామి తన భర్త లేదా భార్యకు కేటాయించిన రాష్ట్రానికి వస్తే చివరి అధికారి స్థాయికి వస్తారు. కంబైన్డ్ లిస్టు ప్రకారం కేటాయిస్తే ఒక రాష్ట్రానికి వస్తారు. పెళ్ళి అయిన తరువాత రాష్ట్రం మారిన సీనియారిటీ పరిగణనలోకి తీసుకుంటే వేరే రాష్ట్రంలోకి వెళతారు. జీవిత భాగస్వామి రాష్ట్రంలో చేరిన తర్వాత నుంచి సీనియారిటీని పరిగణించాలని ప్రత్యూష్ సిన్హా మొదట నిర్ణయించారు. తదనుగుణంగా సీనియారిటీని పరిగణనలోనికి తీసుకొని జాబితాను తయారు చేశారు.

తర్వాత కంబైండ్ మెరిట్‌తో సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని జాబితాను సవరించారు. దీని వెనుక కొందరు బలమైన అధికారుల ప్రమేయం ఉన్నదని నాకు తెలుసు. ఇది ప్రధానంగా ఆందోళన కలిగించింది. కేడర్ అనేది ప్రభుత్వం ఖరారు చేసింది కనుక రాష్ట్ర సీనియారిటీ ప్రకారం వెళ్లాలని నేను వాదించాను. ఆయన దానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. 

దీనితో నేను కచ్చితంగా చెప్పాను. ‘ఈ విషయంలో మీరు వైఖరి తీసుకున్నట్లయితే మనం రోస్టర్ పద్ధతి కూడా పునఃపరిశీలించాలి. మీరు మహంతీని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? మహంతి పదవిలో ఉన్నట్లు పరిగణించితే మొత్తం రోస్టర్ మారిపోతుంది. మీ నిర్ణయాన్ని నేను విభేదిస్తున్నాను కనుక ఈ వివాదాన్ని నిబంధనల ప్రకారం అటార్నీ జనరల్‌కు నివేదించాలి కదా.’ ఆ పనిచేద్దాం. అన్నాను. 

ఇలా అనేక అంశాలపై కమిటీ సమావేశాల్లో వాగ్వివాదాలు జరిగాయి. చివరకు ఈ అంశాలపై నేను నా నిరసన నోట్ ను కూడా ప్రత్యూష్ సిన్హాకు సమర్పించక తప్పలేదు. అది ఆయనకు నచ్చలేదు. 
ఏమైనప్పటికీ ఐఏఎస్ అధికారుల విభజన రెండు రాష్ట్రాల మధ్య న్యాయపూరితంగా, సమానంగా జరగలేదు. తెలంగాణ పక్షానికే అనుకూలంగా జరిగింది. మిగతా అన్ని విషయాల్లో జనాభా నిష్పత్తిని ప్రాతిపదికగా తీసుకుని కేవలం ఐఏఎస్ అధికారుల విషయంలోనే జిల్లాల నిష్పత్తిలో తీసుకున్నప్పుడే ఏపీకి నష్టం జరిగింది. నేను పదవీ బాధ్యతలు స్వీకరించే నాటికే మార్గదర్శక సూత్రాలు నిర్ణయం కావడంతో నేను చేసేది ఏమీ లేకుండా పోయింది. అనుసరించిన ప్రాతిపదిక, కొందరు అధికారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఆ తర్వాత వరుసగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఏపీ ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. అంతేకాక హైదరాబాద్ తెలంగాణ రాజధాని కావడంతో చాలా మంది తెలంగాణలో ఉండేందుకు ఇష్టపడడం, వారి ప్రయోజనాలను ప్రత్యూష్ సిన్హా కాపాడడం కూడా ఏపీకి నష్టం కలిగించింది. 

కేంద్ర అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ (క్యాట్) కూడా ప్రత్యూష్ సిన్హా తీసుకున్న నిర్ణయాలను, అనుసరించిన ప్రాతిపదికను తీవ్రంగా తప్పు పట్టింది. అప్పటికే ఐఏఎస్ అధికారుల విభజన అంశం ఏదో రకంగా సెటిల్ అయి, అంతా తమ తమ స్థానాల్లో పనిచేయడానికి వెళ్లడంతో క్యాట్ అభిశంసన పర్యవసానాలేమీ జరగలేదు. సమయం సమస్యలను చాలామటుకు పరిష్కరించింది. కాని అధికారుల విభజన హేతుబద్ధంగానూ, పారదర్శకంగాను జరుగలేదన్న విషయం రికార్డు అయింది. నా అభిప్రాయాలే సరైనవని తేలింది.

Comments

Popular posts from this blog

Whose Capital Amaravathi - Introduction

Urban centres as growth engines