World Bank and Amaravathi - Whose Capital Amaravathi
11. ప్రపంచ బాంకు - అమరావతి
స్పెషల్ కాటగిరీ స్టేటస్‌కు బదులుగా భారతప్రభుత్వం ప్రకటించిన స్పెషల్ పాకేజ్ స్కీము నుండి ప్రయోజనం పొందే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్టెయినబుల్ కాపిటల్ సిటీ డెవలప్ మెంట్ ప్రాజెక్టుకు ప్రపంచబాంకు ఋణానికి వెళ్లింది. వాస్తవానికి స్పెషల్ కాటగిరీ స్కీములో ఇఎపి ప్రాజెక్టుకు అప్పుగా కాక గ్రాంటురూపంలో సహాయం చేసే కొన్ని వాగ్దానాలున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా రోడ్ల మౌలిక సదుపాయాలు, వరదల తగ్గింపు చర్యలు, సాంకేతిక సహాయం ఉంటాయి. ఈ ప్రాజెక్టు అవుట్ లే రూ॥ 5000 కోట్లు. ఇందులో రూ॥ 2000 కోట్లు ప్రపంచ బాంకునుండి అప్పుగా, రూ॥ 1000 కోట్లు ఆసియా అభివృద్ధి బాంకు (ఎడిబి) నుండి అప్పుగా, తక్కిన మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రావాలి. ఈ ప్రాజెక్టుకు ప్రపంచబాంకు నుండి అప్పు తీసుకునే విషయంపై స్థానిక ప్రజలకు ఎన్నో అభ్యంతరాలున్నాయి.
ప్రపంచ బాంకు నియమాలు, హద్దులను ప్రభుత్వం పాటించకుండానే అమరావతి ప్రాజెక్టుతో ముందుకు వెళ్లింది. అందువల్ల ప్రపంచ బాంకు ఒక ఇన్స్‌పెక్షన్ టీమును ఏర్పరచాలని నిర్ణయించింది. ఈ టీము తమ ఇన్స్‌పెక్షన్ రిపోర్టులో అనేక విషయాలను పేర్కొంది. ఆ ప్రాంతంలోని ప్రజలు లాండ్ పూలింగ్ స్కీము విషయంలో తమతో వారి అనుభవాలను పంచుకున్నారని ఈ జట్టు తెలిపింది. లాండ్ పూలింగు కిందికి రాకపోయినట్లయితే, వారి భూములను భూసేకరణ పద్ధతిలో తీసివేసుకోవడం జరుగుతుందనే బెదిరింపుతో లాండ్ పూలింగ్ స్కీములో చేరేటట్లు బలవంతపెట్టినట్లు అక్కడి ప్రజలు తమకు తెలిపినట్లు ఈ జట్టు నివేదికలో చెప్పింది.
అమరావతి ప్రాంతంలో భూమి ధరలు పెంచనందున భూసేకరణ కింద తమకు అందే పరిహారం తక్కువగా ఉంటుందని రైతులు భయపడుతున్నారు. అధికారులనుండి, గుర్తు తెలియని వ్యక్తులనుండి తమకు బెదిరింపులు వస్తున్నాయని కూడా రైతులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో సహకరించకపోయినట్లయితే లాండ్ పూలింగ్ లాభాలు వారికి లభించవని కమ్యూనిటీ సభ్యులే బెదిరిస్తున్నారనీ, అంటే వాగ్దానం చేసిన హెల్త్ బెనెఫిట్లు వంటివి అందవన్నమాట.
జారీచేసిన హెల్త్ ఇన్సూరెన్సు కార్డులను ఆసుపత్రులలో అంగీకరించరు. వాళ్ల భూములకు హద్దులు నిర్ణయించి తిరిగి ఇవ్వరు. బలహీన వర్గాల పట్ల వివక్ష చూపుతున్నారు. ఇటువంటి లాండ్ పూలింగులో చేరని రైతులకు, విద్యుత్ కనెక్షన్లు కత్తిరించేస్తారు. వాళ్లు తమ భూములను దాదాపు ఒక సంవత్సరం పాటు సాగు చేసుకోలేకపోయారు. తక్కువ జీతాల కూలి పనివారి జీవన ప్రమాణాలు కూడా లాండ్ పూలింగ్ స్కీం అమలు తర్వాత పడిపోయాయనీ, భూమిలేని వాళ్లు తమకు వాగ్దానం చేసినట్లుగా స్వీయ ఉపాధి, విద్యావిషయకమైన ఫీజులు చెల్లింపు మొదలైనవి లభించలేదనీ ఇన్స్‌పెక్షన్ కమిటీ ముందు రైతులు చెప్పుకున్నారు.
రైతులు వ్యక్తం చేసిన భయాలను, వారి జీవనోపాధుల దైన్యాన్ని ఇన్స్‌పెక్షన్ జట్టు గమనించింది. రైతులు తమ అనుభవాలు చెప్పుకున్నారు. తమ భూములు పోయిన తర్వాత తాము మరో ఉపాధిని స్వీకరించలేమని చెప్పుకున్నారు. స్థానిక కూలిరేట్లు అక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయని, రోజుకు 800 రూ॥ల కూలిరేటు ఉందని, ఆ విధంగా నెలకు సగటున 19,000 రూ॥ల ఆదాయం ఉంటుందని, కాని ప్రస్తుతం పింఛను నెలకు 2500 రూ॥లు మాత్రమే వస్తున్నదని వాళ్లు వాపోయారు.
మొత్తం అనైచ్ఛిక పరిస్థితిలో (involuntary situation) లాండ్ పూలింగ్ ఒక ఎంపిక అని ఇన్స్‌పెక్షన్ టీము ప్రత్యేకంగా పేర్కొన్నది. భూసేకరణ ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు లాండ్ పూలింగ్ స్వచ్ఛంద ప్రక్రియ అనడం కష్టమని ఇన్స్‌పెక్షన్ టీమ్ అభిప్రాయపడింది. భూమిని సొంతానికి ఉంచుకోవడమనే ప్రశ్నే తలెత్తినప్పుడు ఒకే ఎంపిక ఉంటుంది కాబట్టి అది అనైచ్ఛిక పునరావాసమేనని చెప్తూ ఇన్స్‌పెక్షన్ పానెల్ ఇలా ముగించింది. అభ్యర్థనలు హానికారక సమర్థమైన ముఖ్యమైన అంశాలను లేవనెత్తుతున్నాయి. అట్లాగే నిబంధనలకు కట్టుబడకపోవడం కూడా. అందువల్ల బాంకు విధానాలకు కట్టుబడకపోవడంతో సహా ఈ అన్ని అంశాలపై మరింత సమగ్రమైన దర్యాప్తు అవసరం ఉంది. ముఖ్యంగా అనైచ్ఛిక పునరావాసం, పర్యావరణ సంబంధమైన సమస్యలు, సంప్రతింపులు, భాగస్వామ్యం, సమాచార వ్యక్తీకరణల విషయంలో ఈ పరిశీలన అవసరమని తేల్చింది.
Comments
Post a Comment