21st Centuries Capital Cities : Indian Experience

5. 

21వ శతాబ్దపు రాజధానీనగరాలు
21వ శతాబ్దపు ప్రారంభంలో ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలన కాలంలో దీర్ఘకాలంనుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం చేస్తున్న మూడు డిమాండ్లను అంగీకరించడం జరిగింది. దాని ప్రకారం అప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి పర్వత ప్రాంతాలను వేరు చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఏర్పరిచారు. బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల గిరిజన ప్రాంతాలను వేరుచేసి, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను ఏర్పరిచారు. ఈ రాష్ట్రాల రాజధానీనగరాల స్థలాల గురించి ఈ అధ్యాయంలో చర్చిద్దాం. 
భారతీయ అనుభవం – ఉత్తరాఖండ్

ఉత్తరప్రదేశ్ నుండి వేరుచేసి దాదాపు కుమావ్, గడువాల్ ప్రాంతాలనన్నింటినీ కలిపి నవంబర్ 2000 లో ఉత్తరాఖండ్ ప్రత్యేకరాష్ట్రాన్ని ఏర్పరిచారు. ఉత్తరాఖండ్ తాత్కాలిక రాజధాని డెహ్రాడూన్ రాష్ట్రంలోని పెద్ద నగరం, దేశ రాజధాని కొత్త ఢిల్లీకి సమీపంలో ఉంది. హై కోర్టు మాత్రం నైనిటాల్‌లో ఉంది. వీరేంద్ర దీక్షిత్ చైర్మన్‌గా 2001 లో రాష్ట్రానికి శాశ్వత రాజధానీ స్థలాన్ని గుర్తించడానికి ఏకసభ్య కమిటీని నియమించారు. కమిటీ 2008 లో నివేదిక సమర్పించింది. ప్రభుత్వం నుంచి సరైన సమర్థన లేకపోవడం వల్ల నివేదికనివ్వడానికి ఏడేళ్ల సమయం పట్టిందని కమిటీ చెప్పింది. 

రాష్ట్రానికి శాశ్వత రాజధానిని నిర్ణయించడంలో కమిటీ చేస్తున్న జాప్యానికి వ్యతిరేకంగా హై కోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. ఆ తరువాత కమిటీకి సిబ్బంది సహాయం వంటి వాటి లోపాన్ని చూపిస్తూ, చివరికి కమిటీ తన నివేదికను సమర్పించింది. తాత్కాలిక రాజధాని అయిన డెహ్రాడూనే శాశ్వత రాజధానిగా అనుగుణమైందని నివేదిక తెల్పింది. దీనికి ప్రధాన కారణాలు దేశ రాజధానికి దగ్గరగా ఉండడం, కేంద్రీకృత జనాభా, జాతీయ ఉత్పాతాలు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండడం.

కాని ప్రజల ఎంపిక చెమోలీ జిల్లాలో ఉన్న గైర్ సైన్. ఇది కుమావ్, గడువాల్ ప్రాంతాలకు సమానదూరంలో ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలూ తమ స్వీయసాంస్కృతిక గుర్తింపును కలిగి ఉండి, రాజకీయంగా పోటీ పడుతున్నాయి. గైర్‌సైన్‌ని ఎంచుకోవడం ఈ రెండు ప్రాంతాల మధ్య వివాదాన్ని తొలగించడం కోసం. కాని ఈ నాటికీ కూడా శాసన సభ వంటి కొద్ది భవనాలు తప్ప రాజధానిని డెహ్రాడూన్ నుంచి గైర్‌సైన్‌కు మార్చే ప్రయత్నాలేమీ జరగలేదు. అప్పుడప్పుడూ రాజధాని తరలింపు కోసం ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ ఆసక్తులు, లేదా పెద్ద నగరంలో నివసించాలనుకునే అధికారులు, తదితరులు, రాజధానిని గైర్‌సైన్‌కు తరలించాలనే పర్వతప్రాంత ప్రజల కోరిక - వీటిలో ఏది చివరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి. రాష్ట్రం ఏర్పడిన 18 ఏళ్ల తరువాత కూడా ఈ నాటికీ తాత్కాలిక రాజధాని డెహ్రాడూనే కొనసాగుతూ ఉంది. 

ఝార్ఖండ్ రాజధాని రాంచీ
2000 సంవత్సరంలో బీహార్ నుండి ఝార్ఖండ్ విడిపోయినప్పుడు రాజధానిగా రాంచీ ఎంపిక యాంత్రికమే. బీహార్, ఒరిస్సా కలిసి ఉన్న కాలంలో రాంచీయే అసలు రాజధాని. తరువాత బీహార్ రాజధాని పాట్నాకు మారింది. అయినా బీహార్ రాష్ట్ర వేసవి రాజధానిగా రాంచీయే పనిచేసింది. బ్రిటిషు వారి కాలంనుండీ రాంచీలో రాజధానికి కావలసిన కొన్ని మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ కార్యాలయ భవనాలు ఏర్పడ్డాయి. జంషెడ్‌పూర్, ధన్‌బాద్ వంటి పెద్ద పట్టణాలు ఉన్నప్పటికీ వాటి విషయంలో పెద్ద చర్చ జరగలేదు. అప్పటికే నిర్మితమైన మౌలిక సదుపాయాలు ఉండడం, వాతావరణం అనుకూలంగా ఉండడం వల్ల ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీ రాజధానిగా నడవడం ప్రారంభించింది. 

ఛత్తీస్‌గఢ్ – దాని రాజధాని


2000 లో మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్‌గఢ్ విడిపోయినప్పుడు దాని రాజధాని ఎక్కడ ఉండాలన్న విషయంలో చర్చ అవసరం కాలేదు. పెద్ద రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌కు కేంద్ర ప్రాంతంలో ఉన్న రాయపూర్ సహజంగానే రాజధాని అయింది. అది అప్పటికే ఒక ముఖ్యమైన పట్టణం. బిలాస్‌పూర్, కోర్బా వంటి పట్టణాలు ఉన్నప్పటికీ అవేవీ జనాభా విషయంలో రాయపూర్‌తో పోటీ పడలేవు. అందువల్ల రాయపూర్ సహజమైన ఎంపిక అయింది. అయితే త్వరలోనే రాయపూర్‌లో  ఉన్న మౌలిక సదుపాయాలు సరిపోవని ప్రభుత్వం గ్రహించింది. అందువల్ల  ఒక ఆధునిక నగరంగానూ, రాష్ట్ర రాజధానిగానూ కూడా వ్యవహరించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక ప్రణాళికాబద్ధమైన కొత్త నగరాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆలోచన 2008 లో వచ్చింది. తదనుగుణంగా రాయపూర్ నగరానికి 30 కి.మీ.ల దూరంలో నయా రాయపూర్ అన్న కొత్తనగరానికి ప్రణాళిక వేసి నిర్మించడం జరిగింది. నయా రాయపూర్ అభివృద్ధి సంస్థ 8 వేల హెక్టార్ల ప్రదేశంలో ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మించడానికి ప్రణాళిక రూపొందింది.

 నయా రాయపూర్ జనాభా 2031 నాటికి 5.6 లక్షలకు చేరుతుందని అంచనా. రాజధానీనగరానికి కావలసిన మొత్తం భూమిని భూసేకరణ పద్ధతి ద్వారా సేకరించడం జరిగింది. ఎక్కువ భూమిని భూయజమానుల అంగీకారం ద్వారా సేకరించారు. నయా రాయపూర్ అభివృద్ధి సంస్థ చైర్మన్ బైజయేంద్ర కుమార్‌తో నేను వ్యక్తిగతంగా చాలాసార్లు మాట్లాడాను. నయా రాయపూర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆయన ఏడేండ్లపాటు సంస్థ చైర్మన్‌గా ఉన్నారు. రాజధానిని రాయపూర్ నుండి తరలించాలని తీసుకున్న నిర్ణయానికి కారణం రాయపూర్‌లో తగినన్ని మౌలిక సదుపాయాలు లేకపోవడం, పెద్దసంఖ్యలో స్పాంజి ఐరన్ కర్మాగారాలు ఉండడం వల్ల ఏర్పడుతున్న కాలుష్యం ముఖ్యమైనవి. రాయపూర్‌కి దూరంగా మరో రాజధాని కట్టవలసిన ఆవశ్యకత ఏర్పడింది. 

భారత ప్రభుత్వం నుండి ధనసహాయం ఏమీ రాలేదు. నయా రాయపూర్ అభివృద్ధి సంస్థ రాష్ట్రప్రభుత్వం నుండి 500 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని, ప్రాజెక్టు ప్రారంభించింది. 11 అంతర్జాతీయ కంపెనీలు స్థలం ఎంపిక బాధ్యతను చేపట్టాయి. ఎంపికకు 33 ప్రమాణాలు రూపొందించారు. 11 కంపెనీలలో 9 విభిన్న స్థలాలను పరిశీలించి, ప్రస్తుత స్థలాన్ని ఎంపిక చేశాయి. గ్రామస్థులకు తగినంత పరిహారం చెల్లించారు. భూసేకరణలో అధికభాగం కాన్‌సెంట్ అవార్డు పద్ధతిలో జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో చేసిన ఒక లాండ్‌ పూలింగ్ ప్రయోగం పూర్తిగా విఫలమైంది. శ్రీ చంద్రబాబు నాయుడు, వారి జట్టు 2014 లో ఛత్తీస్‌గఢ్‌ను సందర్శించినప్పుడు, ఆయనకు ప్రత్యేకంగా రాజధానీనగర స్థలం వ్యవసాయభూమిలో ఉండకూడదనీ, లాండ్ పూలింగ్ పద్ధతిని అనుసరించడం వల్ల సమస్యలు వస్తాయనీ హెచ్చరించామని బైజయేంద్రకుమార్ నాకు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో లాండ్ పూలింగ్ ప్రయోగం ఎలా ఒక వైఫల్యంగా మిగిలిపోయిందీ కూడా తెలియజేశారు.

Comments

Popular posts from this blog

Whose Capital Amaravathi - Introduction

Urban centres as growth engines