"Our people briefed me"- Navyandhra tho na nadaka

7. ‘అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మి’


2015 జూన్ 1 సాయంత్రం T.V. పెట్టినప్పుడు ‘అవర్ పీపుల్ బ్రీఫ్డ్‌మి’ ఉదంతం ప్రసారమవుతుంది. ఈ సంభాషణ వినగానే నాకు మతిపోయినట్లయింది. ఒక సిఎం ఎన్నికల అక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు రావడం, ఆయన గొంతును కూడా వినిపించడంతో ఆయన ప్రతిష్ఠ దెబ్బతింటుందనే అనిపించింది. నిజానికి అంతకు ముందే తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్టీఫెన్‌సన్ ఇంటికి వెళ్లి శాసన మండలి ఎన్నికల్లో తమ అభ్యర్థికి అనుకూలంగా ఓటువేసేందుకు అయనకు డబ్బులు ఇవ్వజూపినట్లు టీవీలు చూపించాయి. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రే ఫోన్‌లో మాట్లాడినట్లు చూపిస్తున్నారు. 

సాయంత్రానికల్లా రాష్ట్ర సలహాదారు పరకాల ప్రభాకర్ స్వయంగా టీవీల ముందుకు వచ్చి జరిగిన దాన్ని ఖండించారు. ‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారం గవర్నర్‌గారికి ఇక్కడున్నటువంటి శాంతి భద్రతలు, ప్రజల యొక్క స్వేచ్ఛ, ప్రజల యొక్క ఆస్తులు, ముఖ్యమైనటువంటి సంస్థల విషయంలో బాధ్యత ఉన్నది. వారు బాధ్యత తీసుకోనప్పుడు, వారు దీన్ని నడపనప్పుడు, రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికీ ఇద్దరికి కూడా సరి సమానమైన హక్కులుంటాయి. మేము ఇక్కడ ఉన్నప్పుడు, అంటే ఉమ్మడి రాజధాని లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం మా రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల వ్యవహరించిన తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై రాజ్యాంగపరమైనటువంటి, చట్టపరమైనటువంటి, న్యాయపరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి అన్ని చర్యలూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది.’ అని చెప్పారు. 

అసలు ఈ టేప్‌లో వినిపిస్తున్న గొంతు చంద్రబాబునాయుడుది కాదని పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ కార్యాలయంలో ఉన్న టీ న్యూస్‌లో ఈ సంభాషణ రికార్డు ప్రసారం అయిందని, ఆ సంభాషణ వివరాలు ఎలా వచ్చాయో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, డీజీపీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక వేళ టెలిఫోన్‌లు ట్యాప్ చేసి ఉంటే అందుకు తెలంగాణ ప్రభుత్వానికి అధికారాలున్నాయా అని అడిగారు. ట్యాపింగ్ అక్రమమని అన్నారు. ఒకవైపు స్టీఫెన్‌తో మాట్లాడింది చంద్రబాబు గొంతుకాదంటూనే మరో వైపు ట్యాపింగ్ అక్రమమని అంటున్నారు. నాకు ఇందులో వైరుధ్యం ఉన్నదనిపించింది.

ఈ ట్యాపింగ్ జరిగిన రెండో రోజుకు విజయవాడలో జూన్ 2న జరిగిన మహా సంకల్ప దీక్షకు ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేశ్‌తో పాటు నేను, పరకాల ప్రభాకర్, సిఎం ప్రత్యేక విమానంలో వెళ్లాం. 
ముఖ్యమంత్రి ముఖంలో నెత్తుటి చుక్క లేనట్లు కనిపించింది. ఆయన మౌనంగా, ఏదో ఆలోచిస్తూ కనిపించారు. 
విమానంలో లోకేశ్ పరకాలను అభినందించారు. ‘మీరు గట్టిగా మాట్లాడి బాగా సమర్థించారు..’ అని ప్రశంసించారు. 
నవనిర్మాణ దీక్షకు ఒక పాయింట్ నుంచి నడుచుకుంటూ బెంజి సర్కిల్ వరకూ వెళ్లాము. 

మహా సంకల్ప దీక్షలో పాల్గొన్న ముఖ్యమంత్రి పరధ్యానంగానే కనిపించారు. అక్కడి నుంచి స్టేట్ గెస్ట్ హౌజ్ కు వెళ్లి ఆఫీసర్లను కలిశాం. డీజీపి, నేను, కొంతమంది ముఖ్యులు అందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కూడా సిఎం ఇంకా తేరుకోనట్లు కనిపించారు. ఆయన ముఖంలో చాలా అలసట, బడలిక కనిపించాయి. 
అంతా కలిసి కొంత చర్చించిన తర్వాత తమ ఫోన్ల ట్యాపింగ్ జరిగిందనే నిర్ధారణకు వచ్చారు. 
ఫోన్ ట్యాపింగ్ పై కేసు వేసి వారిని ముద్దాయిలు చేస్తే అవతలి పక్షం ఆత్మరక్షణలో పడుతుందని భావించారు. 
ఫోన్ ట్యాపింగ్ పై కేసు వేసి వాళ్లను ముద్దాయిలు చేస్తే కౌంటర్ గట్టిగా ఉంటుందని అనుకున్నారు. చివరకు విజయవాడలో కేసు ఫైల్ చేసి ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించారు. 

బహిరంగ సభలో మాత్రం ఆయన జరిగిన దానికి ఘాటుగా స్పందించారు. కేసిఆర్ కయ్యానికి కాలు దువ్వుతున్నారని, కేసులు పెడితే భయపడేదిలేదని గట్టిగా హెచ్చరించారు. తాను నిప్పులాంటి మనిషినని చెప్పుకున్నారు. రాజ్యాంగ వ్యతిరేకంగా తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, కేసిఆర్‌కు తమను విమర్శించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. కెసిఆర్, జగన్ కలిసి కుమ్మక్కయ్యారని అన్నారు. 
‘మన ఫోన్లు ట్యాప్ చేస్తే ఎంత కడుపు మండిపోతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది నేరం, ద్రోహం. ఒక ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేస్తే ఈ దేశం ఏమవుతుందో మీరే చెప్పండి..’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. నీకెంత హక్కుందో నాకంత హక్కుంది. ఖబడ్దార్, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.’ అని హెచ్చరించారు. 

మర్నాడు కేసిఆర్ కూడా ఆయనకు గట్టిగా సమాధానం ఇచ్చారు. కేసుల్లో చంద్రబాబును తాము ఇరికిస్తే ఇరికేంత అమాయకుడు కాడని, ఆయనే గోతులు తీయగల సమర్థుడని అన్నారు. ‘పట్టపగలు దొరికిన దొంగ’ ఇవాళ గట్టిగా మాట్లాడుతున్నాడని అన్నారు. ఎవరూ నిన్ను కాపాడలేరు అని చంద్రబాబును హెచ్చరించారు. 
ఈ ఇద్దరు సిఎంల మధ్యా యుద్ధం ఢిల్లీ దాకా వెళ్లింది. ఢిల్లీ అప్రమత్తం అయింది. 

ఏమైనప్పటికీ ఫోన్ ట్యాపింగ్ అక్రమమంటూ కౌంటర్ దాడులు చేయడం, రచ్చ చేయడంతో చంద్రబాబుకు ప్రయోజనం చేకూరింది. భారత ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని ఇద్దరి మధ్యా రాజీ కుదర్చాలని భావించడం వల్ల ఓట్ ఫర్ నోటు కేసు ప్రాముఖ్యత కోల్పోయింది. విషయాన్ని అక్కడికక్కడే ముగించి ఇద్దరి మధ్యా అవగాహన ఏర్పర్చాలని కేంద్రం నిర్ణయించినట్లు కనిపించింది. 

గవర్నర్ నరసింహన్ కూడా ఢిల్లీ వెళ్లి జరిగిన విషయాలను హోంమంత్రికి వివరించారు. ఆయనను కూడా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యా సంధి కుదర్చమని కేంద్రం కోరే ఉంటుంది. ఏమైనప్పటికీ చివరకు వారిద్దరి మధ్యా ఎలా రాజీ కుదిరింది? ఎవరు కుదిర్చారు? ఎవరు మధ్యవర్తిగా వ్యవహరించారు? నాకు స్పష్టంగా తెలియదు. అందులో నేను పాల్గొనలేదు. ఇద్దరి మధ్యా రెండు విషయాల్లో మాత్రం అవగాహన ఏర్పడినట్లు స్పష్టంగా తెలుస్తున్నది. 
ఓట్ ఫర్ నోట్ కేసు విషయంలో ముఖ్యమంత్రి కేసిఆర్ చంద్రబాబుకు కొంత వెసులుబాటు కల్పిస్తారు..

 టెలిఫోన్ ట్యాపింగ్ సమస్యపై చంద్రబాబు న్యాయస్థానంలో ముందుకు వెళ్లరు. అంతేకాక కేసిఆర్ కొన్ని షరతులు కూడా విధించి ఉంటాడు. ‘మీరు (ఆంధ్రా ప్రభుత్వం) ఇక్కడినుంచి వెళ్ళిపోవాలి. మొత్తం సెక్రటేరియట్‌ను అక్కడికి తరలించి కట్టుబట్టలతో వెళ్లాలి. తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. మిగిలినవి నేను చూసుకుంటాను. అక్కడికి వెళ్లిపోండి..’ అని కేసిఆర్ చెప్పి ఉంటాడు. 

చంద్రబాబునాయుడు దీనితో హైదరాబాద్‌నుంచి పూర్తిగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. అయితేనేం కేసిఆర్‌తో తనపై కేసు కొనసాగించకుండా తనను తాను రక్షించుకోగలిగారు. ఏమైనప్పటికీ చంద్రబాబు కౌంటర్ కేసు వేయడం ఆయనకు ఉపయోగపడింది. విజయవాడ కోర్టులో ఫోన్ టాపింగ్ కేసు విషయంలో ఆయన తదుపరి చర్యలు తీసుకోలేదు. దానికి కాలదోషం పట్టింది. ఇక్కడ ఓట్ ఫర్ నోట్ కేస్ కూడా తెర మరుగవుతుందనే నేను అనుకుంటున్నాను. 

కేసిఆర్‌కు అప్పటికి కాంగ్రెస్ నుంచి భయం లేదు. అది విశ్వసనీయత కోల్పోయిన పార్టీగా మారింది. బిజెపి ఇంకా ఎదగలేదు. అందువల్ల టీడీపీని ఫినిష్ చేయడంపైనే కేసిఆర్ దృష్టి కేంద్రీకరించాడు. తెలంగాణలో తెలుగుదేశం నాయకత్వాన్ని చాలా వరకు తన వైపుకు తిప్పుకున్నారు. కార్యకర్తల్ని కూడా లాగారు. హైదరాబాద్‌లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పట్టు బలపడేలా చేసుకున్నారు. ఇందుకు కారణం ఓట్ ఫర్ నోట్ కేసును బాగా ఉపయోగించు కోవడమే. 

ఓట్ ఫర్ నోట్ కేసు తర్వాత చంద్రబాబు చాలా బలహీనపడ్డారు. మొదట్లో కేసిఆర్ గురించి తేలికగా మాట్లాడేవారు. 2015 జూన్ 2 తర్వాత నోరు విప్పలేదు. జూన్ 2 కు ముందు చంద్రబాబు ఒక మనిషి. తర్వాత మరో మనిషి. ఫోన్ ట్యాపింగ్, ఓట్ ఫర్ నోట్ కేసు చంద్రబాబు ప్రతిష్ఠను, ఆత్మ విశ్వాసాన్ని, మనో స్థైర్యాన్ని, విషయాలను డీల్ చేసే విధానాన్ని పూర్తిగా దెబ్బతీసింది. 

చంద్రబాబు గట్టిగా మాట్లాడితే మరుసటిరోజే కేసిఆర్ విరుచుకుపడి, ఆయనను వెనక్కు తగ్గేలా చేసేవాడు. ‘జాగ్రత్త’ అనే స్థాయిలో మాట్లాడేవాడు. కేసిఆర్ సర్కార్ వద్ద ఇంకా ఓట్ ఫర్ నోట్ కేసుకు సంబంధించి సాక్ష్యాలున్నాయా లేవా అన్నది చెప్పలేను. విచారణ వెంటనే సాగి ఉంటే సాక్ష్యాధారాలు మరింత బయటపడేవి. ఎక్కడినుంచి ఎక్కడకు డబ్బు వెళ్లింది, ఎవరు విత్ డ్రా చేసింది, ఎవరు ఎవరికి డబ్బులు చెల్లించింది అంతా తెలిసేది. మనీ ట్రయల్ కూడా బయటపడేది. ఫోరెన్సిక్ నివేదిక కూడా ఏమయిందో తెలియదు. ముఖ్యమంత్రిదే కాకుండా మరికొందరు ముఖ్యుల ఫోన్ సంభాషణలు కూడా రికార్డు చేశారని కూడా విన్నాను. ఏమైనా విచారణ ఏదో దశలో ఆగిపోయింది. మనీ ట్రయల్ అన్వేషిస్తున్న సమయంలోనే ఆగిపోయిందని ఎవరో చెప్పారు. 

ఫోరెన్సిక్ నివేదిక మాత్రం ఒక కొలిక్కి వచ్చిందని సమాచారం. అదే సమయంలో ఫోరెన్సిక్ నిపుణుడు గాంధీని చంద్రబాబు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో నియమించుకున్నారు. హైదరాబాద్‌లో ఫోరెన్సిక్ లాబ్ ఉన్నది కనుక విజయవాడలో నిర్మించేందుకు గాంధీ సహాయం అవసరమైనందువల్ల ఆయనను తీసుకున్నారు. ఓట్ ఫర్ నోట్ కేసు సమయంలోనే గాంధీ అవసరం ఎందుకు వచ్చిందో ప్రభుత్వానికే తెలియాలి. 

ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అనుమానం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చాలా కాలం ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేసిన బాలసుబ్రహ్మణ్యం సేవలను పూర్తిగా ఉపయోగించుకున్నారు. ఈ అంశాన్ని పరిశీలించి విజయవాడలో కేసు పెట్టడానికి ఆయన బాగా సహాయపడ్డారు.

Comments

Popular posts from this blog

Whose Capital Amaravathi - Introduction

Urban centres as growth engines