AP future may have to pay a heavy price - Navyandhra tho na nadaka
ఉద్యోగులు అరెస్టయితే పోరాడేందుకు పూర్తి మద్దతునిస్తానన్న చంద్రబాబు అన్నిటినీ మరిచిపోయారు.
‘బతుకు జీవుడా’ అంటూ విజయవాడకు తరలి వెళ్లే క్రమాన్ని అతి వేగవంతం చేశారు. "నవ్యాంధ్ర తో న నడక"
8. ఆంధ్రా ప్రయోజనాలకు దెబ్బ
‘బతుకు జీవుడా’ అంటూ విజయవాడకు తరలి వెళ్లే క్రమాన్ని అతి వేగవంతం చేశారు. "నవ్యాంధ్ర తో న నడక"
8. ఆంధ్రా ప్రయోజనాలకు దెబ్బ
ఏమైనా హైదరాబాద్‌లో ఆంధ్ర ప్రయోజనాలను కాపాడతానని, హైదరాబాద్ పై కేసీఆర్‌కెంత హక్కుందో తనకంత హక్కుందని, తనకు కూడా ఏసీబీ ఉన్నదని మాట్లాడిన చంద్రబాబునాయుడు క్రమంగా తోక ముడిచారు. తెలంగాణకు విద్యుత్ కూడా రాకుండా అడ్డుపడిన చంద్రబాబు, హైదరాబాద్‌లో సెక్షన్ 8ను అమలు చేసి, రెండు రాష్ట్రాల పోలీసు బలగాలకు అధికారం కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన చంద్రబాబు, హైదరాబాద్‌లో సెక్రటేరియట్ నిర్మాణానికి భారీ ఎత్తున ఖర్చు పెట్టిన చంద్రబాబు, విజయవాడలో రాజధాని పూర్తిగా నిర్మాణమయ్యేంతవరకూ అక్కడ కేవలం క్యాంప్ ఆఫీసునే పెట్టుకుని హైదరాబాద్‌నుంచే మొత్తం నడిపించాలనుకున్న చంద్రబాబు, కేసిఆర్ సర్కార్‌ను దెబ్బతీసేందుకు తెర వెనుక పన్నాగాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న చంద్రబాబు, తెలంగాణనుంచి నిధులు ఆంధ్ర బ్యాంకులకు మళ్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు, ఉద్యోగులు అరెస్టయితే పోరాడేందుకు పూర్తి మద్దతునిస్తానన్న చంద్రబాబు అన్నిటినీ మరిచిపోయారు.
‘బతుకు జీవుడా’ అంటూ విజయవాడకు తరలి వెళ్లే క్రమాన్ని అతి వేగవంతం చేశారు.
క్రమంగా హైదరాబాద్‌కు రావడం తగ్గించారు. విజయవాడలో రాజధాని గురించి భారీ ఎత్తున ప్రచారం, ఊపు సృష్టించి దానికొక బిల్డప్ ఇవ్వడం మొదలు పెట్టాడు. హైదరాబాద్‌లో ఉండలేని నిస్సహాయత బయటపడకుండా విజయవాడలోనే ఉండిపోవడానికి రాజధాని పేరుతో బలమైన కారణాలు సృష్టించుకోవడం మొదలు పెట్టారు. ఒక ప్రతికూల పరిస్థితిని తనకు అనుకూలంగా ఆయన మీడియా సహాయంతో మలుచుకున్నారు. ఇది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. స్వంత గడ్డపై నుంచే పాలన ఉత్తమమనే కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు
ఇదంతా ఓట్ ఫర్ నోట్ కేసు మాహాత్మ్యమేనని వేరే చెప్పనక్కర్లేదు. జూన్ 2, 2015 తర్వాత చంద్రబాబు వైఖరే మారిపోయింది. ఆ తర్వాత ఆరేడు నెలలకు ఛీఫ్ సెక్రటరీగా నా పదవీ కాలం ముగిసింది. నేను పదవీవిరమణ చేసిన తర్వాతే ఆయన విజయవాడలో శాశ్వత కార్యాలయాన్ని ఏర్పర్చుకున్నారు. అంతవరకూ నేను, ఆయన తాత్కాలిక కార్యాలయంలోనే పనిచేశాం. విజయవాడలో నా క్యాంపు ఆఫీసులోనే చిన్న గదిని పెట్టుకుని ఆఫీసు కమ్ రెసిడెన్స్‌గా ఉపయోగించుకున్నాను. అక్కడ వారానికి ఒకటి రెండు రోజులు పనిచేసి తిరిగి వచ్చేవారం. ఎందుకంటే పూర్తి స్థాయి సిబ్బంది అప్పటికి హైదరాబాద్‌లోనే ఉండేవారు. ఈ-ఆఫీసు రావడం వల్ల ఫైళ్లను భౌతికంగా తరలించే ప్రక్రియ దాదాపు అప్పటికే ఆగిపోయింది. ఈ సౌకర్యం వల్ల పరిపాలనలో అసౌకర్యం రాకుండా మేము సాఫీగా పనిచేశాము.
జూన్ 2, 2015 వరకు విభజన సమస్యలపై ఏ మాత్రం పోట్లాడినా నాకు చంద్రబాబు మద్దతు ఉండేది. కాని ఆయనే ఆత్మరక్షణలో పడడంతో ఏమీ చేయలేకపోయారు. నేను పంపించే ఫైళ్లు తిరిగి వచ్చేవి కావు. తెలంగాణ ప్రభుత్వంతో సంఘర్షణకు పూనుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదని నాకు తెలిసింది. ఒక వ్యక్తి స్వంత ప్రయోజనాలకోసం ఒక రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినడం స్పష్టంగా కనిపించింది.
కాని ఒక ఛీఫ్ సెక్రటరీగా నేను ఊరుకోలేదు. నా పోరాటం నేను సాగిస్తూనే వచ్చాను. ఓట్ ఫర్ నోటు కేసు తర్వాత చంద్రబాబు వెనక్కి తగ్గడంతో ఏపీ సర్కార్‌కు సంఘర్షణాయుతమైన వైఖరి అవలంబించే అవకాశం లేకుండా పోయింది. భారత ప్రభుత్వం దృష్టిలో కూడా ఏపీ ప్రభుత్వం చులకనగా మారడంతో ఏపీకి అంత మద్దతు లభించలేదు. అధికారుల స్థాయిలోనే తేల్చుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.
రాజకీయ స్థాయిలో పరిష్కారానికి అటు చంద్రబాబు కాని, కేంద్రం కానీ ఆసక్తి ప్రదర్శించలేదు. ‘మీరు ఫార్ములా మాట్లాడుకోండి. మీఇద్దరూ అంగీకరిస్తే మేము పచ్చ జెండా ఊపుతాం.’ అని కేంద్రం తన వైఖరి ప్రదర్శించింది.
చాలా విషయాలు హోం సెక్రటరీ స్థాయి వద్దే ఆగిపోయాయి. మొదటి హోం సెక్రటరీ పూర్తిగా ఏపీకి వ్యతిరేకంగా పనిచేశాడు. రెండవ హోం సెక్రటరీ నాతో సత్సంబంధాల వల్ల కొంత న్యాయ సమ్మతంగా ప్రవర్తించాడు. ఇక మూడో హోం సెక్రటరీ మాత్రం ఏమీ పట్టనట్లుగా ఉండడంతో దేనికీ పరిష్కారం లభించని స్థితి ఏర్పడింది.
తెలుగుదేశానికి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి తనకు సాధ్యమైనంత వరకూ సిబ్బంది, ఆస్తుల అప్పుల విషయం పట్టించుకునేందుకు ప్రయత్నించారు కాని ఆయన అంత విజయం సాధించలేకపోయారు.
కాని ఇంతవరకూ ఆ విషయం తేలలేదు..
లేబర్ సెస్ విషయంలోను తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేసిన మురళీ సాగర్‌ను తర్వాత గవర్నర్ వద్దకు తీసుకెళ్లాను. ‘కేసు కొనసాగకుండా చేస్తాను’ అని గవర్నర్ అన్నారు కాని దాన్ని మూసేయలేదు. ఆయనకు ఆంధ్రాలో పోస్టింగ్ ఇచ్చే విషయం కూడా సిఎం పట్టించుకోలేదు. అంతే కాదు, ఆయన ఆంధ్రా ప్రయోజనాలను కాపాడిన ఉద్యోగుల గురించి పెద్దగా పట్టించుకోలేదు.
అందుకు చందనాఖాన్ ఉదంతమే నిదర్శనం.
చందనాఖాన్ గట్టిగా రాష్ట్ర ప్రయోజనాలకోసం పోరాడారు. ఆ విషయంలో ఆమె ప్రథమ శ్రేణిలో ఉంటారు. జాతీయ పర్యాటక, ఆతిథ్య నిర్వహణ సంస్థ (ఎన్ఐటిహెచ్ఎం) బోర్డు మీటింగ్ ను ఏ విధంగా ఆమె రోడ్డుపైనే నిర్వహించారో ఇంతకు పూర్వమే వివరించాను. ఆమె నా బ్యాచ్ మేట్ కూడా. ఆమె చక్కగా చేసిన పని నాకెంతో సంతోషం కలిగించింది. చాలా మంది అధికారులు నేనెంతో ఒత్తిడి చేస్తే కాని పోలేదు. ‘సార్, మేము హైదరాబాద్‌లో ఉండాల్సి వస్తుంది. ఎందుకు అనవసరంగా తెలంగాణ వారితో పెట్టుకోవాలి?’ అని భయపడ్డారు.
ఆమె ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొన్నారు. విభజన జరిగే నాటికి ఆమెకు ఆరు నెలల సర్వీసు ఉన్నది. ఆమెను ఆంధ్రాకు కేటాయించారు. పర్యాటక రంగంలో పనిచేస్తున్నారు. ‘పర్యాటక రంగంలో నాకు మంచి అనుభవం ఉన్నది. నాకు ఏమన్నా అవకాశం ఇస్తారేమో చూడండి’ అని ఆమె అభ్యర్థించారు. నేను సిఎంతో ఈ విషయం ప్రస్తావించాను. ఆమెను ‘టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేస్తే బాగుంటుంది సార్. మంచి పని చేయగలరు.’ అన్నాను.
‘నిజమే. కాని కార్పొరేషన్ చైర్మన్ రాజకీయ పదవి కదా. కావాలంటే ఎండిగా వేద్దాం.’ అని చంద్రబాబు చెప్పారు. మూడేళ్ల పదవీ కాలం ఇచ్చి ఎండిగా చేద్దాం అన్నారు.
నవంబర్‌లో ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉన్నది. రెండు మూడు రోజుల ముందు నేను సిఎంకు ఫైలు పంపించాను.
‘ఇచ్చేద్దాం. సమస్యేమీ లేదు. నేను విదేశాలనుంచి తిరిగి రాగానే సంతకం పెడతాను’ అన్నారాయన.
అప్పుడు ఆయన హాంకాంగో, జపానో వెళుతున్నారు. తిరిగి రాగానే చేస్తానన్నారు.
‘సరే సార్, ఆ తర్వాత ఫైలు తీసుకువస్తాను’ అని చెప్పాను.
ఆమెకు కూడా ఫోన్ చేసి చెప్పాను. ‘మీకు కార్పోరేషన్ ఎండి పదవి వచ్చేసినట్లే. సిఎం అంగీకరించారు కూడా..’ అని చెప్పాను. ఆమె ఎంతో సంతోషపడి నాకు పలుసార్లు ధన్యవాదాలు తెలిపారు.
‘మీరు కూడా రాష్ట్ర ప్రయోజనాలకోసం గట్టిగా పోరాడారు కదా.. మీకు ఈ పదవి పొందేందుకు అన్ని విధాలా అర్హతలున్నాయి.. మీకు పదవి రావడం ఫార్మాలిటీయే’ అని నేను చెప్పాను.
నెలాఖరులో ఆమెకు వీడ్కోలు పార్టీ జరిగింది. అక్కడ కూడా నేను అదే చెప్పాను. ‘చందనాఖాన్ ఏపి టూరిజం కార్పోరేషన్ ఎండి కాబోతున్నారు.. సిఎం గారు విదేశాలనుంచి రాగానే ఫైలుమీద సంతకం చేస్తారు.’ అని చెప్పడంతో అంతా ఆనందంతో చప్పట్లు చరిచారు.
ఆయన విదేశాలనుంచి తిరిగి రాగానే నేను ఫైలు తీసుకుని వెళ్లాను.
‘లేదు లేదు. ఐఎంజి భరత కు సంబంధించిన కేసు ఆమెపై పెండింగ్‌లో ఉంది. తొందరపడవద్దు’ అని చంద్రబాబు అన్నారు.
‘లేదు సార్. నాకు తెలిసి ఆమెకు దేంట్లోనూ ఇన్ వాల్వ్ మెంట్ లేదు.’ అని అన్నాను.
‘లేదు లేదు. ఉంది’ అని ఆయన అన్నారు.
‘సరే సార్, నేను కూడా వెరిఫై చేసుకుని వస్తాను’ అని బయటకు వచ్చాను
ఈవిషయం తెలిసిన సాంబశివరావుకు ఫోన్ చేశాను.
‘లేదు సార్. ఆ కేసులో ఆమె జోక్యం ఏమీ లేదు. సిఎంకు వ్యతిరేకంగా ఆమె ఏమీ చేయలేదు. నిజానికి మేమే ఆమె దగ్గరకు పోయి సిఎంకు మద్దతుగా కొంత సాక్ష్యం కూడా సేకరించాం.’ అన్నారు..
‘మీరు సిఎంకు ఎందుకు వివరించకూడదు?’ అని అడిగాను.
‘సరే, చెబుతాను’ అన్నారు. మళ్లీ సిఎం దగ్గరకు వెళ్లి ఈ విషయం చెప్పాం.
‘లేదు. లేదు ప్రక్కన పెట్టండి’ అన్నారు.
చందనా ఖాన్ పట్ల ఆయన వైఖరికి కొంత నేపథ్యం ఉన్నది. గచ్చిబౌలిలో ఐఎంజి భరత సంస్థకు అంతర్జాతీయ క్రీడా అకాడమీని నెలకొల్పేందుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 2003-2004లో 450 ఎకరాలు కేటాయించింది. 2004 ఫిబ్రవరిలో తనది ఆపద్ధర్మ ప్రభుత్వమైనా సరే చంద్రబాబు ఆగమేఘాలపై ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ కేటాయింపులతో పాటు చంద్రబాబు హయాంలో జరిగిన అనేక భూ కేటాయింపులను రద్దు చేసింది.
కాని అప్పుడు క్రీడలు, యువజన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ చందనాఖాన్‌కు ఈ విషయంలో ఎలాంటి పాత్ర లేదు. ముఖ్యమంత్రి నిర్ణయాలకు అనుకూలంగానే వ్యవహరించారు. కోర్టులో కూడా ఆమె ఎలాంటి వ్యతిరేక సాక్ష్యాలు చెప్పలేదు. పైగా సాంబశివరావు చెప్పిన దాని ప్రకారం ఆమె ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు ప్రభృతులకు కొంత సానుకూల సమాచారాన్ని కూడా అందించారు. కాని చంద్రబాబుకు ఆమె పేరు వినేసరికి గతం గుర్తు వచ్చినట్లున్నది. ఐఎంజి భరత కు భూకేటాయింపులు అప్పట్లో అతి పెద్ద భూ కుంభకోణంగా ప్రచారం జరిగింది
చివరకు చంద్రబాబు చందనాఖాన్ కు కార్పొరేషన్ ఎండి ఉద్యోగం ఇవ్వనే లేదు.
చందనాఖాన్ బాగా ఫీలయ్యారు. నేను కూడా ఫీలయ్యాను. ఆమెకు పదవి వస్తుందని ముఖ్యమంత్రిగారు మాట ఇచ్చి, అందరి ముందు ప్రకటించి చేయలేకపోవడం బాధ కలిగించింది. ఎవరు చెప్పారో, ఏమో తెలియదు. లేదా వాళ్ల మనుషులను పెట్టుకోవాలనుకున్నారో ఏమో. అమరావతిలో పూర్తిగా రాజధాని నిర్మించిన తర్వాతనే వెళ్లాలని ఆయన అనుకున్నారు. కనీసం పదేళ్లు ఇక్కడ ఏపీ ప్రభుత్వం నిర్వహించాలని ఆయన భావించారు. అక్కడ క్యాంప్ఆఫీసు పెట్టుకుని ఇక్కడి నుంచి నడిపించా లనుకున్నారు. అందుకే మొదట్లో సెక్షన్ 8 పై పట్టు పట్టారు. హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల బలగాలు, అధికారులు ఉండాలన్నారు.
కాని ఓట్ ఫర్ నోట్ కేసు తరువాత ఆగమేఘాలపై వెళ్లడంతో సెక్రటేరియట్ ఉద్యోగులు పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఏమైనప్పటికీ ఓట్ ఫర్ నోట్ కేసు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు బాగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉద్యోగులను అక్కడికి తరలించే కార్యక్రమం వేగవంతం అయి డెడ్ లైన్లు విధించడంతో వారు తీవ్రమైన కష్టాలు పడ్డారు. అవి వర్ణనాతీతం అని చెప్పక తప్పదు. చాలా మంది తమ గోడు నాకు చెబుతూ ఉండేవారు. ఆమేరకు వాట్సాప్ సందేశాలు కూడా పంపారు. ఇప్పటికీ చాలా మంది ఉద్యోగులు హైదరాబాద్‌కూ, విజయవాడకూ మధ్య తిరుగుతూ ఉన్నారు.
చంద్రబాబుకు సమస్య వచ్చినందువల్లే వారందరికీ తీవ్ర సమస్య తెచ్చి పెట్టారు. అసలు ఏమాత్రం సన్నాహాలు చేయకుండా సెక్రటేరియట్‌ను తరలించారు. ఇది మరీ ఘోరం. సెక్రటేరియట్‌ను మార్చదలుచుకుంటే అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో వారు దానికి తగ్గ సన్నాహాలు చేసేవారు. రాజధాని ప్రాంతంలో ఒక వర్కింగ్ వుమన్ హాస్టల్, ఒక వర్కింగ్ మెన్ హాస్టల్ నిర్మించేవారు. దానికి భోజన వసతులు ఏర్పర్చేవారు. సరైన విధంగా తరలించి సౌకర్యవంతంగా వారితో పనిచేయించు కోవడం పెద్ద సమస్య అయి ఉండేది కాదు.
భారత ప్రభుత్వం సెక్రటేరియట్ నిర్మాణానికి కొంత సహాయం ఇచ్చింది. అందులో 20-30 కోట్లు పెడితే ఈ హాస్టల్స్, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉండవచ్చు.
కావాలంటే దగ్గర్లో ఏదో ఒక పెద్ద హోటల్ తీసుకుని వారికి ఎంతో కొంతచెల్లించి దాన్ని తాత్కాలికంగా ఉపయోగించుకుని ఉండవచ్చు. కాని ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఒక గొర్రెల మందనో, గొడ్ల మందనో తీసుకువెళ్లినట్లు ఉద్యోగులను తీసుకుపోవడం దారుణం. దీనిపై ఎటువంటి నిరసన లేకపోవడం అనేది ఉద్యోగుల నాయకత్వంలో ఉన్న పెద్ద లోపం. లేకపోతే అదొక పెద్ద సమస్య అయి ఉండేది. నాయకులను మేనేజ్ చేశారు.
మొత్తం ఇక్కడున్న దాన్ని తరలించడం వల్ల పెద్ద ఎత్తున ఖర్చు కూడా అయింది. ఇక్కడ పెట్టిన ఖర్చు వృధా అయిపోయింది. అక్కడ కొత్తగా ఖర్చు అయింది. డబ్బులు ఎలాంటి జవాబుదారీ లేకుండా మంచినీళ్లలా ఖర్చు పెట్టడం ఈ ప్రభుత్వానికి పరిపాటి అయింది.
ఏమైతేనేం ఓట్ ఫర్ నోట్ కేసు వల్ల చంద్రబాబు బలహీనం కావడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగింది.
Comments
Post a Comment