HOW SECTION 8 IN THE REORGANISATION ACT GOT ECLIPSED

3. సెక్షన్ 8కి కాలదోషం ఎందుకు పట్టింది? Navyandhra tho na nadaka

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 కి చివరకు కాలదోషం పట్టింది. ఇందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అని విషయాలను లోతుగా పరిశీలించిన వారెవరికైనా తెలుస్తుంది. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా నిర్ణయించినందువల్ల సెక్షన్ 8కి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి హైదరాబాదులో స్థిరపడిన వారి ప్రాణధన ఆస్థిపరిరక్షణకు ఉద్దేశించబడిన సెక్షన్ సెక్షన్ 8.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం హైదరాబాద్ పదేళ్ల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండాలి. ఉమ్మడి రాజధానిలో పరిపాలనకు సెక్షన్ 8 వీలు కల్పిస్తుంది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల స్వేచ్ఛను, ఆస్తులను కాపాడే బాధ్యతను గవర్నర్‌కు అప్పగించారు. ముఖ్యంగా శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, కీలక ప్రదేశాల భద్రత, ప్రభుత్వ భవనాల నిర్వహణ, కేటాయింపు గవర్నర్ బాధ్యత. తెలంగాణ మంత్రి మండలిని సంప్రదించిన తర్వాత ఆయన స్వంత విచక్షణను ఉపయోగించి, నిర్ణయం తీసుకుంటారు. 

గవర్నర్‌కు సలహాదారులుగా ఇద్దరు సలహాదారులను నియమించే ఏర్పాటు కూడా సెక్షన్ 8లో ఉన్నది. ఈ చట్టం ప్రకారం అవసరమైన నిబంధనలను రూపొందించాలని, హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు, ప్రజల రక్షణ విషయంలో ఆయన అధిక పాత్ర నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది. అందువల్ల తగిన నిబంధనలను రూపొందించాలని మేము కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాము. అదే విధంగా సెక్షన్ 8 సమర్థవంతంగా అమలు కావాలి అంటే హైదరాబాద్ నగర పోలీసు వ్యవస్థలో రెండు రాష్ట్రాల పోలీసులకు తగిన ప్రాతినిధ్యం ఉండాలని మేము కోరాము. 

కాని దీన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ప్రతిఘటించింది. హైదరాబాద్ నగరం పూర్తిగా తెలంగాణలో ఉన్నందువల్ల, శాంతి భద్రతలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అంశమని, ఈ విషయంలో గవర్నర్‌కు ఎలాంటి నిర్దిష్టమైన పాత్ర లేదని చెప్పింది. సెక్షన్ 8 క్రింద ఎటువంటి ప్రత్యేక నిబంధనలను రూపొందించేందుకు వీలు లేదని తెలిపింది. మరి కేంద్ర ప్రభుత్వం నియమించిన సలహాదారులకే ఎటువంటి పాత్ర లేనప్పుడు చట్టంలో సెక్షన్ 8ని చేర్చినందువల్ల వచ్చే ప్రయోజనమేమిటని ఏపీ ప్రభుత్వం వాదించింది. 

సెక్షన్ 8 విషయంలో నాకు అప్పుడు కేంద్రంలో హోంసెక్రటరీగా ఉన్న అనిల్ గోస్వామితో వాగ్వివాదం జరిగింది. అనిల్ గోస్వామి పూర్తిగా తెలంగాణకు అనుకూలంగా కనపడ్డారు. రెండు రాష్ట్రాలనుంచీ పోలీసు బలగాలను సేకరించి గవర్నర్ ఆధ్వర్యంలో పనిచేయించాలన్న అంశాన్ని నేను ఆయనతో ప్రస్తావించినప్పుడు ‘ఆత్మ గౌరవం ఉన్న ఏ ప్రభుత్వమూ వేరే రాష్ట్ర పోలీసు బలగాలు తమ రాష్ట్రంలో పనిచేయాలని కోరుకోదు...’ అని స్పష్టం చేశారు. 
‘అలాంటప్పుడు రాష్ట్రాన్ని విభజించమని మిమ్మల్ని ఎవరు అడిగారు? ఈ సెక్షన్‌ను ఎందుకు చేర్చారు?’ అని నేను ప్రశ్నించాను. ‘హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్రా, ఇతర ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు చేర్చిన ఈ సెక్షన్‌ను ఇప్పుడెందుకు విస్మరిస్తున్నారు? ’ అని నేను అడిగాను

నేను ఇలా నిలదీస్తానని కేంద్ర హోం సెక్రటరీ ఊహించి ఉండరు. నేను అడిగిన తీరుకు ఆయన తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. నేను కేంద్ర కేబినెట్ సెక్రటరీని కూడా కలిశాను. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఆయనను కలుసుకున్నాను. కొన్ని సంఘటనల గురించి కూడా వివరించి వినతిపత్రం సమర్పించాను. 

నిజానికి పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన అనేక అంశాల పరిష్కారం భారత ప్రభుత్వ స్థాయిలో కావాల్సి ఉన్నది కనుక కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ముఖ్యంగా హోం సెక్రటరీల పాత్ర ఎంతో కీలకమైనది. నేను ఛీఫ్ సెక్రటరీగా పదవిని స్వీకరించే నాటికి కేంద్ర హోం సెక్రటరీగా ఉన్న అనిల్ గోస్వామి పూర్తిగా తెలంగాణ పక్షం ఉన్నట్లు కనపడ్డారు. అసలు అప్పుడు పదవిలో ఉన్న హోం సెక్రటరీలు కానీ, హోం విభాగం కానీ కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అవసరాల పట్ల సానుకూలంగా వ్యహరించలేదు. ఇందుకు ఒక కారణం తెలంగాణ ఛీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మకు హోంమంత్రిత్వ శాఖలో వారితో కలిసి పనిచేసిన అనుభవం ఉండడం. ఏఅంశాన్ని కూడా పరిష్కరించేందుకు హోంసెక్రటరీ ఆసక్తి ప్రదర్శించలేదు. పైగా తెలంగాణ ప్రభుత్వం పట్ల సానుకూలంగా వ్యవహరించారు. 

ఏపీ ముఖ్యమంత్రికీ, ఢిల్లీలో ఉన్న ఏపీకి చెందిన కేంద్రమంత్రులకూ ఈవిషయం చెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది. అదృష్టవశాత్తు కొద్ది కాలం లో అనిల్ గోస్వామి పదవి కోల్పోయి ఆయన స్థానంలో ఎల్ సి గోయల్ హోం సెక్రటరీగా వచ్చారు. ఆయన నా బ్యాచ్ మేట్ కావడంతో భారత ప్రభుత్వం సహాయంతో అనేక సమస్యలను మేము సానుకూలంగా పరిష్కరించుకోగలిగాం. కాని 6 నెలల తర్వాత ఆయన స్థానంలో వచ్చిన హోంసెక్రటరీ విభజన అంశాల గురించి పూర్తిగా ఉదాసీనంగా వ్యవహరించారు. కనీసం రెండు రాష్ట్రాల మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ఆసక్తి ప్రదర్శించలేదు. ‘తాంబూలాలిచ్చాం. తన్నుకు చావండి’ అన్నట్లు గా వ్యవహరించారు దీనితో మేము పరస్పర సర్దుబాటు ద్వారానో, కోర్టు ద్వారానో సమస్యలను పరిష్కరించుకున్నాం. 

ఇక ఏడాది తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఈలోపు చంద్రబాబు నాయుడు రాజధానిని హైదరాబాద్‌నుంచి విజయవాడ తరలించాలని నిర్ణయించారు. ఒక సారి రాజధానిని విజయవాడ తరలించిన తర్వాత సెక్షన్ 8 అనే దానికి ప్రాధాన్యత లేకుండా పోయింది. దానికి కాలదోషం పట్టింది. ‘మీ ప్రభుత్వమే ఇక్కడ లేనప్పుడు సెక్షన్ 8 అవసరం ఏమున్నది..’ అన్న వాదన కేంద్ర ప్రభుత్వంలో వినిపించింది. కనుక ఆ అంశాన్ని నిశ్శబ్దంగా సమాధి చేశారు. 

మరో వైపు గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజల ఆస్తులు, శాంతిభద్రతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరు ప్రశంసనీయం. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా వ్యవహరించగలమన్న విశ్వాసం ప్రజల్లో కలిగింది. సెక్షన్ 8 అమలులో లేదన్న విషయం అందరూ మరిచిపోయారు. సామాన్య ప్రజలు ఈ విషయం పెద్దగా పట్టించుకోనే లేదు. 

కాని చంద్రబాబు నాయుడే ముందుగా అనుకున్న ప్రకారం పదేళ్లు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లో కొనసాగి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవి. అమరావతిలో రాజధాని నిర్మాణం పూర్తయ్యేంతవరకూ హైదరాబాద్‌లోనే ఉండాలని మొదట్లో బలంగా నిర్ణయించుకున్న చంద్రబాబునాయుడు ఎందుకు ఏడాదిలోపే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు? దీనికి బలమైన కారణాలున్నాయి. 

అధికారంలోకి వచ్చిన తొలి కొద్ది నెలలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనో భావాలను బట్టి చూస్తే, ఆయనకు హైదరాబాద్‌నుంచి ఇప్పటికిప్పుడే వెళ్లిపోయి విజయవాడ నుంచి పనిచేయాలన్న అభిప్రాయం ఉండేది కాదని అర్థమయింది. హైదరాబాద్‌నుంచి వెళ్లిపోవాలన్న సంకేతాలు ఆయన ఎప్పుడూ తొలి నెలల్లో మాకు ఇవ్వలేదు. ‘మనం హైదరాబాద్‌నుంచే చాలా కాలం పనిచేయాల్సి ఉంటుంది’ అని ఆయన చెబుతూ ఉండేవారు. ‘రాజధానిని తరలించే నిర్ణయం తీసుకునేటప్పుడు హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆంధ్ర ప్రజల ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి.’ అని ఆయన ఒక సందర్భంలో చెప్పారు. 

ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆంధ్ర ప్రదేశ్‌కూ, తెలంగాణకూ బ్లాకులు అలాట్ అయ్యాయి. గవర్నర్, ఆయన సలహాదారులు ఆంధ్రప్రదేశ్‌కు హెచ్, ఎల్ బ్లాక్ లు అలాట్ చేశారు. వాటిలో హెచ్‌బ్లాక్ ముఖ్యమంత్రి కార్యాలయానికి కేటాయించారు. కాని కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాను హెచ్ బ్లాక్ నుంచి పనిచేయనని సిఎం స్పష్టం చేశారు. వాస్తు ప్రకారం హెచ్ బ్లాక్ సరైంది కాదని అన్నిటికన్నా ఎత్తైన ఎల్ బ్లాక్ లోని 8 వ అంతస్తు నుంచి పనిచేస్తానని ఆయన నిర్ణయించారు. మేము ఎల్ బ్లాక్ ను సందర్శించాం. అక్కడ అప్పటికే కొన్ని సెక్షన్లు పనిచేస్తున్నాయి. వాటిని ఖాళీ చేసి మరో చోటికి మారాల్సిందిగా సిబ్బందిని అభ్యర్థించాం. ఎల్ బ్లాక్ సిఎం అభీష్టానికి అనుగుణంగా పునర్నిర్మించడం ప్రారంభమైంది. 7వ ఫ్లోర్ లో ఛీఫ్ సెక్రటరీ కార్యాలయం, 8 వ ఫ్లోర్ లో ముఖ్యమంత్రి కార్యాలయం ఉండాలని నిర్ణయించాం. వేగంగా పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 7వ ఫ్లోర్‌ లోనే తాత్కాలికంగా నేను చిన్న గదిలో చేరి విధినిర్వహణలో నిమగ్నమయ్యాను. ముఖ్యమంత్రి లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ నుంచి పని ప్రారంభించారు. ఎల్ బ్లాక్ పునర్నిర్మాణానికి భారీ ఎత్తున ఖర్చు పెట్టారు. అత్యధునాతనంగా బ్లాక్ రూపు దిద్దుకుంది. 

విజయదశమి నాటికి మేము కొత్త బ్లాక్ లోకి మారిపోయాం. చంద్రబాబు నాయుడు తొలి నెలల్లో హైదరాబాద్‌లోనే ఉండిపోవాలన్న బలమైన ఆకాంక్షను వ్యక్తం చేయడమే కాకుండా తెలంగాణ పట్ల ప్రత్యర్థి వైఖరిని అవలంబించారు. ఇందుకు ఉదాహరణ- రెండు రాష్ట్రాలకు వర్తించే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను గౌరవించే బదులు వాటిని రద్దు చేసి అదనపు విద్యుత్ ను తెలంగాణతో పంచుకోకూడదని ఆయన నిర్ణయించడం. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం విద్యుత్ ప్లాంట్లు ఎక్కడఉన్నాయనే ప్రాతిపదికపై జెన్కో యూనిట్లను విభజించాలి. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రాజెక్టులకు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను కొనసాగించాలి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి అదనపు విద్యుత్ ఉంటుందని, తెలంగాణకు విద్యుత్ లోటు ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. విద్యుత్ ఉత్పాదన కంపెనీలన్నీ ఏపీలో ఉండడమే ఇందుకుకారణం. అందుకే సమైక్య రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రెండు రాష్ట్రాలకు వర్తిస్తాయని చట్టం పేర్కొంది. అయితే రాజకీయ స్థాయిలో మాత్రం ఈ ఒప్పందాల్ని రద్దు చేసి ఏపీ నుంచి తెలంగాణకు విద్యుత్ లభ్యమయ్యేలా చూడకూడదన్న ఆలోచన కలిగింది. ఈ ఆలోచనకు నేను వ్యతిరేకం. ఎందుకంటే చట్టం ప్రకారం పీపీఏలకు సంబంధించినంత మేరకు ఏపీలో ఉన్న అదనపు విద్యుత్ ను తెలంగాణకు లభ్యమయ్యేలా చూడాలని చట్టం స్పష్టం చేసింది. కాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్ని రద్దు చేసి అదనపు విద్యుత్‌ను తెలంగాణతో పంచుకోకూడదని నిర్ణయించారు. 

నేను హేతుబద్ధంగా ఆలోచించాలన్న సలహాను ఆయన పాటించలేదు. ఇది చాలా తీవ్ర సమస్యలకు దారితీసింది. ఈ ఒక్క నిర్ణయమే రెండు రాష్ట్రాల మధ్య ఎక్కువ అగాధాన్ని సృష్టించింది. సంబంధాలను బాగా దెబ్బతీసింది. ఆ కాలంలో తెలంగాణ విద్యుత్ విషయంలో తీవ్ర కొరతను ఎదుర్కొంది. ఈ సంఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సచివాలయంలో రెండు రాష్ట్రాల భవనాల మధ్య బారికేడ్లను నిర్మించింది. అప్పటివరకూ సచివాలయంలో స్వేచ్ఛగా తిరిగే అనేకమంది ఉద్యోగుల మనోభావాలు దీనితో దెబ్బతిన్నాయి. ఈ విషయం నేను తెలంగాణ మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకువచ్చాను. 

‘బారికేడ్లు ఎందుకండీ.. లేకపోయినా వచ్చే సమస్య ఏమి లేదు కదా..’ అని నేను అన్నాను. 
‘మీ ముఖ్యమంత్రి మాకు విద్యుత్ సరఫరా ఆపు చేసేందుకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయడం మాత్రం సరైనదా..’ అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. 
తెలంగాణ పట్ల ఇంత కఠినమైన వైఖరి అవలంబించిన చంద్రబాబునాయుడు తర్వాత తెలంగాణ ఏపీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా ఎందుకు మెతక వైఖరి అవలంబించారో ఇంకో చోట పరిశీలిద్దాం


Comments

Popular posts from this blog

Whose Capital Amaravathi - Introduction

Urban centres as growth engines