Special Category Status & Facts



ప్రత్యేక హోదా - విభజన అంశాలు: నిజానిజాలు
ప్రత్యేక హోదా విభజన అంశాల విషయాల్లో ప్రజల మనస్సులో చాలా అస్పష్టత నెలకొని ఉన్నది. చాలామంది మిత్రులు నాకు తెలిసినంతవరకు అంశాలను వివరిస్తూ వివరణ ఇవ్వవలసిందిగా కోరుతున్నారు. దానికనుగుణంగా ఈ కింది సమాచారాన్ని ఉంచుతున్నాను

1.రాష్ట్రానికి రావాల్సిన మొత్తం ఎంత? వివిధ కమిటీలు ఏమి చెబుతున్నాయి?
 పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఏర్పడిన జేఎఫ్ ఎఫ్ సి రిపోర్టు తయారు చేసే సమయంలో ఒక ప్రధాన అంశం చర్చకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారాన్ని సేకరించడానికి కానీ సంప్రదించడానికి గాని జే  ఎఫ్ఎస్సి ప్రయత్నం చేయలేదు. కేంద్ర ప్రభుత్వ వాదన తెలియకుండా ఇంత మొత్తం కేంద్రం నుంచి రావాలి అని చెప్పడం సరైన విధానం కాదు అని భావించి జే ఎఫ్ ఎఫ్ సి 75 వేల కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరిష్కరించుకోవలసిన మొత్తంగా చూపెట్టారు కానీ ఇంత మొత్తం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాలని చెప్పలేదు.
జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో ని స్వతంత్ర నిపుణుల కమిటీ తన అధ్యయనాన్ని ప్రారంభించినప్పుడు జే ఎఫ్ ఎఫ్ సి కి సాధికారత లేకపోవటంతో రిపోర్టుకు ప్రాధాన్యత లేకుండా పోయింది కాబట్టి ఆ రోజే జే పి గారికి కేంద్రాన్ని కూడా భాగస్వామ్యం చేసుకొని ముందుకు పోతే బాగుంటుందని సూచించడం జరిగింది. దురదృష్టం అటువంటి ప్రక్రియ జరగలేదు. 10 నెలల కసరత్తు తర్వాత కేంద్రంతో సంప్రదించకుండా వారి అభిప్రాయం తెలుసుకోకుండా ఏకపక్షంగా ఎన్నికల ముందు కేంద్రం నుంచి రాష్ట్రానికి 85 వేల కోట్లు రావాలని తేల్చారు.ఇది కూడా వెంటనే రావాలా కొన్ని సంవత్సరాల పరిమితిలో రావాలనే స్పష్టత విలేకర్ల సమావేశంలో ఇవ్వలేదు. దానితో ఈ మొత్తం అంతా ఒకేసారి వెంటనే రావాలన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లి పోయింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే లక్షా 16 వేల కోట్లు రావాలని చెబుతున్నది. ఎవరు చెప్పినా దీంట్లో నాలుగైదు పద్దులు ప్రధానంగా పరిశీలించి వాటిలో నిజంగా ఎంత రావాలో పరిశీలిస్తే మనకు అసలు విషయం అర్థం అయిపోతుంది.
2. వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ
విభజన చట్టంలో సెక్స్ 46 94 ప్రకారం  ఈ ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్ లోని 7 జిల్లాలకు తెలంగాణలోని 9 జిల్లాలకు వర్తింప చేయడం జరిగింది. ప్రధాన మంత్రి గారి ప్రసంగం లో దీనిని ఆంధ్రప్రదేశ్ కు బుందేల్ఖండ్ ప్యాకేజీ తరహాలో వర్తింప చేస్తాము అని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అడిగిన విధంగా బుందేల్ఖండ్ ప్యాకేజ్ అనుగుణంగా 24 వేల 350 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని జె పి గారికమిటీ తేల్చింది. రాష్ట్ర ప్రభుత్వం జేపీ గారు మర్చిపోయిన ఒక ప్రధానమైన విషయం ఈ ప్యాకేజీ 24000 కోట్లల్లో అప్పటికే బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉన్న ఉపాధి హామీ పథకంలో నిధులను ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాల లోని నిధులను కలిపి ఒక ప్యాకేజీగా చూపెట్టారు. ఆ వివిధ స్కీముల లో వచ్చే నిధులను రెండు చోట్ల కలిపిన రెండు చోట్లా తీసేసిన బుందేల్ఖండ్ ప్యాకేజీకి మనకిచ్చే వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ తేడా లేదు. 6 సంవత్సరాల సమయంలో 2100 కోట్లు ఇస్తే ఇది బుందేల్ఖండ్ కు ఇచ్చిన ప్యాకేజీకిసమానంగా ఉందని నీతి ఆయోగ్ నిర్ధారించింది. ఈ మధ్యకాలంలో పార్లమెంట్ లో ఇచ్చిన సమాధానాన్ని ఆధారంగా చేసుకొని ఈనాడు పత్రిక వారు ఈ పద్దు క్రింద ఇంకొక 900 కోట్ల రూపాయలు వస్తే 2100 కోట్ల కు బదులు మూడు వేల కోట్లు వస్తే మన వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ బుందేల్ఖండ్ ప్యాకేజీకి సమానం అవుతుందని పేర్కొన్నారు. హేతుబద్ధంగా ఒక వెయ్యి కోట్లు అటు ఇటు గా ఉంటే అడిగితే ఎవరైనా ఇస్తారు. ఏకంగా లేని రాని ఎటువంటి ఆధారాలు లేని 24 వేల కోట్లను రావాలి అంటూ అబద్ధాలు ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల నుంచి ప్రజలను మోసం చేస్తూనే ఉన్నది.జేపీ గారి ఆధ్వర్యంలో ఉన్న కమిటీ ఈ అంశాలను సరిగ్గా పరిశీలించకుండా సరైన నివేదిక ఇవ్వలేదు. అది రెండు వేల వంద కోట్ల లేక మూడు వేల కోట్ల ఏది తే లాలన్న ముందు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చలకు సిద్ధం కావాలి. ఈ అంశాన్ని చర్చించకుండా గుడ్డిగా 24 వేల కోట్లు రావాలంటూ వాదిస్తుంటే ఎవరూ పట్టించుకోరు.


3. లోటు బడ్జెట్ 2014-15
2014 -15 లోటు బడ్జెట్ ను కాగ్ వారు 16 వేల 78 కోట్లు గా నిర్ధారించారు కాబట్టి దానిని భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ పద్దు లో అంకెలన్నీ పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం విభజన వలన ఏర్పడిన లోటు కేవలం 4118 కోట్లుగా తేల్చి అంతవరకే చెల్లిస్తామని చెప్పడం జరిగింది. మిగిలిన వ్యయం వ్యవసాయ రుణ మాఫీ కి పెన్షన్లకు మొదలైన ఖర్చులకు పెట్టడం జరిగిందని ఆ మొత్తాన్ని రాష్ట్రానికి ఇస్తే మిగతా రాష్ట్రాల కూడా ఇవ్వాల్సి వస్తుందని కాబట్టి ఇవ్వలేమని తేల్చి చెప్పారు. తదనుగుణంగా సుప్రీంకోర్టులో తమ అఫిడవిట్లు కూడా వేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు ప్రతి చోట ఈ 16 వేల కోట్లను అదేవిధంగా ప్రస్తావిస్తూనే ఉంది.
ఇక జయ ప్రకాష్ నారాయణ్ కమిటీ ఈ 16 వేల కోట్లు వచ్చే ప్రశ్నే లేదని తేల్చి చెపుతూనే మరియు ఆరు వేల కోట్లు మాత్రం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. దీనిలో ప్రధానంగా 2015 -16 లో పెండింగ్ బిల్లులపైఖర్చు పెట్టిన 2,950 కోట్లు పిఆర్సి బకాయిలు 3920 కోట్లు ఉన్నాయి. ఈ పెండింగ్ బిల్లుల ఖర్చు విషయం కేంద్రం పరిశీలించి తిరస్కరించింది కాబట్టి తిరిగి ఆమోదించే అవకాశం చాలా తక్కువ. పి ఆర్ సి కి సంబంధించిన 3920 కోట్ల వరకు మాత్రం హేతుబద్ధత ఉంది. సమస్య చర్చించి పరిష్కరించుకునే దృష్టితో రాష్ట్ర ముందుకు పోతే ఇవి వచ్చే అవకాశం ఉంది.

4. ప్రత్యేక ప్యాకేజీ
ప్రత్యేక ప్యాకేజీ కింద 16447 కోట్లు రావాల్సి ఉంటుందని జయ ప్రకాష్ కమిటీ నిర్ధారించింది. ఈ అంశంలో కేంద్రానికి కూడా ఎటువంటి అభిప్రాయ భేదము లేదు. ఎటొచ్చి ఎస్పీవీ  ఏర్పాటు చేసుకొని తీసుకోవడానికి రాష్ట్రం ముందుకు రావటం లేదు. అటువంటి పరిస్థితులలో ఈ మొత్తాన్ని కేంద్రం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న తీసుకోవటానికి రాష్ట్రం సిద్ధంగా లేదని చూపెట్టాల్సింది పోనిచ్చి జయప్రకాష్ నారాయణ కమిటీ ఈ మొత్తం కూడా కేంద్రం నుంచి రావాల్సిందిగా ఎట్లా చూపెడుతున్నదో అర్థం కావటం లేదు.
5. జాతీయ విద్యా సంస్థలు
ఈ పద్దు కింద 12746 కోట్లు రావాలని ఇంతవరకు 845 కోట్లు మాత్రమే వచ్చాయని జయ ప్రకాష్ కమిటీ తేల్చింది. 11 జాతీయ విద్యా సంస్థలను రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మీద రికార్డ్ టైములో ఒక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పడం జరిగింది. ఆరోజు తాత్కాలిక భవనాలలో నైనా ప్రారంభించమని మనం బ్రతిమాలుకున్నాం.ఈరోజు వాటిని తాత్కాలిక భవనాల్లో నడుపుతున్నారని ఎద్దేవా చేస్తున్నాం. 2009లో ప్రారంభించిన హైదరాబాద్ ఐఐటీ శాశ్వత భవనాలకు తరాల టానికి 10 ఏళ్లు పట్టింది. మిగిలిన రాష్ట్రాలలో భవన నిర్మాణాలు జరుగుతున్నట్టే మనకు జరుగుతున్నాయి గాని మనకు ఎటువంటి వివక్ష చూపటం లేదు. ఎప్పుడైనా సివిల్ వర్క్స్ ఒకట్రెండు సంవత్సరాల అయిన తర్వాతనే పుంజుకుంటాయి. 2015లో రాజధాని భవనాలు కట్టుకోమని 1500 కోట్లు ఇస్తే 2018 చివరిలో పునాదులు వేసి ఇంకెవరో త్వరగా భవనాలు పూర్తి చేయలేదని ఎద్దేవా చేయడం మనకే చెల్లుతుంది. ఇవి కేంద్ర విద్యా సంస్థలు వాటికి సపరేట్ డైరెక్టర్స్ ఉంటారు. వాటి పురోగతి వాళ్ళు చూసుకుంటారు.కావాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటి ప్రగతిని పర్యవేక్షించవచ్చు సమీక్షించవచ్చు. ఇవన్నీ వదిలేసి ఏదో ఈ పద్దు కింద రేపే పదివేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి రావాలని నట్టుగా అబద్ధాలను అసత్యాలను ప్రజల్లోకి ప్రచారం చేస్తున్నారు.
6. పోలవరం ప్రాజెక్టు
ఆరు వేల కోట్ల దాకా కేంద్ర ప్రభుత్వం ఇవ్వబట్టే పోలవరం ప్రాజెక్టు ముందుకు పోయింది. రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా అంచనాలు పెంచడం కాంట్రాక్టర్లను మార్చటం ఒక పద్ధతి పాడూ లేకుండా పోలవరం నిర్మాణాన్ని గత నాలుగేళ్లలో నడిపిన విధానం ఇవాళ కాకపోయినా రేపైనా ఒక ప్రధాన విచారణ కు తెర తీస్తుంది. అది తేలేంతవరకు అదనంగా నిధులు ఎంత వస్తాయి అనేది వేచి చూడాల్సిందే.
7. రాజధాని
రాజధానిలో ప్రధాన భవన నిర్మాణానికి 1500 కోట్లు ఇస్తే శాశ్వత భవనాల నిర్మాణం ఇప్పుడే ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నిర్ణయానికి పూర్తిగా వ్యతిరేకంగా స్థల నిర్ణయం జరిగింది. ఇచ్చిన డబ్బులు ఎంత మటుకు ఖర్చు పెట్టలేదు. హేతుబద్ధంగా ఆడకుండా లక్షల కోట్లు అడిగితే  ఏ ప్రభుత్వం ఉన్నా నిధులు వచ్చే అవకాశం లేదు. ఇచ్చిన నిధులను కూడా ఇంతవరకు సక్రమంగా వినియోగమే చేయలేదు.
8. మౌలిక సదుపాయ సంస్థలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం షెడ్యూల్ 13 లో ఒక పది మౌలిక సంస్థలను గురించి పేర్కొనడం జరిగింది. ఆరోజు చట్టం తయారుచేసే టైములో ఈ 10 లో ఒకటి రెండు తప్పితే మిగిలిన వాటన్నిటికీ సాధ్యాసాధ్యాలు పరిశీలించామన్నారు కానీ నెలకొల్పాలని ఇదమిద్ధంగా చెప్పలేదు.ఈ సంస్థలు ఏర్పాటు చేయడానికి పది సంవత్సరాల కాలపరిమితి కూడా ఇచ్చారు. ఈనాడు ఆవేశపూరితంగా వీటిలో కొన్ని వివిధ ప్రాంత ప్రజల మనోభావాలకు సంతరించుకున్నాయి. వీటిని ఒక్కొక్కదాన్ని పరిశీలిద్దాం.
దుగరాజపట్నం దగ్గర ఓడరేవు సాధ్యం కాదని ప్రత్యామ్నాయ స్థలాన్ని సూచించమని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే సూచించకుండా కేంద్రాన్ని దోషిగా చూపెట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది. ఇక ఈ ప్రాజెక్టు విషయాల్లో కేంద్రాన్ని ఎట్లా చెప్పబడుతుందో అర్థం కావటం లేదు.
కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కావాల్సిన సాధ్యాసాధ్యాలను పరిశీలించమని చట్టంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా నే  పోయి శంకుస్థాపన చేసి వచ్చింది.అక్కడ నాణ్యమైన ముడిసరుకు ఉందా లేదా అనే విషయం ఇంతవరకు తేలలేదని స్టీల్ సెక్రటరీ గారు రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. ముడిసరుకు తేలకుండా ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా నిర్మిస్తుందో అర్థం కావటం లేదు.
పెట్రో కెమికల్ కాంప్లెక్స్. ఈ అంశంలో కొంత పురోగతి కనిపిస్తున్నది. కొన్ని రోజుల్లో కొలిక్కి రావచ్చు. చాలా మూలధన వ్యయం తో కూడుకున్న అంశం. చట్ట ప్రకారం కూడా 10 సంవత్సరాల కాలపరిమితి ఏర్పాటు చేయడానికి ఉంది.
వైజాగ్ చెన్నై పారిశ్రామిక ద్వారం. దీని పనులు త్వరితగతిన పూర్తి అవుతున్నాయి. ఈ ప్రాజెక్టును ఇంకొక స్కీం కింద తీసుకొనమని రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన. అది పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తున్నది
విజయవాడ వైజాగ్ మెట్రో విజయవాడలో మెట్రో కు బదులు లైట్ రైల్ వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వమే వెనక్కి పోయింది. విశాఖపట్నం మెట్రో రైలు పరిశీలనలో ఉన్నట్టు గా తెలుస్తున్నది.వీటన్నిటిని ఏర్పాటు చేయడానికి పది సంవత్సరాల సమయం ఉన్నది అనే విషయాన్ని మరవరాదు.
విమానాశ్రయాల ఆధునీకరణ.  ఈ కార్యక్రమం చాలా త్వరితగతిన జరుగుతున్నది.
రోడ్డు రవాణా వ్యవస్థ. ఈ అంశంలో అధిక మొత్తంలో నిధులు కేటాయించి చాలా రోడ్డు ప్రాజెక్టులు రాష్ట్రంలో చేపట్టడం జరిగింది.
రైల్వే జోను. ఇది ఎక్కడ అనే విషయం చట్టంలో చెప్పలేదు. కానీ ఉత్తరాంధ్ర రాయలసీమ వాసులు వైజాగ్ గుంతకల్ అని ముందే ఫిక్స్ అయిపోయారు. ఆర్థికంగా మనగలిగే విధంగా లేదు కాబట్టి ఎట్లా చేయాలి అనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తూ ఉన్నది.
ఈ ప్రాజెక్టుల్లో కొన్ని అప్పటికప్పుడు అనుకుని చట్టంలో చొప్పించారు కాబట్టి వాటి ఆర్థిక సాధ్యాసాధ్యాలను సరిగ్గా పరిశీలించలేదు. పరిశీలన తర్వాత వాటికి సరైన ఆర్థిక ప్రాతిపదిక లేదని తేలితే వాటికి బదులుగా అంతే పెట్టుబడి ఉండే ఆ ప్రాంతానికి పనికొచ్చే మరి ఏమైనా ప్రాజెక్టులు తీసుకోవచ్చు. కానీ దానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చించే మనస్తత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి!

9. పన్ను రాయితీలచెల్లింపులలో విభజన చట్టంలో లోపాలు
విభజన చట్టంలో లోపాల మూలంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలకు ఇచ్చిన పన్ను రాయితీలను తిరిగి చెల్లించే టప్పుడు హైదరాబాదులో చెల్లించే విధంగా ఉంది దీనివలన రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతున్నది మూడు వేల కోట్ల రూపాయలు. దీనిని తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి భర్తీ చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. గంప గుత్తగా ఉన్నవి లేనివి అన్నీ కలిపి రాజకీయంగా లక్షా  16 వేల కోట్లని మాట్లాడకుండా దీని వరకు అడిగితే వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది.

10.ప్రత్యేక హోదా లో పరిశ్రమ రాయితీలు భాగమా?
అన్ని అంశాల కన్నా చాలా ప్రధానమైనది ఆవేశపూరిత మైనది ప్రత్యేక హోదా. ఒకసారి దీని పూర్వాపరాలను పరిశీలిస్తే ఇది విభజన చట్టంలో భాగం కాదు. మన్మోహన్ సింగ్ గారి పార్లమెంట్ లోని ప్రకటనలో ఆర్థిక సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వర్తింప చేస్తామని మాత్రమే ఉన్నది. అక్కడ పరిశ్రమ రాయితీల ప్రస్తావన లేదు. విభజన చట్టంలోని పరిశ్రమ రాయితీలను రెండు రాష్ట్రాలకు ఇస్తామని అదే ప్రకటనలో మరియొకచోట పేర్కొన్నారు. దానిని సరిగ్గా అర్థం చేసుకోక ప్రత్యేక హోదా తో పాటు పరిశ్రమ రాయితీలు వస్తాయి అని అందరూ భ్రమించారు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఏనాడు ప్రత్యేక హోదా లో భాగంగా పరిశ్రమ రాయితీలు లేవు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా కేవలం ఆర్థిక సహాయం కోసమే 1969లో ప్రవేశపెట్టడం జరిగింది. పరిశ్రమరాయితీలు 1997వ సంవత్సరంలో మరి ఒక ప్రత్యేక స్కీం కింద ప్రవేశపెట్టారు. కాబట్టి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమ రాయితీలు వస్తాయనుకోవడం  కేవలం భ్రమ మాత్రమే.
11. ఈనాడు ప్రత్యేక హోదా ఇవ్వటంలో సమస్యలేమిటి?
ఇక 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు మధ్య ఉన్న తేడాను తొలగించడంతో ఈరోజు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఏమీ లేవు. ఈశాన్య రాష్ట్రాలకు 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు తర్వాత వేసిన ముఖ్యమంత్రి ఉప సంఘం సిఫార్సుల మేరకు అంతకు ముందు ఇచ్చిన రాయితీలను కొనసాగించడం జరుగుతుంది. అదే సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కింద ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆపైన యూటర్న్ తీసుకుని  రాష్ట్ర ప్రభుత్వం లేని రాని ప్రత్యేక హోదా కావాలంటున్న ది.జయప్రకాష్ నారాయణ కమిటీ వారు కూడా ఏ ప్రభుత్వం ఉన్నాపారిశ్రామిక  రాయితీలు వచ్చే అవకాశం లేదని తేల్చేశారు. పారిశ్రామిక రాయితీలు లేని హోదా అయినా ప్యాకేజీ అయినా ఒకటే. కానీ రాష్ట్ర ప్రభుత్వం  కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపెట్టి రాజకీయ లబ్ది పొందాలనే ఉద్దేశంతో లేని రాని పరిశ్రమ రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా కావాలని వాదిస్తున్నది. విచిత్రం ఏమిటంటే వారితో పాటు ధర్నాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు కూడా ఎవరు పరిశ్రమ రాయితీలతో కూడిన ప్రత్యేక హోదాను వాగ్దానం చేయడం లేదు.ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయంలో అసత్యాలను ప్రజల్లో ప్రచారం చేసి రాజకీయ లబ్ధి కోసం ప్రజలను మభ్యపెడుతున్నారు.

స్థూలంగా విభజన అంశాలు ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ విషయాల్లో వాస్తవాలు పై విధంగా ఉన్నాయి.

Comments

Popular posts from this blog

Whose Capital Amaravathi - Introduction

ChandraBabu Naidu - CBN

Urban centres as growth engines