How Did I Become A Chief Secretary - IYR KrishnaRao


1. ఛీఫ్ సెక్రటరీ ఎలా అయ్యాను?


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 2012 డిసెంబర్ ప్రాంతంలోనే నేను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఛీఫ్ సెక్రటరీ) పదవి స్వీకరించేందుకు తగిన వాతావరణం ఏర్పడింది. అప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్న మిన్నీ మాథ్యూ 2013 జనవరిలో పదవీ విరమణ చేయాల్సి ఉన్నది. రాష్ట్రంలో ఉన్న సీనియర్ అధికారులలో ఒకడిని కావడం వల్ల నేను ఈ పదవిని స్వీకరించేందుకు అర్హుడినయ్యాను. కాని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి నన్ను ఛీఫ్ సెక్రటరీగా నియమించేందుకు అంత ఆసక్తి ప్రదర్శించ లేదు. దీనికి ఒక నేపథ్యం ఉంది. 
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి నేను టిటిడి కార్యనిర్వహణాధికారిగా ఉన్నాను. దాదాపు రెండేళ్లు ఆ పదవిలో పనిచేశాను. 2009లో నేను టిటిడి కార్యనిర్వహణాధికారి పదవి చేపట్టాను. 
 2010 నవంబర్ లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు నుంచీ నన్ను టిటిడి నుంచి తప్పిస్తారని ప్రచారం జరిగింది. సరిగ్గా ఆయన ముఖ్యమంత్రి అయిన ఏడు నెలలకు జూన్ 16న నన్ను ఆ పదవి నుంచి తప్పించారు.  

కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్‌గా ఉన్నప్పుడు అడిషనల్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారిగా ఉన్న తిప్పిరెడ్డి వెంకట శివకుమార్ రెడ్డిని కొండ క్రింది నుంచి పైకి తేవడానికి ప్రయత్నించారు.. కిరణ్ స్వయంగా నాతో ఫోన్‌లో మాట్లాడారు. ఒక శాసన సభ స్పీకర్ ఫోన్ చేస్తే దానికి విలువ ఇవ్వాలి. అందునా చిత్తూరు ఆయన స్వంత జిల్లా. కాని అదే సమయంలో శివకుమార్ రెడ్డిపై ఆరోపణలున్న రీత్యా ఆయనను కొండ పైకి తీసుకు వస్తే సమస్యలుంటాయని నాకు తెలుసు. ఈ విషయం స్వయంగా స్పీకర్‌కు చెప్పాలని నేను భావించాను. 

హైదరాబాద్ కు వెళ్లినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నాను. శివకుమార్ రెడ్డిపై ఆరోపణలున్నందువల్ల ఆయనను పైకి తీసుకురావడం అంత మంచిది కాదని నేను ఆయనకు వివరంగా చెప్పాను. కిరణ్ కుమార్ రెడ్డి ఏమీ మాట్లాడలేదు. నా మాటలు ఆయన అర్థం చేసుకున్నారనే అనుకున్నాను. సమస్య పరిష్కారం అయిందనే ఉద్దేశంతో తిరుమల తిరిగి వెళ్లాను. కాని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ విషయం మనసులో పెట్టుకుంటారని కానీ, కక్ష సాధింపు ధోరణితో ప్రవర్తిస్తారని కానీ అనుకోలేదు. 
నన్ను టిటిడి కార్యనిర్వహణాధికారి పోస్టు నుండి బదిలీ చేసి, నేను ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన సీనియర్ అధికారినని తెలిసినప్పటికీ ఆయన నన్ను తక్కువ ప్రాధాన్యం గల కార్మిక శాఖలో నియమించారు. దీనితో నేను కిరణ్ కుమార్ రెడ్డిని స్వయంగా కలుసుకుని నా అసంతృప్తి వ్యక్తం చేశాను. ‘గతంలో నేను వృత్తి పరంగా తీసుకున్న నిర్ణయాలను మీరు మనసులో పెట్టుకున్నారేమో..’ అని కూడా అన్నాను. కిరణ్ నేను చెప్పింది మౌనంగా విన్నారు. ‘సరే ఈ విషయం పరిశీలిస్తాను’ అన్నారు. ఒక రెండు నెలలు పెండింగ్ లో పెట్టి మార్కెటింగ్ అండ్ కోపరేషన్ కు ప్రత్యేక సీఎస్ గా నియమించారు. నా సీనియారిటీకి ఇది కూడా తగిన ప్రాధాన్యం గల పోస్టు కాదు. ఏమైతేనేమి, మొత్తం మీద ఆయనతో నాకు అంత సత్సంబంధాలు లేవనే చెప్పాలి. 

అందుచేత ఒకసారి ఆయనను కలిసి విషయం నివృత్తి చేసుకుంటే మంచిదని మినీమాథ్యూ పదవీ విరమణకు నాలుగు నెలలు ముందే ఆయనను కలిసాను. నా తరఫున ఆయనను విశ్వవిద్యాలయంలో నా జ్యూనియర్ అయిన ఒక మంత్రి కూడా కలిసారు. ఆయనను కలిసిన తర్వాత ఆ మంత్రి నాకు చెప్పింది ఏమిటంటే తిరుపతి సంఘటనే కాకుండా ఆయన దృష్టిలో తన‍ అవసరాలకు మీరు సరిగా ఉపయోగపడరు అనే భావన కూడా ఉందని పేర్కొన్నారు. కాని కొంత మెత్తపడ్డారని మిమ్మల్నే నియమించవచ్చని చెప్పారు. నవంబర్ వరకూ ఆయన నా పట్ల సుముఖంగా ఉన్నట్లు కనిపించింది. తనకు సన్నిహితంగా ఉన్న ఒక మంత్రితో కూడా ఆయన నా గురించి సానుకూలంగా మాట్లాడినట్లు తెలిసింది. కాని ఏం జరిగిందో కాని ఆయన ఢిల్లీ నుంచి పిలిపించి మరీ పి. కె. మహంతీని ఛీఫ్ సెక్రటరీగా నియమించాలని నిర్ణయించారు. అదే విధంగా పి.కె. మహంతి జనవరి నెలాఖరుకు రాష్ట్ర సర్వీసుకు తిరిగి వచ్చాడు. కాని చివరి క్షణంలో మినీ మాథ్యూ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించారు. ఆ సమయంలో మహంతీని భూ పరిపాలన ఛీఫ్ కమిషనర్ (సిసిఎల్ఏ) గా నియమించారు. 

మినీ మాథ్యూ గారి మూడు నెలల పదవీ పొడిగింపు ముగిసిన తరువాత మే నెల మొదటి రోజు ప్రసన్న కుమార్ మహంతీ ఛీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. దీనితో ఆయన స్థానంలో నేను ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఛీఫ్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించాను. సాధారణ సాంప్రదాయం ప్రకారం లాండ్ అడ్మినిస్ట్రేషన్ ఛీఫ్ కమీషనర్ పదవి నిర్వహించినవారు తదుపరి ఛీఫ్ సెక్రటరీ అవుతారు. 

ఈలోపు తెలంగాణకు సంబంధించి రాజకీయ పరిణామాలు వేగవంతం అయ్యాయి. 2013 జులై 30న సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానం చేసింది. ఆ మరుసటి రోజు నుంచీ రాష్ట్ర విభజనకు సంబంధించి చట్టాన్ని రూపొందించేందుకు పనులు ప్రారంభమయ్యాయి. ఛీఫ్ సెక్రటరీగా ఉన్న మహంతి హైదరాబాద్‌నుంచి, అప్పుడు హోంమంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్న రాజీవ్ శర్మ ఢిల్లీ నుంచి పూర్తి స్థాయిలో విభజన ఘట్టంలో పాలు పంచుకున్నారు. తర్వాత సీనియర్ అధికారుల్లో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ఈ విభజన కార్యక్రమం నుంచి ఛీఫ్ సెక్రటరీ నన్ను దూరం పెట్టారు.. ఆ సమయంలో నేను సిసిఎల్ఏ పదవిలో ఉన్నాను. అందువల్ల నాకు చట్టం గురించి, దాని ముసాయిదా గురించి తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. అనేక పరిణామాలు, వాడి, వేడి వాతావరణంమధ్య 2014 ఫిబ్రవరిలో పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందింది. సరిగ్గా ఆ సమయంలో మహంతీ టర్మ్ పూర్తయి నేను ఛీఫ్ సెక్రటరీ అయ్యేందుకు మళ్లీ అవకాశాలు వచ్చాయి. ఫిబ్రవరిలో 28 రోజులే కనుక బిల్లు ఆమోదం పొందిన ఎనిమిది రోజుల్లో ఆయన పదవీ విరమణ జరుగనున్నది. 

తనకు (extension) పొడిగింపు మీద ఆసక్తి లేదని మార్చి 1న పదవీ విరమణ చేయనున్నానని పికె మహంతీ బహిరంగంగా కూడా ప్రకటించారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు మహంతి పదవీ విరమణ తరువాత నిన్నే ఛీఫ్ సెక్రటరీ చెయ్యాలనుకుని నిర్ణయించారని ముఖ్యమంత్రి కార్యదర్శి అజేయ కల్లాం వచ్చి ఒకసారి కలిస్తే మంచిదని సూచించారు. నేను వెళ్ళి ఫిబ్రవరి 16 ప్రాంతంలో కలిశాను.
‘సార్, నెలాఖరులో మహంతీ పదవీ విరమణ చేయనున్నారు..’ అని గుర్తు చేశాను. 
‘తెలుసు’ అని ఆయన చెప్పారు. తన వద్దే ఉన్నప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ కల్లం వైపు చూసి ‘మనం కృష్ణారావు గారికి ఇప్పుడు ఆర్డర్ ఇద్దామా, తర్వాత ఇద్దామా?’ అని అడిగారు. 
అజయ్ కల్లం నావైపు చూసి.. ‘ఎప్పుడైనా ఇవ్వవచ్చు. మహంతీ నెలాఖరులో వెళుతున్నారు కదా.. అప్పటి వరకూ సమయం ఉంది..’ అని అన్నారు. 
మహంతీ తర్వాత నేను ఛీఫ్ సెక్రటరీ కావడం ఖాయమన్న విషయం అందరికీ తెలిసిపోయింది. 

అజయ్ కల్లం తర్వాత నాకు ఫోన్ చేసి సిఎం నన్ను ఛీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ఆ రోజే ఆర్డర్ ఇద్దామని భావించారని, కాని ఛీఫ్ సెక్రటరీ నెలాఖరులో ఇద్దామన్నారని తెలిపాడు. ఇది జరిగిన మూడు, నాలుగు రోజులలో కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం, గవర్నర్ పాలన మొదలు కావడం జరిగింది. గవర్నర్‌తో నాకు సత్సంబంధాలు ఉన్నందువల్ల ఇక ఛీఫ్ సెక్రటరీ పదవికి ఎలాంటి ఆటంకాలు ఉండవని భావించాను. కేంద్రం రాష్ట్ర గవర్నర్ అభిప్రాయం అడుగుతుందని నాకు తెలుసు. 

ఫిబ్రవరి 28న మహంతికి ఛీఫ్ సెక్రటరీగా చివరి రోజు. ఆయన నాకు బాధ్యతలు అప్పగిస్తారని అందరూ అనుకున్నారు. చివరి వారం కావడంతో మహంతికి వీడ్కోలు విందులు కూడా మొదలయ్యాయి. ఫిబ్రవరి 25న జూబ్లీ హిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో జరిగిన మహంతి వీడ్కోలు విందుకు నేను కూడా హాజరయ్యాను. విందునుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ నుంచి ఫోన్ వచ్చింది. గతంలో ఎప్పుడూ నేను దిగ్విజయ్ సింగ్ ను కలుసుకోలేదు. మరి ఎందుకు చేశారో తెలియదు కాని, ‘మిస్టర్ కృష్ణారావ్, మీరే ఛీఫ్ సెక్రటరీ అవుతున్నారు. కంగ్రాచ్యులేషన్స్’ అని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. 
‘థాంక్స్ సర్’ అని జవాబిచ్చాను. కాంగ్రెస్ అధిష్ఠానం నుంచే ఫోన్ వచ్చిందంటే ఇంకేమని భావించాలి?
కాని కథ అనూహ్యంగా మలుపు తిరిగింది. ఫిబ్రవరి 26న మహంతీ ఢిల్లీ వెళ్లారు. ఎందుకు వెళ్లి ఉంటారో వేరే చెప్పనక్కర్లేదు. ఈ సమయంలో తనను మారిస్తే విభజన ప్రక్రియకు విఘాతం కలుగుతుందని ఆయన వారికి నచ్చచెప్పి ఉంటారు. 

ఫిబ్రవరి 27 శివరాత్రి. నా శ్రేయోభిలాషి, సర్వీసులో నాకు సీనియర్ అయిన ఎం. వి. ఎస్. ప్రసాద్ గారు శంషాబాద్‌లో శారదా చంద్రమౌళీశ్వర దేవాలయానికి ధర్మకర్త. ఆయన ఆహ్వానం మేరకు ఆ రోజు సాయంత్రం నేను దేవాలయానికి వెళ్లాను. అక్కడ కూడా నాకు తెలిసిన వారు కనపడి అభినందనలు తెలిపారు. దేవాలయం నుంచి ఇంటికి తిరిగిరాగానే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ప్రధానమంత్రి కార్యాలయంలో నా బ్యాచ్ మేట్ ఆర్. రామానుజం కార్యదర్శిగా ఉన్నారు. ఆయన తమిళుడైనప్పటికీ మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన అధికారి. 
‘సారీ కృష్ణారావు, నిర్ణయం నీకు వ్యతిరేకంగా జరిగింది. పి. కె. మహంతీకి మూడు నెలలు ఎక్స్‌టెన్షన్ ఇవ్వడానికి నిర్ణయించారు.’ అని ఆయన చల్లగా చెప్పారు. ఆయనేం చెబుతున్నారో ఒక్క క్షణం అర్థం కాలేదు. 
‘అదేమిటి రామానుజం, రేపు ఒక్క రోజే సమయం ఉంది కదా.. మహంతీని కొనసాగించాలన్నా సమయం ఎక్కడుంది?’ అని నేను అడిగాను. 
‘ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. పిఎంఓలో చర్చ జరిగింది. కేబినెట్ సెక్రటరీతో మాట్లాడారు. ఫైల్ రేపు ఉదయానికల్లా రెడీ అవుతుంది’ అని రామానుజం చెప్పారు. 
‘ఓకే దెన్. ఏం చేస్తాం మరి..’ అని జవాబిచ్చాను. 
నాలో ఒక అంతర్గత లక్షణం ఉన్నది. నా మనస్సు గాయపడితే ఊరికే ఉండిపోయే మనస్తత్వం నాకు లేదు. చివరి వరకూ వచ్చి ఛీఫ్ సెక్రటరీ పదవి చేజారిపోవడం నాకు భావోద్వేగాన్ని కలుగజేసింది. వెంటనే ఫోన్ చేసి గవర్నర్‌గారి అపాయింట్‌మెంటు అడిగాను. ఫిబ్రవరి 28 ఉదయం నేను గవర్నర్ నరసింహన్‌ను కలిశాను. 
ఆయన నన్ను చూడగానే ఏదో తప్పు జరిగిందన్న భావనతో కనిపించారు. 
‘ఏం సార్ ఇలా జరిగింది..’ అని అడిగాను. 
‘దీన్ని మనసుమీద తీసుకోకండి కృష్ణారావు గారూ.. ఇవాళ కాకపోతే రేపు ఛీఫ్ సెక్రటరీ అవుతారు..’ అని ఆయన నాకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. 
నేనేమీ మాట్లాడకుండా తిరిగి వచ్చాను. 

(ఫిబ్రవరి 26న ఢిల్లీలో మహంతి అంతర్గత భద్రత కార్యదర్శిని కలిసి ఛీఫ్ సెక్రటరీగా కొనసాగేందుకు తన అభీష్టాన్ని వ్యక్తం చేశారు. తదనుగుణంగా గవర్నర్ ఫిబ్రవరి 27న తన ఆమోదాన్ని తెలిపారు. దీనితో ఫిబ్రవరి 28 మధ్యాహ్నం 2 గంటలకు సిబ్బంది, శిక్షణ శాఖ మంత్రి వి. నారాయణ స్వామి ఫైల్ క్లియర్ చేయడం, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సాయంత్రం 4. 30కి ఫైల్ పై సంతకం పెట్టడం, ఈ విషయాన్ని సాయంత్రం 5. 30కి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. మహంతీ పదవీ కాలాన్ని నాలుగునెలల పాటు పొడిగిస్తూ ఆర్డర్ ను రాత్రి 10. 45కు జారీ చేశారు. మహంతీ ఛీఫ్ సెక్రటరీగా మర్నాటి నుంచీ మళ్లీ బాధ్యతలు స్వీకరించారు.)
ఏమైనప్పటికీ నాకు ఈ పదవి ఇచ్చే విషయంలో జరిగిన అవమానం మింగుడుపడలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో నిరసన తెలుపుతూ లేఖ రాసి పది రోజులు సెలవులో వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపాను. మహంతీ పదవీ కాలం పొడిగింపుకు కేంద్రం తెలిపిన కారణాలు అఖిల భారత సర్వీసుకే అవమానకరమని నేను ఈ లేఖలో తెలిపాను. 

‘ఒక అధికారి పదవీకాలాన్ని పొడిగించాలంటే ఆ అధికారి అసాధారణ ప్రతిభ గలవాడై ఉండాలి. అదే సమయంలో ఆయన స్థానంలో అర్హుడైన వ్యక్తి లభించకపోయే పరిస్థితి ఏర్పడాలి. అని రూల్సు చెపుతున్నాయి. కాని ప్రస్తుత నిర్ణయానికి ఈ రెండు కారణాలూ కనపడడం లేదు.’ అని లేఖలో చెప్పాను. మళ్లీ పదవి చేపట్టిన మహంతీకే ఈ లేఖను సంధించాను. ఉమేశ్‌కుమార్‌కూ, దినేశ్ రెడ్డికి మధ్య కొనసాగుతున్న కేసులో మహంతీ నిర్వహించిన పాత్ర గురించి సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానాలు చేసిన విషయాన్ని కూడా నేను ఈ లేఖలో ప్రస్తావించాను. రాష్ట్ర విభజనకు చెందిన విషయాలను రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాకుండా ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తి సమర్థంగా పరిష్కరిస్తారనుకోవడం ఆల్ ఇండియా సర్వీసులకే అవమానకరమని నేను లేఖలో వ్యాఖ్యానించాను. 
మహంతీ పదవీ కాలాన్ని పొడిగించడంపై రాష్ట్ర హైకోర్టులో కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలు అయింది

.చంద్రమౌళీశ్వర్ రావు, దివాకర్ బాబు అనే ఇద్దరు వ్యక్తులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కొత్త ఛీఫ్ సెక్రటరీ నియామకం విషయంలో తన నిస్సహాయత వ్యక్తం చేసినందువల్ల గవర్నర్ జోక్యం కోరామని, ఆయన ప్రస్తుత ఛీఫ్ సెక్రటరీ పదవీ కాలాన్ని పొడిగించాలని నిర్ణయించారని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. విభజన క్రమం కొనసాగుతున్నందువల్ల ప్రస్తుత ఛీఫ్ సెక్రటరీ పదవీ విరమణ చేస్తే గందరగోళం తలెత్తుతుందని వాదించింది. చివరకు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టి వేసింది. 

ఈ లోపల ఎన్నికలు జరిగాయి. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చారు. నాకు ఛీఫ్ సెక్రటరీగా బహుశా అవకాశం ఇక రాదేమో అనిపించింది. ఆయన అస్మదీయులకు అందలమిస్తారు కాని నాకు ఛీఫ్ సెక్రటరీ పదవి ఇస్తారా అనుకున్నాను. రమేశ్‌కుమార్ గవర్నర్ దగ్గర ప్రత్యేక ఛీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన కూడా ఛీఫ్ సెక్రటరీ కావడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని కొందరు మిత్రులు తెలిపారు. చంద్రబాబునాయుడు తమ సామాజిక వర్గానికి ఛీఫ్ సెక్రటరీ పదవి ఇవ్వాలా లేక డీజీపీ పదవి ఇవ్వాలా అన్న విషయంపై తెలుగుదేశంలో అంతర్గత చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. అదే సమయంలో ఆయన వర్గానికి చెందిన ఆపరేషన్స్ వింగ్ డీజీపీ జాస్తి వెంకట రాముడు డీజీపీ కావాలన్న ఆసక్తితో ఉన్నారు. చివరకు అంతర్గత తర్జన భర్జనలు జరిగిన తర్వాత ఛీఫ్ సెక్రటరీగా తమ సామాజిక వర్గానికి చెందని అధికారిని, డీజీపీగా తమ సామాజిక వర్గానికి చెందిన అధికారిని నియమించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అప్పుడు నా పేరు మళ్లీ ముందుకు వచ్చింది. అదే సమయంలో ఐ. వి. సుబ్బారావు కూడా ఛీఫ్ సెక్రటరీ పదవి ఆశించారు. ఆయన కూడా చంద్రబాబుకు ఫోన్ చేశారు. 

జెవి రాముడు నాకు మంచి స్నేహితుడు. ఆయన నేను ఛీఫ్ సెక్రటరీగా ఉంటేనే బాగుంటుందని కాబోయే సిఎంకు చెప్పారు. జెవి రాముడు పదవీ కాలం మరో రెండునెలలు మాత్రమే ఉన్నది. ఆయన పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన రీత్యా చేయాల్సిన బృహత్తర కర్తవ్యాలు ఎన్నో ఉన్నాయి. మేమిద్దరమూ మంచి స్నేహితులం కనుక పరిపాలన సవ్యంగా, సమర్థంగా సాగుతుందని చంద్రబాబు భావించి ఉండవచ్చు. నేను సమర్థ అధికారినన్న అభిప్రాయం కూడా ఆయనకు ఏర్పడి ఉండవచ్చు. చివరకు ఒక రోజు చంద్రబాబు సలహాదారు ఎం. సాంబశివరావు సిసిఎల్‌ఏ కార్యాలయంలో ఉన్న నాకు ఫోన్ చేశారు. ‘మిమ్మల్ని ఛీఫ్ సెక్రటరీగా నియమించాలని చంద్రబాబు గారు నిర్ణయించారు.. వచ్చి సిఎంను కలుసుకోండి.’ అని చెప్పారు. 
జూన్ 1 న మహంతి పదవీ కాలం ముగిసింది. జూన్ 1న ఉమ్మడి రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీగా ఆయన నుంచి పదవీ బాధ్యతలు చేపట్టాను. జూన్ 2న నేను ఆంధ్రప్రదేశ్ డిజిగ్నేటెడ్ సిఎస్ హోదాలో పనులు మొదలు పెట్టాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు జూన్ 7 వరకూ ప్రమాణ స్వీకారం చేయలేదు. 

గవర్నర్ గారి పాలనలో విభజనకు అవసరమైన సన్నాహక పనులెన్నో జరిగాయి. ఫైళ్లను వేర్వేరు చేశారు. పెద్ద ఎత్తున వాటిని కాపీ చేయించి ఇరు రాష్ట్రాలకు ప్రతులను అంద జేశారు. గవర్నర్ నిర్వహించాల్సిన పాత్రను నిర్దేశించారు. గవర్నర్‌కు ఇద్దరు సలహాదారులను నియమించారు. తాత్కాలింగా సిబ్బంది విభజన జరిగింది. ట్రాన్స్ కో, జెన్ కో ను కూడా విభజించారు. సచివాలయాన్ని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మధ్య విభజించారు. ఉద్యోగుల విభజన ప్రారంభమైంది. తాత్కాలిక ప్రాతిపదికగా రెండు సెక్రటేరియట్‌లలో ఉద్యోగులను విభజించారు. హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్‌లు పనిచేయడం మొదలు పెట్టారు. 

ఐఏఎస్ అధికారుల విభజన ప్రారంభమైంది. ఐఏఎస్, అఖిల భారత సర్వీసు అధికారుల విభజన విషయంలో ప్రత్యూష్ సిన్హా నేతృత్వంలో తగ్గ విధానాల రూప కల్పన కూడా పూర్తయింది. షెడ్యూల్డు 10, 11 సంస్థల విభజన ఇంకా ప్రారంభం కాలేదు. కాని షెడ్యూలు 9 క్రింద ఉన్న సంస్థల ఆస్తులు, అప్పుల విభజనకు షీలా భిడే నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. షెడ్యూల్డు 10 సంస్థలకు అలాంటి విధానాన్ని దేన్నీ అనుసరించలేదు. ఉద్యోగుల విభజనను శాశ్వత ప్రాతిపదికన జరిపేందుకు కమలనాథన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. విభజనకు ముందు జరిగిన వీటన్నింటిలో నాకే పాత్రా లేదు. 

జూన్ 1 మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ఛీఫ్ సెక్రటరీగా నేను బాధ్యతలు స్వీకరిస్తే జూన్ 2 ఉదయం రాజీవ్ శర్మ తెలంగాణ ఛీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. విభజనకు సంబంధించిన అంశాలపై ఇక్కడ ఏ పరిజ్ఞానం, అనుభవం లేని నేను, అక్కడ పూర్తి పరిజ్ఞానం, అనుభవం ఉన్న రాజీవ్ శర్మ ఉన్నారు. ఇందుకు కారణం రాజీవ్ శర్మ కేంద్ర హోంశాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్నారు. విభజన బిల్లును ఆయనే రచించారు. చట్టంలోని అన్ని సెక్షన్ల గురించి ఆయనకు తెలుసు. అంతేకాక రాష్ట్రానికి చెందిన ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను రెండు రాష్ట్రాల మధ్య విభజించేందుకు ఏర్పడిన ప్రత్యూష్ సిన్హా కమిటీలో ఆయన భారత ప్రభుత్వం సభ్యుడుగా ఉన్నారు. విభజన క్రమంలో ఆయన పూర్తి స్థాయిలో పాత్ర పోషిస్తున్నారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ అధికారి గా ఉన్నా నన్ను విభజన ప్రక్రియకు దూరంగా ఉంచారు. అంతా కొత్తగా ఉన్నది. తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కొత్త బాధ్యతలకు నన్ను సన్నద్ధం చేయాల్సి ఉన్నదని తెలిసినా మహంతి పట్టించుకోలేదు. 
నేను ఛీఫ్ సెక్రటరీ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొదటి ఆరునెలలు విభజనకు సంబంధించిన అనేక అంశాలను పరిశీలించడం, విశ్లేషించడం తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలతో వాటిపై పోరాడడంతోనే సరిపోయింది. 
మొదటివారం అంతా మేము రాష్ట్ర కాబినేట్ ప్రమాణస్వీకారానికి కావలసిన ఏర్పాట్లు చేయడంలో తలమునకలైనాము. నాగార్జున విశ్వవిద్యాలయానికి ముందున్న సువిశాల ప్రాంగణాన్ని ఈ మహోత్సవం జరపడానికి స్థలంగా నిర్ణయించాము.

ఏర్పాట్లు పెద్దపెట్టున చేశాము. చాలా జనవాహిని వస్తారని అంచనా వేశాము. ముఖ్యమంత్రిగారు స్వయంగా ఫోను చేసి చాలమందిని ఆహ్వానించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితగారికి ఫోన్ చేస్తే ఆమె ఎత్తలేదు. అది వేరే విషయం. జూన్ 7న ప్రమాణ స్వీకారం సాయంత్రం ముహూర్తం నిర్ణయింపబడింది.
నాకు తెలిసిన కొందరు మీరు టిటిడి కార్యనిర్వహణాధికారిగా వున్న సమయంలో చక్కగా లాల్చీ పంచా ధరించేవారు. ఆ వస్త్ర ధారణ మీకు నప్పింది. ప్రమాణ స్వీకార సమయంలో కూడా ఆ వస్త్రధారణతో రండి బాగుంటుందని సలహా యిచ్చారు. నాకు నచ్చి పాటిద్దామని అనుకున్నాను. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతం ముఖ్యమంత్రిగారు వచ్చి అక్కడనే ఉన్న లింగంపల్లి ఎస్టేటులో విడిది చేశారు. 

నాలుగు గంటల ప్రాంతంలో లాల్చీపంచె ధరించి వారి దగ్గరకు వెళ్ళాను. వారు నన్ను ఎగాదిగా చూచారు. నేను ఈ వస్త్రధారణ నూతనంగా ఉంటుందని వేశానన్నాను. వారు నా సమస్య అది కాదు. మీరు ఆ డ్రెస్‌లో ఉండి నేను ఫాంటు షర్ట్‌లో ఉంటే చూచే జనాలు మిమ్మల్ని నేను పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నాననుకుంటారని అన్నారు.

ప్రమాణస్వీకార సమయానికి ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు, ఇతరులు చాలామంది వచ్చారు. కొంత కట్టడి చెయ్యడం సమస్య అయింది. జనసందోహంలో కొందరు వి.ఐ.పి.లు చిక్కుకున్నారు. మొత్తంమీద ప్రమాణ స్వీకారం కొంత రసాభాసగా ముగిసింది.

Comments

Popular posts from this blog

Whose Capital Amaravathi - Introduction

Urban centres as growth engines