Navyandhra tho na nadaka (Telugu)

నవ్యాంధ్ర తో నా నడక 


ప్రజలు కోరుకునేది
- ఎం. గోపాలకృష్ణ
మాజీ ప్రత్యేక కార్యదర్శి, ఆం.ప్ర. ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర, ప్రభుత్వ పాలనకు సంబంధించి ప్రస్తుతం ఉన్న రచనలకు అదనంగా ఇవ్వాళ అత్యవసరమైన మరింత సమాచారాన్ని ఈ పుస్తకం అందిస్తుంది. ఆంధ్రరాష్ట్రం భారతదేశంలో భాషాప్రాతిపదికన  ఏర్పడిన తొలి రాష్ట్రం. 1953 అక్టోబర్ 1న కర్నూలు తాత్కాలిక రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. తరువాత మరెన్నో భాషాప్రయుక్తరాష్ట్రాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం భాషను ప్రజల ఐక్యతకు ప్రాథమికమైన ఆధారంగా చూడడమే దీనికి కారణం. అయితే స్థానికమైన రాజకీయ సంస్కృతిక ఆకాంక్షలను, సామాజిక ఆర్థిక అవసరాలను తీర్చడంలో విఫలమైనప్పుడు అదే ఒక విభాజికశక్తిగా రూపొందింది. ఆంధ్రరాష్ట్రం కర్నూలు నుండి 1956 లో హైదరాబాదుకు రాజధాని మారే క్రమంలో గొప్ప మార్పు పొందింది. హైదరాబాదు తెలుగు మాట్లాడే ప్రజల విశాలాంధ్ర, ఆంధ్రప్రదేశ్ అనే ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా రూపుదిద్దుకుంది. 2014 లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అది మళ్లీ మిగిలిపోయిన పాత ఆంధ్రరాష్ట్రం అయిపోయింది (పేరు మాత్రం ఆంధ్రప్రదేశ్). 

ఈ గ్రంథ రచయిత శ్రీ ఐవైఆర్. కృష్ణారావు 1979 బాచ్‌కు చెందిన ఐ.ఏ.ఎస్. అధికారి. విభజన అనంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన కీలకమైన ఈ పునర్వవస్థీకరణ కాలంలో పనిచేశారు. జనవరి 2016 లో పదవీ విరమణ చేశారు. ఐవైఆర్ అనేక ఉన్నతపదవులను నిర్వహించారు. తన నిజాయితీకీ, సమగ్రతకూ నేలవిడచి సాముచేయని దృష్టికోణానికీ ప్రసిద్ధుడు. అంతేకాక నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తి. 

ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు పునర్వవస్థీకరణ కార్యక్రమంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. విభజన సమయంలో జరిగిన ఎన్నో విషయాలకూ, ఒత్తిడులకూ, ప్రయత్నాలకూ ఆయన సాక్షి. కృష్ణారావుగారు మార్చి 2018 లో ‘అమరావతి ఎవరి రాజధాని?’ అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని ఫౌండేషన్ ఫర్ సోషల్ అవేర్‌నెస్ సంస్థ ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా రాజధానీ నగర ఎంపికలో అవలంబించిన పద్ధతులనూ, సైద్ధాంతిక నేపథ్యాన్నీ ఆయన ఈ పుస్తకంలో విహంగవీక్షణం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఎంపిక, దాన్ని ఒక అద్భుతమహానగరంగా నిర్మించే ప్రణాళిక భారతప్రభుత్వం ఏర్పరచిన శ్రీ శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులకు వ్యతిరేకమే కాకుండా, ఈ ఎంపిక వల్ల ప్రభావితులైన వ్యక్తుల అంగీకారాన్ని సంపాదించే విషయంలో ప్రభుత్వం అవలంబించిన సూత్రాలు, ఆచరణలు కూడా తప్పు దారి తొక్కినవే.

కృష్ణారావుగారు రాజధాని స్థలంకోసం ప్రభుత్వభూమి విస్తారంగా అందుబాటులో ఉన్న దొణకొండను సూచించారు. ప్రభుత్వం దాన్నికూడా అంగీకరించలేదు. అనేక లోపాలు, సందేహాలు ఉన్నప్పటికీ అమరావతిని ఎంపిక చేసుకోవడం ఒక వివాదాస్పద అంశమైంది. దీనికి ఒక కారణం రాజధానీ నిర్మాణానికి కావలసిన విస్తృతమైన నిధుల సమస్య. రెండవది పర్యావరణ సమస్యలు.  అత్యవసరంగా దృష్టిసారించాల్సిన సామాజిక ఆర్థిక సమస్యలెన్నో ఉన్నందువల్ల ఈ విషయం ప్రజల్లో ప్రాధాన్యతను సంతరించుకుని చర్చనీయాంశమైంది. అందువల్ల సమస్యలు, వాటి పరిష్కారాలు, సంఘటనలు, చర్చనీయాంశాలు మరొక్కసారి చర్చించుకోవలసిన అవసరముంది. అంగీకారయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనవల్సి ఉంది. 

ఆయన ప్రధానకార్యదర్శి ఎలా అయిందీ? ఐఎఎస్ అధికారులు, ఉమ్మడి సంస్థలు, ఉద్యోగులను రెండు రాష్ట్రాల మధ్య విభజించే సమయంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలేమిటి? అన్న విషయం ఈ పుస్తకంలో వివరంగా ఉంది. విద్యుత్ పంపిణీ విషయంలోనూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలోనూ తలెత్తిన సవాళ్లను కూడా ఈ పుస్తకం పేర్కొన్నది. జరగకూడని ఎన్నో సంఘటనలను జరగకుండా నిరోధించే అవకాశం ఉండింది.

ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాదులో పదేళ్ల వరకూ ఉండడానికీ, సెక్షన్ 8 కింద అవకాశం ఉన్నప్పటికీ ఆంధ్రప్రాంతం నుండి వచ్చి హైదరాబాదులో స్థిరపడిన వారి రక్షణకి ఇది ఏర్పాటు కలిగించినప్పటికీ ఉమ్మడి గవర్నరుకు ఒక ప్రత్యేక పాత్రను ఇచ్చినప్పటికీ ఆకస్మికంగా ఆంధ్రప్రదేశ్ అధికారులను, ఉద్యోగులను సరైన ఎటువంటి ఏర్పాట్లూ లేకుండానే హైదరాబాదు నుండి విజయవాడకు మార్చడం సంబంధిత, ప్రభావిత వ్యక్తులందరి విమర్శకు గురయింది. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ‘ఓటుకు నోటు’ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సందేహాస్పద పాత్ర విషయంలో మీడియా రిపోర్టుల ప్రభావం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తొందరపడి విజయవాడకు మారడానికి కొంత కారణమై ఉంటుందని ఆయన ఊహించారు.

రాజనీతిజ్ఞత, మిత్రత్వం ప్రధానమైన అవసరంగా ఉన్న సమయంలో రెండు రాష్ట్రాల మధ్యా రాజకీయ, సామాజిక, సంస్కృతిక, పాలనాపర సత్సంబంధాలు లేకపోవడం విషయాలను మరింత సంక్లిష్టం చేసింది. అనేక సమస్యలను పరస్పర విశ్వాసంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో రెండు రాష్ట్రాలూ తేలికగా పరిష్కరించుకోగలిగేవి. ఉభయ రాష్ట్రాలకూ ఐఎఎస్ అధికారుల ఉమ్మడి కేడర్ కొన్ని సంవత్సరాలపాటు కొనసాగి ఉంటే అనేక సమస్యలు ఉభయులకీ అంగీకారయోగ్యంగా పరిష్కారమై ఉండేవి. 

ముఖ్యమంత్రికీ, ప్రధానకార్యదర్శికీ మధ్య తగినంత విశ్వాసమూ, పారదర్శకతా, సత్సంబంధం కొరవడినందుకు రచయిత బాధ పడ్డాడు. ‘అంతా నాకు తెలుసు’, ‘మా వాళ్లు నాకు చెప్పారులే’ వంటి ముఖ్యమంత్రి ధోరణి రచయిత దూరమవడానికీ, మూగబోవడానికీ కారణమయినట్లు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు అందితే జుట్టు, అందకపోతే కాళ్లూ పట్టుకునే ధోరణిని, ఎంతకైనా దిగజారే ధోరణిని కూడా ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అయుత చండీ యాగానికి తనను ఆహ్వానించిన తెలంగాణ ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖామంత్రి తగిన మర్యాద చూపించిన సన్నివేశాన్ని ఇక్కడ ఆయన పోలికగా ఉదహరించారు.

ఇటీవలి కాలంలో ప్రధాన కార్యదర్శి కార్యాలయం, సివిల్ సర్వీసుల అధ్యక్షుడుగా కేబినెట్ సెక్రటరీ కార్యాలయం రాజకీయ అధికార వర్గానికి రాష్ట్ర/దేశ సంబంధమైన అన్ని విషయాలలో సలహాలిచ్చే అధికారం తగ్గిపోయింది. ఆధికారికంగా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ), ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) పలుకుబడి అధికమైపోతూ ఉంది.

2014 జూన్‌లో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకార సమయంలో ప్రధాన కార్యదర్శి తనకు నిర్దేశించిన అధికార దుస్తులను కాక, సాంప్రదాయిక ఆంధ్ర వస్త్రాలైన ధోవతి, లాల్చీ అంగవస్త్రం ధరించాడు. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారన్న విషయంలో ఫొటోలు సందేహం కలిగించవచ్చునని వ్యాఖ్యానించారట.

అక్టోబర్ 2014 లో విశాఖపట్నం నగరానికి విస్తృతమైన నష్టం కలిగించిన హుద్‌హుద్ తుపాను విధ్వంసానికి మొత్తం రాష్ట్ర అధికార యంత్రాంగం ముఖ్యంగా జిల్లా అధికార యంత్రాంగం అద్భుతంగా ప్రతిస్పందించిన తీరును, వారి అసాధారణ కృషిని ఈ పుస్తకం కీర్తించింది. పౌరులు అప్పటికప్పుడు స్పందించి ఇచ్చిన సహాయసహకారాలు, భారతప్రభుత్వం చేసిన సహాయం నిజంగా చెప్పుకోదగినవి.

లాండ్ ఎడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమీషనర్‌గా ఉన్న కాలంలో అత్యంత విలువ కలిగిన నగరభూముల కేసుల్ని తాను నిర్వహించిన సందర్భంలో ఎదుర్కొన్న కొన్ని అరుచికరమైన సన్నివేశాలను కూడా రచయిత ఈ పుస్తకంలో వివరించారు. రాజకీయ నాయకులు భూమాఫియాతో కుమ్మక్కై విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని లాభం పొందిన సందర్భాలివి. 
రచయిత బిసి నాయకుడు కంచ ఐలయ్యకు సంబంధించిన ఉదంతాన్ని పదవి చివరి రెండు నెలలలో ఎదుర్కొన్న సమస్యలను  ఈ పుస్తకం రాశారు. 

పదవీ విరమణ చేసిన తరువాత కృష్ణారావుగారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. ఆయన సమస్యలను గుర్తించడానికి ప్రయత్నించారు. సమాజంలోని పేదవర్గాలు ఎదుర్కొంటున్న సామాజిక ఆర్థిక సమస్యలకూ, ఉద్యోగావకాశాల లేమి సమస్యకూ పరిష్కారాలు కనుగొనడానికి ప్రయత్నించారు. పేదల సంక్షేమం కోసం ఒక సహకార సంస్థను నెలకొల్పడంతో సహా వివిధ మార్గాలు అన్వేషించారు. 2007 లో ఆలయ అర్చకులకు సంబంధించి ఆమోదింపబడిన చట్టం విషయంలో చట్టం ఆమోదింపబడినప్పటికీ నియమాలు ఏర్పరచకపోవడం, వాటిని నోటిఫై చేయకపోవడం, అర్చకులు నైతికస్థైర్యం కోల్పోవడానికి ఎలా కారణమైందో వివరిస్తూ అందుకు ఆయన విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల సహాయసహకారాలు, ప్రోత్సాహంతో ప్రత్యర్థి బ్రాహ్మణ నాయకుల కుట్రల వల్ల తనను చైర్మన్ పదవి నుండి ఎలా బయటికి పంపించారో ఆయన వివరించారు. 

స్వార్థప్రయోజనాలు కలిగిన వ్యక్తుల కారణంగా పరిపాలనా వ్యవస్థలో విభిన్న అంతరవులు, ప్రక్రియలు పాడైపోయాయో సివిల్ సర్వెంట్ల పాత్ర ఏ విధంగా రాజకీయ నాయకులు, వారికి సనినహితంగా ఉన్నవారి చేత అణగదొక్కబడి కుంచించుకుపోయిందో ఈ పుస్తకం వివరిస్తుంది.  అభివృద్ధి దిశను గురించి కుల, మత శక్తులు ఎలా బలపడుతున్నదీ, అవి లక్ష్యాన్నీ, ప్రక్రియనీ, ప్రజలను కూడా తప్పు త్రోవ పట్టించి, సామాజిక ఆర్థిక న్యాయాన్నీ, అభివృద్ధినీ ప్రభావితం చేస్తున్నాయో దానిగురించీ ఈ పుస్తకం అనేక సముచితమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఈ పుస్తక రచనలో పాటించిన క్లుప్తతకు, స్పష్టతకూ పరిగెత్తే కథనశైలికీ రచయితను మనం అభినందించాలి.

ఈ గ్రంథం చాలా సూటిగానూ, స్పష్టంగానూ మాట్లాడుతుంది. విభజనానంతర ఆంధ్రప్రదేశ్ గతంలో ఎన్నో మార్పులు పొందింది. ఇప్పుడు పునర్జననం పొందింది. ఈ రాష్ట్రం అనుభవించిన వేదనలు, కష్టాలు తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఒక మంచి సాధనం.  సివిల్ సర్వెంట్లందరూ, మేనేజ్‌మెంట్ విద్యార్థులు, రాజకీయనాయకులు, అకడమీషియన్లు, సంఘ సేవకులు సమాజంలోని సరిగ్గా ఆలోచించే ప్రజలందరూ ఈ పుస్తకాన్ని చదవాలి. ప్రతి గ్రంథాలయంలోనూ ఈ పుస్తకం స్థానం సంపాదించుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ నిరంతర సామాజిక, ఆర్థిక పరిణామం, దాని ఉన్నత, వేగమంతమైన, దృఢమైన, మెరుగైన భవిష్యత్తుకు కీలకం. ఉత్తమ పరిపాలన మాత్రమే సంపద్వంతమైన, పురోగమనశీలమైన సూర్యోదయ రాష్ట్రానికి పునాది వేయగలుగుతుంది. దీనికి నిజమైన భాగస్వామ్య, ప్రజాస్వామ్యం కావాలి. ప్రజలయొక్క, ప్రజల చేత, ప్రజలకోసం ప్రజాస్వామ్యమనే నిర్వచనానికి లక్ష్యంగా నిలవాలి.

జనం కోరుకునేదేమంటే, “జీవితంలో కాస్త దుఃఖం తగ్గాలి, కాస్త ఆనందం పెరగాలి”.

Comments

Popular posts from this blog

Whose Capital Amaravathi - Introduction

Urban centres as growth engines