Navyandhra tho na nadaka Hud-hud Cyclone

టెలికమ్యూనికేషన్లను పునరుద్ధరించే విషయంలో ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్‌ను పబ్లిక్‌గా తిట్టి టీవీలో పబ్లిసిటీ పొందారు -"నవ్యాంధ్ర తో న నడక" 

6. హుద్ హుద్‌లో తల మునకలు

రాష్ట్ర విభజన జరిగి నాలుగు నెలలు కాలేదు, హుద్ హుద్ తుఫాను విశాఖను తాకి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. అక్టోబర్ 8న తుఫాను వచ్చే సూచనలు కనిపించాయి. అప్పటికి హైదరాబాద్‌లో సెక్రటేరియట్‌లో నేను కొత్త బ్లాకులోకి షిఫ్టు కాలేదు. నేను చిన్నగదిలో పనిచేస్తున్నప్పుడే తుఫాను సమాచారం లభించింది. అండమాన్ వద్ద అల్పపీడనం పెను తుఫాను గాలిగా మారి అక్టోబర్ 12 నాటికి తీవ్రతరమై, కాకినాడ గోపాలపట్నం మధ్య తీరం దాటుతుందని తెలిసింది. ఆ విషయం నేను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చెప్పాను. సరే, లెటజ్ ప్రిపేర్ అని ఆయన అన్నారు. ఆ రోజు మధ్యాహ్నమే హుద్ హుద్ తుఫానుకు సంసిద్ధతపై దాదాపు అన్ని విభాగాల అధిపతులతో సమావేశం ఏర్పాటు చేశాను. డీజీపి, అదనపు డీజీపీలు, ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ కమాండెంట్ తదితరులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. 24గంటల పాటు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని, ఫీల్డ్ ఆఫీసర్లను రంగంలోకి దించాలని, సెలవుల్లో ఉన్న అధికారులను వెనక్కు రప్పించాలని, తుఫాను, వరదలకు గురయ్యే ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఇతర బలగాలను నియమించాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వివిధ విభాగాల అధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. ఒక్కరి ప్రాణనష్టం జరగకుండా చూడడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించాము.

విపత్తు రాకముందే వృద్ధులు, అంగవికలురు, మహిళలు, పిల్లలు మొదలైన వారిని తరలించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పాము. అన్ని తుఫాను, వరద పునరావాస కేంద్రాలను తనిఖీ చేసి అక్కడ అన్ని ఉపకరణాలు, ఆహారం, నీరు తదితర సరుకులు లభ్యమయ్యేలా చూశాము. పునరావాస కేంద్రాలుగా మార్చేందుకు వీలైన ఇతర భవనాలను గుర్తించాము. అన్ని ఆనకట్టల వద్ద నీటి స్థాయిని, నదుల పరిస్థితిని నిరంతరం తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశాము. ఎస్ సి, ఎస్టీలకు చెందిన అన్ని ఆశ్రమ పాఠశాలలకు చెందిన హాస్టళ్లలో తగిన ఆహారం లభ్యమయ్యేలా చూడాలని కలెక్టర్లను కోరాము. తుఫానుకు గురైన ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు ట్యాంకర్లలో నీటిసరఫరా చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాము. పశువులకు కూడా తగిన పశుగ్రాసం లభించేలా చూశాము. తుఫాను వల్ల విద్యుత్ సరఫరా దెబ్బతినే ప్రమాదం ఉన్నందువల్ల ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యామ్నాయ విద్యుత్ లభించేందుకు ఏర్పాట్లు చేసుకొమ్మని చెప్పాము. మత్స్యకారులకు తగిన హెచ్చరికలు జారీ చేశాము. ప్రజల ఆస్తుల దోపిడీ కాకుండా, పెట్రోల్, డీజిల్ వంటివి బ్లాక్ లో అమ్మకుండా తగిన చర్యల్ని తీసుకొమ్మని పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాము. ప్రజలకు తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా, భయోత్పాతాన్ని కలిగించకుండా తగిన చర్యల్ని తీసుకున్నాము. మొత్తం మీద 5 కోస్తా జిల్లాల్లో లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాము. 64 మండలాల్లో 436 గ్రామాలు తుఫానుకు గురవుతాయని గుర్తించాము. దాదాపు 370 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశాము.

అప్పుడు విపత్తు యాజమాన్య కమిషనర్‌గా ఉన్న అధికారి ముస్సోరికి ఆరువారాల కోసం శిక్షణకు వెళ్లడంతో ఆయన స్థానంలో వెంటనే ఎ.ఆర్. సుకుమార్ అనే అధికారిని నియమించాము. జాయింట్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ ను సహాయ పునరావాస కార్యక్రమాలను ప్రర్యవేక్షించేందుకు ప్రత్యేక విధుల అధికారి హోదాలో విశాఖపట్టణం పంపించాము. జిల్లాల్లో 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. విశాఖలో సైనిక బలగాలను సిద్ధంగా ఉంచారు. తూర్పు నావల్ కమాండ్ కూడా నాలుగు ఓడలను సహాయానికి సిద్ధంగా ఉంచారు. 
గతంలో జరిగిన ప్రకృతి వైపరీత్యాల సమయంలో లేని సౌలభ్యం ఈ సారి అందుబాటులోకి రావడం నేను గమనించిన ఒక మంచి పరిణామం. వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థ ఏర్పడడం వల్ల కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ ప్రతిరోజూ సమీక్షించేందుకు ఆస్కారం కలిగింది. ఢిల్లీలో సంబంధిత అధికారులతో, ఆర్మీ, హోంమంత్రిత్వ శాఖ అధికారులతో మేము ఇక్కడ ప్రతి రోజూ సమావేశమయ్యే వారం. ఎలెక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా నిలదొక్కు కోవడంతో ఎక్కడా సమాచారం చేరుకోవడంలోనూ, చర్యలు తీసుకోవడంలోనూ ఆలస్యం జరగలేదు. ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లు సకాలంలో చేరుకున్నాయి. 

పరిస్థితిని తనకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ‘క్రౌడ్ సోర్సింగ్(Crowd Sourcing) చేస్తున్నాం, ఆండ్రాయిడ్ ఫోన్లలో సమాచారం పంపండి..’ అంటూ హడావిడి చేశారు. టెలికమ్యూనికేషన్లను పునరుద్ధరించే విషయంలో ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్‌ను పబ్లిక్‌గా తిట్టి టీవీలో పబ్లిసిటీ పొందారు. విపత్తులను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ప్రచారమాధ్యమాలను సమాయత్త పరచడం తను జరిపే ప్రతి మీటింగు లైవ్ లో టెలికాస్ట్ అయ్యేట్టు చూడడము దీనిలో భాగాలు.

ఏమైనప్పటికీ తుఫానును ఎదుర్కొనేందుకు యుద్ధ ప్రాతిపదికన సిద్ధమయ్యాం. తుఫాను సరిగ్గా విశాఖపై కేంద్రీకృతమై తీరం దాటింది. ఆ విషయం కూడా వెంటనే తెలియలేదు. ఎందుకంటే తుఫాను గాలికి రాడార్లు కూడా పడిపోయాయి. ‘నేను సాయంత్రమే విశాఖ పట్టణం వెళతాను. మీరిక్కడే ఉండి జరుగుతున్నదాన్ని పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకోండి..’ అని చంద్రబాబు చెప్పారు. తుఫాను తీవ్రత రీత్యా ఆ రోజు విశాఖకు చేరలేనని సిఎంకు తెలుసు. కాని తాను జనం మధ్య ఉంటానన్న సంకేతాలు ఆయన పంపించదలుచుకున్నారు. ఆ రోజు ఆయన రాజమండ్రి చేరుకోగలిగారు. తర్వాత రోజు విశాఖ పట్టణం వెళ్లారు. ఇలాంటి తుఫాను వచ్చినప్పుడు 24 గంటలు పనిచేసే నిబద్ధత గల అధికార యంత్రాంగం అవసరం. ఆ కీలక సమయంలో నేను పూర్తిగా ఆఫీసులోనే
ఉండిపోయాను. 

హుద్ హుద్ తుఫాను సమయంలో అద్భుతంగా పనిచేసిన అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ విశాఖ పట్టణం జిల్లా కలెక్టర్ యువరాజ్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్, కృష్ణా జిల్లా కలెక్టర్ రఘునందన్ అంతా బాగా పనిచేశారు. పశ్చిమబెంగాల్ ఛీఫ్ సెక్రటరీ తో మాట్లాడి చెక్ పోస్టులో సమస్యలు లేకుండా బంగాళా దుంపలు తెప్పించాం. ఉల్లి గడ్డల్ని కర్నూలు నుంచి తెప్పించాం. ఇలా మొత్తం విశాఖ మార్కెట్‌లో కూరగాయల లోటు లేకుండా చేశాం. వాటిని బాధితులకు ఉచితంగా అందించేలా చూశాం. ఇది చాలా మంచి ప్రభావం చూపింది. పెట్రోల్ బ్లాక్ చేస్తున్నారని సమాచారం అందడంతో దాన్ని అరికట్టాం. 
అప్పుడు రక్షణ శాఖ సెక్రటరీ గా ఉన్న ఆర్ కె. మాథుర్ మాకెంతో సహాయపడ్డారు. హోంసెక్రటరీ అనిల్ గోస్వామి వైఖరికి భిన్నంగా రక్షణ సెక్రటరీ తోడ్పడిన తీరు చెప్పుకోదగ్గది. ఏ రాత్రి ఏ చిన్న సమస్య చెప్పినా స్పందించేవారు. వెంటనే ఆదేశాలు పంపేవారు. ఆయనతో సమస్యలు మాట్లాడడం నాకు ఎంతో సౌకర్యవంతంగా ఉండేది. త్వరలో టెలికమ్యూనికేషన్ సౌకర్యాలను కూడా పునరుద్దరించాం. ఒక విపత్తు పట్ల టీం వర్క్ పకడ్బందీగా ఎలా ఉంటుందో హుద్ హుద్ తుఫాను విషయంలో నిరూపితమైంది.

Comments

Popular posts from this blog

Whose Capital Amaravathi - Introduction

Urban centres as growth engines