Yevari Rajadhani Amaravathi - Foreword by Sri Vadde Sobhanadriswararao

ముందుమాట - "ఎవరి రాజధాని అమరావతి?’ 
ఇక్కడ భూమిలేని పేదల సగటు నెలవారీ సంపాదన ఒక్కొక్క కుటుంబానికి 15,000 వేల రూపాయలు వుండగా సి.ఆర్.డి.ఏ. వారికి నెలకు 2,500 మాత్రమే చెల్లించడం చాలా విచారకరం. వందలాది కుటుంబాలు ఉపాధి వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకి వలసపోవలసి వస్తున్నది.

‘ఎవరి రాజధాని అమరావతి?’ అన్న ఈ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల రాజధానీ నగరాల గురించి విఫులమైన సమాచారాన్ని అందిస్తూ ఉంది. రాజధానీ నగరాలను ఏర్పాటుచేయవలసిన ప్రదేశాల ఎంపికకు వెనుకవున్న వివిధ అంశాలను ఈ పుస్తకం చర్చించింది. అనేక రాజధానీ నగరాల గురించి విస్తృతంగా చర్చించింది. వాటి స్థలాల ఎంపికకు వెనుక వున్న ఆర్థిక, సాంస్కృతిక, జాతి, ప్రాంతాది కారణాలను వివరించింది. చండీగఢ్, గాంధీనగర్, భువనేశ్వర్, నయా రాయపూర్ వంటి కొత్త రాజధానీ నగరాల గురించిన సమాచారాన్ని వాటి ఆర్కిటెక్టులు ప్రణాళికల ప్రత్యేక లక్షణాలను గురించిన సమాచారాన్ని ఇచ్చింది. ఇక రాష్ట్రవిభజన తరువాత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానీ విషయానికి వస్తే శ్రీ కృష్ణారావు సి.సి.ఎల్.ఏ. గాను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగాను నవ్యాంధ్రప్రదేశ్ రాజధానీ స్థలం కోసం అందుబాటులో వున్న ప్రభుత్వ భూముల సమాచారాన్ని శ్రమకోర్చి సంపాదించారు.

ప్రకాశం జిల్లా దొనకొండలో కానీ, కృష్ణాజిల్లాలో నూజివీడుకు సమీపంలో కానీ రాజధానీ నగర నిర్మాణానికి తగిన స్థలం వున్నదన్న శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు అభిప్రాయం కొందరికి నచ్చలేదు. మద్రాసు రాష్ట్రంనుండి ఆంధ్ర విడిపోయే సమయంలోనే రాయలసీమ ప్రజలు వ్యక్తం చేసిన భయాల నేపథ్యంలోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తున్న సమయంలో రాయలసీమకు చెందిన కొందరు ‘రాయల తెలంగాణ’ ను సూచించిన నేపథ్యంలోనూ దొనకొండను రాజధానిగా సూచించడం జరిగింది. రాయలసీమ ప్రజల ప్రాంతీయ మనోభావాలు, ఆకాంక్షలను పరిగణనలోనికి తీసుకున్నప్పుడు దొనకొండ రాజధానిగా వుండడం వల్ల ప్రకాశం జిల్లా, రాయలసీమ జిల్లాల వెనుకబడిన ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. 

అదే విధంగా నూజివీడు సమీపంలో రాజధానిని ఏర్పరచాలని ఆయన సూచనకు కూడా బలం ఉంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూమి లభ్యమవుతూ ఉంది. అట్లాగే శిథిలమైన అటవీభూములు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో అవసరమయితే రాజధానీ నగర  నిర్మాణం కోసం అటవీ భూములను కూడా వాడుకోవడానికి అవకాశమిస్తామని కేంద్రప్రభుత్వం వాగ్దానం చేసింది. జాతీయ రహదారులకు, పోలవరం కాలువకు, ఎన్.ఎస్.పి. కాలువకు, విజయవాడ విమానాశ్రయానికి సమీపంగా వుండడం కూడా దీన్ని బలపరుస్తున్నాయి. 

నవ్యాంధ్రప్రదేశ్‌కు కొత్తరాజధానీ స్థల ఎంపికలో తగిన స్థలాన్ని సూచించడానికి శివరామకృష్ణన్ నేతృత్వంలో కేంద్రప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికకు ఇవ్వవలసిన ప్రాధాన్యాన్ని ఇవ్వకపోవడం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొరపాటు. తమ ‘టెర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్’  దృష్ట్యా కమిటీ సిఫారసులు చేసింది. ఈ టెర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌తో పాటు కమిటీ ‘2013 భూసేకరణ చట్టా’న్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఉంటుంది. ఈ చట్టాన్ని భారత పార్లమెంటు 2013లో ఆమోదించింది. సరిగ్గా ఈ కారణాల దృష్ట్యా విజయవాడ పరిసరాలలో సంపద్వంతమైన వ్యవసాయ భూములలో అనేక పంటలు పండించే ప్రదేశంలో ఒక పెద్ద హరితక్షేత్ర రాజధానీ నగరాన్ని ఈ కమిటీ సిఫారసు చేయలేదు. 

నిపుణుల కమిటీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తూ వివిధ క్షేత్రాలనుండి సూచనలను స్వీకరిస్తూ వున్న సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం పురపాలకశాఖామంత్రి శ్రీ కె. నారాయణ నేతృత్వంలో కొంతమంది ప్రజాప్రతినిధులు కొంతమంది పారిశ్రామికల వేత్తలతో మరో కమిటీని నియమించడం సముచితంగా లేదు. ఈ కమిటీ ఎటువంటి నివేదికను సమర్పించకపోవడం మరీ ఆశ్చర్యకరం. ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రదేశంలో నదీతీరాన రాజధానిని నిర్మించాలని ముందుగానే తీసుకున్న నిర్ణయానికి కొంత విశ్వసనీయతను కల్పించడానికి ఒక యుక్తిమాత్రమే ఇది. 
చండీగఢ్ లేదా నయా రాయపూర్ కొత్తరాజధానీ నగరాల నిర్మాణానికి కేవలం 20,000 ఎకరాల భూమిని మాత్రమే సేకరించారు. నయా రాయపూర్ విషయంలో చాలావరకు భూమిని రైతుల అంగీకారం మీద సేకరించారు. 1894 భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వవలసిన పరిహారంకంటే చాలా ఎక్కువ, మెరుగైన పరిహారాన్ని చెల్లించినందువల్ల రైతుల అంగీకారం లభించింది. ఇక చండీగఢ్ విషయంలో చాలావరకు అది ప్రభుత్వభూమి కాని అమరావతి విషయానికి వస్తే దాదాపు 15,000 ఎకరాల భూములు జరీబు భూములు.  చాలా సారవంతమైనవి. దాదాపు నూరు రకాల పంటలు పండుతాయి. ముఖ్యంగా ఆహారపంటలు, పండ్లతోటలు, పూలతోటలు మొదలైనవి ఇక్కడ పెంచుతారు. వేలాది  ఎకరాల మెట్టభూముల్లో అనేక ఎత్తిపోతల పథకాల ద్వారా ఏడాదికి ఒకటి లేదా రెండు పంటలు పండిస్తున్నారు. ఈ భూములపై వేలాదిమంది రైతులు, కవులు రైతులు, వ్యవసాయ కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు. రాజధానికోసం దాదాపు 54,000 ఎకరాల భూమిని సేకరించడం రాష్ట్రప్రభుత్వం చేస్తున్న పెద్ద తప్పు.

ఇక్కడ భూమిలేని పేదల సగటు నెలవారీ సంపాదన ఒక్కొక్క కుటుంబానికి 15,000 వేల రూపాయలు వుండగా సి.ఆర్.డి.ఏ. వారికి నెలకు 2,500 మాత్రమే చెల్లించడం చాలా విచారకరం. వందలాది కుటుంబాలు ఉపాధి వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకి వలసపోవలసి వస్తున్నది. 
జరీబు భూములను వరదమైదానాలు అని కూడా అంటారు. వీటిలో భూగర్భంలో సుమారు అరవై మిలియన్ క్యూబిక్ మీటర్ల తాగునీరు నిలువలుంటాయి. పది లక్షల మంది జనాభా తాగునీరు అవసరాలను ఈ నీరు తీర్చగలుగుతుంది. రాజధానీ నగర ప్రాంతంలో కృష్ణానదిమీద ఒక ఆనకట్ట కట్టడమో, రెండు మూడు చోట్ల తాగునీటి జలాశయాలు నిర్మించడమో - అదీ కొన్ని వందలకోట్ల ఖర్చుతో  - పూర్తిగా అనవసరం. 
ఎక్కువ ధరలు వస్తాయనో లేకపోతే రాజకీయ సామాజిక కారణాలవల్లో చాలామంది రైతులు దాదాపు 32,000 ఎకరాలను లాండ్ పూలింగ్ పథకం కింద ఇచ్చారు. ఈ భూములతో రాష్ట్రప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం అత్యంత దురదృష్టకరం. ప్రభుత్వం ప్రాథమిక ధరగా ఎకరానికి 4 కోట్ల రూపాయలు నిర్ణయించింది. ఇది ఆర్.బి.ఐ. వంటి కేంద్రప్రభుత్వ సంస్థలకు తదితరాలకు కేటాయించిన భూములకు నిశ్చయించిన ధర. అదే సమయంలో ప్రభుత్వం చాలా ఉదారంగా వందలాది ఎకరాల భూములను ప్రైవేటు విద్యాసంస్థలకు, వాణిజ్య సంస్థలకు ఎకరానికి 50 లక్షల ధరకు కేటాయిస్తూ ఉంది.

1691 ఎకరాల ‘స్టార్ట్‌ అప్ ఏరియా’ లో భూమిని చదరం చేయడం, రోడ్లు వేయడం, డ్రైనేజి, ఎలక్ట్రిసిటీ వంటి మౌళిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్రప్రభుత్వం సుమారు 5,500 కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నదన్న విషయం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఇది సింగపూరు కన్సార్టియంకు అప్పజెప్పారు. అందులో 42% వాటా పొందడానికి ప్రభుత్వం 221 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. సింగపూరు కన్సార్టియంకి కేవలం 306 రూపాయలు పెట్టుబడితో 58% వాటా ఇచ్చింది. కన్సార్టియంకు స్టార్ట్‌అప్ ఏరియా అభివృద్ధిని అప్పగించడానికి రాష్ట్రప్రభుత్వం ఎ.పి.ఐ.డి.ఇ.ఏ చట్టం 2001 నిబంధనలను సడలించింది. పైగా ఏదైనా వివాదం తలెత్తినట్లయితే దాన్ని లండన్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో పరిష్కరించుకోవాలన్నా నిబంధనకు లజ్జా రహితంగా అంగీకరించింది. 

2050 నాటికి జనాభా 25 లక్షలకు చేరుకునే ప్రపంచ స్థాయి మహానగరాన్ని నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం ఉద్దేశిస్తున్నది. ఇది వాస్తవానికి చాలా దూరం. ఎందుకంటే 3 రాష్ట్రాలకి రాజధాని అయిన చండీగఢ్ నగరం 35 సంవత్సరాల తర్వాత కేవలం 10 లక్షలు మాత్రమే. గత ఎనిమిదేళ్లలో చత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయపూర్ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ విషయంలో గవర్నర్ బంగళా, సచివాలయం శాసనసభ, హైకోర్టుల శాశ్వత భవన నిర్మాణం ఇంకా ప్రారంభం కాకముందే కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు ఇచ్చింది. మరో వెయ్యి కోట్ల రూపాయలు వాగ్దానం చేసింది. జనవరి 2016లో పురపాలక శాఖామంత్రి శ్రీ కె. నారాయణ 26 ఎకరాలలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో తాత్కాలిక సచివాలయ భవనాన్ని 180 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తామని ప్రకటించాడు. మరీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక సలహాదారు ‘మౌలిక సదుపాయాలతో తాత్కాలిక సచివాలయం’ నిర్మాణ ఖర్చు 1542 కోట్ల రూపాయలని చెప్పాడు. ఎటువంటి ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యంతో రాష్ట్రప్రభుత్వం పనిచేస్తుంటే గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరిక మేరకు ప్రపంచస్థాయి రాజధానీ నగరం అమరావతి నిర్మాణానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయో ఎవరైనా ఊహించుకోవచ్చు. 

రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం రాజధానీ నగరంలో వ్యవసాయం, ఉద్యానవనాలు, పశుపోషణ, కోళ్లపరిశ్రమ, మత్స్యపరిశ్రమ, తదితర కార్యకలాపాలకు అవకాశమే లేదు. అది పూర్తిగా అర్బన్ కాంక్రీట్ జంగిల్. ఇంకా శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణం  మొదలు కాలేదు కాబట్టి రాష్ట్రప్రభుత్వం కృష్ణా కుడిఒడ్డు పొడుగునా వున్న జరీబు భూములను ‘స్పెషల్ ఆర్గానిక్ ఎగ్రికల్చరల్ ఎక్స్‌పోర్ట్ జోన్’ గా ప్రకటించి కౌలు రైతులతో సహా రైతులందరికీ అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులను పండించడానికి తోడ్పడాలి. ఇది వారికి అధిక ఆదాయాన్ని ఇవ్వడమే కాక స్వీయ ఉపాధిని కూడా కల్పిస్తుంది. అప్పుడు మాత్రమే అమరావతీ రాజధానీ నగరాన్ని ‘అమరావతి - ప్రజారాజధాని’ అని పిలవవచ్చు.

ఈ పుస్తకం  చరిత్రను అధ్యయనం చేసేవారికే కాక సాధారణ ప్రజానీకానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పుస్తకం తెలుగు అనువాదం కూడా త్వరలో వెలువడి ఆంధ్రప్రదేశ్‌లోని సామాజిక ప్రజానీకానికి రాజధాని అమరావతిని గురించిన ఎంతో సమాచారాన్ని అందిస్తుందని ఆకాంక్షిస్తున్నాను. ఈ పుస్తక రచనలో శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావుగారి కృషిని నేను ఎంతో అభినందిస్తున్నాను. 
- వడ్డె శోభనాద్రీశ్వరరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీమంత్రివర్యులు

Comments

Popular posts from this blog

Whose Capital Amaravathi - Introduction

Urban centres as growth engines