Swiss Challenge Singapore - Whose Capital Amaravathi
12. స్విస్ ఛాలెంజి - సింగపూరు సంబంధం
కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రణాళిక వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర మాస్టర్ ప్లాను, వివరణాత్మక మాస్టర్ ప్లానుల రచన కోసం సింగపూరు ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ప్రారంభిక సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను సింగపూరు ప్రభుత్వం ఉచితంగానే తయారుచేసింది. కాని వివరణాత్మక మాస్టర్ ప్లాన్ కోసం రాష్ట్రప్రభుత్వం సింగపూరు ప్రభుత్వానికి సంబంధించిన సుర్బానా సంస్థకు 12 కోట్ల రూపాయలు చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి, స్టార్టప్ ఏరియాలో సీడ్ కాపిటల్ సిటీ నిర్మాణంలో సింగపూరు కంపెనీలకు కాంట్రాక్టు ఇవ్వడంలో అనుసరించిన మొత్తం పద్ధతిని, ప్రక్రియను పరిశీలిస్తే, ఆ కంపెనీలకు కాంట్రాక్టు కట్టబెట్టాలని ముందే నిర్ణయించుకున్నట్లు, తాము ముందే నిర్ణయించుకున్నట్లు సింగపూరు కంపెనీలకు ప్రాజెక్టు నివ్వడానికి కావలసిన ఔపచారిక ప్రక్రియను నిర్వహించినట్లు అనిపించక మానదు.
ఈ లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం స్విస్ ఛాలెంజి పద్ధతిని ఎంచుకుంది. కాని దాన్ని కూడా ఉన్నదున్నట్లుగా కాని, ప్రక్రియ విధి విధానాలను సక్రమంగా అనుసరించకుండా వక్ర మార్గంలో ఈ సింగపూరు కంపెనీల కన్సార్టియంకు అనుచిత ప్రయోజనం చేకూరేటట్లుగా, వారికే కాంట్రాక్టు దక్కేటట్లుగా సదుపాయం కల్పించడం జరిగింది. ఈ స్విస్ ఛాలెంజి పద్ధతిని అమలుచేసిన ప్రక్రియపై కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి.
ముందు సింగపూరు కన్సార్టియం తమ ప్రతిపాదనను సమర్పించడానికి అనుమతించారు. ఇది అంగీకరించిన స్విస్ ఛాలెంజి నియమాలకు విరుద్ధం. ఇతరులు తమ కౌంటరు ప్రతిపాదనలు సమర్పించడానికి అతి తక్కువ సమయం ఇచ్చారు. అసలు కాంట్రాక్టే సింగపూరు కంపెనీలకే లభించే విధంగా తయారుచేయబడింది. మధ్యవర్తిత్వం లండన్‌లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల చట్టం రాజీ చర్యలకు ఈ స్థానాన్ని ఎంచుకుంది. సింగపూరు కంపెనీలు చెల్లించవలసి కనీస గ్యారంటీలకు ఎటువంటి ఏర్పాట్లు కల్పించలేదు. ఈ కంపెనీలకు భూమిని రాయితీ ధరలలోకాని, ఉచితంగా కాని ఇవ్వాలి. కేవలం నామమాత్రపు ఆదాయపు వాటానే ఊహించారు. సింగపూరు కంపెనీలకు చూపించిన అనుచిత పక్షపాతం, మనకు కంటికి కనిపించే దానికంటే భిన్నంగా కనిపించని దేదో ఉందన్న అనుమానాన్ని కలిగిస్తుంది.
సింగపూరు ప్రభుత్వం అంతరంగ పరిపాలనలో స్వచ్ఛపాలనను అందిస్తుంది. కుటుంబ పాలనావ్యవస్థలో ఉక్కుహస్తంతో, అంతర్గత పాలనలో ఉన్నతస్థాయి నిజాయితీతో నడుపుతాయి. కాని ఈ ద్వీప రాజ్యపు అంతర్జాతీయ వ్యవహారాలలో విభిన్నవిధానాన్ని అనుసరిస్తుంది. 2006 లో మోర్గన్ స్టాన్లీ ప్రధాన ఆర్థికవేత్త ఆండీజీ ఇలా అన్నారు, ‘అవినీతిపరులైన ఇండోనీసియన్ వ్యాపారస్థులు, ప్రభుత్వాధికారులకు మనీ లాండరింగ్ కేంద్రంగానే వాస్తవానికి ప్రధానంగా సింగపూరు దేశ సాఫల్య సంపాదన జరిగింది.’ అమెరికా అంతర్జాతీయ మాదక పదార్థాల నియంత్రణ నివేదిక, 2011 కఠినమైన బాంకు రహస్యచట్టాలు, సింగపూరును విదేశీ అవినీతి అధికారులకు ఆకర్షణీయమైన గమ్య స్థానంగా మారుస్తున్నాయని పేర్కొన్నది. ఒక అంతర్జాతీయ అలీన నెట్ వర్కు అయిన టాక్స్ జస్టిస్ నెట్ వర్కు నివేదికలో 2013 లో ఆర్థిక రహస్య సూచిలో సింగపూరు ఐదవ స్థానంలో ఉన్నట్లు పేర్కొంది.
అంటే ధనవంతులైన వ్యక్తులు తమ డబ్బును దాచుకోవడానికి ఇదొక ప్రధాన కేంద్రమని అర్థం. సింగపూరు దేశీయంగా చట్టపరమైన నియమాలను కఠినంగా పాటిస్తూ విదేశీ చట్టభంగాలను పట్టించుకోదన్నమాట. ఫెయిర్ అబ్జర్వర్‌లో మీడియా అస్కర్ వ్యాసంలో ‘ధనిక ఇండోనీసియన్లు తమ సేవింగ్సును దాచుకోవడానకి అతివ్యూహాత్మక స్థానంగా సింగపూరు తయారయింది. దీనికి కారణం రహస్యాన్ని భద్రంగా కాపాడే నియమాలు’ అని పేర్కొనడం జరిగింది. ఇటువంటి అవిశ్వసనీయచరిత్ర ఉన్న దేశాన్ని భాగస్వామిగా ఎందుకు ఎన్నుకున్నారు? సింగపూరు కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టడంలో అనుచితమైన పక్షపాతం ఎందుకు చూపించారు? వంటి ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడో ఒకప్పుడు సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణంలో ఈ దేశాన్ని, ఈ దేశపు కంపెనీలను భాగస్వాములు చేయడానికి ఆ దేశపు నిజాయితీ ఎంత ఉన్నతస్థాయిలో ఉందో ఎప్పుడూ ఉదాహరణలు చెప్తుంటారు.
సింగపూరుపై జస్టిస్ నెట్‌వర్క్ సమర్పించిన ఒక కథనాత్మక నివేదిక ఇలా వివరిస్తున్నది - దేశీయ చట్టాలను దృఢంగా గౌరవించి పాటించడం, అదే సమయంలో విదేశీ చట్టాల ఉల్లంఘనను, అక్రమ ధనాన్ని దాచుకోవడం వంటి కార్యక్రమాలనుండి ఏర్పడే ‘మేము మీ డబ్బు దొంగిలించం, మీరు మరొకరి డబ్బు దొంగిలిస్తే మేము పట్టించుకోం’ వాణిజ్య ఆదర్శంతో కూడిన లీ కువాన్ యూ నమూనాను వివరిస్తుంది. ఈ ద్వీపరాజ్యం ఉన్నతస్థాయి నిజాయితీని తన దేశీయ పాలనలో అవలంబిస్తుంది కాని, అంతర్జాతీయ వ్యవహారాలలో అలా చెప్పలేం.
ఇంకా సింగపూరు కంపెనీలలో ఒకటయిన సెంబ్ కార్ప్ బ్రెజిల్ పెట్రోబ్రాస్ కుంభకోణంలో ఆరోపణలనెదుర్కుంటున్నది. ఈ కంపెనీ కూడా కన్సార్టియంలో ఒకటి. సింగపూరు కంపెనీల కాంట్రాక్టు ఇచ్చేముందు ప్రభుత్వం ఈ కంపెనీల గురించి విచారించే జాగ్రత్తలేమీ తీసికోలేదు.
ఆ విధంగా సింగపూరు అవినీతి రహితమనే ప్రభుత్వవాదం, అత్యున్నతస్థాయి నిజాయితీ కలిగిన దేశం కాబట్టి దాన్ని నూతన రాజధానీనగర అభివృద్ధిలో భాగస్వామిని చేశామన్న వాదం చాలా సందేహాస్పదమయినది.
మరియొక ముఖ్య విషయం ఏమిటంటే ఏ ప్రదేశం ఈ సీడ్ కాపిటల్ కట్టడానికి సింగపూర్ కంపెనీలకు కేటాయింపబడిందో అక్కడ జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పుననుసరించి, రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ (State environment impact assessment authority) ఉత్తర్వుల మేరకు ఎటువంటి కట్టడాలూ చేపట్టే అవకాశం లేదు. హరిత ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కృష్ణానది కరకట్ట లోపల ప్రాంతం ముంపు ప్రాంతంగా గుర్తించబడి ఎటువంటి కట్టడాలు చేపట్టడానికి వీలులేదు.
పర్యావరణ సంస్థ ఉత్తర్వు ప్రకారం కరకట్ట నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో కేవలం అటవీ సంబంధమైన మొక్కలను నాటడానికి హరిత, జల పరమైన కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశమున్నది. సింగపూర్ సంస్థలకు కేటాయించిన స్థలం సరిగా ఈ ప్రాంతంలోనే వస్తుంది. అటువంటి పరిస్థితులలో ప్రభుత్వం వారితో ఒప్పందం చేసుకొని ప్రాజెక్టు విషయంలో ముందుకెందుకు పోతున్నదో అర్థం కావడంలేదు. పైగా మధ్యవర్తిత్వం ఈ ఒప్పందం ప్రకారం లండన్ నగరంలో ఉంటుంది. ప్రాజెక్టు మొదలుపెట్టకుండానే మన రాష్ట్రం మీద మధ్యవర్తిత్వ ఒప్పందం ద్వారా సింగపూరు కంపెనీలు నష్టపరిహారానికి కేసులు వేసే అవకాశం లేకపోలేదు. ఈ రకంగా నిజాలను దాచి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నదో అర్థంకావడం లేదు. ఇది మరొక ఐ.యమ్.జీ. భరత్ కేసులాగా తయారవు తుందనడంలో ఎట్లాంటి సందేహం లేదు.
Comments
Post a Comment