Whose Capital Amaravathi - The Conclusion

15. ముగింపు/ఉపసంహారం

ఈ పుస్తకంలో మనం ఇంతరవరకు ప్రాచీనకాలంలో ఆంధ్రుల రాజధానీనగరాలతో ప్రారంభించి ఆధునికకాలం వరకు, మరింత నిర్దిష్టంగా స్వాతంత్ర్యానంతరం కర్నూలు నుండి హైదరాబాదు ద్వారా 2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించడానికి దారితీసిన ప్రక్రియ వరకు చరిత్రను పరిశీలించాం. 1953 లో రాజధానిని కర్నూలులో నిర్ణయించిన నాయకత్వశైలికీ, 2014 లో అమరావతి ఎంపికలో నాయకత్వశైలికీ తారతమ్యం చూశాం. రాజధానీనగర స్థలాల ఎంపికలో సైద్ధాంతిక నేపథ్యాన్ని చారిత్రిక దృక్కోణంలో పరిశీలించాం. 

వివిధ ఖండాలలో రాజధానీ నగరాల స్థాపనలో అంతర్జాతీయ అనుభవాలను, స్వాతంత్ర్యానంతరం మన దేశంలో రాజధానీ నగరాల ఏర్పాటు అనుభవాలను, 21వ శతాబ్దంలో ప్రజల డిమాండుపై రాష్ట్రాలను విభజించడం వల్ల కొత్తగా ఏర్పరచవలసి వచ్చిన రాజధానుల అనుభవాలను పరిశీలించాం. అమరావతికి నిర్దిష్టమైన, ప్రత్యేకమైన సమస్యల దృష్ట్యా లాండ్ పూలింగు, మల్టీ లేటరల్ ఏజెన్సీలనుండి ఆర్థిక సహాయం, కొన్ని విదేశాలు, కంపెనీలకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి రాజధానీనగరం అమరావతి నిర్మాణానికి ఆహ్వానించిన ప్రభుత్వ ప్రయత్నాలు మొదలైనవాటి గురించి గత అధ్యాయాలలో చర్చించాం.


కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని స్థలనిర్ణయానికి సముచితమైన వ్యూహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేకదృష్టితో నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా జరగవలసి ఉండింది. అన్నిటికంటే ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్‌లోని భిన్న ప్రాంతాలు అంటే, రాయలసీమ, మధ్య కోస్తా, ఉత్తర కోస్తా ప్రాంతాల విశిష్టలక్షణాలు దృష్టిలో పెట్టుకొని అన్నిప్రాంతాల ఆసక్తులూ, ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని రాజధానీనగరాన్ని ఒక తటస్థ ప్రాంతంలో ఏర్పాటుచేయడంపై ప్రజాభిప్రాయాన్ని నిర్మించవలసి ఉండింది. అప్పుడు మాత్రమే అది ప్రజల రాజధాని అవుతుంది. అందరికీ ఆమోదయోగ్యమవుతుంది. దీర్ఘకాలం మనగలుగుతుంది. 

రాజధానీ నగర స్థలనిర్ణయంలో అటువంటి ప్రజాభిప్రాయ నిర్మాణ ప్రయత్నమే జరగలేదు. రాజధాని నిర్మాణానికి ఏకపక్ష నిర్ణయం మాత్రమే జరిగింది. రెండో ముఖ్యమైన అంశమేమిటంటే ఆంధ్రప్రదేశ్‌లోని మూడు భిన్నప్రాంతాలలో మూడు పెద్ద నగరాలున్నాయి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం. ఈ మూడు పెద్ద నగరాలకు తోడు రాష్ట్రమంతటా వ్యాపించి ఉన్న పట్టణకేంద్రాల నెట్‌వర్క్ కూడా ఉంది. ఇటువంటి నెట్‌వర్కులు ఎక్కడెక్కడ ఉంటాయో, అక్కడ రాజధానీనగరం చిన్నదిగా ఉండి, ప్రధానంగా పరిపాలన రాజధానిగా వ్యవహరిస్తుందని వాదిం రాస్‌మన్ అభిప్రాయపడ్డాడు.

 రాష్ట్రానికి ఉన్న ఈ ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని ఒక తటస్థప్రదేశంలో రాజధానీనగర స్థలాన్ని సంప్రతింపులు, ప్రజాభిప్రాయ సేకరణల ద్వారా అన్నిప్రాంతాల వారికీ ఆమోదయోగ్యమైన చోట, ఎవరూ మరొకవర్గం కాని, ప్రాంతం కాని తమపై ఆధిపత్యం చలాయించదన్న విశ్వాసం ఏర్పడేటట్లు తెర వెనుక ప్రయత్నం జరుగవలసింది. మూడు పెద్ద నగరాలు, బలమైన పట్టణాలు రాష్ట్రమంతా వ్యాపించిఉన్న నేపథ్యంలో మనం అవలంబించవలసిన నమూనా పరిపాలనా రాజధానిగా సమర్థంగా పనిచేసే చిన్నపట్టణం. ఇతర ప్రధాన నగరాలు, పట్టణాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేయాలి. రాష్ట్రం పెరుగుదల దృష్ట్యా ఇటువంటి నమూనా రాష్ట్ర లక్ష్యాలకు అనుగుణంగా, ఆదర్శవంతంగా పనిచేసేది.


ఏ రాజధానీ నగరాన్నయినా నిర్మించాలని ప్రణాళిక వేసుకున్నప్పుడు ఆలోచించవలసిన ఒక ముఖ్యమైన అంశం ఎంత ఖర్చవుతుంది, ఆ నిధులు ఎక్కడినుండి వస్తాయి అన్నది. కొత్తరాజధానీనగర పథకం ఆ దేశం లేదా రాష్ట్రం జిడిపితో సమనిష్పత్తి కలిగి ఉండాలి. ఒక అంచనా ప్రకారం రాజధాని నిర్మాణ వ్యయం ఆ దేశ లేదా రాష్ట్ర జిడిపిలో 3 నుండి 12% వరకు ఉండవచ్చునంటారు. రాజధానీనగర నిర్మాణ ప్రారంభానికి ముందే తగిన ఆర్థిక ప్రణాళికను రచించుకోకపోయినట్లయితే, రాజధానీనగరనిర్మాణం ప్రారంభమే కాకపోవచ్చు, ఒకవేళ ప్రారంభమయినా నిధుల కొరత వల్ల ఆగిపోవచ్చు, జాప్యం జరగవచ్చు. కొత్త రాజధానులు నిర్మించుకున్న కొన్ని దేశాలలో ప్రత్యేక కారణాలవలన నిధులకొరతలేదు. మలేసియాలో రాజధానీనగర నిర్మాణంలో ప్రభుత్వ పెట్రోలియం గుత్తాధికార సంస్థ నిధులిచ్చింది. నైజీరియాలో కూడా రాజధాని అబూజా నిర్మాణానికి పెట్రోలు ఉత్పత్తుల నుండి నిధులు ప్రవహించాయి.


అవసరమైన వనరులు ఏర్పాటు చేసుకోకుండా కొత్త రాజధానీనగరానికి పూనుకున్న బ్రెజిల్ వంటి దేశాల్లో, రాజధాని నిర్మాణం ఒత్తిడే దేశంలో భారీ ఆర్థిక సంక్షోభానికి కారణమై, దేశపాలన మిలిటరీ చేతిలోకి వెళ్లిపోవడానికి దారితీసింది. అమరావతికి కూడా ఒక మహానగరంగా లక్ష కోట్లకు పైగా భారీ అంచనాలతో పథకం రచించారు. దాన్ని అవసరమైన నిధుల ఏర్పాటు లేకుండానే కేవలం పరిపాలన రాజధానిగా కాక మహానగరంగా ఉద్దేశించారు. ప్రభుత్వ భవనాలు, కనీస మౌలిక సదుపాయాల కల్పనకు మాత్రమే నిధులివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. 
ఇటువంటి భారీ ప్రాజెక్టుకు వనరులను సేకరించగలమన్న ప్రభుత్వ విశ్వాసం వాస్తవాలపై ఆధారపడింది కాదు. ఒకవేళ నిధులు గ్రాంటుగా రాకపోతే అప్పుగా తెచ్చుకోవాలంటే ప్రాజెక్టు వాణిజ్యపరంగా లాభదాయకమై ఉండాలి.

 రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్న పద్ధతిని చూస్తే పరిపాలన రాజధానిగా కాక, మహానగరంగా తగిన్ని ఆర్థికవనరులను ఏర్పాటు చేసుకోకుండా నిర్మించడానికి పూనుకోవడం నిధుల కొరతవల్ల నిర్మాణమే ప్రారంభం కాకపోవడానికో, లేకపోతే నిర్మాణ సమయంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకు పోవడానికో దారితీస్తుంది. నిర్దిష్టంగా నిధుల వాగ్దానాలు లేకుండా ఇటువంటి భారీ ప్రాజెక్టుకు పూనుకోవడం వల్ల కలిగే మరో ప్రభావం, అసలు రాష్ట్ర ఆర్థిక వనరుల పైనే పెద్ద బరువై కూర్చుని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, నగరాల అభివృద్ధిని కుంటుపరచవచ్చు.
ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో రామచంద్రయ్య తన వ్యాసంలో అమరావతిని ఒక స్పెక్యులేటివ్ నగరంగా అభివర్ణించాడు. 2035 నాటికి అమరావతి జనాభా 45 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. కో ఆప్షన్, బలాత్కారం, మోసం, బెదిరింపుల ద్వారా రైతులనుండి 30,000 ఎకరాల భూమిని సంగ్రహించారు. లాండ్ పూలింగ్ పద్ధతి ద్వారా భూసేకరణ జరిపారు. వాళ్లకు అభివృద్ధి చేసిన ప్లాట్ల కేటాయింపు ద్వారా భారీగా లాభాలు చేకూరుతాయనే ఊహలు కల్పించారు. రాజధాని ప్రాంత రైతులతో తన సమావేశాలలో ముఖ్యమంత్రి, రైతులు తమ భూములు వదలుకున్నట్లయితే వారిని జిఎంఆర్‌లుగా మారుస్తానని వాగ్దానం చేసినట్లు రామచంద్రయ్య పేర్కొన్నాడు. నలభైలక్షల జనాభా అమరావతి నగరానికి వలస రావడానికి, అవకాశాల కల్పనకు అవసరమైన పెట్టుబడుల స్థాయిని అంచనావేయడం జరగలేదు, దానికి అవసరమైన నిధులు వచ్చే మార్గాన్ని ఏర్పరచలేదు. 

ఇటువంటి బలహీనమైన పునాదుల మీద పెట్టుబడులు, పెట్టుబడుల మూలాలు, అక్కడ జరగబోయే కార్యకలాపాలు మొదలైనవాటిని సమగ్రంగా అధ్యయనం చేసి ప్రణాళికీకరించి వివరించకుండా నిర్మించిన నమూనా, దాని సొంత బరువు కిందే కూలిపోయే అవకాశాలున్నాయి. ఈ ప్రాంతంలోని భూముల ధరలకు సంబంధించి ప్రస్తుతం స్పెక్యులేటివ్ కార్యకలాపాలు సాగుతున్నాయి. కాని వాస్తవాలు వెలుగు చూచి చేసిన వాగ్దానాలను సాధించడం అసాధ్యమని తెలిసిననాడు ధరలు కుప్పకూలి స్థానిక వ్యవసాయ సమాజంలో ఆందోళన తలెత్తక తప్పదని స్పష్టమవుతున్నది.


వాదిం రాస్‌మన్ అభిప్రాయంలో ఒక విజయవంతమైన రాజధాని స్థలం ఎంపిక ప్రక్రియ భిన్న ప్రాంతాలు, ప్రజల ప్రయోజనాలను ప్రతిబింబించాలి, భాగస్వాములైన వారందరూ నిర్ణయ ప్రక్రియలో పాలు పంచుకోవాలి. ఈ కోణం నుండి చూసినప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భిన్నప్రాంతాల మధ్య సర్దుబాటుగా కాని, ఏకాభిప్రాయం వల్ల కాని ఏర్పడిన నిర్ణయం కాదు. దీనికి సంబంధించినంతవరకూ ఈ నగర పునాదులు బలహీనమైనవి, అస్థిరమైనవి. విస్తృతమైన చర్చలు, సంభాషణలు జరిపి, సంప్రతింపులు, ఏకాభిప్రాయ సేకరణ ప్రక్రియల ద్వారా అన్నిప్రాంతాల వారినీ కలుపుకొని ఏర్పరచినప్పుడు మాత్రమే ఇటువంటి రాజధానీనగరాలు స్థిరంగా ఉండగలుగుతాయి, దీర్ఘకాలం మనగలుగుతాయి. ఏకాభిప్రాయ సాధన, సంప్రతింపులు, భిన్న వర్గాల మధ్య అభిప్రాయభేదాల తొలగింపు, రాజధానీ నగర స్థలాన్ని ఒక సమైక్యత బిందువుగా ఉపయోగించడం వంటి లక్షణాలతో నిర్మించిన రాజధానుల మంచి ఉదాహరణలు మనకెన్నో దొరుకుతాయి. 

ఈ దిశలో అత్యంత విజయవంతమైన తొలి ఉదాహరణగా మనం వాషింగ్టన్ డిసిని తీసికోవచ్చు. ఈ ఉదాహరణ మరెన్నో ఆంగ్లో శాగ్జన్ దేశాలకు ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, కెనడా వంటి వాటికి తమ రాజధానీనగర స్థలాల ఎంపిక ప్రక్రియలో ఆదర్శంగా నిలిచింది. వీటి రాజధానులు కూడా సంప్రతింపులు, సర్దుబాట్లు, రాజీల ప్రక్రియ ద్వారా ఏర్పడినవే. ఈ అన్ని దేశాలలోనూ రాజధానీనగరం దేశంలోని భిన్నప్రాంతాలకు ఆమోదయోగ్యమైన తటస్థ ప్రాంతాలలోనే ఉంది. ఈ అన్నిచోట్లా అది ఆ దేశ ప్రధాన ఆర్థిక కేంద్రబిందువు కంటే చిన్నదిగానే ఉంది.


భారత ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులో దేనినీ రాష్ట్రప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. వాటిలో తమకు అనుకూలమైన చోట, అవసరమైనంత వరకు యథాలాపంగా పేర్కొనడం మాత్రమే చేసింది. ఈ కమిటీ నివేదిక కోసమే ఎదురుచూస్తున్నట్లుగా, ఆగస్టు చివరలో కమిటీ నివేదిక సమర్పించగానే సెప్టెంబరు మొదటివారంలో ప్రభుత్వం రాజధానీనగర స్థలాన్ని ప్రకటించింది. ఒక వ్యూహాత్మక చాణక్యరీతిలో రాజధానీనగర అంశాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి, శాసనసభ తీర్మానాన్ని రాజధానీనగరాన్ని విజయవాడ నగర పరిసరాలలో ఏర్పాటు చేసేటట్లుగా తీసికొని, ప్రభుత్వం తాను ముందే ఎంచుకున్న స్థలంలో రాజధానీనగరాన్ని ప్రకటించింది. 

వాదిం రాస్‌మన్ రాజధానీనగరాల స్థలాల నిర్ణయం విషయంలో అనుకూల విషయాలనూ, ప్రతికూల కారణాలనూ, రహస్య అజెండాలనూ వివరంగా వర్ణించాడు. 

అనుకూల వ్యూహాలు ప్రాంతీయ సర్దుబాట్లమీద ఆధారపడి ఉంటాయి, రాజధానీనగరం ఒక తటస్థప్రాంతంలో ఏర్పడడానికి దారితీస్తాయి. రాజధానీనగరాన్ని అభివృద్ధి చెందని ప్రాంతంలో ఏర్పరచడం ద్వారా రాజధానిస్థలమూ, ఆ ప్రాంత అభివృద్ధికి ఒక సాధనమయ్యేట్లుగా ఈ నిర్ణయం ఉంటుంది. దీన్నే ఫార్వర్డ్ థ్రస్ట్ కేపిటల్ సిద్ధాంతం అంటారు. పక్షపాతం లేకుండా ఉండడం గుర్తింపు, ఆర్థిక పరిపాలనాసామర్థ్యం వంటి కారణాల వల్ల కూడా రాజధానీనగర స్థలనిర్ణయం ఉంటుంది.

ప్రాచీనకాలం నుండీ భూశకునశాస్త్రం, జ్యోతిషశాస్త్రం రాజధానీనగరాల స్థలాల ఎంపికలో ప్రధానపాత్ర వహించాయి. ఆ విధంగా స్థానిక జ్యోతిషశాస్త్ర సూత్రాలమీద ఆధారపడి నిర్మించిన రాజధానీనగరం మయన్మార్‌కు చెందిన నేపీడా. భూశకునశాస్త్రానికే భారతీయరూపం వాస్తు. జ్యోతిషశాస్త్రంతో కలిసి వాస్తు కృష్ణానదీతీరంలో అమరావతి రాజధానీనగర స్థలనిర్ణయంలో ప్రధానపాత్ర పోషించింది. అయితే ఈ ఎంపికకు కారణంగా దీన్ని బయటికి పేర్కొనలేదు. అంతవరకూ ఇది రాజధానీనగరాన్ని ప్రస్తుతస్థలంలో ఏర్పరచడంలో ఉన్న రహస్య అజెండా.


క రాజధానీ నగరాల ఏర్పాటులో రహస్య అజెండాలు ఇలా ఉంటాయి. ఇక్కడ ఒక పరిపాలకుడు ఏ జాతికి చెందినవాడు అన్నది ప్రధానమవుతుంది. అతనికి విధేయంగా ఉన్న జాతి ప్రాబల్యం కలిగిన ప్రాంతంలో రాజధాని ఏర్పాటు జరుగుతుంది. అది ఒక నిర్దిష్ట తెగ, జాతికి అనుకూలంగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో తెగ సమైక్యత, పక్షపాతబుద్ధి అన్న సూత్రంపై ఆధారపడి నిర్ణయం జరుగుతుంది. ఇటువంటి దేశాలలో పాలకవర్గం తమ ప్రభుత్వ అధికారస్థానాన్ని తమ సొంత జాతిప్రాబల్యం ఉన్న ప్రాంతానికి తరలిస్తుంది. ఇక్కడ దేశ నిర్మాణ లక్ష్యాలను ప్రోత్సహించడానికి బదులుగా, తమ విధేయులను నియమించుకోవడానికి పథకం పన్నుతారు. ఇటువంటి సందర్భంలో రాజధానీనగరం ఇతర తెగలనుండి దూరమవుతుంది. అన్ని వర్గాల సమైక్యత ఆధారంగా రాజధాని ఉండదు. అనుకూలవ్యూహాలలో ఒక ఏకాభిప్రాయానికి వచ్చే ప్రయత్నం, తక్కిన వర్గాలను తమలో కలుపుకుపోయే పద్ధతి ఉంటుంది. కాని నకారాత్మక వ్యూహాలలో తక్కినవాళ్లని వేరుగా ఉంచే వ్యూహాలు ఒకే రాజకీయ సామాజిక వర్గానికి పరిమితమై, తక్కిన వర్గాలను దూరం పెడతాయి. 

తెగలమధ్య ఘర్షణలు ఉన్న దేశాలలో ఇటువంటివి సాధారణం. అట్లాగే, నిరంకుశపాలకులు ఉన్న దేశాలలో కూడా ఇది సాధారణం. రాస్‌మన్ ప్రకారం మహానగరాల నిర్మాణప్రయత్నాలకు దారితీసే కారణాలలో మొత్తం తామే సొంతం చేసుకోవాలనుకునే స్వార్థపరత్వమూ, తనంత గొప్పవాడు లేడని చెప్పుకోవడానికి ఇటువంటి పద్ధతులను ఎంచుకునే నాయకులు ఉంటారు.


గొప్ప కట్టడాలు నిర్మించడం ద్వారా ప్రజల మనస్సుల్లో శాశ్వతంగా నిలిచి ఉండాలనుకునేవాళ్లూ, తమ గొప్పదనాన్ని ప్రపంచమంతా పొగడాలనుకునేవాళ్లూ, మొత్తం తామే కబళించాలనుకునేవాళ్లూ ఇటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఈ లక్షణాలన్నీ నిరంకుశపాలకుల ప్రత్యేక లక్షణాలు. ఈ లక్షణాలను రాజధానీనగరాల స్థలనిర్ణయాల వెనుక ఉన్న అదనపు కారణాలుగా గుర్తించవచ్చు. ఇటువంటి పాలకులు ఒక ప్రకటన చేసి, రాజధానీనగరాలను మహానగరాలుగా నిర్మించడం ద్వారా విశాల అంతర్జాతీయ రంగంలో తమకు ప్రాధాన్యం కల్పించుకోవడానికి కీర్తిని చాటడానికి ప్రయత్నిస్తారు. 

మలేషియాకు చెందిన మహమ్మద్ మహాతిర్, టర్కీకి చెందిన అతాతుర్క్, కజకిస్తాన్‌కు చెందిన నజర్ బయేవ్ ఇటువంటి నిరంకుశపాలకుల వర్గంలోకి వస్తారు. అమరావతి వంటి మహానగరాన్ని నిర్మించి, కాలమనే ఇసుకదారిలో తన అడుగుజాడలను వదలిపెట్టాలనుకునే ఇటువంటి పాలకులశ్రేణిలో తననుగూడా చేర్చుకోవడానికి శ్రీ చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ వాళ్లకీ, తనకూ మధ్య ఒక ప్రధానభేదం ఉందనే విషయాన్ని ఆయన మరిచిపోతున్నట్లు కనిపిస్తున్నది. టర్కీకి చెందిన అతాతుర్క్ పూర్తిగా భిన్నమైన కాలానికి చెందినవాడు. అతనితో పోల్చుకోవడం అంత బాగుండదు. మహమ్మద్ మహాతిర్ ఒక విధంగా అదృష్టవంతుడు. మలేషియా పెట్రోనాస్ రాజధానీనగరాన్ని మహానగరంగా నిర్మించడానికి అవసరమైన ఆర్థిక సహాయం చేసింది. కజకిస్తాన్ నజర్ బయేవ్ పెట్రోలు, ఇతర ఖనిజాల వంటి సహజవనరులలో ధనికమైన దేశానికి నాయకుడు. శ్రీ నాయుడుకు రాజధానీనగరాన్ని మహానగరంగా నిర్మించడానికి అవసరమైన ఇటువంటి వనరుల ఆధారం లేదు. అందువల్ల మహానగరాన్ని నిర్మించాలన్న ఆయన కల గానీ, కాలపు ఇసుకతిన్నెలమీద తన అడుగుజాడలను వదలిపెట్టాలన్న కోరిక గానీ నిజంగా సాకారం కాకపోవచ్చు. నిధుల కొరత వల్ల అసలు ఈ ప్రాజెక్టే ప్రారంభం కాకపోవచ్చు. లేదా ఆర్థిక సమస్యలతో నత్తనడక నడవవచ్చు. 


ఒక రాజధానీ నగర బలం కానీ, శక్తి కానీ అది ఏ పునాదుల మీద నిర్మింపబడిందో ఆ పునాదుల మీద ఆధారపడి ఉంటుంది. ఏ రాజధానీనగరం భాగస్వాములైన అందరితోనూ విస్తారమైన చర్చలు జరిపి, ఏకాభిప్రాయ సాధన ద్వారాకానీ, సర్దుబాటు ద్వారాకానీ నిర్మితమవుతుందో ఆ రాజధానీనగరం విజయవంతంగా సుదీర్ఘకాలం నిలుస్తుంది. ఏకాభిప్రాయసాధన, సర్దుబాటు ప్రక్రియల ద్వారా ఏర్పడిన రాజధానీనగరాలకు వాషింగ్టన్ డిసి, కేన్ బెరా లను ఉదాహరణలుగా చెప్పవచ్చు.
ఈ సందర్భం దృష్ట్యా  అమరావతి ఒక అనుకూల వ్యూహానికి సంబంధించిన ఏ లక్షణాలనూ ప్రదర్శించదు. అది ఒక తటస్థప్రదేశంలోనూ లేదు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారికీ అంగీకారయోగ్యమూ కాదు. భిన్నప్రాంతాల మధ్య ఒక సర్దుబాటు ఫార్ములాగా ఏర్పడినదీ కాదు. అది రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతంలోనూ లేదు. అందువల్ల ఒక ఫార్వార్డ్ థ్రస్ట్ కేపిటల్‌గా అభివృద్ధి చెందని ప్రాంతానికి ఒక అభివృద్ధి సాధనంగా ఉపయోగపడదు కూడా. రాజధానీ నగరంగా అమరావతిని ప్రకటించే ముందు ఒక స్థూలమైన ఏకాభిప్రాయాన్ని సాధించడానికి ఎటువంటి ప్రయత్నమూ జరగలేదు. దీనికి సంబంధించినంత వరకూ భిన్నభాగస్వాములకు ప్రాతినిధ్యం వహించే, భిన్నభాగస్వాములు అంగీకరించే తమదిగా భావించే, అందరినీ కలుపుకుపోయే రాజధానిగా దీన్ని వర్ణించలేను. 

మరోవైపు అమరావతి మనం ఇంతకుముందు రాజధానీస్థలాన్ని గురించి పేర్కొన్న అన్ని నకారాత్మక లక్షణాలనూ కలిగి ఉంది. ఒక డిస్ఎంబెడెడ్, ఎక్స్‌క్లూజివ్ రాజధాని లక్షణాలన్నీ దానికున్నాయి. ఇటువంటి రాజధానీనగరాలకు మనకు ప్రాచీనకాలంలోనూ, ఉదాహరణలున్నాయి. మరీ ముఖ్యంగా ఆఫ్రికాలోని రాజధానీనగర స్థలాలకు సంబంధించి జాతి విధేయతలు, జాతిపరమైన పక్షపాతాలు అతి ప్రాధాన్యం వహించాయి. ఉదాహరణకు మలావీలో రాజధానీనగరం అప్పటి అధికారంలో ఉన్న రాజకీయ నాయకుని సొంత తెగప్రజలు ప్రబలంగా ఉన్న ప్రాంతంలో ఉంది. వాదిం రాస్‌మన్ పేర్కొన్నట్లుగా ఆఫ్రికాలో ఎందరో నియంతల విషయంలో బహిరంగంగా ప్రకటించినదాని వెనుక రహస్య ఎజెండాలున్నాయి. 

బహిరంగంగా చేసిన ప్రకటన స్వాతంత్ర్యం, వలసపాలన నుండి విముక్తి వంటివైతే, అధికారాన్ని తమ స్వీయ తెగ, వర్గంలోనే ఎప్పటికీ నిలుపుకోవాలన్న కోరికతో ప్రేరేపితులై ఈ నాయకులు, తమ రాజధానీనగరాలను తమకు అత్యంతవిధేయమైన ప్రాంతాలలో ఏర్పరుస్తారు. ప్రస్తుతమున్న అధికారకూటములకు ప్రత్యేక ప్రయోజనాలను కట్టబెట్టడం ద్వారా వారి విధేయతను నిలుపుకుంటారు. అమరావతిని రాజధానీ నగరంగా ఎంచుకోవడంలో ప్రస్తుత రాజకీయ పాలకవర్గానికి కూడా ఇటువంటి ఆలోచనలే ప్రధానపాత్ర వహించినట్లు కనిపిస్తుంది. 

ఆఫ్రికాలో నియంతలలో సాధారణంగా కనిపించే లక్షణాలు ఒక ప్రజాస్వామ్యదేశంలో రాజధానీ నగరాన్ని ఏర్పరిచే స్థలం ఎంపిక విషయంలో కీలకపాత్ర పోషించినట్లు కనిపిస్తుంది. పాలకవర్గానికి విధేయులైన ప్రజా బాహుళ్యమున్న ప్రాంతంలో ముందుగానే రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను, భారీ వాణిజ్య ప్రయోజనాలను స్థాపించిన ప్రాంతంలో రాజధాని స్థలం ఎంపిక జరిగింది. రాజధానీ నగర స్థలనిర్ణయం విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఏకాభిప్రాయాన్ని సాధించే ప్రయత్నమేదీ జరగలేదు. పాలక తెగకు లాభదాయకంగా హఠాత్తుగా రాజధానీ స్థలాన్ని ప్రకటించారు. సారవంతమైన సాగుభూములున్న కారణంగా ఈ స్థలం ఎంపిక ఏ మాత్రం తగినది కాదు. సారవంతమైన సాగుభూములున్న ప్రదేశంలో సాధారణంగా రాజధానీ నగరాలను నిర్మించరు. దీనికి కారణం, భూసేకరణ, నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకుని ఉండడం. ఇక్కడ రాజధానీస్థలాన్ని ఎంపిక చేసుకోవడం వెనుక ఒక రహస్య ఎజెండా కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ రియల్ ఎస్టేట్, వ్యాపారప్రయోజనాలు ప్రాధాన్యం వహించాయి. ఒక మహానగరంగా  రాజధానీనగరాన్ని నిర్మించడంలో, చరిత్ర ఇసుకతిన్నెలపై తన పాదముద్రలను వదిలి వెళ్లాలని భావించిన నాయకుని వ్యక్తిగతలక్షణం కూడా ఒక ముఖ్యపాత్ర పోషించి ఉంటుంది. 

టువంటి డిస్ఎంబెడెడ్ ఎక్స్‌క్లూజివ్ రాజధానీనగరాలు సుదీర్ఘకాలం మనలేవనీ, స్థిరంగా ఉండలేవని కూడా గమనించడం జరిగింది. ఇవి స్వల్పకాలికమైనవి. వీటి నిర్మాణం, నిర్వహణ చాలా ఖర్చుతో కూడినవి. ఇటువంటి రాజధానీనగరాల విషయంలో సిద్ధాంతరీత్యా ఊహించిన దానికంటే అమరావతి భవిష్యత్తు భిన్నంగా ఉండకపోవచ్చు.
రాజధానీ నగర స్థలం ఎంపిక విషయంలో భారత ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ 2014 ఏప్రిల్ 20 వ తేదీన ‘ది హిందూ’ పత్రికలో  ప్రచురితమైన ‘ఐ ఆన్ కేపిటల్ లాస్ ఇన్ విజన్’ అన్న వ్యాసంలో ఇలా పేర్కొన్నారు: ‘రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం చంద్రబాబు నాయుడు రాజధానీ నగర స్థలం సమస్యలో కూరుకుపోకుండా ఆంధ్రప్రదేశ్‌ను ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలపై కేంద్రీకరించడానికి కావలసినంత సమయం ఇచ్చింది. కానీ జరిగింది మాత్రం అదే...  నాయుడు ముందున్న అతి ముఖ్యమైన సవాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్రవ్యాప్తంగా సమతులమైన అభివృద్ధిని సాధించడం. అంతే తప్ప కేవలం వి.జి.టిఎమ్ ప్రదేశం కాదు... శ్రీ నాయుడు తన అడుగులను వెనక్కు తీసుకోవడానికి ఇంకా సమయం ఉంది... సమస్య చరిత్రలో నిలిచిపోయే రాజధానీనగర నిర్మాణం కాదు, అది ముందెప్పుడో రావచ్చు. ప్రస్తుతం ముఖ్యమైనది ఏమంటే, ఈ రాజధాని ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ రాజకీయశక్తినీ, ఆర్థికవనరులనూ తాకట్టు పెట్టే  దాదాపు ఆత్మహత్యా సదృశమైన  నిర్ణయం!

Comments

Popular posts from this blog

Whose Capital Amaravathi - Introduction

Urban centres as growth engines