Whose Capital Amaravathi - Introduction
ఉపోద్ఘాతం - ‘ఎవరి రాజధాని అమరావతి?’
వలసపాలన రోజుల్లో రాజధానీనగరం రేవు పట్టణమై ఉండేది. దేశం లోతట్టు ప్రాంతాలనుండి వలసరాజ్యానికి ముడి సరకులు ఎగుమతి చేయడానికి, వాణిజ్యానికి ఇది అనుకూలంగా ఉంటుంది. బ్రిటిషువారి కాలంలో 1911 వరకు దేశ రాజధాని ‘కలకత్తా’. తక్కిన సంపన్నమైన ప్రెసిడెన్సీలు ‘బొంబాయి’, ‘మద్రాసు’ ప్రెసిడెన్సీల రాజధానులు బొంబాయి, మద్రాసులు కూడా రేవు పట్టణాలే. ఆ నాడు మద్రాసు ప్రెసిడెన్సీ పెద్ద ప్రెసిడెన్సీ. ఈ ప్రెసిడెన్సీలలో భిన్నభాషలు మాట్లాడే ప్రాంతాలున్నాయి. మద్రాసు (చెన్న పట్టణమని కూడా అంటారు) నుండి పరిపాలింపబడే మద్రాసు ప్రెసిడెన్సీలో, తమిళుల తర్వాత బహుళసంఖ్యలో ఉన్న ప్రజలు తెలుగువారే. కన్నడం, మలయాళం మాట్లాడే ప్రజలు కూడా ఉండేవారు కాని, వారిసంఖ్య తమిళులు, తెలుగువారి కంటే తక్కువ. ముందుగా ఇంగ్లీషు భాష నేర్చుకొని, దాని సహాయంతో ప్రభుత్వోగాలు సంపాదించుకున్నవారు తమిళులు. ప్రభుత్వోద్యోగాలలో అధికభాగం వారి చేతుల్లోనే ఉండేవి. ఇది తక్కిన భాషలు మాట్లాడేవారికి, ముఖ్యంగా అధికసంఖ్యలో ఉన్న తెలుగువారికి బాధాకరంగా పరిణమించింది. భాషాపరంగా ప్రత్యేకరాష్ట్రం కోసం అన్వేషణకు నాయకత్వం వహించినవారు ఆంధ్రులు. జాతీయోద్యమకాలంలో ఇదొక బలమైన ఉద్యమం. జాతీయోద్యమంలో అదొక ప్రధానభాగం. ఆ సమయంలో తెలుగు మాట్లాడే ప్రజల్లో కొంత భాగం నిజాం పరిపాలనలో ఉన్న హైదరాబాదు రాజ్యంలో నివసించేవారు. హైదరాబాదు రాజ్యప్రజలు కూడా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు.
క్రమంగా తెలుగు సెంటిమెంటు ప్రబలమై, హైదరాబాదు రాజ్యంలోని తెలుగు ప్రాంతాలు, మద్రాసు ప్రెసిడెన్సీలోని తెలుగు ప్రాంతాలు భాషాప్రాతిపదికన కలిసి, రాష్ట్రంగా ఏర్పడాలనే అభిలాష పెంపొందింది. 1948 లో పోలీస్ యాక్షన్ జరిగింది. హైదరాబాదు స్వతంత్రభారత సమాఖ్యలో ప్రత్యేక రాష్ట్రమయింది. తక్కిన తెలుగువారు 1947 తర్వాత కూడా మద్రాసు ప్రెసిడెన్సీలోనే కొనసాగవలసి వచ్చింది. భాషా ప్రాతిపదికన ప్రత్యేకరాష్ట్ర ఆకాంక్ష ఆంధ్రులలో చాలా దృఢంగా ఉంది. కాని అదే సమయంలో మద్రాసు ప్రెసిడెన్సీలోని ఆంధ్రప్రాంతంలోని రెండు ప్రధానప్రాంతాలు కోస్తాంధ్ర, రాయలసీమల మధ్య అనుమానాలు కూడా ఉన్నాయి. రాయలసీమ అంటే దత్తమండలాలు. 1802 లో నిజాం బ్రిటిషువారితో చేసుకున్న సైన్యసహకార ఒప్పందంలో భాగంగా, ఈ జిల్లాలను నిజాం బ్రిటిషు వారికి దత్తం చేశాడు. ఆ విధంగా ఈ ప్రాంతానికి ఒక స్వీయ ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది.
నంద్యాల ఆంధ్రమహాసభ దత్తమండలాల ప్రత్యేకతను కొనసాగించడం కోసం 1928 లో రాయలసీమ అని నామకరణం చేసింది. విజయనగరసామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఈ ప్రాంతం ప్రాముఖ్యం పొందింది. వాళ్ల భయమేమిటంటే ప్రత్యేక ఆంధ్రరాష్ట్రంలో కోస్తా జనాభా ఎక్కువ కాబట్టి, ప్రబలం కాబట్టి తమ గుర్తింపు, ప్రయోజనాలకు సరైన రక్షణ ఉండేదేమోనని. ప్రత్యేకరాష్ట్రం కోసం ఐక్యంగా పోరాడవలసిన అవసరం ఉంది కాబట్టి, ఆ నాటి రాయలసీమ, కోస్తా నాయకులు కలిసి శ్రీబాగ్ ఒడంబడిక అనే ఒప్పందం చేసుకున్నారు.
ఆంధ్ర పత్రిక అధిపతి శ్రీ దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు గారి మద్రాసు (చెన్నై) ఇంట్లో 16.11.1937 న ఈ ఒడంబడిక జరిగింది. దీని మీద శ్రీయుతులు కె. కోటిరెడ్డి, కల్లూరి సుబ్బారావు, పప్పూరి రామాచార్యులు తదితరులు రాయల సీమ తరఫున, శ్రీయుతులు భోగరాజు పట్టాభిసీతారామయ్య, కొండా వెంకటప్పయ్య, తదితరులు కోస్తాంధ్ర తరఫున సంతకాలు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధాని రాయలసీమలోను,
హైకోర్టు కోస్తాలోను ఉండాలన్నది ఈ ఒడంబడికలోని ప్రధానాంశం. ముఖ్యంగా అంగీకరించిన విషయమేమంటే విశ్వవిద్యాలయం, ప్రభుత్వ ముఖ్యకార్యాలయాలు, హై కోర్టు వేరు వేరు ప్రదేశాలలో ఉండడం మంచిదన్న అభిప్రాయం. ఆ విధంగా ముఖ్యమైన కార్యాలయాలన్నీ ఒకే చోట కేంద్రీకరింపకూడదన్న సూత్రం ఎనభయ్యేళ్ల తర్వాత శివరామకృష్ణన్ కమిటీ పునరుద్ఘాటించిన సూత్రం.
ఈ ఒడంబడికపై ఆధారపడి ప్రత్యేకరాష్ట్రం కోసం ఆంధ్రులు ఐక్యపోరాటం సాగించారు. భాషాప్రయుక్త రాష్ట్రాలకు నెహ్రూ అంత అనుకూలంగా లేకపోయినప్పటికీ, పొట్టి శ్రీరాములు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష, ఆయన అమరుడైన వెంటనే చెలరేగిన హింసాత్మకనిరసనలు ఆంధ్రులకు ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటును ప్రకటించడం తప్ప నెహ్రూకు మరో ప్రత్యామ్నాయం లేకపోయింది. ఆ విధంగా అక్టోబరు 1, 1953 న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. శ్రీబాగ్ ఒడంబడికలో అంగీకరించినట్లుగా రాజధాని కర్నూలుగా ప్రకాశం పంతులుగారి నాయకత్వంలోని ప్రభుత్వం 1-10-1953 నుండి పనిచేయడం ప్రారంభించింది. మద్రాసు ప్రెసిడెన్సీలోని ప్రజలతోపాటు హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగువారికి కూడా విశాలాంధ్ర ఒక దీర్ఘకాలస్వప్నం. 1-10-1953 నుండి తెలుగు మాట్లాడేవారి రెండు రాష్ట్రాలు ఒకటి హైదరాబాదు రాజధానిగా, మరొకటి కర్నూలు రాజధానిగా పనిచేయసాగాయి.
తెలుగు మాట్లాడే ప్రజల కలను సాకారం చేసుకోవడానికి విశాలాంధ్ర నిర్మాణం కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అప్పటికి మద్రాసు ప్రెసిడెన్సీలోని ప్రజలకు ఇంగ్లీషు భాషతోనూ, ఆధునికవిద్యలోనూ నిజాం కింద ఉన్న తెలంగాణ ప్రజలకంటే ఎక్కువ పరిచయం ఏర్పడింది. అది తెలంగాణ ప్రజలలో భయసందేహాలకు కారణమయింది. ఉమ్మడి రాష్ట్రం తమ ప్రయోజనాలకు నష్టదాయకమవుతుందేమోనన్న అనుమానం వారిలో కలిగింది. ఈ భయాలు పోగొట్టడానికి 1956 లో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. ఈ పెద్దమనుషుల ఒప్పందపు సూత్రాలపై ఆధారపడి హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగువారు, ఆంధ్రరాష్ట్రంతో కలిసి విశాలాంధ్ర ఏర్పడింది. హైదరాబాదు రాజధాని అయింది. హైదరాబాదు రాష్ట్రంలోని కన్నడం మాట్లాడే జిల్లాలు కర్ణాటకలోను, మరాఠీ మాట్లాడే జిల్లాలు బొంబాయి రాష్ట్రంలోను కలిసిపోయాయి. ఆ విధంగా 1-11-1956 న మూడు కోట్ల తెలుగువారితో భాషాప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.
ఈ కలయిక నల్లేరుపై నడకగా సాగలేదు. అంత సంతోషాన్నీ కూర్చలేదు. సచివాలయం, హై కోర్టు హైదరాబాదులో ఉండడంతో, తెలంగాణేతర ప్రాంతంనుండి ప్రజలు భారీ సంఖ్యలో ఉద్యోగాలు వెత్కుకుంటూ హైదరాబాదుకు రావడం ప్రారంభమయింది. తెలంగాణ ప్రాంతంలో విద్యాస్థాయి తక్కువగా ఉండడం, ఇంగ్లీషు విద్యలో అంతగా పరిచయం ఉండకపోవడంతో ఆంధ్రప్రాంతం నుండి చాలామంది వచ్చి ఉపాధ్యాయ, వైద్య ఉద్యోగాలలో చేరడం, న్యాయవాదవృత్తి నవలంబించడం ప్రారంభమయింది. సచివాలయంలో ఉద్యోగాలు సరేసరి. పెద్దమనుషుల ఒప్పందంలో ఇచ్చిన రక్షణలు ఆచరణలో అటకెక్కాయి. స్థానికప్రజలలో ఇది అయిష్టాన్ని సృష్టించింది. క్రమంగా ఇది బలమైన ప్రత్యేకరాష్ట్ర ఉద్యమానికి దారితీసింది. 1969 లో తెలంగాణలో ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం రాజుకుంది.
1972 లో సుప్రీం కోర్టు ముల్కీ నిబంధనలకు ఆమోదం తెల్పడంతో, ప్రత్యేకాంధ్ర రాష్ట్రోద్యమమొకటి ప్రారంభమైంది. ఈ రెండు ఉద్యమాలూ సఫలం కాకపోవడానికి ప్రధానకారణం, శ్రీమతి ఇందిరాగాంధీ దృఢవైఖరి. ఈ రెండు ప్రత్యేకరాష్ట్రోద్యమాల తీవ్రత, ప్రజల తీవ్ర ఆకాంక్షలను పరిగణనలోకి తీసికున్నప్పుడు, వాటి విజయం దాదాపు అనివార్యమన్న పరిస్థితిలో నాటి ప్రధాని దృఢవైఖరి రాష్ట్రవిభజన జరగకుండా అడ్డుకుంది. తరువాత ఒక కృత్రిమ ఐక్యత పైకి కనిపించినప్పటికి అంతర్గతంగా విభజన ఆకాంక్ష తెలంగాణలో కొనసాగుతూనే ఉంది. ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెసును ఒడించి ఎన్.టి. రామారావు అధికారంలోకి వచ్చాడు. కాని అంతర్గతంగా ఈ నినాదం ఆంధ్రులలో ఐకమత్య సాధనలో సఫలీకృతం కాలేదు. తెలంగాణ ప్రాంతం ప్రత్యేకరాష్ట్ర ఆకాంక్ష పునరుజ్జీవమై బలమైన నాయకుడి కోసం ఎదురుచూస్తూ ఉంది. ఈ లక్ష్యాన్ని కె. చంద్రశేఖరరావు చేపట్టి, ఒక దశాబ్దం పాటు ఉద్యమం నడిపించాడు.
2013 లో కాంగ్రెసు పార్టీ తన స్వీయ ఎన్నికల కారణాలతో సూత్రప్రాయంగా 30-07-2013 నాటి సిడబ్ల్యుసి తీర్మానంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసికొంది. తదనుసారంగా అవసరమైన బిల్లును తయారుచేసి 01-03-2014 న పార్లమెంటులో ఆమోదింపజేశారు. రాష్ట్ర విభజనకు అపాయింటెడ్ తేదీగా 02-06-2014 ను నిర్ణయించారు. ఆ ప్రకారంగా పదేళ్లకు మించకుండా హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా రెండు రాష్ట్రాలేర్పడ్డాయి. పదేళ్ల తర్వాత హైదరాబాదు కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధాని అవుతుంది. చట్టంలోని సెక్షన్-6 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానికి సంబంధించి వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించడానికి ఒక నిపుణుల కమిటీ ఏర్పాటుకు అవకాశం కల్పించింది. కమిటీ ఆర్‌ఓఆర్ చట్టం చేసిన తేదీనుండి ఆరు నెలలలోగా తగిన సిఫారసులు చేయవలసి ఉంటుంది.
హైదరాబాదును యూనియన్ టెరిటరీ చేసి, రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ప్రకటించి ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానికోసం వెతకవలసిన అవసరమేర్పడేది కాదు. పునర్వ్యవస్థీకరణ చట్టం రాజధానీనగరం హైదరాబాదు పరిపాలన బాధ్యతను తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తూ, గవర్నరుకు కొన్ని అసాధారణ అధికారాలను ఇచ్చింది. హైదరాబాదు 10 సంవత్సరాలు మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఉంటుందనీ, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మాత్రమే ఉంటుందని ప్రకటించింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానికోసం అన్వేషణ, అసలు అపాయింటెడ్ డే 02-06-2014 కంటే ముందే ప్రారంభమయింది. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తనకు విడిగా రాజధానిని చూసుకోకతప్పదు, హైదరాబాదు వదిలి వెళ్లక తప్పదు.
Comments
Post a Comment