Yevari Rajadhani Amaravathi - IYR KrishnaRao

‘ఎవరి రాజధాని అమరావతి?' - ప్రస్తావన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని రెండు చిన్న రాష్ట్రాలుగా విభజించడం, ముఖ్యంగా చిన్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎంతో బాధనూ ఇబ్బందులనూ కల్పించడమే కాక భారీ వ్యయాన్ని కూడా మీద వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ రాజధానీ నగరాన్ని మళ్లీ నిర్ణయించుకొని సంపూర్ణంగా ఆ కొత్త ప్రాంతానికి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-6 ప్రకారం భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధానీ స్థలాన్ని నిర్ణయించడానికి ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడానికి శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ముందు వున్న లక్ష్యాలలో జనం స్థానభ్రంశం కావడం కనిష్ఠ స్థాయిలో జరగాలి. వ్యవసాయానికి, పర్యావరణానికి అతితక్కువ నష్టం జరగాలి. ప్రభుత్వ కోశాగారంపై అతితక్కువ భారం పడాలి. కమిటీ సరిగ్గా ఈ లక్ష్యాన్నే నిర్వహించింది. దాని సిఫారసులను ఆమోదించినట్లయితే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుదీర్ఘ భవిష్యత్తులో ఎంతో ప్రయోజనం కలిగించి ఉండేది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకత్వం మరోవిధంగా ఆలోచించింది. శివరామకృష్ణన్ కమిటీ సూచనలను ఏమాత్రం పట్టించుకోకుండా అది ఏక పక్షంగా నిర్ణయం తీసుకుంది. ఎక్కువమంది జనాన్ని నిర్వాశికులను చేయడం వ్యవసాయానికి, స్థానిక పర్యావరణానికి నష్టం కలిగించడం. సామాజికంగానూ నగదురూపేణా కూడా ప్రస్తుత రాబోయే తరాల రాష్ట్రప్రజల మీద భారీ వ్యయాన్ని మోపడం. కమిటీ సూచనలు అంగీకరించినట్లయితే జరిగేవి కావు.
రాజధానీ నగరం ఎక్కడ ఉండాలన్నది రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకూ సంబంధించిన విషయం. అట్లాగే అన్ని వర్గాల ప్రజలకూ సంబంధించిన విషయం. వాస్తవానికి నేటితరమే కాక, రాబోయే తరాల వారికి కూడా ఇది ముఖ్యమైన విషయమే. మనవంటి ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి విషయాలమీద నిర్ణయాలు ఏకపక్షంగా కాక అందరినీ కలుపుకొని తీసుకోవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందేమిటి? రాష్ట్రంలో అధికారంలో వున్న కొద్దిమంది పలుకుబడి కలిగిన వ్యక్తుల ఇష్టాయిష్టాల మీద ఆధారపడి నిర్ణయాలు జరిగాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలను చీకట్లో ఉంచడం జరిగింది.
గుంటూరు, కృష్ణా ప్రాంతంలో రాజధానీ నగర ఏర్పాటును వ్యతిరేకించిన వారి గొంతులను నొక్కివేయడమో, నిర్లక్ష్యం చేయడమో జరిగింది. కేంద్రప్రభుత్వ చట్టంలోని ప్రగతిశీలకమైన నిబంధనలను పక్కనపెట్టడం జరిగింది. ముఖ్యంగా లాండ్ ఎక్విజిషన్ రిహాబిలిటేషన్ రీ సెటిల్‌మెంట్ చట్టం, 2013 లోని నిబంధనలను తోసిరాజని లాండ్ పూలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. తత్ఫలితంగా రైతులు బలాత్కార పరిస్థితులలో తొందరపడి తమ హక్కులను తాకట్టుపెట్టి తమకు వాగ్దానం చేసిన అతితక్కువ నగదు పరిహారానికి భూములను ఇచ్చివేయవలసి వచ్చింది. నిజమైన వ్యవసాయదారులకు బదులుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం విజృంభించింది. రైతులు, వారిపై ఆధారపడిన వ్యవసాయకూలీలు, వృత్తికారులు నష్టపోయారు.
రాజధానీ నగరాన్ని మరోచోటికి తరలించవలసిన సమస్య చాలా కఠినమైన సవాళ్లను ఏర్పరచినప్పటికీ నిర్ణయాలు తీసుకునే స్థానంలో వున్నవారికి సృజనాత్మకమైన కొత్తబాటలు వేసే సువర్ణావకాశాన్ని కూడా ఇచ్చింది. గతంలో ఏర్పడిన రాజధానీ నగరాలు సాధారణంగా ఒకేచోట ఎక్కువ జనాభా కేంద్రీకృతమైనవి, పట్టణప్రాంతాలు కలిసి ఏర్పడినవి. కానీ డిజిటల్ కనక్టివిటీ, వేగవంతమైన రవాణా లభ్యమైన నేటి పరిస్థితులలో రాజధానులు ఒకచోట కేంద్రీకృతమై ఉండవలసిన అవసరం లేదు. ప్రభుత్వ కేంద్రాన్ని ప్రజలకు మరింత దగ్గరగా తీసుకొని వెళ్లవచ్చు. ప్రస్తుతం మనకు లభిస్తున్న సాంకేతకతలు ఆధికారిక సమాచారాన్ని డిజిటల్ స్టోరేజ్ రూపంలో నిలువచేయడానికి, ఆన్‌లైన్‌లో వ్యవహారాలు జరుపుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఇటువంటి పరస్థితులలో ఒకేచోట భారీ భవనాలు నిర్మించి అధికారాన్ని కేంధ్రీకృతం చేయడం, వాటి నిర్మాణానికి వివపరీతమైన డబ్బు ఖర్చుపెట్టడం దానికి సారవంతమైన వ్యవసాయభూములను నాశనం చేయడం ఏ మాత్రం అవసరం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకత్వం సృజనాత్మకంగా ఆలోచించదలచుకున్నట్లయితే ప్రజాప్రధానమైన ప్రభుత్వం విషయంలో తక్కిన దేశానికి ఒక ఆదర్శాన్ని నెలకొల్పగలిగి ఉండేది. దురదృష్టవశాత్తు రాష్ట్ర రాజకీయ నాయకత్వం తన దృక్పథంలో పూర్తిగా చత్వారంతో వ్యవహరించింది. ఇటువంటి అతిముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంలో విశ్లేషణాత్మకంగానూ, సంయమంతోనూ ఆలోచించే అవకాశాన్ని వదిలిపెట్టింది. దురదృష్టవశాత్తు ఇటువంటి నిర్ణయం వల్ల కలిగే సామాజిక కష్టనష్టాలను భరించవలసిన వారు ప్రస్తుత రాబోయే తరాల ఆంధ్రప్రదేశ్ ప్రజలే తప్ప ఈ రాజకీయ నాయకులు కారు. ఈ పుస్తకాన్ని రచించిన ఐ.వై.ఆర్. కృష్ణారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను విభజన తరువాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను చాలా ముఖ్యమైన ఉన్నత స్థానాలలో పనిచేశారు. ఆయన పదవీవిరమణ సమయానికి రాష్ట్రప్రధాన కార్యదర్శిగా రాష్ట్రంలోని సివిల్ సర్వీసెస్‌కు నాయకత్వం వహించారు. అందువల్ల ప్రభుత్వంలో అంతర్గతంగా నిర్ణయాలు తీసుకునే పద్ధతులను అతిసమీపంనుండి ఆయన చూడగలిగారు. ప్రజలకు ఇటువంటి దృక్కోణం అందుబాటులోనికి రావడం చాలా అరుదు. ఆయన ఈ పుస్తకంలో చెప్పిన విషయాలు, బహిరంగ పరచిన విషయాలు చాలా విలువైనవి. అందువల్ల వాటిని అంతే గంభీరంగా చదివి అర్థం చేసుకోవలిసిన అవసరం ఉంది. కృష్ణారావు ఈ రచనలో చూపించిన సూక్ష్మ విశ్లేషణ నిజంగా గణనీయమైనది. ప్రపంచంలో నగరీకరణ ఎలా జరిగింది, ముఖ్యంగా రాజధానీనగరాలు ఎలా ఏర్పడ్డాయి, అన్న విషయంలో భారతదేశంలోనూ, ఇతరత్రా జరిగిన పరిశోధనల ఫలితాలను ఆయన చర్చించారు.

రాజధానీ నగరంగా అమరావతిని నిర్ణయించడంలో జరిగిన లోపాలను, నగరప్రణాళికలో లోపాలను, తత్కారణంగా భవిష్యత్తులో ఏం జరగవచ్చునో అన్న విషయాలను ఆయన సూక్ష్మంగా పరిశీలించారు. గతకాలపు అనుభవాల దృష్ట్యా కృష్ణారావు తెలిపిన విషయాలనుండి రాష్ట్ర రాజకీయ నాయకత్వం పాఠాలను నేర్చుకున్నా, శివరామకృష్ణన్ కమిటీ వివేకవంతమైన సూచనలను పట్టించుకున్నా ప్రస్తుత, భవిష్యత్తరాల ప్రజలపై ఈ ప్రాజెక్టు సామాజిక వ్యయ భారాన్ని గణనీయంగా తగ్గించగలుగుతుంది. రాజధానీ నగరాన్ని ఒకేచోట కేంద్రీకరించకుండా భిన్నప్రదేశాలలో పంపిణీ చేసి ప్రభుత్వ పాలనను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు సమీపంలోకి తేగలుగుతుంది.
ఇప్పుడు ప్రణాళికీకరిస్తున్న పద్ధతిలో అమరావతీ నగరం, భూపరిహారపు సింహభాగం ధనికులైన ఆబ్సెంటీ రైతుల, మధ్యదళారీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. పేదలు నష్టపోతారు, ధనికులు లాభపడతారు. ఇటువంటి పక్షపాత ధోరణి కలిగిన ఏ పట్టణ విస్తరణ నమూనా అయినా సమాజంలో ప్రజల మధ్య విభేదాలను, అంతరాలను పెంపొందిస్తుంది. దేశంలోని పెద్దపెద్ద నగరాలలో జరిగింది ఇదే. అమరావతి ప్రణాళికాకారులు రాబోయే సంవత్సరాలలో దీన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.
భవిష్యత్తులో రాబోయే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలన్నీ సుప్రసిద్ధ గ్రీకుతత్త్వవేత్త ప్లేటో(క్రీ.పూ. 4వ శతాబ్ది) భవిషధ్వాణిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడం మంచిది. ‘‘ఏ నగరమైనా అదెంత చిన్నదైనా వాస్తవానికి రెండుగా విభాజితమై ఉంటుంది. ఒకటి పేదల నగరం. రెండవది ధనికుల నగరం. ఈ రెండూ ఎప్పుడూ ఒకదానితో ఒకటి పోరాటంలో ఉంటాయి.’’ మానవ వనరులపై తగినంత ఊనికలేని పట్టణప్రణాళిక ఎప్పుడూ నష్టదాయకంగానే పరిణమిస్తుంది. ‘ఎవరి రాజధాని అమరావతి?’ అన్న ఐ.వై.ఆర్. కృష్ణారావు విశ్లేషణాత్మక రచనను సాధ్యమైనంతమంది ఆంధ్రప్రదేశ్‌లోనే దాని వెలుపలా కూడా చదవాలని నా కోరిక. అది అమరావతిని ఎలా ప్రణాళికీకరించారు. భవిష్యత్తులో ప్రజలపై దాని ప్రభావం ఎలా ఉంటుంది. అన్న విషయాలపై ఈ గ్రంథం లోతైన పరిశీలనను అందిస్తున్నది. - ఇ.ఎ.ఎస్. శర్మ మాజీ కార్యదర్శి, భారత ప్రభుత్వం

Comments

Popular posts from this blog

Whose Capital Amaravathi - Introduction

Urban centres as growth engines