ACKNOWLEDGEMENTS By IYR KrishnaRao

కృతజ్ఞతలు IYRKrishnaRao-  Navyandhratho na nadaka

ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత వివిధ సమస్యల పరిష్కారంలో నా పాత్రను దగ్గరగా పరిశీలిస్తూ ఉన్న మిత్రుడు ఒకరు ఆ కీలక ఘట్టంలో ప్రత్యక్ష సాక్షిగా వున్న నేను నా అనుభవాలను జనంతో పంచుకుంటే బాగుంటుంది అని సూచించారు. ఇది మంచి ఆలోచనే అనుకున్నాను. నా పదవి విరమణ అనంతరం వెంటనే నా వ్యక్తిగత కార్యదర్శి శేషగిరికి కొన్ని వివరాలు డిక్టేట్ చేసాను. అయితే వెంటనే నేను మరో పదవీ బాధ్యత చేపట్టవలసి వచ్చింది. ఒకసారి ఈ బాధ్యతనుంచి కూడా బయటపడిన తరువాత భూపాలనా ప్రధాన కమీషనర్‌గా ఉన్నప్పటి నుండీ బ్రాహ్మణ కార్పొరేషన్ నుండి బయటికి వచ్చేంతవరకు జరిగిన విషయాలను కూడా చేర్చి దీన్ని విస్తరించాలనుకున్నాను. అందువల్ల ఈ పుస్తకంలో నేను CCLA గా వున్నప్పుడు ఎదుర్కొన్న చాలా ముఖ్యమైన భూమి కేసులలో నా అనుభవాలు కూడా చోటుచేసుకున్నాయి. అట్లాగే బ్రాహ్మణ కార్పొరేషన్ నుండి నేను బయటికి రావలసిన వాస్తవ పరిస్థితులను కూడా ఈ పుస్తకం వివరిస్తుంది. నన్ను బ్రాహ్మణ కార్పొరేషన్ నుండి తొలగించిన వెనువెంటనే పత్రికా విలేఖరుల సమావేశంలో దానికి కారణాలను వివరించే అవకాశం కలిగినప్పటికీ మరెన్నో విషయాలు ఆనాడు చెప్పనివి ఈ పుస్తకంలో చెప్పే అవకాశం లభించింది.

రాష్ట్ర విభజన సమస్యలు సంఘర్షణాత్మకంగా మారినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఇద్దరు అధికారులు స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పర్యాటక శాఖ శ్రీమతి చందనాఖాన్, కార్మికశాఖ అదనపు కమీషనర్ శ్రీ మురళీసాగర్ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో అద్భుతమైన శ్రద్ధను, వ్యక్తిగతమైన కష్టనష్టాలను ఎదుర్కొని తమ విధులకు అంకితమై పనిచేసారు. వారికి ఈ పుస్తకాన్ని అంకితం చేశాను.

ఈ పుస్తకం స్వభావ రీత్యా ఒక ప్రత్యేక కాలానికి సంబంధించిన స్వీయచరిత్ర కూడా కాబట్టి ఆ సమయంలో నేను వ్యవహరించవలసి వచ్చిన వ్యక్తుల గురించి, వారి స్వభావం, ధోరణుల గురించి తెలియజేస్తుంది.
రాష్ట్ర విభజన సమయంలో ఎదుర్కొన్న సమస్యల గురించి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని లోపాల గురించి, విభజనానంతర సమస్యల గురించి, వాటి పరిష్కారం గురించి పాఠకులు మెరుగైన అవగాహన కలగడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ నుండి నేను వైదొలగవలసిన పరిస్థితుల మీద ఇది మరింత వెలుగును ప్రసరిస్తుంది. 

నా సీనియర్ సహోద్యోగి శ్రీ ఎమ్. గోపాలకృష్ణ, ఐఏఎస్ (రిటైర్డ్) గారిని నా పుస్తకానికి ఒక ముందుమాట రాయమని కోరినప్పుడు ఆయన పుస్తకమంతా చదివి ముందుమాట రాసారు. వారికి నా హార్దిక కృతజ్ఞతలు. 1987-89 మధ్య కాలంలో నేను ఖమ్మం జిల్లా కలెక్టరుగా వున్నప్పుడు శ్రీ అజయ్ కల్లం గారు ఐటిడిఏ కి పిఓ గా వున్నారు. అప్పటినుండి మా పరిచయం. ఆయన మరో ముందుమాట రాయడానికి అంగీకరించారు. ఆయనకు నా కృతజ్ఞతలు. సిల్వర్ జూబిలీ కళాశాలలో నాతో పాటు చదువుకున్న ఒకే హాస్టల్‌లో వున్న మిత్రుడు శ్రీ వై.ఎస్. మూర్తి ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దడంలో శ్రమపడ్డారు. 'Whose Capital Amaravathi' అన్న నా పుస్తకానికి కూడా ఆయనే సంపాదకత్వం వహించారు. ఆయనకు నా కృతజ్ఞతలు. నా అన్ని ప్రయత్నాలలోనూ నాతో వున్న నా వ్యక్తిగత కార్యదర్శి శేషగిరికి ప్రత్యేక కృతజ్ఞతలు. 

Comments

Popular posts from this blog

Whose Capital Amaravathi - Introduction

ChandraBabu Naidu - CBN

Urban centres as growth engines