My Relations With Telangana CM ,KCR -Navyandhratho na nadaka

కేసిఆర్ ముఖం విప్పారింది. బొటన వేలు చూపించి ‘డన్’ అన్నారు. ...."నవ్యాంధ్ర తో నా నడక" 

9. కేసిఆర్‌తో సంబంధాలు

ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకోసం నేనెంత పోరాడినా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌కు నేనంటే మంచి అభిప్రాయమే ఉండేదని తెలిసింది. ‘మీరంటే ఆయనకు అభిమానం.. మీ నిజాయితీని ఆయన గౌరవిస్తారు..’ అని రాజీవ్ శర్మ ఒక సందర్భంలో చెప్పారు. నేను కేసిఆర్ ను ఒకటి రెండు సందర్భాల్లో తప్ప కలుసుకోలేదు. కలుసుకోవాల్సిన అవసరం రాలేదు. 

2015 డిసెంబర్ లో కేసిఆర్ ఆయుత చండీ యాగం తలపెట్టినప్పుడు మాత్రం ఆయనను కలుసుకునే అవకాశం లభించింది. అప్పుడు నేను ఛీఫ్ సెక్రటరీగానే ఉన్నాను.అప్పటికి నాకు ఆహ్వానం రాలేదు. యాగనిర్వాహకుల్లో ఒకరైన వెంకట రమణ శర్మ ఒకరోజు నాకు ఫోన్ చేశారు. 
‘యాగానికి ఎప్పుడు వస్తున్నారు సార్’ అని ఆయన అడిగారు. 
‘నాకు ఆహ్వానం అందలేదండీ’ అని చెప్పాను. 
ఆయన ఆశ్చర్యపోయారు. ‘మీకు ఆహ్వానం లేకపోవడమేమిటి సార్, మీరు వస్తారన్న చర్చ కూడా జరిగింది. ఎక్కడో పొరపాటు అయినట్లుంది. ఉండండి. మీతో మళ్లీ మాట్లాడుతాను’ అని ఫోన్ పెట్టేశారు.


సరిగ్గా మూడు నిమిషాల్లో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ‘ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని యాగానికి రమ్మని చెప్పారు సార్.. మీరు వీలు చూసుకుని తప్పని సరి రావాలి.’ అని అన్నారు. ‘సరే వస్తాను’ అని చెప్పాను

మరి కొద్ది సేపటికి హరీశ్ రావు నుంచి ఫోన్ వచ్చింది. ‘సార్ ఎప్పుడు వస్తున్నారు.. చెబితే మేము అంతా లైనప్ చేసుకుంటాం’ అన్నారు. 
నేనిక ఆలోచించలేదు. ‘ఈ సాయంత్రమే వస్తానండీ’ అని చెప్పాను. 
యాగం వద్ద నాకు హరీశ్ రావు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఎక్కడా ఇబ్బంది రాకుండా నన్ను లోపలికి తీసుకెళ్లారు. 

అప్పుడే పూజ అయిపోయింది. అనంతరం పళ్లు, హవిశ్శేషాన్ని కేసిఆర్ తాను తీసుకోకుండా నాకిమ్మని చెప్పారు. మామూలుగా చేతులు చాచి తీసుకోకుండా పైన పంచె పట్టుకుని ఎలా తీసుకోవాలో ఆయనే వివరించారు. లేచి వెళతానంటే తర్వాత కార్యక్రమం ముగిసే దాకా కూర్చోమని చెప్పారు. ప్రసాదం తీసుకొమ్మన్నాడు. 
నేను వెళుతుంటే మర్యాదగా సాగనంపేందుకు ముందుకు వచ్చారు. 
సరిగ్గా అదే సమయంలో నేను ‘సార్, చిన్నమాట’ అన్నాను. 
కేసిఆర్ నా వైపు చూశారు. ‘చెప్పండి’ అన్నారు. 
‘సార్. ఆంధ్రప్రదేశ్‌లో నా చొరవవల్ల బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటు చేశాను. కాని తెలంగాణలో బ్రాహ్మణుల పరిస్థితి ఆంధ్రా బ్రాహ్మణుల కంటే చాలా దారుణంగా ఉన్నది. మీరంటే బ్రాహ్మణులకు ఎంతో అభిమానం. ఇక్కడ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్రాహ్మణులను ఆదుకోండి.’ అన్నాను. 
కేసిఆర్ ముఖం విప్పారింది. బొటన వేలు చూపించి ‘డన్’ అన్నారు. 


కొన్ని నెలల తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ మేధోమధనం ఏర్పాటు చేసి ఆ సమావేశానికి నన్ను ఆహ్వానించారు. అప్పటికి నేను పదవీ విరమణ చేసి ఎపి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాను. కేసీఆర్ వస్తూనే ‘కృష్ణారావు గారు, వచ్చారా?’ అని నన్ను చూసి ఆప్యాయంగా పలకరించారు.సుదీర్ఘంగాజరిగిన ఈ సమావేశంలో నాతో పాటు సాంస్కృతిక శాఖ సలహాదారు కె. వి. రమణాచారి, పార్లమెంట్ సభ్యుడు కాప్టెన్ లక్ష్మీకాంతరావు కూడా పాల్గొన్నారు. ఆయన కోరిక మేరకు నేను ఆంధ్రప్రదేశ్‌లో బ్రాహ్మణుల కార్పొరేషన్ ఏవిధంగా ఏర్పరిచానో, అది ఎలా నడుస్తుందో వివరించాను. బ్రాహ్మణుల సమగ్ర అభివృద్ధిలో భాగంగా బ్రాహ్మణ సదనం నిర్మించాలని ఈ సమావేశం తీర్మానించింది. ఈ సదనం పనులను వేగవంతం చేసేందుకు కమిటీని నియమించి నన్ను, మాజీ డీజీపి అరవిందరావును ప్రత్యేక ఆహ్వానితులుగా వ్యవహరించాలని కోరారు. 

దీనికనుగుణంగానే తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేశారు. 200 కోట్లు కేటాయించారు. ఆరోజు సమావేశంలో నన్ను అరవిందరావుగారిని కమిటీలో ఉండమన్నారు. క్రిందిస్థాయి రాజకీయంవలన ఇది కార్యరూపం దాల్చలేదు. ఇక బ్రాహ్మణపరిషత్ ఏర్పడిందేకాని దాని కార్యక్రమాలు పుంజులోలేదు. అధికారుల స్థాయిలో ఆటంకాలేర్పడ్డాయి. ఇచ్చేవాడున్నా తెచ్చుకునే సామర్థ్యం లోపించింది. ఆ సంస్థ కుంటినడక నడుస్తున్నది. ఈ అంశంలో ఆయన నిబద్ధతని శంకించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అర్చకుల సంక్షేమం విషయంలో కూడా.


Comments

Popular posts from this blog

Whose Capital Amaravathi - Introduction

Urban centres as growth engines