Whose Capital Amaravathi - International Experience with Capital City Building
3. రాజధానీనగర నిర్మాణంలో అంతర్జాతీయ అనుభవం
పై సైద్ధాంతిక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రపంచవ్యాప్తంగా వివిధదేశాలలో రాజధానీనగరస్థలాల విషయంలో వాస్తవ అనుభవాలను పరిశీలించడం బాగుంటుంది. స్థూలవిశ్లేషణలో రాజధానీనగరాల స్థల నిర్ణయంలో పైవివరించిన ఒక సూత్రాన్నో, మరో సూత్రాన్నో లేదా ఆ సూత్రాల సమ్మిశ్రణాన్నో ఉపయోగించినట్లు తెలుస్తుంది.
యుఎస్ఎ రాజధాని వాషింగ్టన్ డిసి
అమెరికా సంయుక్తరాష్ట్రాల రాజధానీనగరంగా వాషింగ్టన్ డిసి రూపుదిద్దుకోవడం వివిధ దేశాలలో వివిధ ఫెడరల్ రాజధానీనగరాలకు స్ఫూర్తినిచ్చింది. వాషింగ్టన్ డిసి అమెరికా రాష్ట్రాలన్నిటి ప్రయోజనాలకూ సమప్రాధాన్యం వహించేటట్లు ప్రణాళికీకరించబడింది. తదనుగుణంగానే దాని పాలన బాధ్యత ఫెడరల్ ప్రభుత్వానిదే. స్థానిక పురపాలక వ్యవస్థ పాత్ర అత్యల్పం మాత్రమే.
అమెరికా దేశంలోని ఉత్తరదక్షిణ రాష్ట్రాల మధ్య సర్దుబాటుగా ఈ నగరం రూపొందింది. అంతర్యుద్ధానంతరం అప్పుల బాధ్యతను ఫెడరల్ ప్రభుత్వం స్వీకరించాలని ఉత్తర రాష్ట్రాలు కోరుకున్నాయి. దక్షిణ రాష్ట్రాలు దీనికి అభ్యంతరం తెలిపాయి. రాజీగా ఒక అంగీకారం కుదిరింది. రాజధానీనగరం దక్షిణ రాష్ట్రాలకు సమీపంగా ఉంటుంది. యుద్ధకారణంగా ఏర్పడ్డ ఋణాలను ఫెడరల్ ప్రభుత్వం చెల్లిస్తుంది. తదనుగుణంగా పోటొమాక్ నదీతీరంలో మేరీలాండ్, వర్జీనియా రాష్ట్రాలనుండి భూమిని తీసికొని నగరాన్ని నిర్మించారు. దీన్ని కాపిటల్ హిల్ మీద ఉన్న గ్రామంగా ఆ రోజులలో వర్ణించారు. దేశ వాణిజ్యకేంద్రాలుగా న్యూ యార్కు, ఫిలడెల్ఫియా వంటి పట్టణాలను వదిలి, కేవలం పరిపాలనస్వభావానికి మాత్రమే ఇది పరిమితమైంది. వాషింగ్టన్ డిసి ఒక ప్రధాన మహానగరంగా రూపొందడానికి దాదాపు ఒక శతాబ్దం పట్టింది.
అదే పద్ధతిలో అమెరికా సంయుక్తరాష్ట్రాలలోని రాష్ట్రాల రాజధానులను కూడా ఇదే తర్కాన్ని ఉపయోగించి ఎంపిక చేశారు. కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటో, టెక్సాస్ రాజధాని ఆస్టిన్, న్యూ యార్కు రాజధాని ఆల్బనీ, ఆయా రాష్ట్రాల పెద్దపెద్ద నగరాలతో పోలిస్తే ఈ రాజధానులు చాలా చిన్నవి. ఆ రాష్ట్రంలో ఆ రాజధాని ప్రదేశపు తటస్థస్థితి ఆధారంగా దాని ఎంపిక జరిగి ఉంటుంది.
ఆస్ట్రేలియా రాజధాని కాన్ బెరా
ఆరు రాష్ట్రాల సమాఖ్యగా ఆస్ట్రేలియా ఒక దేశంగా రూపొందింది. రాజధానీనగరస్థాన నిర్ణయంలో ఉద్దేశపూర్వకంగానే ఏ ఒక్క రాష్ట్రానికో తక్కిన వాటిపై ఆధిక్యం లేకుండా చూసే ప్రయత్నం జరిగింది. దేశంలోని అతి పెద్ద నగరాలైన సిడ్నీ, మెల్బోర్న్ నగరాలకది సమదూరంలో ఉండాలని కూడా నిర్ణయించారు. తదనుగుణంగా రాజధానీనగరం కాన్ బెరా ప్రస్తుతస్థలాన్ని ఎంపిక చేశారు. ఈ ప్రదేశం ఆదిమ తెగల సమావేశ ప్రదేశం. స్థానిక భాషలో కాంబెరా అంటే సమావేశ స్థలమని అర్థం. అందుకే ఈ పేరు ఎంపిక చేశారు. వాషింగ్టన్ డిసి నిర్మాణం నమూనాపై ఆధారపడి వాస్తు ప్రణాళికలో మూడు కొండలు కీలక ప్రాంతాలుగా ఉండేటట్లు నగరాన్ని నిర్మించారు.
దక్షిణాఫ్రికా పంపకపు రాజధాని
స్థలం సర్దుబాటులో భాగంగా రాజధానీప్రదేశాన్ని ఒక తటస్థ ప్రాంతంలో నిర్మించవచ్చు లేదా విశిష్ట గుర్తింపు ఉన్న భిన్నప్రాంతాల మధ్య సమతుల్యత కోసం ప్రభుత్వ కార్యకలాపాలను భిన్న ప్రాంతాలకు పంపిణీ చేయవచ్చు. దక్షిణాఫ్రికాలో ఈ రెండో విధానాన్ని అనుసరించారు. అధికారస్థానాన్ని మూడు ప్రాంతాల మధ్య విభజించారు. ఆంగ్లో – బోయర్ యుద్ధానంతరం ట్రాన్స్‌వాల్, కేప్ రాష్ట్రం, ఆరెంజ్ రిపబ్లిక్, నాటల్ అన్న భిన్న భూభాగాల కలయికతో దక్షిణాఫ్రికా ఏర్పడింది. ఈ ప్రాంతాలన్నిటి మధ్యా ప్రాంతీయ సమతుల్యతను పాటించడానికి దేశాధ్యక్షుడు ప్రిటోరియాలోను, పార్లమెంటు కేప్‌టౌన్‌లోనూ, సుప్రీం కోర్టు బ్లోమ్ ఫౌంటెయిన్ లోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జాతి వివక్షావిధానం ముగిసిన తర్వాత రాజ్యాంగ న్యాయస్థానాన్ని జొహాన్నెస్‌బర్గ్‌కు మార్చారు. ఆ విధంగా ప్రభుత్వ విధులను దక్షిణాఫ్రికాలో మూడు భిన్న ప్రాంతాలనుండి నిర్వహిస్తున్నారు.
నైజీరియా రాజధాని అబూజా
బ్రిటన్ నుండి నైజీరియా స్వాతంత్ర్యం పొందినప్పుడు లాగోస్ రాజధానిగా ఉండేది. మొదటి దేశాధ్యక్షుడు రాజధానిని లాగోస్ నుండి దేశానికి కేంద్రస్థానంలో ఉండే అబూజాకు మార్చాలన్న ఆలోచన చేశాడు. అతని వారసులు కూడా ఈ అభిప్రాయాన్ని సొంతం చేసుకున్నారు. రాజధానిని మార్చడానికి ఒక కారణాన్ని లాగోస్‌లో అధిక జన సమ్మర్దం. నగర జనాభాలో కొంత భాగాన్ని రాజధానీనగరాన్ని మార్చడం ద్వారా తరలించినట్లయితే లాగోస్‌లో జీవన పరిస్థితులు మెరుగుపడతాయన్నది అభిప్రాయం. అంతర్గతంగా రాజధానిని దేశకేంద్ర ప్రాంతానికి మార్చడంలో మరోకారణం కూడా ఉంది. అది మతపరమైన తెగలు ముస్లిములు, క్రైస్తవుల మధ్య రాజీగా రాజధాని తరలింపు నిర్ణయం జరగటం. ఉత్తరాదిలో ముస్లిములు, దక్షిణాదిలో క్రైస్తవులు ఉండడం వల్ల రాజధానీనగరాన్ని తటస్థ స్థానంలో ఏర్పరచవలసి వచ్చింది. స్థలం సర్దుబాటుగా తటస్థసూత్రంగా అబూజాలో రాజధాని ఏర్పాటు జరిగింది.
రాజధానీనగర నిర్మాణానికి పెట్టుబడులు నైజీరియా పెట్రోలియం ఆదాయం నుండి ఉపయోగించారు. రాజధాని నిర్మాణంలో అవినీతి విపరీతంగా పెచ్చరిల్లిపోయింది. ఈ కాంట్రాక్టులకు అబూజా కాంట్రాక్టులన్న పేరు వచ్చింది. ప్రాజెక్టు వ్యయంలో 25% అంచనాలు పెంచి ఈ కాంట్రాక్టులు ఇచ్చారు. రాజధాని తరలింపులో ఉద్దేశించిన రెండు ప్రయోజనాలను కొత్త రాజధాని సాధించిందా అన్నది సందేహాస్పదం. రాజధాని అబూజాకు మారిన తర్వాత కూడా లాగోస్‌లో అధిక జనసమ్మర్దం అలాగే ఉంది. జాతి పరమైన ఒత్తిడులు కూడా మరింత పెరిగాయి. తటస్థ రాజధానిగా ఉండడానికి బదులు అది ముస్లిం ప్రాబల్యంలోకి వచ్చి క్రైస్తవుల నిరసనకు దారితీసింది. ఇటీవల అబూజాకు ప్రాధాన్యం పెరుగుతూ ఉంది.
మలావీ రాజధానీ నగరం
మలావీ ఆఫ్రికాలో జల సరిహద్దులేని దేశం. తన రాజధానిని 1975 లో దక్షిణాన ఉన్న జోంబా నుండి ఉత్తరాన ఉన్న లిలోంగ్వే పట్టణానికి తరలించింది. రాజధానిని మార్చడానికి పైకి కనిపించే ప్రధాన కారణం దేశ మౌలిక ప్రాంతంలో స్వతంత్ర అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పరచడం. ఆ విధంగా దేశంలో అభివృద్ధిని సమతుల్యం చేయడం. అయితే ఇందులో ఒక రహస్య అజెండా ఉంది. అప్పటి దేశాధ్యక్షుడి తెగ ప్రజలు అధికంగా ఉండే ప్రాంతానికి ఇది దగ్గరగా ఉంది. ప్రకటించిన అజెండాకు భిన్నంగా రహస్య అజెండా కారణంగా రాజధానిని తరలించిన సందర్భాలకు ఇదొక ఉదాహరణగా నిలుస్తుంది.
బోస్ట్వానా రాజధానిని గబొరోన్‌కు తరలించడం
మొదటి బోస్ట్వానా రాజధాని మఫెకింగ్. ఇది దేశంలోని పలుకుబడి కలిగిన తెగలలో ఒకటైన బారోలాంగ్ తెగకు సాంప్రదాయిక స్థావరం. ఇది తక్కిన తెగలలో నిరసనకు దారితీసింది. దేశంలోని అన్ని తెగలకూ అంగీకారయోగ్యమైన మరోస్థానంలో రాజధానిని స్థాపించవలసిన అవసరం ఏర్పడింది. ఆ విధంగా 1969 లో రాజధాని గబొరోన్‌కి మారింది. ప్రభుత్వం రాజధాని మార్పులో రాజకీయపు సర్దుబాటు నిర్ణయాన్ని తీసికొంది.
సొమాలియా, సెనెగల్ వంటి ఇతర ఆఫ్రికా దేశాలలో రాజధానిని మరింత కేంద్రప్రాంతాలకు తరలించే విషయంలో చర్చలు జరుగుతున్నాయి.
ఆ విధంగా ఆఫ్రికాలో రాజధాని స్థలం విషయంలో జాతి, ప్రాంత సమతుల్యత, నగరాలలో సమ్మర్దాన్ని తగ్గించడం ప్రధానపాత్ర వహిస్తున్నాయి. రహస్య అజెండాలో దేశ నాయకుని జన్మస్థలం, లేదా అతని తెగ ప్రాబల్యం వంటివి కూడా ప్రధానమవుతున్నాయి.
మలేసియా రాజధాని పుత్రజయ
1857 లో బ్రిటిష్ వారు మలేసియా రాజధానిగా కౌలా లంపూర్‌ను స్థాపించారు. 1993 లో మహాతిర్ మొహమ్మద్ రాజధానిని మరో చోట ఏర్పాటు చేయాలని నిర్ణయించేంతవరకు ఇదే రాజధానిగా కొనసాగింది. పుత్రజయ కౌలా లంపూరుకు 25 కి.మీ. దూరంలో ఉంది. రాజధాని మార్పుకు రెండు ప్రధాన కారణాలు. ఒకటి వరదలు. రెండు రాజధాని ఇరుకైపోవడం. మరో అంతరంగ కారణం కూడా ఉంది. అన్ని ఆగ్నేయాసియా దేశాల్లాగానే కౌలా లంపూరుతో సహా ప్రధాన నగరాలన్నింటిలో నగరప్రదేశాలన్నిటినీ చైనీయులు ఆక్రమించుకున్నారు. కౌలా లంపూరులో 80% జనాభా చైనీయులే. వలస రాజ్యకాలంనుండి వాణిజ్యమంతా చైనీయుల నియంత్రణలోనే ఉంది. స్థానిక మలే జాతీయులు వాణిజ్యంలో చైనీయుల పాత్రను తగ్గించి, వాణిజ్యంలోను, పరిపాలననేతృత్వంలోను స్థానికజాతి వారి ప్రాబల్యాన్ని పెంచుకోవాలని భావించారు. అందువల్ల రాజధానిని కౌలాలంపూరు నుండి పుత్రజయకు మార్చడంలో రాజకీయ, వాణిజ్య రంగాలలో స్థానిక నాయకత్వాభివృద్ధి ఒక ప్రధాన లక్ష్యం.
రాజధానీనగర ప్రాంతనిర్ణయం ఒక జాతిపరమైన మలే నగర స్థాపనకు, మలే నగర జనాభా సృజనకు ఒక చోదకశక్తిగా పనిచేయడానికి ఉద్దేశించినది. చారిత్రిక నగరాలలో చైనీయుల ప్రాబల్యానికి వ్యతిరేకంగా ఒక కౌంటర్ కాలనైజేషన్, కౌంటర్ అర్బనైజేషన్‌గా ఇది వచ్చింది. దేశపు పెట్రొనాస్ ఆయిల్ మొనోపలీ లాభాలనుండి నగర నిర్మాణానికి ప్రధానంగా నిధులు వినియోగించరు. నగరం ఆయిల్ పామ్ పొలాల నడుమ ఉంది. మలేసియాకు పరిపాలనపరమైన రాజధానిగా దీన్ని ఉద్దేశించారు. బయటికి కనిపించే కారణం అప్పటి రాజధాని సమ్మర్దాన్ని తగ్గించడం అయినప్పటికీ, సైద్ధాంతికంగా దీన్ని వికేంద్రీకరణ వ్యూహంగా అంతర్గత కారణం అభివర్ణిస్తుంది. మలే జాతీయుల పట్టణ మధ్యతరగతి అనే కొత్త వర్గాన్ని సృజించే లక్ష్యంతో రాజధాని తరలింపు జరిగింది. మలే గుర్తింపు, మత ఆధారంగా ఈ పట్టణంలో వాస్తునిర్మాణంపై ఇస్లామిక్ లక్షణాలకు ప్రాధాన్యమివ్వడం జరిగింది. ఆ విధంగా దీన్ని అందరినీ కలుపుకొని వెళ్లే నగరంగా కాక, ఒకవర్గానికి మాత్రమే పరిమితమై తక్కినవారిని వెలుపల పెట్టే నగరంగా భావించాలి.
ఇది విపరీతమైన వృథా ఖర్చు అనీ, వాస్తు ఆర్భాటమేననీ, మలయా సంస్కృతిని ప్రతిబింబించదని విమర్శలు వచ్చాయి. ప్రధానమైన చైనీయ, భారతీయ జనాభా నివసిస్తున్న దేశంలో ఇస్లామిక్ శైలి భవనాలతో నింపివేయడం అనుచితంగా తోస్తుంది. ఇటువంటి భవనాలు నిర్వహణ ప్రధానమైనవి. ప్రజాస్వామ్యంలో రాజభవనాల లాంటి నిర్మాణాలు అనుచితమైనవి, మొత్తంమీద ఆరు బిలియన్ల అమెరికన్ డాలర్లను రాజధాని నిర్మాణంపై ఖర్చుపెట్టడం మహాతిర్ మొహమ్మద్ లా తమని మించిన వారు లేరని అతి గొప్పలు చూపేవారి (megalomaniacs) పని అనీ, దాన్ని మరింత సముచితమైన విషయాలపై ఖర్చు పెట్టవలసిందనీ విమర్శకులంటున్నారు.
ఇండోనీసియాలో రాజధాని స్థానమన్నది చాలా పాత చర్చాంశం. జకార్తాలో జన సమ్మర్దాన్ని తగ్గించవలసిన అవసరం, భూకంపాల ప్రమాదం, పాలకులు కొత్త రాజధానిని అన్వేషించవలసిన అవసరాన్ని కల్పిస్తున్నాయి. ఇండోనీసియా ద్వీప సముదాయానికి నడుమన ఉన్న కాలీమంతన్ ద్వీపం దీనికి సహజమైన ఎంపిక. ఈ చర్చ చాలాకాలం నుండి జరుగుతూ ఉన్నప్పటికీ ఒక నిర్దిష్ట నిర్ణయం జరగలేదు.
పాకిస్తాన్ రాజధానీ నగర ప్రదేశం
పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందినప్పుడు కరాచీ రాజధాని. 1959 ప్రాంతంలో కరాచీ నుండి రాజధానిని మరికొంత లోపలికి మరింత కేంద్రస్థానానికి మార్చాలన్న నిర్ణయం జరిగింది. ఇస్లామాబాదును రాజధాని స్థానంగా నిర్ణయించడానికి వెనుక కొన్ని కారణాలున్నాయి. వాటిలో ఒకటి భారతదేశంనుండి పాకిస్తాన్ తనదిగా పేర్కొంటున్న కాశ్మీరుకు దగ్గరగా ఉండడం. ఇస్లామాబాదు పఖ్తూన్ ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో ఉంది. పఖ్తూన్‌లో వేర్పాటువాద ధోరణులు ప్రబలుతున్న సందర్భంలో రాజధాని దానికి సమీపంగా ఉండడం ఆ ప్రాంతంపై అధికనియంత్రణ నిస్తుంది. అప్పటికి కరాచీలో తరచుగా వలసవచ్చిన ముహాజిర్‌లు, స్థానిక సింధీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. కరాచీ ముఖ్యమైన మహానగరం కావడం వల్ల ఆందోళనలు తరచుగా జరుగుతూ ఉంటాయి. అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ పఖ్తూన్ వాడు కావడం కూడా రాజధాని స్థలం ఎంపికలో ప్రధానపాత్ర వహించి ఉంటుంది. వాస్తవానికి తన సొంత ప్రదేశం అబ్బటాబాదులో రాజధానిని ఏర్పరచాలని అతని కోరిక. అయితే అది భూకంపాలు తరచుగా వచ్చే అవకాశాలున్న ప్రదేశం కావడం వల్ల దానికి సమీపంలోనే ఉన్న ఇస్లామాబాదు ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది.
ఇస్లామాబాదుకు సమీపంలో ఉన్న రావల్పిండి నగరం ఒక ప్రధాన సైనికస్థావరం కావడం కూడా ఇస్లామాబాదు ఎంపికలలో కీలకపాత్ర వహించి ఉంటుంది. ఎందుకంటే దేశాన్ని పరిపాలిస్తున్నది సైనిక యంత్రాంగం కాబట్టి. మరో ముఖ్యకారణం లాహోరు, కరాచీ వంటి అధిక జనాభా కలిగిన నగరాలను సైన్యం తన నియంత్రణలోకి తెచ్చుకోవడం కష్టం కాని, ఇస్లామాబాదు వంటి విడిగా ఉన్న రాజధానీనగరాన్ని సైన్యం స్వాధీనంలోకి తెచ్చుకోవడం సులభం. నగరాన్ని గ్రీకు ఆర్కిటెక్టు చక్కగా ప్రణాళికీకరించాడు, సెక్టర్లుగా విభజించారు. వాతావరణం బాగుంటుంది. దీర్ఘకాలంగా ఇక్కడ పౌరజనాభా కంటే సైన్య జనాభా అధికంగా ఉండి, పౌరులు తక్కిన ప్రాంతాలతో పోల్చినప్పుడు మెరుగైన జీవన ప్రమాణాలను, జీవనస్థాయిని అనుభవిస్తున్నారు.
భారత రాజధాని
భారత రాజధాని కలకత్తా నుండి 1911 లో కొత్త ఢిల్లీకి మారింది. కలకత్తా నుండి కొత్త ఢిల్లీకి రాజధానిని మార్చడానికి ప్రధాన కారణం బెంగాలు రాష్ట్రంలో జాతీయోద్యమ తీవ్రత. ముస్లింల మెజారిటీ ఉన్న తూర్పు బెంగాలును 1905 లో విభజించడం ద్వారా జాతీయోద్యమాన్ని బలహీనపరచడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే వాస్తవానికి ఉద్యమం తీవ్రతరమయింది. బ్రహ్మాండమైన ప్రజావ్యతిరేకత వల్ల బ్రిటిష్ వాళ్లు బెంగాలును మళ్లీ కలపవలసి వచ్చింది. అయితే రాజధానిని ఢిల్లీకి తరలించాలన్న నిర్ణయం జరిగింది.
దీనికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కలకత్తాను రాజధానీనగరంగా ఎంపిక చేసికున్నప్పుడు, అది బ్రిటిషు వారికి ప్రధానమైన ప్రవేశద్వారంగానూ, ముఖ్యమైన రేవు పట్టణంగానూ ఉంది. బర్మా వంటి దేశాలమీద కూడా ప్రభావం చూపించడానికి అనుకూలంగా ఉండింది. 20 వ శతాబ్దంలో అడుగుపెట్టే సమయానికి బ్రిటిషువారికి తమ పశ్చిమ సరిహద్దులను ఆఫ్ఘాన్ల నుండీ, రష్యన్ల నుండీ ఎలా కాపాడుకోవాలో అనే సమస్య ప్రధానమైంది. జాతీయోద్యమం దేశంలోని ఇతరప్రాంతాలలో కూడా వ్యాపించి ఉన్నప్పటికీ, తక్కినచోట్ల బెంగాలులో ఉన్నంత తీవ్రంగా లేదు. రాజధానిని ఢిల్లీకి మార్చడంలో బ్రిటిషువాళ్లు భారతజాతీయవాదానికి బెంగాలు జాతీయవాదానికి భిన్నంగా ప్రోద్బలం కల్పించాలన్న భావన కనిపించింది.
ఢిల్లీకి సుదీర్ఘమైన చారిత్రక ప్రాధాన్యముంది. మహాభారతకాలం నుండీ రాజధానిగా ఉండి, తొలి ముస్లిం రాజులు, మొఘలు వంశ రాజులకు కూడా రాజధానిగా ఉన్న చరిత్ర దానికి ఉంది. ఇదంతా ఢిల్లీకి ఒక చారిత్రకప్రాధాన్యాన్ని సంతరించింది. రాజధానిని ఢిల్లీకి మార్చడానికి బ్రిటిషు వారికి ఇదొక ముఖ్య కారణంగా భాసించింది. నగర ప్రణాళిక సామ్రాజ్యరీతికి (Imperial) చెందింది. ఆ కాలంలో నిర్మించిన భవనాలు స్వతంత్ర భారతదేశంలో కూడా ఉపయోగంలో ఉన్నాయి. నగరంలోని ప్రభుత్వ భవనాలను డిజైన్ చేసిన ముఖ్యమైన ప్రణాళికాకర్తలలో ఒకడైన హెర్బర్ట్ బేకర్ ఇలా అన్నాడు, ‘ఈ నగరాన్ని భారతీయ నగరంగా గానీ, ఆంగ్లనగరంగా గానీ, రోమన్ నగరంగా గానీ నిర్మించలేదు. సామ్రాజ్యరాజధానిగా దీని నిర్మాణం జరిగింది.’
మయన్మార్ రాజధాని
2005 లో మయన్మార్ సైనిక పాలకులు అప్పటి రాజధాని రంగూన్ నుండి దానికి సుమారు 300 కి.మీ.ల దూరప్రాంతంలో ఉన్న నేప్యిడాకు మార్చారు. స్థానిక విశ్వాసాల ప్రకారం జ్యోతిషశాస్త్ర పరంగా ముఖ్యమైన తేది, సమయాన కొత్త రాజధానిని ఏర్పరచడం జరిగింది. అప్పటినుండి ఈ నగరం ముఖ్యమైన నగరంగా అభివృద్ధి చెంది, ప్రస్తుతం 10 లక్షల జనాభాకు చేరుకుంది. రాజధాని మార్పిడిలో జ్యోతిషశాస్త్ర పరమైన కారణాలతోపాటు, వ్యూహాత్మక కారణాలు కూడా ఉన్నాయి. అమెరికా, నాటోల దాడి అవకాశాలను ఊహించి మిలిటరీ పాలకులు రాజధానీ నగరాన్ని కొత్తచోటికి తరలించారు.
రంగూన్‌తో పోల్చినప్పుడు దేశం లోపలివైపు దూరప్రాంతంలో కొత్త రాజధాని ఉండడం అధిక భద్రతగా సైన్యాధికారులు భావించారు. ఇతర కారణాల వల్ల కూడా రాజధానీనగర స్థలానికి న్యాయసమ్మతి ఉంది. వలసపాలకులు రాజధానిని రేవుపట్టణానికి మార్చకముందు మయన్మార్ రాజధాని ఎల్లప్పుడూ దేశానికి కేంద్రప్రాంతంలోనే ఉంది. రాజధానీనగరం దేశకేంద్రప్రాంతంలో ఉండడం భిన్న ప్రాంతాల ప్రయోజనాల మధ్య సమతుల్యతను కాపాడుతుంది. మయన్మార్ చరిత్ర, భౌగోళిక అస్తిత్వాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు రాజధానీనగర ప్రదేశం దేశ కేంద్రప్రాంతంలో ఉండడం సముచితంగానే ఉంది. నగర ప్రణాళికను చాలా భారీస్థాయిలో రూపొందించారు. దానివల్ల నగరంలో జనులు ఆవాసాలేర్పరచుకోవడానికి సుదీర్ఘకాలం పట్టింది. ఆ మధ్య కాలంలో అదొక నిర్మానుష్యమైన దయ్యపునగర భావన కల్గించింది.
బ్రెజిల్ రాజధాని బ్రసీలియా
బ్రెజిల్ రాజధానిని రియో నుండి బ్రిజిల్ లోతట్టు ప్రాంతానికి తరలించాలనే నిర్ణయం 1956 లో జరిగింది. బ్రెజిల్‌లో సవాన అడవుల ప్రాంతంలో ఉన్న సెరాడో ప్రాంతంలో రాజధానిని నిర్మించాలని నిర్ణయించారు. రాజధానీనగరాన్ని దేశం లోపలి ప్రాంతానికి తరలించడానికి అనేక కారణాలున్నాయి. వలస రాజధాని అట్లాంటిక్ సముద్రతీరంలోని రియో డి జనీరో దీన్ని దేశం లోతట్టు ప్రాంతానికి మార్చడం ద్వారా ఆ ప్రాంతాల అభివృద్ధి వేగాన్ని పెంచే అవకాశం కలిగింది. బ్రెజిల్ దేశంలో అప్పటివరకు దేశం ఒక భౌగోళిక భావనేకాని జాతీయ భావనకాదు. ఒక కొత్త రాజధాని నిర్మాణం ద్వారా జాతీయభావన తెచ్చే యత్నం జరిగింది. పైగా రియోలో జనసమ్మర్దం విపరీతంగా పెరిగి, అసమానతలు పెచ్చుపెరిగాయి. ఒక నూతన సామాజిక వాతావరణాన్ని తీసికొని వచ్చి ఒక సామాజిక సమానీకరణ ప్రయత్నానికి కొత్త రాజధానీనగరం ఉపయోగపడుతుందని భావించారు. 2010 నాటికి బ్రసీలియా ఒక ప్రధాన నగరంగా రూపొందింది. 25 లక్షల జనాభాతో దేశంలోని వివిధ ప్రాంతాలనుండి రాజధానికి జనాన్ని ఆకర్షించింది. ఈ వలసలు బ్రెజిల్ వంటి విశాలదేశపు అంతర్గత ప్రాంతాలకు అభివృద్ధి ద్వారాలను తెరిచాయి. వంపులు, విశాలమైన బహిరంగ స్థలాలపై గొప్ప ఊనికతో ఈ నగరం వాస్తుపరంగా కూడా బ్రెజిల్ సాంస్కృతిక స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తూ ఉంది.
మరో వైపున మురికివాడలు లేని నగరంగా దీన్ని ప్రణాళికీకరించారు. కానీ నగరనిర్మాణ కాలంలోనే మురికివాడలు అభివృద్ధి చెందసాగాయి. కొత్త రాజధానిని నిర్మాణంలో దేశపు వనరులను భారీగా ఉపయోగించడం వల్ల ఆర్థిక అస్తవ్యస్తత ఏర్పడి, చివరికి సైన్యం చేతిలోకి ప్రభుత్వం వెళ్లిపోయింది.
లాటిన్ అమెరికా దేశాలలో కూడా రాజధానీనగరాలను మరోప్రాంతానికి తరలించే విషయంపై తరచుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం భూకంపాలు, తుపానులు వంటి జాతీయ ఉపద్రవాలకు ఈ నగరాలు గురికావడమే. బెలీజ్, హైతీ, నికరాగువా వంటి దేశాలలో ఈ సమస్య ఉంది. ఇతర దేశాలలో ప్రాంతీయ సమతుల్యతలు, ప్రస్తుత రాజధానులు అనియంత్రంగా పెరిగిపోవడం రాజధాని మార్పిడి చర్చలకు ప్రధానమైన హేతువులవుతున్నాయి.
జర్మన్ రాజధాని బెర్లిన్
1991 లో బెర్లిన్ గోడ కూలిపోవడంతో సమైక్య జర్మనీకి ఏది రాజధానిగా ఉండాలన్న విషయంలో తీవ్రమైన చర్చ జరిగింది. చివరికి రాజధానిని బెర్లిన్‌కు మార్చాలని నిర్ణయించారు. సమైక్య రాజధానీనగరంగా అభివృద్ధి చేయాలని భావించారు. రెండు జర్మనీల సరిహద్దులో ఉండడం కూడా మరింత ప్రభావవంతమైన రాజకీయ, ఆర్థిక సమైక్యతకు అది తోడ్పడుతుందని భావించారు. భూమి అందుబాటులో ఉండడం, భవనాలు లభ్యమవడం కూడా ఈ నిర్ణయానికి తోడ్పడ్డాయి. తూర్పుకు ఉన్న బెర్లిన్ రాజధాని కావడం వల్ల మధ్య తూర్పు, యూరప్ దేశాలకు జర్మనీని నేతగా మార్చివేస్తుంది. మొత్తం యూరప్‌ను సమైక్యం చేయడంలో జర్మనీకి ఒక విశిష్టపాత్రనిస్తుంది అన్న భావన కూడా బెర్లిన్ ఎంపికకు దోహదం చేసింది.
భారీ రాజధానీనగరాలు – రాజధాని మార్పిడిపై చర్చ:
రెండు చారిత్రక నగరాలు లండన్, పారిస్ ప్రపంచ వాణిజ్య కేంద్రాలుగా రూపొందాయి. అవి ఆయా దేశాల రాజధానులుగా కాక, ప్రపంచస్థాయిలో చూడదగిన పట్టణాలుగా రూపొందాయి. అందువల్ల ఈ రెండు దేశాల్లోనూ దేశ అవసరాలకు మరింత స్పందనాత్మకంగా ఉండే రాజధానీనగరాల ఏర్పాటు అవసరాలపై చర్చ ప్రారంభమైంది. ఇంగ్లండులో ప్రభుత్వ విధానాలు దేశప్రయోజనాల దృష్ట్యా కాక, లండన్ ప్రయోజనాల దృష్ట్యా జరుగుతున్నాయనే భావన ఒకటి ఏర్పడింది. అదే విధంగా రూసో మొదలుకొని ఫ్రెంచి తత్త్వవేత్తలెందరో పారిస్ అభివృద్ధి చెందుతున్న రీతిపట్ల తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. 1881 లో పారిస్ జనాభా ఫ్రాన్స్ జనాభాలో 5 శాతం కాగా, అది 1975 నాటికి 19 శాతం అయింది. ఈ రెండు నగరాలలో ఈ విధమైన అభివృద్ధి, అవి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రపంచం ప్రయోజనాల దృష్ట్యా ఈ రెండు దేశాలలోనూ రాజధానిని మరింత కేంద్రస్థలానికి మార్చడం ద్వారా దేశంలోని మిగతా ప్రాంతాల అవసరాలకు అనుకూలతను కల్పించడం వీలవుతుందన్న అంశంపై చర్చ జరుగుతున్నది.
Comments
Post a Comment