Swiss Challenge - Amaravati

రాజధాని ఎంపిక నిర్ణయం కేవలం కొన్ని వర్గాలను సంతృప్తి పరిచేందుకు హ్రస్వదృష్టితో తీసుకున్న నిర్ణయం - "నవ్యాంధ్ర తో నా నడక"
12. రాజధాని రాజకీయం
జూన్ 2013లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత అందరికీ రాష్ట్ర విభజన తప్పదన్న విషయం అర్థమైంది. రాజధాని ఎక్కడుంటే బాగుంటుందన్న విషయంపై చర్చలు ప్రారంభమయ్యాయి. అప్పుడు రఘువీరారెడ్డి రెవిన్యూ మంత్రి. ‘ఈ అంశాన్ని పరిశీలించి రాజధాని ఎక్కడుండాలో సూచించండి.’ అని నాకు చెప్పారు.
నేను అప్పుడు #సిసిఎల్‌ఎ గా ఉన్నాను. అన్ని జిల్లాలనుంచి ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములున్నాయో వివరాలు తెప్పించాను. విశాఖలో అచ్యుతాపురం వద్ద, విజయవాడలో నూజివీడు దగ్గర, గుంటూరు వినుకొండ-మాచెర్ల దగ్గర, ప్రకాశంలో దొనకొండ దగ్గర పెద్ద ఎత్తున భూమి లభ్యమవుతుందని తెలిసింది. ఇక నెల్లూరు, అనంతపురం, ఇతర సీమ జిల్లాల్లో కూడా భూమి బాగానే లభ్యమవుతున్నది. కర్నూలులో అంత లేదు.
వీటన్నిటినీ పరిశీలించి ఒక కాన్‌సెప్ట్ నోట్ తయారు చేశాను. ఇంకా శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేయనే లేదు.

నేను ప్రభుత్వ భూములు లభించడమే ప్రాతిపదికగా తీసుకోకుండా రాజధాని ఏర్పాటుకు ఇతరత్రా కారణాలను, ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితులను కూడా పరిశీలించాను. రాజధాని అనేది అన్ని ప్రాంతాలకూ ఆమోదయోగ్యంగా ఉండాలి. #రాయలసీమ#ఉత్తరాంధ్రమనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి అని నేను భావించి దొనకొండ ప్రాంతం రాజధానికి అనువైన ప్రాంతమని సూచించాను.
దొనకొండ ప్రాంతంలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇది #కోస్తాంధ్రలో భాగం. ఐనా రాయలసీమకు ఆమోదయోగ్యం. ఎందుకంటే #ప్రకాశం జిల్లా ఏర్పడినప్పుడు దొనకొండ కందుకూరు డివిజన్‌నుంచి వచ్చింది. అది నెల్లూరులో భాగం. మార్కాపురం, ఎర్రగొండ పాలెం ప్రాంతాలకు రాయలసీమతో సంబంధం ఉన్నది. దొనకొండ మార్కాపురానికి చాలా దగ్గర. దొనకొండ రాయలసీమ, ఆంధ్రకు బాగా ఆమోదయోగ్యం అవుతుంది.

అక్కడ భారీ ఎత్తున ప్రభుత్వ భూమి లభ్యమవుతుంది కనుక భూమిపై ఖర్చు దాదాపు తగ్గిపోతుంది. అది చాలా పేద ప్రాంతం. ప్రభుత్వ పెట్టుబడులు ఇలాంటి ప్రాంతంలో పెట్టబడినప్పుడే ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది. అక్కడే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నిర్మించిన ఎయిరోడ్రోమ్ ఉన్నది. దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చుకోవచ్చు. దర్శి బ్రాంచ్ కెనాల్ నుంచి, వెలిగొండ రిజర్వాయర్ నుంచి కృష్ణాజలాలను తెచ్చుకోవచ్చు.
నేను పరిపాలనకు అనువైన రాజధాని గురించే ఆలోచించాను కాని మెగా సిటీ కావాలని అనుకోలేదు. విశాఖ, విజయవాడ, తిరుపతి, కర్నూలు వీటిని ఆర్థికప్రయోజనాల రీత్యా బలోపేతం చేసేందుకు ప్రయత్నించాలి.
అమెరికాలో చేసిన ప్రయోగాలు నాదృష్టిలో ఉన్నాయి. అక్కడ అన్ని రాష్ట్రాల రాజధానులు చిన్న నగరాలు. పెద్ద నగరాలు కావు. న్యూయార్క్ స్టేట్ కు న్యూయార్క్ రాజధాని కాదు. అబర్న్ అన్నది రాజధాని. కాలిఫోర్నియాకు లాస్ ఏంజెల్స్, శాన్‌ఫ్రాన్సిస్కో ఇవేవీ రాజధానులు కావు. సాక్రమెంటో రాజధాని. అమెరికాకు న్యూయార్క్ రాజధాని కాదు. వాషింగ్టన్ డిసి అన్నది రాజధాని. కనుక పరిపాలనకు అనువైన రాజధాని మెగాసిటీ కానక్కర్లేదు. అదొక చాలా ప్రశాంతంగా ఉండే నగరం కావాలి.

పరిపాలనకు అనువైన రాజధాని అంటే ఏమేమి అవసరం? సెక్రటేరియట్, సిబ్బందికి కావల్సిన క్వార్టర్లు. ప్రజలకు సామీప్యత ఉండాలి. రైల్వే లైను ఉన్నది. మంచి రహదారుల నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుంటే అన్ని విధాల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులో వుంటుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకుని కాన్‌సెప్ట్ నోట్ తయారు చేసి పంపించాను. దాని గురించి ప్రచారం కూడా జరిగింది.

దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాను. అక్కడి నుంచి భారత ప్రభుత్వానికి పంపినట్లు ఆపైన తెలిసింది.
ఈ లోపు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి నేను ఛీఫ్ సెక్రటరీ అయ్యాను. నేను దొనకొండలో రాజధాని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన విషయం వారికి తెలిసిపోయింది. నన్ను వాళ్లు నమ్మలేదు. అప్పటికే శివరామకృష్ణన్ కమిటీని నియమించినప్పటికీ చంద్రబాబు నిపుణులతో కాకుండా వ్యాపారస్తులు, పార్టీ నేతలతో మరో కమిటీని ఏర్పాటు చేశారు. అందులో ఉన్నవారంతా అనుభవం లేని వారు. మొదట్లో నన్ను కమిటీకి సిఎస్‌గా సభ్య కన్వీనర్‌గా పెట్టారు. ఈలోపు ఎవరో వెళ్లి నేను దొనకొండను ప్రతిపాదించానని చెప్పారు. దీనితో సిఎం నన్ను ఈ కమిటీ నుంచి తీసేశారు. ‘సిఎస్ గా మీరు చాలా పనులు చేయాలి కదా.. ఈ కమిటీలో మీరు వద్దు లెండి’ అన్నారు.
నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. అనవసరంగా నన్ను నిందిస్తారని భావించాను.

శివరామకృష్ణన్ కమిటీకి ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా ఉన్నాను. ఆయనను కలిస్తే నేను ప్రభావితం చేశానని ప్రచారం చేస్తారని తెలుసు. రెండు మూడు నెలల తర్వాత ఒక రోజు శివరామకృష్ణన్ అనుకోకుండా సిఎం దగ్గర తటస్థ పడ్డారు. ఇక తప్పించుకోలేకపోయాను. ఛీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావును అని నన్ను నేను పరిచయం చేసుకున్నాను.

‘ఓహ్ మీరా కృష్ణారావు. నేను మీ గురించి విన్నాను, మీ కాన్సెప్ట్ నోట్ గురించి చదివాను. చాలా బాగున్నది’ అని వ్యాఖ్యానించారు. సిఎం ముఖం చిన్నబోయింది.తెలుగుదేశం ఎంపి రాయపాటి సాంబశివరావు ఆరోజే నామీద కామెంట్ చేశారు. రాజధానిని ‘దొనకొండ తీసుకువెళ్లాలని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి చూస్తున్నారు’ అని.
‘నేను సిఎస్ మీదే కామెంట్ చేశాను. అక్కడ ఆయనకు భూములున్నాయి అందుకే అక్కడికి రాజధానిని తీసుకెళ్లానుకుంటున్నారు.’ అని ఆయన విలేకరుల సమావేశంలో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
నేను ఛీఫ్ సెక్రటరీగా ఉన్నాను కాని ప్రతిస్పందించలేదు. లేకపోతే ఆరోజే గట్టిగా జవాబు చెప్పేవాడిని.
ఈ లోపు చంద్రబాబు ఆలోచనలో ఉన్న రాజధానిని ఆచరణలో పెట్టడం ప్రారంభించారు. నిజానికి ఆయన నియమించిన కమిటీ ఎక్కడా ఏమీ తేల్చలేదు. కాని లీకులు రావడం ప్రారంభమయ్యాయి. లీకులు సృష్టించడమే ఆయన వ్యవస్థలో భాగం. #నూజివీడు దగ్గర అటవీ ప్రాంతాన్ని డీనోటిఫై చేసి రాజధాని నిర్మిస్తారని ఒక రోజు లీకు సృష్టించారు.

#గుంటూరు-#విజయవాడ ల మధ్య నాగార్జున యూనివర్సిటీ భవనాల్లో రాజధాని పెడతారని మరో రోజు లీకు సృష్టించారు. #మంగళగిరి వద్ద అటవీభూములను కూడా డీ నోటిఫై చేసి రాజధాని నిర్మిస్తారని ఇంకో రోజు వదంతులు వ్యాపించాయి. నూజివీడు దగ్గర రాజధాని వస్తుందేమోనని మొదట వాళ్లవాళ్లంతా భూములు కొనుక్కున్నారు. కాని అక్కడేమో సమస్య వచ్చి పడింది. దీనితో లీకులుఇచ్చి అక్కడ భూమి రేట్లు పెంచి అమ్ముకునేలా చూశారు. నూజివీడులో భూముల క్రయం వల్లే విజయవాడలో #కాల్‌మనీ రాకెట్ పుట్టిందని అంటారు. ఈ కాల్‌మనీ తో విజయవాడ వాళ్లు అక్కడ భూములు కొనుక్కున్నారు. తర్వాత దాన్ని డబ్బులు చేసుకుని #వెలగపూడి వద్దకు వెళ్లి కొనేసుకున్నారు.

జూన్ 2 నుంచి సెప్టెంబర్ వరకూ రకరకాల రాజధానుల పేర్లు వినపడ్డాయి. దానికి నేను ఫ్లోటింగ్ క్యాపిటల్ అని పేరుపెట్టాను..
సెప్టెంబర్ 3న అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు కూడా విజయవాడ, దాని చుట్టుప్రక్కల అన్నారు కాని ఆ ప్రాంతం ఏదో చెప్పలేదు. సెప్టెంబర్‌ ఆఖరున సేకరణ నియమాలను నిర్ణయించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించేంతవరకూ విజయవాడ, చుట్టుప్రక్కల ఉన్నవారంతా రక రకాల ఊహాగానాలతో పెట్టుబడులు పెట్టి బాగా దెబ్బతిన్నారు.
ఈ దెబ్బ తినడానికి ప్రధాన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రజలపై ప్రభుత్వం చాలా అన్యాయంగా ట్రిక్కులు ప్లే చేసింది. భూముల కొనుగోళ్లు, అమ్మకాలను ప్రోత్సహించి, మధ్యతరగతిని మోసగించడం ద్వారా కొందరికి ప్రయోజనం చేకూర్చేందుకే ఈ వదంతులకు ఆస్కారం కల్పించారు. #తుళ్లూరు మండలంలో రాజధాని వస్తుందని ముందస్తు సమాచారం ఉన్నవారు వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టి స్పెక్యులేటివ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించేందుకు తోడ్పడేందుకే ప్రభుత్వం ఈ సయ్యాటలాడి ఉంటుంది.
చివరకు ఎటువంటి అధ్యయనం చేయకుండా వెలగపూడిలో రాజధానిని నిర్ణయించారు.

#శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల్ని తెలుసుకుని ఏ ప్రాంతాన్నీ సూచించలేదు కాని ఈ ప్రాంతం మాత్రం వద్దని చెప్పింది. స్పష్టంగా చెప్పింది. ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఎటువంటి శాస్త్రీయమైన అధ్యయనం చేయలేదు. అది చంద్రబాబుకు తీరని నష్టంగా, ఘోరవిపత్తుగా మారుతుంది.
రాజధాని కోసం భూములు పణంగా పెట్టిన రైతులు పెద్ద ఎత్తున నష్టపోతారని చెప్పడానికి వెనుకాడనక్కర్లేదు.
ఒకటి, ఆయన పరిపాలనకోసమే రాజధాని ప్లాన్ చేయలేదు. ఆయన మెగాపొలిస్ ప్లాన్ చేశాడు. పరిపాలన రాజధాని కావాలంటే 500-600 ఎకరాల కంటే అవసరం లేదు.. కోర్ ఆఫీసులు పెట్టి వదిలేయాలి.
చంద్రబాబు ప్లాన్ చేస్తున్న అమరావతి అనే మెగాపొలిస్ కోసం 32వేలఎకరాలు సేకరించారు. ల్యాండ్ పూలింగ్ లో తీసుకుని ఆ రైతుల్లోఎలాంటి భ్రమ ఏర్పాటు చేశారంటే, వాళ్లందరికీ విపరీతమైన రేట్లు వస్తాయని అంచనాలు వేసుకుని, భ్రమలో పడి తమ భూములు ఇచ్చేశారు. వాళ్లనుకున్న స్థాయిలో లాభాలు రావాలంటే ఇది ఏ హైదరాబాద్ స్థాయి నగరమో, మద్రాస్ స్థాయి నగరమో కావాలి. ఎప్పటికి అవుతుంది?
వస్తుందని అనుకున్నా, అది కావడానికి 30 ఏళ్లు పడుతుందా, 50 ఏళ్లు పడుతుందా 100 ఏండ్లు పడుతుందా చెప్పలేం.

రాజధానికి చంద్రబాబు వస్తుందనుకున్న స్థాయిలో విలువ రావాలంటే అది ఎప్పుడూ సాధ్యపడదు. ఆయన పులిమీద స్వారీ చేస్తున్నారు. రాజధాని అనే గాలిబుడగ పేలి పోవడానికి ఎంతో కాలం పట్టదు.
నాలుగున్నర ఏండ్ల తరువాత చూస్తే చిన్న స్థాయిలో తాత్కాలిక ఆఫీసు భవనాలు తప్పితే, పక్కాగా ఏమైనా పెట్టుబడులు వచ్చాయా ఎవరైనా చెప్పగలరా?

సింగపూర్ కంపెనీలు నిర్మాణాలు చేసినా, ఈ 30 వేల ఎకరాలకు వారనుకున్న స్థాయిలో లాభాలు ఆర్జించడానికి అదనపు విలువ కల్పించలేరు. నిజానికి సింగపూర్ కంపెనీలు ప్రవేశించడానికి ఎన్నోఅడ్డంకులున్నాయి.
అమరావతిలో సింగపూర్ టౌన్ షిప్ పేరిట 1600 ఎకరాల కోర్ కాపిటల్ ఏరియా అభివృద్ధి సింగపూర్ కంపెనీకి ఇచ్చారు. దానికోసం సింగపూర్ ప్రభుత్వం వచ్చి మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇస్తామని చెప్పి ఇచ్చింది.
ఆ పై కోర్ క్యాపిటల్ ఏరియా అభివృద్ధికి రెండు ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు వచ్చాయి. ఆ తర్వాత వెనక్కు తగ్గాయి. తమ కంపెనీలకు ప్రాజెక్టు ఇవ్వమని చెప్పారు. ప్రభుత్వ కంపెనీలే అవి. కాని వాటి తీరు వేరు.

దాన్ని స్విస్ ప్రపోజల్ క్రింద పెట్టారు. నిజానికి సింగపూర్ కంపెనీలకు భూములు అప్పజెప్పడం స్విస్ ఛాలెంజ్ క్రింద రాదు. అది పెద్ద మైనస్ పాయింట్ అవుతుంది. ఈ పద్ధతి వల్ల టెండర్ల ప్రక్రియలో పారదర్శకత ఉండదని, న్యాయంగా జరిగే అవకాశాలు లేవని కేల్కర్ కమిటీ తన నివేదికలో వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ఈ ప్రక్రియను ఆమోదించినప్పటికీ కొన్ని మార్గదర్శకాలు పేర్కొంది. అందులో ఒకటి కచ్చితంగా ఒక కంపెనీ తనంతట తాను అభివృద్ధికి ముందుకు రావాలి.

స్విస్ ఛాలెంజ్ అంటే నిర్వచనం – ప్రతిపాదన కోరకుండా వారంతటవారు వచ్చేది. ఉదాహరణకు ఫలానా కంపెనీ ముందుకు వచ్చి తమ దగ్గర ఎవరి దగ్గరా లేని విశిష్టమైన ప్లాన్ ఉందని, కొత్త పద్ధతిలో ప్రాజెక్టును అమలు చేస్తాం వచ్చాం అని ముందుకు వస్తే దాన్ని పరీశీలించి తృప్తి చెందిన తర్వాత అప్పుడు దాన్ని టెండరింగ్ కు పంపాలి.
‘ఫలానా కంపెనీ ప్రతిపాదనతో వచ్చింది. ఈ ప్రతిపాదన ప్రకారం ప్రభుత్వానికి వందకోట్లో, 200 కోట్లో ఆదాయం. దీనికన్నా ఎక్కువ వాటా ఎవరైనా ఇస్తారా?’ అని బహిరంగంగా ప్రకటించాలి. ఏదైనా మరో కంపెనీ వచ్చి తాను కూడా అదే పద్ధతిలో చేస్తానని అంతకంటే అధిక మొత్తం ఇస్తామని చెబితే ఆ మొత్తానికి చేయాల్సిందిగా తొలుత ప్రతిపాదన చేసిన కంపెనీని అడగాల్సి ఉంటుంది. అందుకు ఆ కంపెనీ అంగీకరిస్తే దానికి పనులు అప్పజెప్పాలి
ఇక్కడేమి జరిగింది?
సింగపూర్ ప్రభుత్వంతో మొదటినుంచీ తెలుగుదేశం ప్రభుత్వం అంట కాగింది. మాస్టర్ ప్లాన్ తయారు చేయించుకుంది. వాళ్ల కంపెనీలు సిఆర్ డిఏతో తమ ప్రాజెక్టు నివేదిక తయారీలో సమాచారాన్ని పంచుకున్నాయి.

స్విస్ ఛాలెంజ్ విధానమంటే ఎవరైనా తమంతట తాము (suomoto) ప్రతిపాదన ఇవ్వాలి. ఇక్కడ సింగపూర్ కంపెనీలు అందుకు భిన్నంగా ప్రభుత్వ నోటిఫికేషన్‌కు అనుగుణంగా ప్రతిపాదన ఇచ్చారు.చంద్రబాబు ఎంచుకున్న ప్రక్రియ చట్టరీత్యా, సాంకేతికత రీత్యా సరైంది కాదు. అలాంటి వ్యవస్థను ఆయన కొద్ది మంది లాభం కోసమే చేపట్టారని, అది క్రమేణా భారీ కుంభకోణంగా మారుతుందని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

రెండు, సింగపూర్ వాళ్లు తమ కొచ్చే ఆదాయంలో ఎంత వాటా ప్రభుత్వానికి ఇస్తారో చెప్పారు. ముందు 5 శాతం అని చెప్పారు. ఆ తర్వాత మనవాళ్లు బేరాలకు దిగితే మొదటి దశలో 5, తర్వాతి దశలో 7.5, ఆపైన 12 అని ఏదో నిర్ణయించారు. అది కూడా ముందు చెప్పకుండా ప్రకటన చేశారు. దానికి దరఖాస్తుచేసుకున్న వాళ్లను అనర్హులుగా ప్రకటించారు.

గ్లో
బల్ టర్నోవర్ రు. 2వేల కోట్లు లేదని, నెట్ వర్త్ లేదని, అది లేదు, ఇది లేదని తిరస్కరించారు. సింగిల్‌బిడ్ మీద సింగపూర్‌ కంపెనీలకు ఇచ్చేశారు. ఇది సరైనదెలా అవుతుంది? ఇంత చేసే బదులు నిజంగా సింగపూరే కావాలనుకుంటే ఎటు తిరిగీ బిడ్డింగ్‌లో పోతున్నందువల్ల అంతర్జాతీయ బిడ్డింగ్ చేయడానికి అడ్డంకులేమున్నాయి? సాధారణ టెండరింగ్ పద్ధతిలో అంతర్జాతీయ బిడ్డింగ్ చేయొచ్చు. కాని అలా చేయలేదు.

మూడవది, సింగపూర్ ప్రభుత్వం గురించి చెప్పాలంటే చాలా నమ్మకమైన ప్రభుత్వం, నిజాయితీ గల ప్రభుత్వం, అవినీతి లేదు. సమర్థవంతమైన ప్రభుత్వం అని చెబుతారు. అక్కడ ఉమ్మేస్తే తంతారు, పేపర్ వేస్తే పట్టుకుపోయి జైళ్లో వేస్తారు, అటువంటి ప్రభుత్వంతో మేం పెట్టుకుంటున్నాం అని చెప్పుకుంటారు.
వాళ్ల అంతర్గత విషయాల్లో ఇవన్నీకరెక్టే. ఎవరూ కాదనలేరు.

కాని ఇతర దేశాలతో వ్యవహరించేటప్పుడు సింగపూర్ ప్రభుత్వ వ్యవహార శైలి ఏమిటి? అని తెలుసుకున్నారా? ఆ కంపెనీ పూర్వచరిత్ర ఏమిటి? తెలుసుకునే ప్రయత్నం చేశారా? సింగపూర్‌కు ఇంకో కోణం ఉంది, అది మరిచిపోకూడదు. ఈ రోజు అంతర్జాతీయ మనీలాండరింగ్ కేంద్రం సింగపూర్. స్విట్జర్లాండ్, హాంకాంగ్‌ల కంటే ఎక్కువ మనీ లాండరింగ్ అక్కడ జరుగుతుంది.

ఇండోనేషియాలో జరిగిన అవినీతి సొమ్ము అంతా దాచుకునేది సింగపూర్ లో. అక్కడ అవినీతి చేసిన వాళ్లు సింగపూర్‌కు వచ్చి పౌరసత్వం తీసుకుని అక్కడే ఉంటారు. అటువంటి దేశాన్ని తెలుగుదేశం సర్కార్ ఒక పవిత్రమైన దేశంగా నెత్తికెక్కించుకుంటే ఎవరు నమ్ముతారు? సింగపూర్ అంతర్గతంగా బాగానే కనిపించవచ్చు. కాని బయటదేశాల విషయానికి వస్తే దానికి ఎటువంటి నీతి నియమాలు లేవు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారా? లేదే?. కనుక టెండర్ పద్ధతిని మానేసి ట్రాక్ రికార్డును పట్టించుకోకుండా సింగపూర్ కంపెనీలకు ఎందుకు పట్టం కట్టాలి?

మూడవది, 1691 ఎకరాలను కోర్ కాపిటల్ నిర్మాణానికి రాసిచ్చిన కంపెనీల్లో అసెండాస్-సింగ్ బ్రిడ్జి ప్రైవేట్ లిమిటెడ్, సెంబ్ కార్ప్ డెవలప్మెంట్ లిమిటెడ్ ఉన్నాయి
సెంబ్‌కార్ప్ పై ఇప్పటికే అంతర్జాతీయంగా అవినీతి ఆరోపణలున్నాయి. బ్రెజిల్ పెట్రోబాస్ అనే పెద్ద చమురు కంపెనీ అధికారులకు డ్రిల్ల్ షిప్ లను నిర్మించే కాంట్రాక్టులు పొందేందుకు భారీ ముడుపులు చెల్లించారనేది ఈఆరోపణ. బ్రెజిల్ లో ఒక జాతీయ చమురు కంపెనీపై ఇప్పటి వరకూ వచ్చిన అతి పెద్ద అవినీతి ఆరోపణ ఇది. దానిపై దర్యాప్తు జరుగుతోంది. 

మనం రాజధాని కాంట్రాక్టు వారికిచ్చేముందు వారి నేపథ్యం పరిశీలించారా? లేదు.
బ్రెజిల్‌లో ఉన్న భారత రాయబారికి రాసి పెట్రోబాస్, సెంబ్ కార్ప్ కంపెనీలను విచారించి సత్యాసత్యాల గురించి తెలుసుకోవాలి. రిపోర్టు తెప్పించుకోవాలి. అది జరగలేదు.ఇన్ని అవకతవకలతో దీన్ని ఎలా ముందుకు తీసుకువెళతారు?

మూడవది, సింగపూర్ కంపెనీలకు, ప్రభుత్వానికీ మధ్య తగాదే ఏర్పడితే మధ్యవర్తిత్వం లండన్‌లో జరగాలని నిర్ధారించారు. ఏ చిన్న వాగ్దానాన్ని మన ప్రభుత్వం నెరవేర్చకపోయినా, మన అధికారులు లండన్ కు వెళ్లాలి. మొత్తం భూమిని సేకరించి ఇవ్వాలని సింగపూర్ కంపెనీల అన్నాయి. కాని భూమి సేకరణలో సమస్యలున్నాయి. రైతులు కొంతమంది సహకరించాలి.
బయటి మౌలిక సదుపాయాలన్నీ అభివృద్ధి చేయాలని ఆ కంపెనీలు షరతుల విధించాయి. ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీ పెట్టుబడులు కావాలి. ఎప్పుడు అభివృద్ధి చేస్తారు?

సింగపూర్ వాడేమీ చంద్రబాబుపై, ఆంధ్రప్రదేశ్‌పై ప్రేమాభిమానాలతో వచ్చి పనిచేయడం లేదు. వ్యాపారం కోసమే వస్తున్నాడు. వాడు చెప్పింది ఏది చేయకపోయినా, వాడు మనను అంతర్జాతీయ మధ్యవర్తిత్వానికి లాగుతాడు. అక్కడ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇంత రిస్క్ తీసుకుని, ఇంత తొందరపడి వాడికి కాంట్రాక్టు ఇచ్చి వాడి చేతుల్లో చిక్కుకుపోవాల్సిన అవసరం ఏమున్నది?

అసలు రాజధాని ప్రాంతం అక్కడ పెట్టాలని ఎంపిక చేయడమే తప్పు. అది శాస్త్రీయంగా జరగలేదు. శాస్త్రీయంగాచేసిన శివరామకృష్ణన్ కమిటీ వద్దన్న చోట రాజధానిని నిర్ణయించారు. దూరదృష్టి గల ఏ నాయకత్వమైనా శాస్త్రీయంగా వ్యవహరించాలి. ప్రజల్లో అన్ని వర్గాలతో చర్చించాలి. నిర్ణయంలో వారిని భాగస్వాములు చేయాలి. కాని రాజధాని ఎంపిక నిర్ణయం కేవలం కొన్ని వర్గాలను సంతృప్తి పరిచేందుకు హ్రస్వదృష్టితో తీసుకున్న నిర్ణయంలా కనపడుతోంది.
పరిపాలనకోసమే రాజధాని అనుకుంటే సులభంగా అయ్యేది అని తెలిసినా ఆదిశలో చర్యలు తీసుకోలేదు. గాలిలో మేడలు కట్టే విధంగా మెగాపోలిస్ కోసం ప్రయత్నిస్తున్నారు. దాని కోసం రైతుల్లో ఏవో భ్రమలు కల్పించి 32 వేల ఎకరాలు తీసుకున్నారు.

దానికి తగ్గట్లుగా ఊహాత్మక లాభాలు రాకపోతే వాళ్లందరూ మీదపడితే ఏం చేయగలరు? ప్రభుత్వం భారీగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ లోపు ఎంత సామాజిక, సాంస్కృతిక విధ్వంసం జరుగుతుంది అక్కడ? వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన రాజేందర్ సింగ్ వచ్చి అక్కడ రాజధాని పెట్టడమే తప్పు అన్నాడు. సిఎం ఇల్లు తో సహా రాజధాని, రహదారులన్నీ వరద ప్రాంతాల్లో ఉన్నాయని ఆయన అన్నారు. ఇదంతా చూస్తే చంద్రబాబు మొత్తం రాష్ట్రాన్ని సరైన మార్గంలో నడిపించడం లేదు అని అనిపిస్తున్నది.అంతేకాదు, #అమరావతి మైకంలో పడి చంద్రబాబు మిగిలిన ప్రధాన నగరాలను విస్మరించారు.

ఆయన విశాఖ, తిరుపతి తదితర నగరాలపై దృష్టి కేంద్రీకరించడం లేదు. చుట్టుప్రక్కల ఉన్న విజయవాడ, గుంటూరులను కూడా పట్టించుకోవడం లేదు. అమరావతి ఇప్పుడున్న పద్ధతిలో అభివృద్ధి కావడం వల్ల గుంటూరు, విజయవాడ ప్రజలకు కూడా ఒరిగింది ఏమీ లేదు. #గుంటూరు, #విజయవాడ కూడా ప్రయోజనం పొందాలి అంటే మంగళగిరిలో స్పెషల్ బెటాలియన్ భూమిలో రాజధాని కట్టి ఉంటే సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు, ఇతర భవనాలను కట్టి ఉంటే, విజయవాడ, గుంటూరు జంటనగరాల్లాగా బ్రహ్మాండంగా అభివృద్ధి అయి ఉండేవి. అది కాకుండా 30 కిలోమీటర్ల దూరంలో పంటపొలాల్లో రాజధాని నిర్మిస్తే, ఇక్కడ రెండు నగరాలను వదిలిపెట్టి అక్కడ మెగాసిటీ నిర్మించాలని కలలు కంటే, అది అసలు ఎప్పుడు పూర్తి కావాలి?

రాజధాని విషయంలో కేంద్రం తొలుత సానుకూలంగా కనిపించినప్పటికీ తర్వాతి కాలంలో జరుగుతున్న అంశాలను తెలుసుకున్న తర్వాత అది ప్రతికూలంగా మారుతున్నదని సమాచారం. కేంద్రం నిధులైతే ఇచ్చింది కాని అక్కడ నిర్మాణాలు పూర్తి చేస్తే కదా మళ్లీ నిధులు అడిగేది.
#దొనకొండ రాజధాని అయితే ఇంత అస్తవ్యస్త పరిస్థితులు తలెత్తేవి కావు. లేదా అతిసారవంతమైన మాగాణి భూములు, భూమి నేల సామర్థ్యం బలహీనతను దృష్టిలో ఉంచుకుని అమరావతి ప్రాంతం అనువైన ప్రాంతం కాదని శివరామకృష్ణన్ కమిటీ చేసిన హితవును పట్టించుకున్నా ఈ పరిస్థితి వచ్చేది కాదు. నిపుణులు సూచించిన విధంగా పరిపాలనా రాజధాని కోసం చూడకుండా, ప్రభుత్వ వ్యవహారాలను భారీగా ఒకే చోట కేంద్రీకృతం కాకుండా చూసుకోవాలని చెప్పిన హితవును పాటించకుండా, మహా నగరం ఏర్పాటు చేయాలన్న దూకుడులో వెళ్లినందువల్ల ఎటూ కాని పరిస్థితిలో పడతామనే నా భయం.

‘సింగపూర్ వెళ్లే భూమి కోటా ఏమైనప్పటికీ అది వ్యవసాయ భూమి నుంచే వస్తుంది. రాజధాని ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా ప్రభావితం అయ్యే వారే కాకుండా, ఆదాయం లేని లక్షలాది కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ కుటుంబాల భద్రత, సంక్షేమానికి హామీ ఇవ్వడం ఆచరణాత్మకంగా అసాధ్యం... ఆంధ్రప్రదేశ్‌లో నూతన రాజధాని ప్రాజెక్టు కోసం సంపూర్ణమైన రాజకీయ సమర్థన లేదు..’ అని శివరామకృష్ణన్ తాను మరణించడానికి కొద్ది రోజుల ముందు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. రాజధాని ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయ శక్తినీ, ఆర్థిక వనరులను తాకట్టు పెట్టే ఆత్మహత్యా సదృశమైన పని చేయవద్దని ఆయన హితవు పలికారు.

పరిస్థితి ఎలా మారిందంటే వచ్చే ఎన్నికలు సమీపించే నాటికి ఆరునెలల ముందు వాతావరణం తెలుసుకుని అమరావతి ప్రాంతంలో కొన్న భూములను అయినకాడికి అమ్ముకుని బయటపడాలనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు. ఈ విషయం నాకు విజయవాడ విమానాశ్రయంలో ఒక తెలుగుదేశం నాయకుడే చెప్పారు.
ప్రపంచ బ్యాంకు నుంచి 5 వేల కోట్లు తేవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అది ముందుకు పోవడం లేదు. ప్రపంచ బ్యాంకు వాళ్లు భూసమీకరణ స్వచ్ఛందంగా లేదని ఆ అంశంపై ప్రస్తుతం వారి పరిశోధన చేస్తున్నారు. ఈ మొత్తం వచ్చేది అనుమానమే.
కాని ఇన్ని అవకతవకలు, అస్తవ్యస్త పరిస్థితులు, అక్రమాలను చూసిన తర్వాత కేంద్రం ప్రపంచ బ్యాంకు సహాయానికి అంగీకరిస్తుందా? జరుగుతున్న విషయాలను కేంద్రం గమనించదనుకోవడం అమాయకత్వం కాదా?

Comments

Popular posts from this blog

Whose Capital Amaravathi - Introduction

Urban centres as growth engines