AP Formation Day
"జైరాం రమేశ్ స్వయంగా ఏపీ భవన్‌కు వచ్చి చంద్రబాబునాయుడుకు సలహా ఇచ్చినందువల్లే ఇవాళ పోలవరంకు అడ్డంకులు తొలిగాయి " - నవ్యాంధ్రతో నా నడక
13. ఆంధ్రప్రదేశ్‌కు అవతరణ దినోత్సవం లేదా?
జూన్ 2న రెండు రాష్ట్రాలు విడిపోయాయి. తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించింది కనుక జూన్ 2 ఆ ప్రాంతానికి ఒక మహత్తరమైన రోజు. అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం జూన్ 2న చాలా పెద్ద ఎత్తున అవతరణ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించింది. కాని తెలంగాణ నుంచి విడిపోయిన శేష ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు? జూన్ 2న ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయలేదు. అంతేకాక విభజన అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగాజరిగింది కనుక జూన్ 2న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సంబరాలు జరుపుకోవడంలో అర్థం లేదు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ 1న జరిగేది. కాని అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు. ఇప్పుడా విశాలాంధ్ర లేదు. కనుక నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకోవడం అర్థరహితం.
కాని ఆంధ్రప్రదేశ్ ఏదో ఒకరోజు అవతరణ దినోత్సవం జరుపుకోవాలి కదా.. అని నేను అనుకుని ఆ మేరకు ఫైలును సర్క్యులేట్ చేశాను. 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది కనుక అక్టోబర్ 1కి ప్రాధాన్యత ఉన్నది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ కర్నూలు వచ్చారు. ప్రముఖ కవి శంకరంబాడి సుందరాచారి ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ అని రాసిన గీతాన్ని అభేరి రాగంలో ప్రముఖ గాయని టంగుటూరి సూర్యకుమారి ఆ సందర్భంగా ఆలపించారు. దాన్నే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక గీతంగా నిర్ణయించింది.
అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకోవాలన్న నా ప్రతిపాదనను ముఖ్యమంత్రి అంగీకరించలేదు. ‘నో’ అని సమాధానం వచ్చింది. చివరకు ఆ ఫైలు బుట్ట దాఖలైంది.
చంద్రబాబునాయుడుకు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవడం ఇష్టం లేదు. ఆంధ్రప్రదేశ్‌కూ ఒక గుర్తింపు ఉండాలి అన్న విషయం ఆయన అంగీకరించలేదు.
ఎంతసేపూ రాష్ట్రం విడిపోయిన రోజు జూన్ 2న నవ నిర్మాణ దీక్ష జరిపి కాంగ్రెస్‌ను తిట్టాలి. అదే ఎజెండా కావాలి అన్నది ఆయన ఉద్దేశం.
రాజకీయాలు తప్ప ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కోసం ఆయన దృష్టి పెట్టిన సందర్భాలు చాలా తక్కువ. భద్రాచలం విషయంలోనూ అదే జరిగింది. రాష్ట్ర విభజనకు ముందు చంద్రబాబు కానీ, ఆంధ్రా నాయకత్వం కానీ కొంత గట్టిగా వ్యవహరించి ఉంటే భద్రాచలం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేది. భద్రాచలం తమకు కావాలని, దాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తామని హామీ ఇచ్చి ఉంటే ఆ ప్రాంత ప్రజలంతా ఆంధ్రప్రదేశ్‌తో ఉండేవారు. భద్రాచలం రెవిన్యూ డివిజన్ మొదట తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలు విలీనమైన తరువాత కొంతకాలానికి నీలం సంజీవరెడ్డి హయాంలో భద్రాచలంను తూర్పుగోదావరి నుంచి ఖమ్మంలో కలిపారు.
ఇప్పుడు భద్రాచలం ఆంధ్రాకు వెళితే తాము పనులు కావాలంటే ఏ రాజమండ్రికో, కాకినాడకో వెళ్లాల్సి ఉంటుందని ప్రజలు భావించారు. అందుకే వారు ఖమ్మంలో ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. నిజానికి వారికి తూర్పుగోదావరి జిల్లాతో అనుబంధం ఉన్నది. విభజనకు ముందు చంద్రబాబు మిగిలిన ఆంధ్రా నాయకులు ముందుచూపుతో వ్యవహరించి భద్రాచలంను ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తామని చెప్పి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవి. కాని రాజకీయాలే తప్ప నిర్దిష్టమైన ఆలోచన ఎక్కడిది?
పోలవరం కోసం విభజన సమయంలో నాలుగు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో చేరేందుకు చంద్రబాబునాయుడు గారే కారణమని భావించేవాణ్ణి. కాని తరువాత తెలిసింది ప్రధానంగా కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అప్రమత్తంగా ఉండడం కారణం అని . ఆయనే బిల్లు రూపొందించారు కనుక మరో ఆరునెలలు వేచి ఉంటే, నాలుగు మండలాలు ఏపీలో చేర్చేందుకు కేంద్రం అంగీకరించదని, తెలంగాణ అడ్డుకాలు వేసేదని జైరాం రమేశ్‌కు తెలుసు. జైరాం రమేశ్ స్వయంగా ఏపీ భవన్‌కు వచ్చి చంద్రబాబునాయుడుకు సలహా ఇచ్చినందువల్లే ఇవాళ పోలవరంకు అడ్డంకులు తొలిగాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందే ఈ ఆర్డినెన్స్ జారీ చేయాల్సిన అత్యంత ఆవశ్యకత ఉన్నదని, తెలంగాణ అసెంబ్లీ ఏర్పడితే ఆర్డినెన్స్ జారీ చేయడం ఏ మాత్రం సాధ్యపడదని తాను హోంమంత్రి రాజ్నా థ్ సింగ్ కు చెప్పి ఒప్పించినట్లు జై రాం రమేశ్ తాను విభజన ఘట్టంపై రచించిన ‘గడచిన చరిత్ర-తెరిచిన అధ్యాయం’ అన్న పుస్తకంలో చెప్పారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఈ విషయంలో కీలక పాత్ర పోషించారని చెప్పక తప్పదు.
Comments
Post a Comment