Capital Cities of Andhras Through the centuries

6. శతాబ్దాల కాల పరిణామంలో

ఆంధ్రుల రాజధానీ నగరాలు

మహాభారతం కురుక్షేత్ర యుద్ధంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన యుద్ధం చేసినట్లు చెప్తున్నది. వింధ్యపర్వతాలకు దక్షిణప్రాంతంలో నివసిస్తున్న ఒక జాతిగా ఐతరేయ బ్రాహ్మణం ఆంధ్రులను పేర్కొంది. వీరు విశ్వామిత్ర మహర్షి కుమారులనీ, ఆయన వల్ల శాపం పొంది వింధ్యపర్వతాలకు దక్షిణాన స్థిరపడ్డారని పురాణకథనం. 

ఆంధ్రులకు సంబంధించి క్రీ.పూ. 2వ శతాబ్ది నుండి క్రీ.శ. 2వ శతాబ్ది వరకు భారతదేశంలోని ప్రధాన భూభాగాలను పరిపాలించిన అతి ప్రాచీన రాజవంశం శాతవాహన వంశం. శాతవాహనుల రాజధాని ధాన్యకటకం నేటి ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతికి సమీపంలో ఉంది. పురాతత్త్వశాస్త్రవేత్తలు ఇక్కడ ఆ నాటికి చెందిన బౌద్ధనిర్మాణాల శిథిలాలను కనుగొన్నారు. శాతవాహనులు తమ రెండవ రాజధానిగా ప్రస్తుత మహారాష్ట్ర ప్రాంతంలోని ప్రతిష్ఠానపురాన్ని ఎంచుకున్నారు. విదేశీయుల దండయాత్రలను - ముఖ్యంగా హూణుల దండయాత్రలను - ఎదుర్కొనడానికి ఇది తోడ్పడుతుందని వాళ్లు భావించారు. భారతదేశమంతటా వ్యాపించిన ఒక బలమైన సామ్రాజ్యాన్ని శాతవాహనులు స్థాపించారు. మంచి పరిపాలనను అందించారు. హిందూ బౌద్ధమతాలు రెండింటినీ ప్రోత్సహించారు. 

శాతవాహన సామ్రాజ్యపతనం తరువాత అనేక చిన్నచిన్న రాజ్యాలు నేటి ఆంధ్రప్రదేశ్ విభిన్నప్రాంతాలలో స్థాపించబడ్డాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని గణనీయమైన భూభాగాన్ని పరిపాలించిన తూర్పుచాళుక్యులు ఆవిర్భవించేంతవరకూ ఈ చిన్నరాజవంశాల పరిపాలన కొనసాగింది. ఇక్ష్వాకు రాజులు విజయపురి రాజధానిగా నేటి గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు ప్రాంతాలను నూరేళ్లపాటు పరిపాలించారు. బృహత్ఫలాయనులు నేటి కృష్ణాజిల్లా ప్రాంతాన్ని పరిపాలించారు. వీరి రాజధాని కుందూరు. అవనిగడ్డ లేదా మచిలీపట్నానికి సమీపంలో ఉంది. శాలంకాయనులు ఏలూరుకు దగ్గరగా ఉన్న పెదవేగి కేంద్రంగా పరిపాలించారు. ఆనంద గోత్రికులు కృష్ణానదికి దక్షిణాన ఉన్న కర్మ రాష్ట్రాన్ని పరిపాలించారు. వీరి రాజధాని కందరపురం. నేటి గుంటూరు జిల్లాలోని కంతేరు. 
వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న అధికప్రాంతాన్ని పరిపాలించిన ముఖ్యమైన రాజవంశాలలో విష్ణుకుండినులు ఒకరు. వారి పరిపాలన నేటి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు వ్యాపించింది. వీరి రాజధాని కొంతకాలం బెజవాడ, మరికొంత కాలం దెందులూరు. 

శాతవాహన సామ్రాజ్యం పతనమైన తరువాత ఈ చిన్న చిన్న రాజ్యాలు రాష్ట్రంలోని భిన్నప్రాంతాలను పరిపాలించాయి. తూర్పుచాళుక్యులు క్రీ.శ. 7వ శతాబ్ది నుండి 11 వ శతాబ్ది వరకు మొదట పెదవేగి రాజధానిగా, తరువాత రాజమహేంద్రవరం రాజధానిగా, దాదాపు మొత్తం తీరాంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారు. వేంగీ చాళుక్యుల పరిపాలన కాలంలోనే 9వ శతాబ్దిలో తూర్పుచాళుక్యుల సేనాని పండరంగు బెజవాడ కందుకూరు మధ్య బోయకొట్టాలను మట్టుబెట్టినట్టు అద్దంకి శాసనం చెపుతుంది. తెలుగులో ఇది తొలి పద్యశాసనం. తూర్పు చాళుక్యులు రాజమహేంద్రవరాన్ని తమ రాజధానిగా చేసుకున్న తరువాత, రాజరాజ నరేంద్రుని పరిపాలన కాలంలో ఆయన ఆస్థానకవి నన్నయ వ్యాసమహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం ప్రారంభించాడు. ఇదే తెలుగులో మొదటి కావ్యం. 

తూర్పు చాళుక్యుల తరువాత తెలుగు మాట్లాడే ప్రాంతాలను పరిపాలించిన ముఖ్యమైన రాజవంశం ఓరుగల్లు రాజధానిగా పరిపాలించిన కాకతీయవంశం. వీరి మతం శైవం. వీళ్లు ఎన్నో దేవాలయాలను కట్టించారు. సాగునీటికోసం ఎన్నో చెరువులు తవ్వించారు. ఢిల్లీ నుండి దండెత్తి వస్తున్న ముస్లిం ఆక్రమణదారులను కాకతీయులు చాలాకాలం విజయవంతంగా నిలువరించారు. కాని చివరికి ఓటమి పాలయ్యారు. 
కాకతీయుల పరిపాలనానంతరం సింహాచలం నుంచి నెల్లూరు వరకు మొత్తం తీరాంధ్ర దేశాన్ని వందేళ్లపాటు రెడ్డి రాజులు పరిపాలించారు. రెడ్డి రాజుల మొదటి రాజధాని ప్రకాశం జిల్లాలోని అద్దంకి. తరువాత వారు తమ రాజధానిని గుంటూరు జిల్లాలోని కొండవీడుకు మార్చారు. 

ఆంధ్రులు స్థాపించిన మహోన్నతమైన సామ్రాజ్యం 1336 లో స్థాపించిన విజయనగర సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాన్ని 1336 – 1565 మధ్య సంగమ, సాళువ, తుళువ అన్న మూడు భిన్న వంశాలు పరిపాలించాయి. వీరి రాజధాని తుంగభద్ర తీరంలోని హంపి. హంపి ఆ నాడు కేవలం ఒక రాజధాని పట్టణమే కాక, ఒక ముఖ్యమైన వాణిజ్యకేంద్రం కూడా. విజయనగర పతనం తరువాత తిరుమల రాయలు నేటి అనంతపురం జిల్లాలోని పెనుగొండ నుంచి పరిపాలన ప్రారంభించాడు. ఈ ఆరవీటి వంశ రాజులు తరువాతి కాలంలో చంద్రగిరిని రాజధానిగా చేసుకున్నారు. చెన్న పట్టణంలో వాణిజ్య కేంద్రాన్ని స్థాపించడానికి ఈస్టిండియా కంపెనీకి భూదానం చేసిన పాలకులు ఈ చంద్రగిరి పాలకులే. 

ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చివరి రెండు ముఖ్యమైన రాజవంశాలు కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీలు. కుతుబ్ షాహీలు గోల్కొండ రాజధానిగా ఈ ప్రదేశాన్ని రెండు శతాబ్దాలు పరిపాలించారు. ఆసఫ్ జాహీలు మొదట తమ పరిపాలనను ఔరంగాబాదు నుండి ప్రారంభించి, తరువాత హైదరాబాదుకు మార్చారు. ఆసఫ్ జాహీల పరిపాలన మొదటి ఈస్టిండియా కంపెనీ నియంత్రణలోనూ, తరువాత బ్రిటిషు ప్రభుత్వ నియంత్రణలోనూ సాగింది. ఆసఫ్ జాహీలు హైదరాబాదు రాజ్యం స్వతంత్ర భారత సమాఖ్యలో విలీనమయ్యే వరకూ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు.

Comments

Popular posts from this blog

Whose Capital Amaravathi - Introduction

Urban centres as growth engines