WHOSE CAPITAL AMARAVATHI - AMARAVATHI LOCATION

1. అమరావతి ప్రదేశం

ఈ నేపథ్యంలోనే పార్లమెంటుకు, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 2014 ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో బిజెపి, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తెలంగాణ, మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లుగా అపాయింటెడ్ డే 02-06-2014 న విభాజితమై ఉనికిలోకి వచ్చినప్పటికీ, 19 మంది మంత్రుల శ్రీ చంద్రబాబు నాయుడు మంత్రివర్గం జూన్ 8, 2014 న ప్రమాణస్వీకారం చేసింది. శుభముహూర్తంగా భావించిన ఆ రోజు గుంటూరులో నాగార్జున విశ్వవిద్యాలయానికి ఎదురుగా ఉన్న స్థలంలో, ప్రమాణస్వీకార మహోత్సవం బహిరంగసభలో జరిగింది. ఆ సమయంలో రాజధానీనగరం నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంతంలోనో, మంగళగిరి పోలీస్ బెటాలియన్ ప్రాంతంలోనో ఏర్పడుతుందని చెప్పుకున్నారు. మంత్రివర్గంలో శ్రీ నారాయణ కూడా ఉన్నారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖలు ఇవ్వబడిన నారాయణ, ముఖ్యమంత్రితోపాటు రాజధానీనగర స్థలనిర్ణయంలో కీలకపాత్ర వహించవలసి ఉంది. ఆయన శాసనసభలో కాని, శాసన మండలిలో కాని అప్పటికి సభ్యుడు కాదు. తరువాత 2014 ఆగస్టులో శాసనమండలికి ఎన్నికయ్యారు. ఎన్నికల సమయంలో శ్రీ చంద్రబాబు నాయుడితో పాటు తెలుగుదేశం పార్టీకోసం పనిచేసిన ఆంతరంగికవర్గంలో ఆయన కూడా ఒక  భాగం.

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, భారతప్రభుత్వం శ్రీ శివరామకృష్ణన్ నేతృత్వంలో మరో నలుగురు సభ్యులతో రాజధాని నగరానికి తగిన చోటును సూచించడానికి ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆగస్టు 31, 2014 వ తేదీలోపు తన నివేదికను సమర్పించాలి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసిన వెనువెంటనే కొత్త రాజధానీనగరస్థలంపై దృష్టి కేంద్రీకరించింది. రాజధానీనగరం ఎక్కడ ఉండాలన్న విషయంపై నిర్ణయం, పైకి కనిపించని తెలుగుదేశం పార్టీ థింక్ టాంక్ (మేధావివర్గం) ముందే తీసేసుకుంది. దానికి కావలసింది ఇప్పుడు ఆ నిర్ణయాన్ని ఆధికారికం చేయడానికి అవసరమైన ప్రక్రియలు మాత్రమే. ఈ ప్రభుత్వ కార్యకలాపాలన్నీ దాదాపు ఇటువంటివే. రాజధానీనగర నిర్మాణస్థలం ఎంపిక కోసం అన్వేషిస్తున్న శివరామకృష్ణన్ కమిటీ వంటి ప్రొఫెషనల్ బాడీ తమ ఉద్దేశానికనుగుణంగా పనిచేయదని తెలిసిన ముఖ్యమంత్రి, రాజధానీనగరస్థలం ఎంపిక కోసం వేరే ఒక కమిటీని నియమించుకోవడం మంచిదని భావించాడు. 

శివరామకృష్ణన్ కమిటీ ఆగస్టు 31, 2014 లోపునే తన నివేదికను సమర్పించవలసి ఉండగా జులై 21, 2014 న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఎం.పి.లు సుజనాచౌదరి, గల్లా జయదేవ్, తెలుగుదేశం పార్టీ కార్యకర్త బేడ మస్తాన్‌రావు, స్థానిక పారిశ్రామికవేత్తలు సంజయ్ రెడ్డి, శ్రీనివాస్ శ్రీనిరాజు, ప్రభాకర్ రావులతో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ పరిశీలించవలసిన అంశాలలో భూమి, నీళ్లు, విద్యుత్తు, రవాణా సౌకర్యాలను సమర్థంగా వినియోగించుకోవడం, గ్రీన్ టెక్నాలజీలు, గ్రీన్ స్పేస్‌లు నదీతీరంలో స్థిరమైన సంవర్ధవంతమైన అభివృద్ధి ఉన్నాయి. దీనితో శివరామకృష్ణన్ కమిటీకి ఇచ్చిన పరిశీలనాంశాలను పోల్చండి. శివరామకృష్ణన్ కమిటీ దృష్టి ప్రధానంగా ప్రస్తుతం ఉన్న వ్యావసాయికవ్యవస్థలకు భంగం కలగకుండా చూడడం, స్థానిక పర్యావరణాన్ని పరిరక్షించడం, నిర్మాణవ్యయాన్ని కనిష్ఠస్థాయిలో ఉంచడం, ప్రకృతి ఉత్పాతాల వల్ల కలిగే అవకాశాలున్న నష్టాల అంచనా. వీటని పోల్చి చూసినప్పుడు, శివరామకృష్ణన్ కమిటీ పరిశీలనాంశాలు ప్రత్యేకంగా రాజధానీనగరానికి స్థలం ఎంపికపై దృష్టి కేంద్రీకరిస్తే, మునిసపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి నేతృత్వంలోని కమిటీ పరిశీలనాంశాలు అప్పటికే నిర్ణయించుకున్న స్థలం దృష్ట్యా భూమిని సమర్థంగా వినియోగించుకోవడం, జల, విద్యుత్ సరఫరా సౌకర్యాలు, గ్రీన్ టెక్నాలజీలు, వాటర్ ఫ్రంట్ వంటి వాటిపై కేంద్రీకరించాయి. వాటర్ ఫ్రంట్‌ను పేర్కొనడం నదీతీరంలో రాజధానీనగరనిర్మాణం జరగాలన్న నిర్ణయం అప్పటికే తీసికొన్న సూచన నిస్తుంది. ప్రభుత్వం మనస్సులో ఉన్నది కృష్ణానదీతీరం అని ఎవరైనా తేలికగా ఊహించగలరు.


రాష్ట్ర ప్రభుత్వానికి తమ సిఫారసులు ఇష్టం లేదనీ, రాష్ట్రప్రభుత్వం అప్పటికే రాజధానీనగరస్థల నిర్ణయం చేసేసిందనీ తెలుసుకోవడానికి శివరమకృష్ణన్ కమిటీకి ఎక్కువ సేపు పట్టలేదు. తమ కృషి అంతా వృథా అని తెలుసుకున్నారు. దీనికి అదనంగా కమిటీకి సమాచారం అందించడం వంటి విషయాలలో రాష్ట్రప్రభుత్వం నుండి సహకార నిరాకరణ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ విషయాన్ని కమిటీయే స్వయంగా పేర్కొంది. ఈ అననుకూల పరిస్థితులలోనే కమిటీ తన శక్తి మేరకు నివేదిక తయారుచేసింది. కమిటీ ప్రభుత్వం తనకిచ్చిన కాలవ్యవధిని పాటించింది. ఆగస్టు 31, 2014 లోపుననే తన నివేదికను సమర్పించింది. కమిటీ సిఫారసులపై విపులమైన చర్చ మరో అధ్యాయంలో చేద్దాం. ఈ ఔపచారిక కార్యక్రమం ముగియడం కోసమే ఎదురు చూస్తున్నట్లుగా, సెప్టెంబరు 1, 2014 న ఆం.ప్ర. మంత్రివర్గం సమావేశమై విజయవాడ చుట్టుపట్ల రాజధాని నిర్మాణాన్ని నిర్ణయించింది. 

గౌరవనీయ ముఖ్యయంత్రి అప్పుడు జరుగుతున్న శాసనసభ సమావేశాలను అవకాశంగా తీసికొని సెప్టెంబరు 4, 2014 న శాసనసభలో ప్రకటన చేశారు. రాజధానీనగరాన్ని విజయవాడ నగరం చుట్టుపక్కల నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయించిందని చెప్తూ, పనిలోపనిగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తాను చేపట్టనున్న వివిధ ప్రాజెక్టుల పట్టికను చదివారు. మూడు మెగా నగరాలు, 16 స్మార్ట్ సిటీలు నిర్మిస్తామని చెప్పారు. వ్యూహాత్మకంగా ప్రతిపక్ష అనుకూలతను సాధించినట్లు చేసి ముఖ్యమంత్రి ప్రకటనకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదింపజేసుకున్నారు. శాసనసభలో ప్రకటన చేస్తూ ముఖ్యమంత్రి తనకనుకూలమైన అంశాల వరకు శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పేర్కొన్నారు. కమిటీ పంపిన ప్రశ్నావళికి సమాధానం చెప్పిన ప్రజలలో ఎక్కువమంది రాజధాని విజయవాడ - గుంటూరు ప్రాంతంలో ఉంటే బావుంటుందన్నారన్నది వీటిలో ఒకటి. పూర్తి నివేదికను, ముఖ్యమైన కమిటీ సిఫారసులను పరిగణనలోనికి తీసికోకుండా, ప్రభుత్వం రాజధాని స్థలానికి విజయవాడ ప్రాంత అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి పనికివచ్చే భాగాన్ని మాత్రమే తీసికొంది. 

శాసనసభ తీర్మానాన్ని సాధనంగా చేసికొని ముఖ్యమంత్రి - ఎన్నికల కంటే ముందే నిర్ణయం జరిగిన ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. ఈ నిర్ణయం ముందే తెలిసిన అస్మదీయులు, ఈ ప్రాంతంలో గణనీయంగా రియల్ ఎస్టేట్, వాణిజ్య ఆసక్తిని నిర్మించేశారు – ముందుకు వెళ్లి రాజధానీనగరం కృష్ణానది దక్షిణతీరంలో 21 గ్రామాలతో కూడిన మూడు మండలాలలో ఉంటుందనీ, లాండ్ పూలింగ్ విధానం ద్వారా భూయజమానుల నుండి భూసేకరణ జరుగుతుందని ప్రకటించివేశారు. ఆ విధంగా ముందుగా అనుకూలతను అధ్యయనం చేయకుండానే, సర్వే చేయకుండానే రాజధాని స్థలాన్ని నిర్ధారణ చేసిన ప్రాంతంగా అమరావతి చరిత్ర కెక్కింది. భారతప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ వికేంద్రీకరణ పద్ధతిని సూచించింది. నాలుగు భౌగోళిక ప్రాంతాలను సిఫారసు చేసింది. కాని వాటిలో అమరావతి ప్రాంతం లేదు. పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నేతృత్వంలోని కమిటీకి ఇచ్చిన పరిశీలనాంశాలు నగరనిర్మాణస్థలాన్ని ఎంపిక చేయడం కాక, నిర్ణయించుకున్న  స్థలంలో ఒక నగరానికి ప్రణాళిక రచించడానికి అనుగుణమైనవి. ఏది ఏమైనా ఈ కమిటీ ఏ విధమైన సిఫారసూ చేసినట్లు లేదు, అటువంటి నివేదిక ఏదీ ప్రజలకోసం బహిరంగపరచలేదు. దీనికి భిన్నంగా నయారాయపూర్‌ను రాజధానిగా నిర్ణయించిన సందర్భంలో 11 అంతర్జాతీయ కంపెనీలకు స్థలాన్ని ఎంపిక చేసే పనిని అప్పగించినప్పుడు, ముప్ఫైమూడు ప్రమాణాలు నిర్దేశించడం జరిగింది. రాయపూరు చుట్టుపక్కల ప్రాంతంలో  అత్యంత అనుకూలమైన స్థలాన్ని నయారాయపూర్ కోసం సూచించవలసిందిగా కోరడం జరిగింది.  పదకొండు కంపెనీలలో తొమ్మిది ప్రస్తుత నయారాయపూర్ స్థలాన్ని సూచించాయి. ఆ విధంగా స్థలనిర్ణయం జరిగింది. 

ఆ సమయంలో నయారాయపూర్ అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ బైజేంద్ర కుమార్‌ నాకు ఈ విషయం తెలిపారు. దీన్ని అమరావతి స్థలనిర్ణయంతో పోల్చి చూడండి. అదే విధంగా ప్రస్తుత రాజధాని టోక్యో నగరానికి భిన్నంగా కొత్త రాజధాని నిర్మించాలని తలపెట్టినప్పుడు, ముప్ఫై సదస్సులలో తీవ్రంగా చర్చించడం జరిగింది. పదహారు ప్రమాణాలు ఆధారంగా మూడు స్థలాలను ఎంపిక చేశారు. కాని అమరావతి ఎంపికలో ఎటువంటి సర్వే, అధ్యయనమూ జరగలేదు. ఆ విధంగా ఎటువంటి అధ్యయనమూ, యోగ్యతా నివేదికా లేకుండా నిర్ణయించిన రాజధాని స్థలం భూమి విలువ దృష్ట్యాకాని, రాజధాని నిర్మాణానికి ఆనుకూల్య విషయంలో కాని ఎంత మాత్రమూ తగిన స్థలం కాదు. పైగా ఇది వరదలకు అవకాశం ఉన్న చోటు, బహుళ పంటలు పండే సాగుభూమి.

చట్టం ద్వారా రాజధానీప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసి, అవసరమైన భూమిని అంగీకారం, కోఆప్షన్, మోసం, బలాత్కారపద్ధతుల ద్వారా సేకరించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 2015 మధ్య నాటికి కొత్త రాజధానీనగరానికి శంకుస్థాపనకు సిద్ధమయింది. చరిత్రలో నిలిచిపోయే ఒక మహాసందర్భంగా ప్రజలు గుర్తుంచుకొనేటట్లు ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని చంద్రబాబు నాయుడు తలపెట్టారు. దానికి అనుగుణంగా దసరా సమయంలో అక్టోబరు 22, 2015 విజయదశమినాడు గౌరవనీయ ప్రధానమంత్రి ముఖ్యఅతిథిగా శంకుస్థాపన కార్యక్రమం నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ముందు దేశంలోని నదుల నుండి నీళ్లు, రాష్ట్రంలోని విభిన్నప్రాంతాల నుండి మట్టి తెప్పించారు. ఈ బ్రహ్మాండమైన శంకుస్థాపన మహోత్సవానికి సింగపూరు వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి ఈశ్వరన్, జపాన్ ఆర్థికవ్యవస్థ, వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి యోసుకె టాకగి సూకి, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, పలువురు కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర నూతనరాజధాని కోసం భారీ ఆర్థికసహాయం ఈ సందర్భంలో ప్రకటిస్తాడని రాష్ట్ర ప్రభుత్వం ఆశించినా, భారత ప్రధాని అటువంటి వాగ్దానమేమీ చేయలేదు కాని, తన వంతు సహాయానికి చిహ్నంగా యమునానదీ జలాన్ని, పార్లమెంటు మట్టిని తెచ్చాడు.


ఆంధ్రప్రదేశ్ ప్రజల నూతన రాజధానిగా అమరావతి ప్రస్థానం ఆ విధంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి అభిప్రాయంలో అది ప్రజారాజధాని, మరికొందరి దృష్టిలో కేవలం భ్రాంతి మాత్రమే అయిన భ్రమరావతి. తరువాతి అధ్యాయాలలో రాజధానీనగర స్థలాల ఎంపికలో స్థూలంగా సైద్ధాంతిక విధివిధానాలు, రాజధానీనగరస్థలాల ఎంపికలో అంతర్జాతీయ, జాతీయ  అనుభవాలను, రాజధానీనగరం అమరావతికి ప్రత్యేకమైన సమస్యలను, ప్రజల ఆకాంక్షల దృష్ట్యా సరిగ్గా అమరావతి స్థానాన్ని, స్వాతంత్ర్యానంతరం ఆంధ్రప్రదేశ్ చరిత్రను, ఆంధ్రుల రాజధానిగా రాబోయే సుదీర్ఘ భవిష్యత్తులో అమరావతి ఎంతవరకు నిలవగలుగుతుందనే విషయాలను చర్చిద్దాం.



Comments

Popular posts from this blog

Whose Capital Amaravathi - Introduction

Urban centres as growth engines