ఉన్నతాధికారులపై నిందలు హానికరం

ఉన్నతాధికారులపై నిందలు హానికరం

తనకు అనుకూలంగా పనిచేస్తేనే సమర్థులైన అధికారులుగా చిత్రీకరించడం.. లేకపోతే అసమర్థులుగా, అవినీతిపరులుగా ముద్ర వెయ్యడం ఏపీ సీఎం చంద్రబాబుకు పరిపాటి అయిపోయింది. తానా అంటే తందానా అన్నవిధంగా ఆయన చెప్పే ఈ అసత్యాలను విస్తృతంగా ప్రచారం చేయటం తన అనుకూల మాధ్యమాలకు అలవాటు అయిపోయింది. తన తప్పిదాలకు, వైఫల్యాలకు అధికారులను బాధ్యులుగా చేస్తూ ముఖ్యమంత్రి ప్రవర్తించడం, అదే నిజంగా ప్రజలను నమ్మించడానికి యత్నించడం ఆయనకూ, అనుకూల మాధ్యమాలకు చాలాకాలం నుంచి వెన్నతో పెట్టిన విద్య. గత వారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విషయంలో బాబు  చేసిన వ్యాఖ్యలు, ప్రధాన ఎన్నికల అధికారి విషయంలో అనుసరించిన వైఖరి గత 30 ఏళ్లుగా కష్టపడి జాతీయంగా, అంతర్జాతీయంగా సంపాదించిన సీఎం వ్యక్తిగత స్థాయిని తుడిచిపెట్టేశాయి.
నేను సర్వీసులో చేరిన కొత్తలో శిక్షణ పొందుతూ ఉన్నప్పుడు ఎమ్మార్‌ పాయ్‌ అని సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఉండేవారు. ఆయనకు అన్ని అర్హతలు ఉన్న ఆ రోజుల్లో నాటి సీఎం చెన్నారెడ్డి వారిని విస్మరించి వారి కన్నా  సర్వీసులో జూనియర్ని చీఫ్‌ సెక్రటరీగా చేశారు. అపారమైన పరిపాలన అనుభవం నిజాయతీ, మంచితనం కలిగిన వ్యక్తి. పరిపాలన శిక్షణ సంస్థకు డైరెక్టర్‌గా  పనిచేస్తూ మాకందరికీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు.తన అనుభవాలను మాతో పంచుకుంటూ ఉండేవారు. వారు సర్వీస్‌లో చేరిన కొత్తలో రాజకీయ నాయకులతో సంబంధాలు ఏ విధంగా ఉండేవి అనేది వివరిస్తూ, బెజవాడ గోపాలరెడ్డి లాంటి సీఎంలు తమవంటి కలెక్టర్లతో ఎంత మర్యాద పూర్వకంగా ప్రవర్తించేవారో చెప్తూ ఉండేవారు.

మేము సర్వీసులో చేరేనాటికి ఈ  ప్రమాణాలు చాలా తగ్గినప్పటికీ అధికారులకు, ప్రభుత్వ సర్వీసులకు చాలా విలువ ఉండేది. నేను విజయవాడ సబ్‌ కలెక్టర్‌గా పని చేసే రోజుల్లో చనుమోలు వెంకటరావు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండేవారు. అధికారులకు గౌరవం ఇవ్వటంలో, రాజకీయ సత్ప్రవర్తనలో ఆయనకు ఆయనే సాటి. ఆ కాలంలో ఎవరికో ఒకరికి  సిమెంటు కేటాయించాలని సిఫార్సు చేశారు. అయితే ఆ వ్యక్తి అంతకుముందు నాతో ఎట్లా ప్రవర్తించిందీ వివరించి నిర్మొహమాటంగా ఇచ్చేది లేదని చెప్పాను. ఆ వ్యక్తికి ఏ స్థాయిలో అక్షింతలు పడ్డాయి అంటే రెండవ రోజు నా దగ్గరకు వచ్చి క్షమాపణ వేడుకున్నాడు. ఆనాటికే దిగజారుడుగా మాట్లాడే చాలా మంది  మంత్రివర్యులు ఉన్నా, చనుమోలు వెంకటరావు లాంటి మర్యాదస్తులేన  రాజకీయ నాయకులు చాలా మందే ఉండేవారు.
కాలక్రమేణా ఇది తగ్గుతూ వచ్చి ఈనాడు అధికారులు అంటే చులకన భావం రాజకీయ నాయకులలో జాస్తి అయింది. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. అందులో ఒక ప్రధాన కారణం అధికారులలో అవినీతి పెరగటం. అవినీతిపరుడైన అధికారిని ఏ విధంగా తమ లాభం కోసం ఉపయోగించుకోవాలని రాజకీయ నాయకులు చూస్తారే కానీ అతనిని గౌరవంగా చూసే అవకాశం తక్కువ. అవినీతిపరుడైన అధికారికి రాజకీయ నాయకుడికి వ్యవస్థలో ఆత్మీయమైన అవినాభావ సంబంధంఉంటుంది. అవినీతిపరులైన అధికారుల సంఖ్య పెరగటంతో నీతిపరులైన అధికారుల అవసరం వ్యవస్థకు లేకుండా పోయింది. పరిపాలనా యంత్రాంగంలో నిలబడాలంటే అటువంటి అధికారులు కూడా కొంత సర్దుకొని పోవలసిన అవసరం ఏర్పడింది. చట్టాలు గుడ్డిగా ఉండటంతో అవినీతిపరులైన అధికారులు చాకచక్యంగా తప్పించుకొని తిరుగుతున్నారు. విలువలకు ప్రాధాన్యమిస్తూ తప్పని పరిస్థితుల్లో ఫైళ్ల పైన కేవలం రూల్స్‌ పాటించకుండా నిర్ణయాలు తీసుకున్న అధికారులు దోషులుగా నిలబడుతున్నారు.. బలైపోతున్నారు. 
ఇక అధికారులు చులకన కావడానికి మరొక ప్రధాన కారణం.. విలువ లేని వ్యక్తులు రాజకీయాలలో ఉన్నత స్థానాల్లోకి రావటం. అడ్డదారిలో డబ్బులు చేసుకొని డబ్బుతోనే అన్నీ సాధించవచ్చు అనుకునే ఈ చౌకబారు రాజకీయ నాయకులకు ఉచ్చ నీచాలు తెలియటం లేదు. నడమంత్రపు సిరి లాగా నడమంత్రపు అధికారం చేతిలోకి రాగానే కొందరు రాజకీయ నాయకులకు కళ్ళు నెత్తికి ఎక్కటం సహజం. ఈ మధ్య ఒక మంత్రివర్యులు ఒక విశ్రాంత అధికారిని ఉద్దేశించి ఉద్యోగంలో ఉన్నప్పుడు గాడిదలు కాచారా అనటం ఇందుకు నిదర్శనం. ఈ రెండు ప్రధాన కారణాల దృష్ట్యా ఈనాడు అధికారులు రాజకీయ నాయకుల దృష్టిలో చులకన అయిపోతున్నారు. 
మూడవ కారణం.. భారత రాజ్యాంగంలో అధికార వ్యవస్థను రాజకీయ ప్రమేయం లేని తటస్థ వ్యవస్థగా పొందుపరిచారనే ప్రధాన అంశాన్ని మర్చిపోయి కొందరు అధికారులు ఒక పార్టీకో, పార్టీ నాయకులకో కొమ్ముకాయడం. దీనివలన అధికార వ్యవస్థ నిలువుగా చీలి రాజ్యాంగంలో పొందుపరచిన తటస్థ వ్యవస్థకు బదులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న  టఞౌజీlటటyట్ట్ఛఝ లాగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. రాజకీయ నాయకత్వం మార్పు జరగ్గానే అధికార వ్యవస్థ పూర్తిగా మారిపోయి కొత్తవారు పదవిలోకి రావటం దీనికి నిదర్శనం. అటువంటి సమయంలో తటస్థ అధికార విధానానికి అర్థం లేకుండా పోతుంది. మన దేశంలో కూడా రాజ్యాంగాన్ని మార్చుకొని  టఞౌజీlటటyట్ట్ఛఝను ప్రవేశ పెట్టుకోవచ్చు. అప్పుడు ఈ నాటకాలకు అవసరం లేకుండా గెలుపొందిన పార్టీకి అనుకూలంగా వారి సలహాదారులు వస్తారు. సలహా ఇస్తారు. వారితోపాటే నిష్క్రమిస్తారు. ఇది సాధారణంగా రాజకీయ నాయకులు, అధికారుల సంబంధ బాంధవ్యాల్లో వచ్చిన కాలక్రమేణా మార్పు. ఈ సాధారణ అంశాలకు సంబంధం లేకుండా గత వారంలో అధికారులను చులకన చేసి ఏపీ సీఎం రెండు సందర్భాలలో మాట్లాడారు, ప్రవర్తించారు.
ఎన్నికల నిర్వహణ తేదీ కన్నా ఒక రోజు ముందు ముఖ్యమంత్రి ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి వెళ్లి నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. ఇది చాలా అసాధారణమైన విషయం. ఇటువంటి విషయాలకు సీఎంలు సాధారణంగా ఒక సీనియర్‌ నాయకుడిని పంపించడం పరిపాటి. అంతేకాకుండా ఆయన కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఒక సాధారణమైన నాయకుడు కాదు. జాతీయంగా, అంతర్జాతీయంగా కీర్తిని గడించిన నాయకుడు. మమతా బెనర్జీలాంటి నాయకులు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ధర్నా చేయడం ముఖ్యమంత్రిగా ధర్నాకు దిగటం ఎవరూ పెద్దగా పట్టించుకోరు. 
కానీ చంద్రబాబులాంటి లబ్ధప్రతిష్టులు ఈ రకంగా చేయటం వారి స్థాయికి తగదు. ఇంతేకాక ప్రధాన ఎన్నికల అధికారిని దోషిగా చూపెడుతూ ‘మీ కార్యాలయమే మూసుకోవచ్చు కదా’ అన్న ధోరణిలో మాట్లాడారు. ప్రధాన ఎన్నికల అధికారి సీఎం హోదాను గౌరవించి చాలా సభ్యతతో, పద్ధతిగా ప్రతిస్పందించారు. సీఎం హోదాను, గౌరవాన్ని కాపాడారు. గట్టిగా సమాధానం చెప్పి సహేతుకంగా వాదనలు వినిపించి ఉంటే ముఖ్యమంత్రి గారి హోదాకు భంగం కలిగి ఉండేది. దురదృష్టం ఏమిటంటే ఆయన నమ్రతను, సభ్యతను బలహీనతగా చిత్రీకరిస్తూ ఏదో తప్పు చేశాడు కాబట్టి సీఎంకి సమాధానం చెప్పలేదు అంటూ తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారాన్ని కొనసాగించి ఎన్నికలలో లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయడం.
ఇక ఎన్నికలు అయిన రెండవ రోజు సీఎం ఏకంగా ప్రధాన కార్యదర్శినే లక్ష్యంగా చేసుకుని తన విమర్శలు సంధించారు. ఎన్నికల సంఘం పనితీరు ప్రశ్నిస్తూ ఈవీఎంల విషయం ప్రస్తావన చేస్తూ ప్రధానకార్యదర్శి అంశం కూడా లేవనెత్తారు. తాను నియమించిన ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేత్‌ని తొలగించి మరొకరిని ముఖ్య కార్యదర్శిగా ఎన్నికల సంఘం ఎట్లా నియమిస్తుంది అని ప్రశ్నించారు. కొత్తగా నియమితులైన ప్రధాన కార్యదర్శి ప్రతిపక్ష నేత జగన్‌తో పాటు సహ నిందితుడు అనీ, అటువంటివారిని ప్రధాన కార్యదర్శి ఎట్లా చేస్తారని వ్యాఖ్యానించారు. ప్రధానంగా చంద్రబాబు మర్చిపోయిన విషయం ప్రధాన కార్యదర్శి మార్పుకు ఎవరైనా కారణం అయితే అది తానుమాత్రమే. ఎన్నికల షెడ్యూలు విడుదల తరువాత అధికార యంత్రాంగం అంతా ఎన్నికల సంఘం అధీనంలోకి వస్తుందని తెలిసి కూడా ఎన్నికల సంఘం ఉత్తర్వులను ప్రధాన కార్యదర్శి బేఖాతర్‌ చేసే విధంగా సీఎం నిర్దేశించారు. వారి  ఆంతరంగిక అధికార వర్గం ఈ విషయంలో సరైన విధి విధానాలను సీఎంకు వివరించ కుండా ఆయన అభిప్రాయానికే వత్తాసు పలికారు. ఇటువంటి ఒత్తిడిని తట్టుకొని ప్రధాన కార్యదర్శి సరైన నిర్ణయం తీసుకుని ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది.  అందువల్లనే ప్రధాన కార్యదర్శి మార్పు జరిగింది. 
ఎన్నికల సంఘం తన అధికారాలను ఉపయోగించుకుని అన్ని విధాల అర్హుడైన వ్యక్తిని ప్రధాన కార్యదర్శిగా నియమిస్తే ఎటువంటి ఆధారాలు లేకుండా సీఎం అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారు. కేసులన్నీ హైకోర్టు కొట్టివేసిన తర్వాత సీనియారిటీ ప్రకారం అర్హతల ప్రకారం ప్రధాన కార్యదర్శి పదవి స్వీకరించడానికి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం అన్ని విధాల అర్హులుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అర్థరహిత అనవసర అభాండాలు వేయడం ఆయన స్థాయికి తగని పని. మనకు అనుకూలంగా పనిచేస్తేనే నిష్పాక్షిక సమర్థులైన అధికారులుగా చిత్రీకరించడం లేకపోతే అసమర్థులుగా అవినీతిపరులుగా ముద్ర వెయ్యడం సీఎంచంద్రబాబుకి పరిపాటి అయిపోయింది. తానా అంటే తందానా అన్న విధంగా ఆయన చెప్పే ఈ అసత్యాలను విస్తృతంగా ప్రచారం చేయటం ఆయన అనుకూల మాధ్యమాలకు పరిపాటి అయిపోయింది. తన తప్పిదాలకు, వైఫల్యాలకు అధికారులను బాధ్యులుగా చేస్తూ ముఖ్యమంత్రి ప్రవర్తించడం, అదే నిజంగా ప్రజలను నమ్మించడానికి యత్నిచడం ఆయనకు, ఆయన అనుకూల మాధ్యమాలకు చాలాకాలం నుంచి వెన్నతో పెట్టిన విద్య.
గత వారంలో ప్రధాన కార్యదర్శి విషయంలో ముఖ్యమంత్రి  చేసిన వ్యాఖ్యలు, ప్రధాన ఎన్నికల అధికారి విషయంలో అనుసరించిన వైఖరి గత 30 ఏళ్లుగా చాలా కష్టపడి జాతీయంగా, అంతర్జాతీయంగా సంపాదించిన వారి వ్యక్తిగత స్థాయిని ఒక్క పెట్టుతో తుడిచి వేశాయి. దీనికి కారణం ఆయన నిజమైన వ్యవహారశైలి.. తను కష్టపడి ప్రపంచానికి ప్రదర్శించిన కృత్రిమ వ్యవహార శైలి కన్నా పూర్తిగా భిన్నంగా ఉండటమా? లేక ఎన్నికలలో పరాజయ సంకేతాలు రావటంతో ఏర్పడిన నిరాశ నిçస్పృహలా? వేచి చూడాలి.

Comments

  1. It's a bad precedent sir.
    The present ruling party should introspect of their own wrong doings.

    ReplyDelete
  2. సర్,
    ఇది పరిస్థితి కి ముమ్మాటికీ కారణం ,Ex CS అనిల్ గారు. ఆయన అంత సీనియర్ అయివుండి ఎలా GO ని వెనిక్కి తీసుకొన్నారు అర్థం కావడం లేదు,అలాగే స్టేట్ ఎన్నికల కమిషనర్ తన చర్యలు తీసుకోవడం విఫలం అయ్యారు,మరి సీబీన్ గారు ప్రెస్ తో వస్తే,ఎలా అనుమతిచ్చారు?? ఒక వేళ ఇచ్చారు అనుకొన్న,వారు సీబీన్ క్యూషన్స్ కి వెంటనే గట్టి సమాధానం ఇచ్చిఉంటే,పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు.
    ఒక సామాన్య వ్యక్తి ,ఏ అధికారం లేకున్నప్పుడు ,ఎలా భయపడి రాజకీయ వ్యక్తులు కు లొంగిపోతారో ,అలానే ఇంత పెద్ద చదువు,హోదా ఉన్న వారు కూడా ప్రవర్తించారు.
    ఇది చాలా దురదుష్టకారం
    నామటుకు తప్పు,ఆంధ్ర ceo మెతకతనం తో వచ్చిన వే ఈ తిప్పలు.

    ReplyDelete
  3. It is the complete failure and inefficiency of CEC. What CBN is doing is right.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Whose Capital Amaravathi - Introduction

ChandraBabu Naidu - CBN

Urban centres as growth engines