తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు - విద్యార్థుల ఇబ్బందులు

భారతదేశంలో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా చాలా ప్రధానమైనటువంటి ఘట్టం ఇంటర్మీడియట్ విద్య. విద్యార్థులు భవిష్యత్తులో ఏ వృత్తిలో ఉండాలనేది ఇప్పుడే నిర్ణయించబడుతుంది. ఉన్నత విద్యాస్థాయిలో ఒక విద్యా విభాగం నుంచి మరియు ఒక విభాగానికి మారే అవకాశం లేని భారతీయ విద్యా విధానంలో ఇంటర్మీడియట్ విద్య సమయంలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి విద్యార్థుల భవిష్యత్ విద్యే కాక వారి వృత్తిపరమైన నిర్ణయం కూడా జరుగుతుంది. తీసుకున్న సబ్జెక్టులను బట్టి భవిష్యత్తులో వారు డాక్టర్ల ఏది ఇంజనీర్ల ఏది ఇంకేదైనా వృత్తిలో స్థిరపడేది ఈ సమయంలోనే నిర్ణయించబడుతుంది. అందుకనే తల్లిదండ్రులు కూడా విద్యార్థుల చదువులలో ఈ ఘట్టానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. వారితో పాటు శ్రమపడి వారు చక్కని ఫలితాలు సాధించడానికి తోడ్పడుతూ ఉంటారు. ఒకరకంగా మొత్తం కుటుంబం కలిసి తీసుకునే పరీక్ష ఇంటర్మీడియట్ పరీక్ష.ఇంత ప్రాధాన్యం కలిగిన ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రభుత్వాలు సక్రమంగా నిర్వహించకపోవడం కొత్తేమీ కాదు. ఇంతకుముందు చాలాసార్లు పరీక్ష పత్రాల లీకేజీ జంబ్లింగ్ విధానాల్లో లోపాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేశాయి. ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అయినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రులు ముందే అనుకున్న వ్యూహం ప్రకారం గా రాజీనామాలు చేయడానికి సమాయత్త పడటం ముఖ్యమంత్రులు నివారించటం సాధారణంగా పరిపాటి అయిపోయింది. కానీ ఇంతకు ముందు ఎన్నడూ ఈనాడు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ చేసిన స్థాయిలో ఫలితాలను పూర్తిగా అస్తవ్యస్తంగా ఎవరూ చేయలేదు.


1997 సంవత్సర ప్రాంతంలొ ఒకసారి చాలా పెద్ద ఎత్తున ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువరించడంలో ఇంటర్మీడియట్ బోర్డు తప్పులు చేసింది. ఆనాడు విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెలువడిన పరిస్థితి ఈనాటి అంత దారుణంగా లేదు. నాటి ముఖ్యమంత్రి ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీని సస్పెండ్ చేయాలని భావించిన నాటి ఉన్నతాధికారులు ఆయనకు బాసటగా నిలిచి పరిస్థితిని చక్కదిద్ది చేయి దాటి పోకుండా చూసుకున్నారు.  అంతకు మించిన స్థాయిలో ఫలితాలు వెలువరించడంలో గోల్మాల్ చేసి ఇంటర్మీడియట్ బోర్డు ఈనాడు మరలా తన పరిమితులను చాటుకున్నది. ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా ఈనాటి పరీక్ష ఫలితాలు చాలా మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమై వారి తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చాయి. వారి ప్రమేయం ఏమీ లేని మరొకరి అసమర్థతకు నిర్లక్ష్యానికి వారు బలైపోయారు.


ఈ మధ్య ఎన్నికలలో పూర్తిగా  నైతిక స్థైర్యం  దెబ్బతిన్న ప్రతిపక్షాలకు ప్రభుత్వం లక్ష్యంగా విమర్శించడానికి ఇది ఒక ఆయుధం గా పనికి వచ్చింది.ప్రభుత్వం పక్షం నుంచి కూడా వెంటనే తగిన నివారణా చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగడం కూడా సమస్యను జటిలం చేసింది. ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని పరిశీలించిన హైకోర్టు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలిచ్చింది.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజనకు ముందు ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని నిర్వహించటానికి ఉన్న  విధి విధానాలే ఈనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. స్థూలంగా ఇంటర్మీడియట్ విద్య కమిషనరు ఆయన ఆఫీసు ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల విధి విధానాలను వ్యవహారాలను చూసుకుంటాయి. ఇంటర్మీడియట్ బోర్డు సిలబస్సు విద్యా పరమైన అంశాలను పరీక్ష నిర్వహణను చూసుకుంటుంది. బోర్డుకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కానీ మంత్రిగారి అధ్యక్షులు గా ఉంటారు. బోర్డు సెక్రటరీగా వ్యవహరించే ఐఏఎస్ అధికారి  బోర్డు కార్యక్రమాలన్నీ చూసుకుంటూ ఉంటారు. ఇతర రాష్ట్రాలలో ఉన్న విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఇంటర్మీడియట్ బోర్డు కు రీజనల్ కార్యాలయాలు లేవు. పరీక్ష నిర్వహణ ఫలితాలు వెల్లడించటం అంతా కేంద్రీకృతంగా రాష్ట్రానికి అంతటికి ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా చేయడం జరుగుతుంది.

 అంతకుముందు సమాధాన పత్రాల మార్కులను క్రోడీకరించడం ఫలితాలు వెల్లడించటం కార్యాలయ సిబ్బంది సహాయంతో యాంత్రీకరణ లేకుండా చేసేవారు. కాలక్రమేణా మార్పులు తీసుకొచ్చి  క్రోడీకరించడం ఫలితాలు వెల్లడించటం ఎలక్ట్రానికల్ గా చేయటం మొదలెట్టారు. ఇందుకు కావలసిన సామర్థ్యం బోర్డు సిబ్బందికి లేదు కాబట్టి విభజనకు ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చేత నడపబడుతున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కి ఇవ్వడం జరిగింది. అక్కడ తగిన  సాంకేతిక సిబ్బంది సామర్థ్యం ఉన్నందున వారు తగిన సంస్థను ఎన్నిక చేసి తమ పర్యవేక్షణలో ఈ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించి ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డుకు అందజేయడం జరిగేది.ఎటువంటి వివాదాలు లేకుండా సాఫీగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుండేది. ఎంసెట్ పరీక్షలు నిర్వహించే జె.ఎన్.టి.యు విశ్వవిద్యాలయానికి స్వతహాగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించే సామర్ధ్యం ఉంది కాబట్టి  ఇతరుల సహాయ సహకారాలతో ప్రమేయం లేకుండా సాఫీగా ఎంసెట్ పరీక్ష ఫలితాలను నిర్వహించగలుగుతారు. నేను సిసిఎల్ గా పనిచేసిన రోజుల్లో ఓఎంఆర్ షీట్ పరీక్ష ద్వారా విలేజ్ అసిస్టెంట్ల ఎంపిక చేయదలచిన ప్పుడు కావలిసిన సహాయ సహకారాలు జె.ఎన్.టి.యు నుంచి తీసుకోవటం జరిగింది. ఎటువంటి సమస్యలు లేకుండా పెద్ద ఎత్తున ఆరోజు విలేజ్ అసిస్టెంట్ల ఎంపిక నిర్వహించగలిగాం. అటు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహాయ సహకారాలు తీసుకోకుండా ప్రత్యామ్నాయంగా జె ఎన్ టి యు వారి  సేవలను వినియోగించుకోకుండా అంతర్గతంగా సరైన సామర్థ్యం లేకుండా ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా ఈ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూనుకొని ఇంటర్మీడియట్ బోర్డ్ పెద్ద తప్పు చేసింది. ఇంటర్మీడియట్ బోర్డు లో పనిచేస్తున్న ఉద్యోగులు తలెత్తుతున్న సమస్యలను వివరిస్తున్న వాటిని బోర్డు  పట్టించుకోక పోవడం ఈనాటి ఈ పరిస్థితికి దారితీసింది.ఈనాడు ప్రభుత్వం  ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఈ బాధ్యతలు అప్పగించిన globarena సంస్థను సరైన పర్యవేక్షణ లేనందుకు ఇంటర్మీడియేట్ బోర్డును అధికారులను తప్పు పట్టడం జరిగింది. ప్రైవేట్ సంస్థ ఎన్నికలో అన్ని విధివిధానాల్లో పాటించి ఉన్నా ఆచరణలో సంస్థ యొక్క కార్యక్రమాలను నిశితంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత దానికి తగిన సామర్థ్యం తమ దగ్గర లేనప్పుడు అటువంటి సామర్థ్యం ఉన్న ప్రభుత్వ సంస్థ సహాయ సహకారాలు తీసుకొనవలసిన  బాధ్యత పూర్తిగా ఇంటర్మీడియట్ బోర్డు మీద ఉన్నది. ఈ బాధ్యతను ఇంటర్మీడియట్ బోర్డు  సక్రమంగా నిర్వహించలేదు అనేది ఈ మొత్తం ఉదంతంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఎలక్ట్రానిక్ గా వచ్చిన ఫలితాలను భౌతికంగా ఒక పది శాతం దాకా అయినా సరిచూసుకోవటం ఇటువంటి కార్యక్రమాలలో తీసుకొనవలసిన కనీస జాగ్రత్త చర్యలు. అటువంటి వెరిఫికేషన్ చేసి ఉంటే  పరీక్ష ఫలితాలు ప్రకటించడానికి ముందే ఈ లోపాలన్నీ  ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల దృష్టికి వచ్చి ఉండేవి.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందుకు భిన్నంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వారు ఎంపిక చేసిన సంస్థ తోనే తమ కార్యక్రమాలను నిర్వహించారు. అక్కడ ఈనాడు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సేవలు అందుబాటులో లేవు. వారు కూడా జే ఎన్ టి యు విశ్వవిద్యాలయం లాంటి సంస్థ యొక్క సహాయసహకారాలు కూడా తీసుకోలేదు. కానీ సమస్యలు లేకుండా స్థిరంగా సాగిపోతున్న పాత సంస్థని కొనసాగించటం వలన ఇటువంటి సమస్యలు ఎదుర్కోకుండా తమ ఫలితాలు వెల్లడించ గలిగారు.
ప్రభుత్వ పాలనలో ఎక్కడా కూడా అలసత్వానికి తావుండకూడదు. ముఖ్యంగా విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న పరీక్షలు నిర్వహించడంలో ను ఆ ఫలితాలను సక్రమంగా వెల్లడించడంలో ను. దురదృష్టమేమిటంటే పదే పదే ఈ విషయాలలో లోపాలు జరుగుతున్న విద్యార్థులకు సమస్యలు ఎదురవుతున్న ప్రభుత్వాలు సమస్య పునరావృతం కాని విధంగా విధి విధానాలు రూపొందించటంలో విఫలమవుతున్నాయి. ఇకనైనా మేలుకొని కేవలం ఇంటర్మీడియట్ స్థాయిలోనే కాకుండా అన్ని స్థాయిల్లో కూడా పరీక్షలు నిర్వహించడంలో ఫలితాలు  వెల్లడించడంలో ఇటువంటి సమస్యలకు ఆరోపణలకు తావులేని విధి విధానాలను రూపొందించే దిశగా ప్రభుత్వాలు కృషి చేస్తే బాగుంటుంది.


నేను మొదటి పేరాలో పేర్కొనిన ప్రహసనంగా మారిన నైతిక బాధ్యత వహించి మంత్రుల  రాజీనామా అంశానికి సంబంధించి నాకు తెలిసిన ఒక అంశాన్ని ప్రస్తావించి ఈ వ్యాసాన్ని ముగిస్తాను. 1987లో నేను ఖమ్మం జిల్లా కలెక్టర్ గా  చేరక ముందు జరిగిన సంఘటన. అక్కడి వారు చెప్పారు. 1986 సంవత్సరంలో కూడా ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగింది. నాటి ఉన్నత విద్యా శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు తన రాజీనామాను ఆమోదించరు అన్న పూర్తి ధీమా తో నైతిక బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు  ప్రకటించారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్న భోజన సదుపాయాల ఏర్పాటు సరిగా లేకపోవడంతో చాలా కోపంగా ఉన్న సమయంలో వ్యక్తిగత సిబ్బంది ఉన్నత విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా పత్రాన్ని పంపించారు అని తెలియజేశారు. ఆయన వెంటనే ఆమోదించండి అని తన ఆమోదముద్రను తెలియజేయడం తో  ఆమోదించరని గట్టిగా నమ్మి రాజీనామా ప్రకటించిన ఉన్నత విద్యా శాఖ మంత్రి బయటికి తన నైతిక బాధ్యతను నొక్కి వక్కాణించిన అంతర్గతంగా ఖిన్ను డైనాడు. ఆపైన ఖమ్మం జిల్లా మంత్రివర్యుల తో మీరు ఆ  రోజు సరైన భోజన  సదుపాయాలు ఏర్పాటు చేసి ఉంటే నా రాజీనామా ఆమోదం అయి ఉండేది కాదని వాపోయాడట.

Comments

Popular posts from this blog

Whose Capital Amaravathi - Introduction

ChandraBabu Naidu - CBN

Urban centres as growth engines