కెసిఆర్ రెండవ తడవ పాలన చేపట్టిన తర్వాత కొన్ని మౌలికమైన పరిపాలన సంస్కరణలపై దృష్టి సారించారు. మొదటి పాలనా కాలంలో రైతులకు బ్యాంక్ అకౌంట్ల ద్వారా నేరుగా సబ్సిడీ చెల్లించే విధానం, కళ్యాణ లక్ష్మి వంటి వ్యక్తిగత లబ్ధి చేకూర్చే పథకాలను, అధికార వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల సంఖ్య పెంచడం వంటి చర్యలు చేపట్టారు. ఇప్పుడు రెవెన్యూ శాఖ ప్రక్షాళన లేదా పూర్తి రద్దు, చట్టబద్ధంగా ఆస్తిపై సంపూర్ణి హక్కులు కల్పించడం, జిల్లాస్థాయిలో ప్రత్యేక సాధారణ పరిపాలన శాఖ ఏర్పాటు చేయటం, రాష్ట్రీయ పరిపాలన సర్వీస్ ప్రారంభించడం, పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖలో పర్మిట్లు లేఅవుట్లు కంప్యూటర్ ద్వారా జారీ, సిబ్బందిని పూర్తిగా ప్రణాళిక అంశాలపై దృష్టి పెట్టేందుకే కేటాయించడం వంటి సంస్కరణలు చేయడంపై ప్రధానంగా దృష్టి పెడతారని వార్తా కథనాలను బట్టి తెలుస్తున్నది. వీటిలో ఒక్కొక్క అంశం సాధ్యాసాధ్యాలను, ఆవశ్యకతను పరిశీలిద్దాం.
ఆస్తి హక్కుకు న్యాయబద్ధంగా పూర్తిగా చెల్లుబాటయ్యే పత్రాలను అందజేసే కార్యక్రమం చాలా బృహత్తరమైనది. ఆస్తి హక్కు వివరాలు పట్టణాలలో మున్సిపల్ రికార్డుల్లోను, గ్రామ పంచాయతీలలో పంచాయతీ రికార్డుల్లోను నమోదై ఉంటాయి. వ్యవసాయ సంబంధమైన హక్కుల రికార్డులు రెవెన్యూ శాఖ పరిధిలోకి వస్తాయి. ఆస్తి పరమైన బదలాయింపులు రిజిస్టర్ చేసుకున్నప్పుడు తదనుగుణంగా ఈ రికార్డుల్లో మార్పు జరుగుతుంది. ఈ రికార్డులలో ఉన్నంత మాత్రాన లేక రిజిస్టర్ అయినంత మాత్రాన పూర్తి ఆస్తి హక్కు ఎవరికీ చట్టబద్ధంగా ఉన్నట్లు కాదు. కేవలం presumptive title మాత్రమే ఈ రికార్డులు కలుగజేస్తాయి. పూర్తి హక్కు కేవలం కోర్టులలో తేలవలసిన విషయం. ఇప్పుడు పూర్తిఆస్తిహక్కు కల్పించే విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఆబాధ్యతను ప్రభుత్వం స్వీకరిస్తుంది. ఈ‘కంక్లూసివ్ టైటిల్ ’ప్రభుత్వం ఇచ్చిన తర్వాత భవిష్యత్తులో కోర్టులో ఆ ఆస్తి ఇంకొకరిది అని తేలితే ఆ వ్యక్తికి నష్టపరిహారం చెల్లించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఈ మొత్తం కార్యక్రమం చాలా బృహత్తరమైనది, శ్రమతో కూడుకున్నది. ప్రస్తుతం మున్సిపల్ రికార్డులు, రెవెన్యూ రికార్డుల్లో ఉన్న టైటిల్ అనుసరించే వ్యక్తులు వారి వారి ఆస్తి హక్కులను అనుభవిస్తున్నారు. ఏవో బహుకొద్ది అంశాలలో తప్పితే వివాదాలు రావటం లేదు. పట్టణీకరణ పెరిగేకొద్దీ ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నా మొత్తం ఆస్తుల వ్యవహారంతో పోల్చి చూస్తే తక్కువే వుంటుంది. అటువంటప్పుడు ఇంత వ్యయప్రయాసలతో, కష్టనష్టాలతో కూడిన ఈ చట్టబద్ధమైన ఆస్తి హక్కు కల్పించే విధానం అందరికీ ఒక బృహత్ పథకం ద్వారా చేపట్టవలసిన అవసరం ఉందా? నా దృష్టిలో లేదని భావిస్తాను. ఎందుకంటే నేడు అమలులో ఉన్న విధానంలో కూడా బహు కొద్ది అంశాలలో మాత్రమే ఆస్తి హక్కులకు సంబంధించి సమస్యలు వస్తున్నాయి. అటువంటప్పుడు ఇంత వ్యయప్రయాసలతో కూడిన చట్టబద్ధమైన ఆస్తి హక్కు కల్పించే విధానాన్ని అమలు చేసే కార్యక్రమానికి స్వస్తి పలికితే మంచిది. లేదా అందరికీ వర్తించే విధంగా కాక ఐచ్ఛికంగా కోరుకునేవారికి పరిమితం చేసే విధానం తెస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశముంది.
ఇక రెండవ అంశం.. రెవెన్యూ శాఖను ప్రక్షాళించడం లేదా పూర్తిగా రద్దు చేయటం. రెవెన్యూ విభాగం అవినీతి మయం అయిందని అందువలన దాన్ని రద్దు చేయాలని భావిస్తున్నారని సమాచారం. ఏ విభాగంలో అయితే విచక్షణాధికారాలు జాస్తిగా ఉంటాయో అక్కడ అవినీతికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. నా దృష్టిలో రెవెన్యూ శాఖ కన్నా పోలీస్ శాఖలో అవినీతి అధికంగా ఉంది. దానికి కారణం విచక్షణతో కూడిన అధికారాలు పోలీస్ శాఖలో ఎక్కువ కేంద్రీకృతమై ఉండటమే. రెవెన్యూ శాఖలో అవినీతి విచ్చలవిడిగా ఉండటానికి కారణాలు అనేకాలు ఉన్నాయి. ప్రధానంగా గత అర్ధ శతాబ్ది కాలంలో రాజకీయ నాయకులు రెవెన్యూ శాఖను ఉపయోగించుకొని ప్రభుత్వ స్థలాలను విచ్చలవిడిగా కొల్లగొట్టడం జరిగింది. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న రీతిలో అధికారులు కూడా ఈ వ్యవహారాల్లో బాగానే బాగుపడ్డారు. ఇటువంటి వారిలో కేవలం రెవెన్యూ అధికారులే కాదు, అఖిల భారత సర్వీసు అధికారులు కూడా ఉన్నారు. అవినీతిపై సమగ్ర విచారణ చర్యలు అభిలషణీయమే. కానీ ఈ విచారణ పరిధిని రెవెన్యూ అధికారులకే పరిమితం చేయకుండా అఖిల భారత సర్వీసు అధికారులు, రాజకీయ నాయకులకూ విస్తరించాల్సిన అవసరం ఉంది. అవినీతి అధికంగా ఉందని విభాగాన్ని రద్దు చేయడం సమస్యకు పరిష్కారం కాదు. ప్రక్షాళన దిశగా అడుగులు వేయటమే సరైన పరిపాలనా సంస్కరణగా భావిస్తాను. ఇతర విభాగాల కార్యక్రమాల అమలులో, అతిథి మర్యాదలు చేయడంలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్ తలమునకలై ఉన్నది. దానితో వారికి మౌలికంగా తమ శాఖ అసలు బాధ్యతలను నిర్వహించడానికి సమయం దొరకడం లేదు. ఈ ఇతర పనులను రెవెన్యూ శాఖ పరిధినుంచి తప్పించడం ద్వారా అవినీతికి తావులేకుండా చేసే విధివిధానాలు రూపొందించడం ముఖ్య పరిపాలనా సంస్కరణ అవుతుంది. కానీ రెవెన్యూ శాఖనే రద్దు చేయడం సమస్యకు పరిష్కారం కాదు.
ఇక మూడవ అంశం.. రాష్ట్ర పరిపాలన సర్వీసును ఏర్పాటు చేయటం. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధమైన రాష్ట్ర పరిపాలన సర్వీసును ప్రారంభించారు. చాలా సమర్థవంతులైన అధికారులను కేవలం రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కే పరిమితం చేయకుండా ఈ సర్వీసులోకి తీసుకున్నారు. ఈనాడు ఐఏఎస్ కేడర్‌లోకి పదోన్నతితో వచ్చే అధికారుల్లో 85 శాతం రెవెన్యూ సర్వీస్ నుంచి, 15 శాతం మిగిలిన అన్ని సర్వీసుల నుంచి వస్తున్నారు. దీనితో మిగిలిన సర్వీసులకు తీరని అన్యాయం జరుగుతున్నది. రాష్ట్ర పరిపాలన సర్వీసును ఏర్పాటు చేయడం ద్వారా దానికి అన్ని సర్వీసులు నుంచి ఎంపిక చేసే విధానాన్ని ప్రవేశపెట్టి, ఈ సర్వీసును ఐఏఎస్‌కు ఫీడర్ సర్వీసుగా చేస్తే అన్ని సర్వీసులకు న్యాయం జరిగి మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. కానీ ఈ రాష్ట్ర పరిపాలన సర్వీసును ఐఏఎస్ కు ప్రత్యామ్నాయంగా భావిస్తే అది వాంఛనీయమైన సంస్కరణగా నేను పరిగణించను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ పని చేయడం అఖిల భారత సర్వీసులకున్న ప్రత్యేకత. కాబట్టి ఆధికారులు వైవిధ్యంతో కూడిన పరిపాలన అనుభవాన్ని కలిగి ఉంటారు. ఎంత చెడ్డా ఎంతో కొంత నీతి నిజాయితీ సమర్థత ఈ సర్వీసులో మిగిలి ఉన్నాయి. మన మాట వినటం లేదు కాబట్టి ఐఏఎస్ స్థానంలో రాష్ట్ర సర్వీసును ప్రత్యామ్నాయంగా రూపొందిస్తాం అనుకుంటే అది పరిపాలనపై తప్పకుండా దుష్ప్రభావాన్ని చూపుతుంది. జిల్లాస్థాయిలో సాధారణ పరిపాలన విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనే ఆలోచన మంచిదే. అతిథి మర్యాద కార్యక్రమాలే రెవెన్యూ శాఖలో ప్రధాన కార్యక్రమాలుగా కొనసాగుతున్నాయి. ఈ కొత్త శాఖ ఈ బాధ్యతలను చేపట్టవచ్చు. కానీ ప్రత్యేక సాధారణ పరిపాలన శాఖ ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో చాలా ప్రాధాన్యత వహించే రెవెన్యూ శాఖను మంత్రులు, రాజకీయ నాయకులు అంత సులభంగా వదిలి పెడతారు అని నేను అనుకోను.
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు, మంత్రులకు పాలనా వ్యవహారాలలో క్రియాశీలక పాత్రను కల్పించటం ఈ పరిపాలనా సంస్కరణల ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. అధికారిక పరంగానే కాక రాజకీయంగా కూడా ఇది పొరపాటు నిర్ణయమే అవుతుంది. జన్మభూమి కమిటీ లాంటి కమిటీలు క్షేత్ర స్థాయిలో లేకపోవడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ జోక్యం లేకుండా కేవలం అర్హత ఆధారంగా పథకాలు అమలు కావడం వల్లనే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలలో అధిక ప్రయోజనం కలిగింది. ఈ విధానాన్ని మార్చి క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల ద్వారా ఇచ్చే సహాయాలను రాజకీయ నాయకుల పర్యవేక్షణలో అమలు చేస్తే పరిపాలనా పరంగా వచ్చే ఇబ్బందుల కన్నా రాజకీయ పరంగా వచ్చే నష్టమే ఎక్కువ. ఈ ఆలోచన విరమించడమే మంచిదని నేను భావిస్తున్నాను. పట్టణ పురపాలక శాఖలలో తలపెట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. పర్మిట్లు పర్మిషన్‌లు ఇచ్చే బాధ్యతను పురపాలక శాఖ సిబ్బంది నుంచి తొలగించి ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టడం ఈ శాఖలో అవినీతికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. పురపాలక శాఖ ఉద్యోగుల ప్రాధాన్యం ఇప్పుడు ఈ లైసెన్స్ పర్మిట్ మీదనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అవినీతికి ఆస్కారం ఉంది కనుక. ఇది పూర్తిగా ఆన్‌లైన్ చేయడం ద్వారా ఈ శాఖ లో ఉద్యోగుల సేవలను పురపాలక సర్వీసులు ప్రజలకు కలుగచేయడం మీద పట్టణ అభివృద్ధి ప్రణాళికను రూపొందించడంలో ఎక్కువగా ఉపయోగించుకొనవచ్చు. పురపాలక శాఖలోనూ రెవిన్యూ శాఖలోనూ కొరవడిన ముఖ్య అంశం పౌర ప్రణాళిక (citizens charter) లేకపోవడం. రెవెన్యూ శాఖలోని వివిధ అంశాలకు పురపాలక శాఖ అంశాలకు ఒక సిటిజన్స్ చార్టర్ తయారుచేసి, నిర్దేశించిన సమయంలో ఆ సేవలను అందించకపోతే పురపాలక సంఘాలు గ్రామ పంచాయతీలు పౌరులకు నష్టపరిహారం చెల్లించే విధంగా సంస్కరణలు రూపొందించాలి. ఆనాడే పరిపాలనా సంస్కరణలకు అర్థం ఉంటుంది.
ఏ పరిపాలనా సంస్కరణలను సిఫార్సు చేసే సలహాదారులు అయినా మొత్తం విధానాన్ని పరిశీలించిన తర్వాత అందరికీ తెలిసిన సత్యాలనే ఒక చక్కటి ప్రజెంటేషన్ రూపంలో తెలియజేస్తారు. చాలా సందర్భాలలో వారిచ్చే సలహాలు సూచనలు అంత వరకు అమలులో ఉన్న విధివిధానాలు పాటించడం లేదని అవి సక్రమంగా పాటిస్తే పరిపాలనలో గణనీయంగా మార్పు వస్తుందని తెలియజేస్తారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమలులో ఉన్న విధి విధానాలు ఎంతవరకు సక్రమంగా పాటిస్తున్నారో ఒకసారి పరిశీలించి, సమగ్రంగా సమీక్షించి అమలు చేస్తే గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది.
పరిపాలనా సంస్కరణల గురించిన ఈ వ్యాసం ముగించే ముందు ఒక చిన్నమాట. కొత్తగా ఎంపికై తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడిన యువ ఐఏఎస్ ఆఫీసర్‌లకు 8 నెలల నుంచి పోస్టింగ్ ఇచ్చినట్టు లేరు. రాబోయే 30–35 సంవత్సరాలు వీరంతా ఈ రాష్ట్రంలోనే వివిధ శాఖలలో అత్యున్నత పదవులు అలంకరిస్తారు. సర్వీసులో జాయిన్ అయిన కొత్తల్లోనే ఎనిమిది నెలలు ఖాళీగా ఉంటే వారికి ప్రభుత్వ విధానాలపై నమ్మకం సడలే ప్రమాదం ఉంది. వారికి పోస్టింగులు ఇవ్వటంతో పరిపాలనా సంస్కరణలు మొదలుపెడితే బాగుంటుంది.
Comments
Post a Comment